అందాల అరకు ఏమయ్యిందో.!

హుద్‌ హుద్‌ తుపాను దెబ్బకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు పూర్తిగా, తూర్పుగోదావరి జిల్లా పాక్షికంగా దెబ్బతిన్న విషయం విదితమే. ప్రధానంగా విశాఖపట్నంలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. విశాఖ జిల్లాలోనే తుపాను తీరం…

హుద్‌ హుద్‌ తుపాను దెబ్బకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు పూర్తిగా, తూర్పుగోదావరి జిల్లా పాక్షికంగా దెబ్బతిన్న విషయం విదితమే. ప్రధానంగా విశాఖపట్నంలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. విశాఖ జిల్లాలోనే తుపాను తీరం దాటిన దరిమిలా.. ఇక్కడి విధ్వంసం అంచనాలను మించి వుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. రోజుకోరకంగా విశాఖ విధ్వంసానికి సంబంధించిన వార్తలు వెలుగు చూస్తున్నాయి.

తాజాగా ఈ రోజు విశాఖలోని కైలాసగిరి ప్రాంతం గురించి మీడియా కవరేజ్‌ బయటకొచ్చింది. కైలాసగిరి అంటే అత్యంత సుందరమైన ప్రాంతం విశాఖలో. ఇప్పుడది కళా విహీనంగా మారిన ఓ ‘దిబ్బ’ మాత్రమే అన్నట్టుగా తయారైంది. కైలాసగిరి నిండా నిన్న మొన్నటిదాకా పచ్చదనం దర్శనమిచ్చేది. ఇప్పుడు అక్కడ ఎండిపోయిన, విరిగిపోయిన చెట్లు మాత్రమే కన్పిస్తున్నాయి. సందర్శకుల కోసం వేసిన రైల్వే ట్రాక్‌ దెబ్బ తింది. రోప్‌వే కూడా సర్వనాశనమైనట్లు తెలుస్తోంది.

కైలాసగిరి సరే.. అందాల అరకు ఏమయినట్టు.? ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడంలేదు. తీవ్ర విధ్వంసమైతే అరకులో చోటు చేసుకుందని తెలుస్తోంది. అరకు వెళ్ళడానికి మార్గం కన్పించనంతగా హుద్‌హుద్‌ తుపాను బీభత్సం సృష్టించింది. కొండ చరియలు విరగిపడి అరకు ప్రాంతంలో పలువురు మృత్యువాత పడ్డారు. అయితే బాధితులకు సహాయం అందించేందుకు సహాయక బృందాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.

రేపటికి అందాల అరకు ఎలా విధ్వంసానికి గురయ్యిందో తెలిసే అవకాశం వుంది. ప్రాథమికంగా వెలుగు చూస్తున్న వార్తల్ని బట్టి అయితే, అరకులో విధ్వంసం ఎవరూ ఊహించని విధంగా వుందట. కాఫీ తోటలు, పూల తోటలు.. అన్నీ ధ్వంసమయినట్లు సమాచారం.