బోరుకేం తెలుసు.. మింగేయకూడదని.!

నీళ్ళ కోసం వేసిన బోరు.. ప్రాణం తీసేసింది. ఈ హెడ్డింగ్‌తో ఎప్పటికప్పుడు వార్తలు వెలుగు చూస్తూనే వున్నాయి. అభం శుభం ఎరుగని చిన్నారులు బోర్లకు బలైపోతూనే వున్నారు. ‘కఠినంగా శిక్షిస్తాం..’ అని బోర్లు వేసి,…

నీళ్ళ కోసం వేసిన బోరు.. ప్రాణం తీసేసింది. ఈ హెడ్డింగ్‌తో ఎప్పటికప్పుడు వార్తలు వెలుగు చూస్తూనే వున్నాయి. అభం శుభం ఎరుగని చిన్నారులు బోర్లకు బలైపోతూనే వున్నారు. ‘కఠినంగా శిక్షిస్తాం..’ అని బోర్లు వేసి, వాటిని అలాగే వదిలేసేవారి విషయంలో ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తూనే వున్నా, ప్రభుత్వాల హెచ్చరికల్ని బోర్లు వేసేవారు, వేయించుకునేవారు లెక్క చేయడంలేదు.

తెలంగాణలో తాజాగా ఓ చిన్నారిని బోరుబావి బలి తీసుకుంది. కాదు కాదు.. బోరు వేసినోళ్ళు, వేయించుకున్నోళ్ళు.. ఆ చిన్నారిని బలి తీసుకున్నారు. బోరుకేం తెలుసు.? చిన్నారుల్ని మింగేయకూడదని. ఆడుకుంటూ వెళ్ళే చిన్నారులు.. నేల మీద వున్న భారీ రంధ్రంలో (బోరు కోసం తవ్విన గుంత) పడిపోవడం నిత్యకృత్యమైపోయింది. కాస్తంత మట్టితోనో, రాళ్ళతోనో కప్పేస్తే.. అవి మృత్యు రంధ్రాలుగా మారకుండా వుంటాయి కదా.! ఆ మాత్రం విజ్ఞత బోర్లు వేయించేవారికి వుంటే ఇకనేం.!

ఒకటీ అరా సందర్భాల్లో మాత్రమే బోరు బావుల్లో పడ్డ చిన్నారులు సురక్షితంగా బయటపడ్తుంటారు. మిగతా సందర్భాలన్నిటిలోనూ పసి పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం అనేది నీటి మీద రాతగానే మిగిలిపోతోంది. ఒక్కసారి కఠిన శిక్షలు విధించడం అంటూ చేస్తే.. భవిష్యత్తులో తవ్విన బోరు విషయంలో అశ్రద్ధ వుండదెవరికీ. కానీ అంత చిత్తశుద్ధి ప్రభుత్వాలకెక్కడిది.?