టీనేజ్ గాళ్స్.. సరదాగా ఛీర్స్ చెప్పుకున్నారు. హుషారుగా బీర్లూ, వైన్లూ తెగ పొంగించారు. హ్యీపీగా పార్టీని ఎంజాయ్ చేశారు. అంత వరకూ బానే ఉంది. వీళ్ల పార్టీ సీన్ కాస్తా వాట్సప్ సాక్షిగా హల్ చల్ చేసింది. దీంతో సదరు అమ్మాయిలు చదువుతున్న కాలేజ్ కన్నెర్ర చేసింది.
విషయంలోకి వెళితే…దక్షిణ కర్నాటక జిల్లాలో ఉన్న సల్లియా తాలూకాలోని ది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర కాలేజ్‌లో బిబిఎం 2వ సంవత్సరం చదువుతున్న కొందరు అమ్మాయిలు గత శుక్రవారం రాత్రి వైన్లూ బీర్ల తో మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారు.
అయితే ఎలాగో గాని అందులో ఇద్దరు అమ్మాయిల మందు కొడుతున్న దృశ్యాలు మరుసటి రోజే వాట్సప్‌లో ప్రత్యక్షమయ్యాయి. కొన్ని గంటల్లోనే ఫలానా కాలేజ్ అమ్మాయిలు అంటూ ఊరంతా అవి షేర్ అయ్యాయి. దీంతో కాలేజ్ కి వ్యతిరేకంగా కొందరు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
పరువు పోయిందని భావించిన కాలేజ్ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఆ ఫొటోలు నిజంగా తమ కాలేజ్ అమ్మాయిలవే అని నిర్ధారించుకుని వెంటనే వారిద్దరినీ కాలేజ్ నుంచి సస్పెండ్ చేసేసింది.కె ఎస్ ఎస్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ కాలేజ్ కార్య నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది.
అయితే కాలేజ్ తీసుకున్న చర్య లు స్థానిక సోషల్ యాక్టివిస్ట్ విద్యా దినకర్ వంటి వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇది పూర్తిగా రాజ్యంగ వ్యతిరేకమని ఆమె అన్నారు. లా ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప మోరల్ పోలీసింగ్ సరికాదని ఆమె స్పష్టం చేశారు. కాలేజ్ వేళలు అయిపోయిన తర్వాత కాలేజ్ బయట విద్యార్ధుల వ్యక్తిగత విషయాలతో కాలేజ్‌కి సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఏవో కొన్ని సంస్థలు ఆందోళన చేసినంత మాత్రాన విద్యార్ధినుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరైంది కాదంటున్న ఆమె.. ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు సైతం వెళ్లేందుకు వెనుకాడబోమంటున్నారు. సస్పెండైన స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రం తమ పిల్లలు పార్టీ చేసుకోలేదని అంటున్నారు. అయితే వీరు ఆ ఫొటోలపై దర్యాప్తు కోరుతూ పోలీసులకు ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదు.