ఎమ్బీయస్‌ : గోడ్సే-33 ‘నైన్‌ అవర్స్‌ టు రామా’3

మధ్యాహ్నం 12.30. గుప్తా భవన్‌. పికె గాంధీకి చెప్తున్నాడు – 'బాపూ, నేను చెప్పబోయేది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. మేమేం చేసినా మీ శ్రేయస్సు కోరే చేస్తాం. మీరు మాకెంత ముఖ్యమో వేరే…

మధ్యాహ్నం 12.30. గుప్తా భవన్‌. పికె గాంధీకి చెప్తున్నాడు – 'బాపూ, నేను చెప్పబోయేది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. మేమేం చేసినా మీ శ్రేయస్సు కోరే చేస్తాం. మీరు మాకెంత ముఖ్యమో వేరే చెప్పనక్కరలేదు, మీరు మాకు మార్గదర్శి, గురువు…'

గాంధీ అడ్డు తగిలాడు – 'అలాటప్పుడు నేను చెప్పిన సలహా ఏదీ మీకు తలకెక్కదేం?' చచ్చాంరా బాబూ, మళ్లీ పార్టీ రద్దు చేయమని నస మొదలెట్టాడు అనుకున్నాడు పికె. పెదాలు తడి చేసుకుని 'సాధ్యపడినపుడు వింటూనే వున్నాం, బాపూ' అన్నాడు. '..దీనిలో అసాధ్యం ఏముంది? పార్టీ వర్కింగ్‌ కమిటీలో నలుగురూ కూర్చుని రద్దు చేసేశామని ఒక్క తీర్మానం చేస్తే చాలు..' అన్నాడు గాంధీ. 'తప్పకుండా, కానీ నేను యిప్పుడు వచ్చిన పని వేరే..' అంటూ పికె హత్యాప్రయత్నం గురించి చెప్పాడు. 

గాంధీ పట్టించుకోలేదు. తన ప్రాణం ఎప్పుడూ అపాయంలోనే వుంది కదా అన్నాడు. తన మీద పగబట్టిన పూనా సొసైటీ ఆఫ్‌ నేషనల్‌ సేవియర్స్‌ సంస్థ సభ్యుల్ని గుప్తా తిడుతూంటే 'వాళ్లూ మన సోదరులే కదా' అని మందలించాడు. తన వైఫల్యాల వలనే కదా, వాళ్లు తనను చంపుదా మనుకుంటున్నది అని సముదాయించాడు. విభజన తర్వాత ఎంతోమందికి యిళ్లు లేవు, తిండి లేదు, పని లేదు, అనేకమంది అమాయకులు బలి అయిపోయారు. కనుచూపు మేరలో శాంతి లేదు. ఇవన్నీ చూసి ఎవరైనా నన్ను చంపుదామనుకుంటే అది నా సంచితకర్మఫలం తప్ప వారి పొరపాటేమీ లేదు అన్నాడు. విభజన అల్లర్లలో చనిపోయిన ఒక రైతు ప్రాణానికీ, నా ప్రాణానికీ తేడా ఏముంది దీన్ని కాపాడుకోవడానికి ప్రార్థనాసమావేశం రద్దు చేయడం అనవసరం అన్నాడు. 

ఇక దాస్‌ కలగజేసుకున్నాడు. 'సమావేశం జరిగితే నేను మీకు ముందుగా నడుస్తాను. ఈసారి బాంబు పెట్టడం కాదు, ఎదుటబడి కాలుద్దామని అనుకుంటున్నట్లుగా మాకు సమాచారం వుంది' అన్నాడు. గాంధీ చిరునవ్వు నవ్వాడు – 'ఇక్కడకి వచ్చేవాళ్లల్లో చాలామంది నా ఫన్నీ ఫేస్‌ చూడ్డానికే వస్తారు. వాళ్లకు నువ్వు అడ్డుపడితే ఎలా?' అన్నాడు. ''పోనీ మీ వెనక్కాల నడుస్తా'' అన్నాడు దాస్‌. ''అలా అయితే ఫర్వాలేదు, కానీ నువ్వు పిస్టల్‌ లేకుండా రావాలి.'' షరతు విధించాడు గాంధీ. 

తుపాకీ లేకుండా ఎలా అని దాస్‌ అంటే 'అంటే దాని అర్థం నన్ను కాపాడేది నువ్వు కాదన్నమాట, పిస్టల్‌ అన్నమాట. హింసకు వ్యతిరేకంగా యిన్నేళ్లూ పోరాడిన నేను, యీ వయసులో యీ బక్కప్రాణం కాపాడుకోవడం కోసం ఒక మారణాయుధం అండ తీసుకోవాలన్నమాట.' అంటూ పెదవి విరిచాడు. అక్కడున్నవారెవరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. నమస్కరించి బయటపడ్డారు. 

xxxxxxxxxxxxxxxxx

అదే సమయం. కృష్ణ భూమీ అనే ఎంపీ యిల్లు. ఆ యింట్లో మేడమీద గదిలో రహస్యంగా బస చేసిన కాటక్‌ ఆప్టేను చివాట్లు పెడుతున్నాడు. 'మీ యిద్దర్నీ యివాళ బియరు తాగవద్దని చెప్పాను. అయినా తాగారు. ఇక్కడకు రావద్దని చెప్పాను. అయినా నువ్వు వచ్చావు…'' ఇంతలోనే కృష్ణ వచ్చి ఒక పోలీసువాడు కాటక్‌ను చూడడానికి వచ్చాడని చెప్పాడు. అదే గదిలో వున్న పర్చూరే, శంకర్‌ కూడా కంగారు పడ్డారు. కానీ కాటక్‌ తొణక్కుండా ''అతని పేరు..?'' అని అడిగాడు. బ్రిజైన్‌ అని చెప్పగానే మనవాడే లోపలకి రమ్మనమను అన్నాడు. 

అతను వచ్చి ''పోలీసు కస్టడీలో వున్న పహ్వా గుట్టుమట్లన్నీ చెప్పేస్తున్నాడు. దానివలన పోలీసులు మేల్కొని మీ కోసం వెతుకుతున్నారు. మీరు కనబడితే రిపోర్టు చేయమని మా అందరికీ చెప్పారు'' అని సమాచారం అందించాడు. అది విన్నాక పర్చూరే అక్కణ్నుంచి పారిపోదామని కంగారు పడుతూంటే తాను చెప్పేదాకా ఎవరూ ఎక్కడికి కదల కూడదని కాటక్‌ ఆజ్ఞాపించాడు. అతను ఒకప్పుడు పహిల్వాన్‌. గురూజీ వద్ద వుండేవాడు. వాళ్ల సంఘంలో చేరినవాళ్లు కొన్నాళ్లకు మనసు మార్చుకుని బయటకు వెళ్లిపోతానంటే శిక్ష తీవ్రంగా వుంటుంది. ఒకతను పేరు మార్చుకుని, జర్మనీ పారిపోయి, జర్మన్‌ అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయాడు. ఐదేళ్లు గడిచేసరికి గురూజీకి టోకరా యివ్వగలిగాననుకున్నాడు. కానీ గురూజీ కాటక్‌ను జర్మనీ పంపి అతన్ని ఖతం చేయించారు. ఆ సందర్భంగా కాటక్‌కు జర్మనీవాసం కలగింది, మాటలో కాస్త జర్మన్‌ యాస తొంగిచూస్తుంది.

1933లో ప్రొఫెసర్‌ భట్‌ యింట్లో నాథూ గురూజీకి పరిచయమైనప్పుడు అతను అక్కడే వున్నాడు. మాటల్లోనే తెలిసింది నాథ్‌కు గురూజీ వేరెవరో కాదు, ఢోండో కనేట్కర్‌ అని. 'మీ గురించి ఎంతో విన్నాను. 16 ఏళ్ల పాటు మాండలే జైల్లో వున్నారనీ, లండన్‌లో బాంబులు తయారుచేసినపుడు మీ చెయ్యి దెబ్బ తిందనీ, మాతృదేశరక్షణకు మీరు చేయని త్యాగం లేదనీ.. యిలా ఎన్నో. మీ సొసైటీలో చేరాలనుంది' అన్నాడు నాథూ. చేరితే విడిచిపెట్టడం అంత సులభం కాదు, బాగా ఆలోచించి చేరు అన్నారు గురూజీ. నాథూ పట్టుబట్టాడు. ఇప్పుడు యీ హత్యా కార్యక్రమాన్ని అతనిపై, ఆప్టేపై పెట్టారు గురూజీ. పర్యవేక్షించే బాధ్యతను కాటక్‌కు అప్పగించారు. కాటక్‌ తన అథారిటీని పూర్తిగా వినియోగిస్తున్నాడు. అందర్నీ శాసిస్తున్నాడు. పర్చూరేని దబాయిస్తూండగానే చుంచుమొహం అతను వచ్చి జరిగినదంతా చెప్పాడు. సైకిలు లేకపోయినందు వలన నాథూని వెంబడించలేకపోయానని చెప్పాడు. కాటక్‌ మండిపడ్డాడు. 'ఆ అమ్మాయెవరో తెలియదు, నాథూ అక్కడికెందుకు వెళ్లాడో తెలియదు, అతన్ని యిక్కడకు తీసుకురమ్మనమంటే ఆ పనిచేయకుండా ఏవేవో కుంటిసాకులు చెప్తున్నావు, చవటా' అని తిట్టిపోశాడు.

xxxxxxxxxxxxxxxxxx

మధ్యాహ్నం 1.00 గం|| నాథూ ఆ అమ్మాయి గదిలో వున్నాడు. ఆమెతో బాటు వుండే అమ్మాయిలు బేరాల కోసం బయటకు వెళ్లారు. ఆమె పేరు షీలా. పంజాబీ, విభజన అల్లర్లలో భర్త, కొడుకు పోయారు. ఈమె గతిలేక పడుచుకుంటోంది. నాథూని పోలీసులు వెంటాడుతున్నారని గ్రహించి ఆమె భయపడింది. కొన్ని గంటలపాటే వుంటాననీ ఆమెకు ధైర్యం చెప్పి చేతిలో చాలా డబ్బు పెట్టాడు. తనకు కాస్త రొట్టెలు చేసి పెడితే చాలు, యింకే రకమైన సేవలూ అక్కరలేదన్నాడు. మంచం మీద నడుం వాలిస్తే అతనికి రాణి గుర్తుకు వచ్చింది. 

xxxxxxxxxxxxxxxxxx

అదే సమయంలో దాస్‌ గదిలోకి యిన్‌స్పెక్టర్స్‌ బోస్‌, ముండా వచ్చారు. ''వాళ్లల్లో ఒకణ్ని సర్కిల్‌ సినిమా హాల్లో చూశాం. కొంచెం వుంటే పట్టేసుకునేవాళ్లమే, కానీ ఆ కిల్లాడీ తప్పించుకున్నాడు. సిటీ అంతా మనుష్యులు పెట్టి గాలించాలి సర్‌'' అన్నారు. దాస్‌ విసుక్కున్నాడు ''గుప్తా భవన్‌లో పోర్టికో నుంచి వేదిక దాకా కాలిదారి వంద గజాలుందేమో. దాన్ని కవర్‌ చేయడానికే మనుష్యులు లేక ఛస్తున్నాం. ఊళ్లో అల్లర్లు, శరణార్థుల నిరసన ప్రదర్శనలు జరుగుతూంటే పోలీసులు ఏం సరిపోతారు? మీ యిద్దరూ ఆ కాలిదారిని కవర్‌ చేయండి. వాళ్లు అక్కడే ఎటాక్‌ చేస్తారని నా వూహ.'' అన్నాడాయన. 

''అక్కడైతే సులభంగా పట్టుబడిపోతారు. గాంధీజీ వేదిక మీద వుండగా బాంబు విసురుతారని నా వూహ'' అన్నాడు బోస్‌. ''మొన్నటిసారి బాంబు ప్రయోగం విఫలమైంది కాబట్టి యీసారి పిస్టల్‌తోనే రిస్కు తీసుకోవచ్చు..'' అన్నాడు దాస్‌. ''మన ఆలోచనలు యిక్కడితో ఆగిపోకూడదు. హత్య కానీ, హత్యాప్రయత్నం కానీ సాగిందంటే దాని పరిణామాలు దేశం మొత్తం మీద ఎలా వుంటాయో వూహించు. పెద్దయెత్తున అల్లర్లు జరుగుతాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. రయట్‌ స్క్వాడ్‌తో నిరంతరం వాకీటాకీతో టచ్‌లో వుండు.'' అని కూడా చెప్పాడు.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]

Click Here For Archives