భూకంపం తర్వాత: మట్టిదిబ్బలు, ఆర్తనాదాలు

తీవ్ర భూకంపం నేపాల్‌ని వణికించింది. భవనాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. రోడ్లు అడ్డంగా విడిపోయాయి. రోడ్లపై వెళ్తున్నవారూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుప్పకూలిన భవనాలు మట్టి దిబ్బల్ని తలపిస్తున్నాయి. ఏ శిధిల భవనం…

తీవ్ర భూకంపం నేపాల్‌ని వణికించింది. భవనాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. రోడ్లు అడ్డంగా విడిపోయాయి. రోడ్లపై వెళ్తున్నవారూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుప్పకూలిన భవనాలు మట్టి దిబ్బల్ని తలపిస్తున్నాయి. ఏ శిధిల భవనం కింద ఎంతమంది ఏ పరిస్థితుల్లో వున్నారో తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే నేపాల్‌లోని భూకంప ప్రభావిత ప్రాంతాల పరిస్థితి అత్యంత భీతావహంగా వుంది.

భారతదేశం హుటాహుటిన నేపాల్‌కు సహాయ బృందాల్ని పంపింది. ప్రపంచంలోని వివిధ దేశాలు నేపాల్‌కి అండగా వుంటామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ పరిస్థితి నుంచి నేపాల్‌ ఎలా గట్టెక్కుతుందన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా తీవ్రంగానే సంభవించాయి. ఎంతమంది చనిపోయారు.? అన్నదానిపై లెక్కలు చెప్పలేని పరిస్థితుల్లో వుంది నేపాల్‌ ప్రభుత్వం.

ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకూ వెయ్యి మంది వరకూ చనిపోయి వుంటారని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు చెబుతున్నారు. అది చాలా చిన్న సంఖ్య అనీ, భూకంప తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య అంచనా వేయలేనంత ఎక్కువగా వుండొచ్చని అనధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. శిధిలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. అదే సమయంలో నేపాల్‌లోని ఆసుపత్రులన్నీ బాధితుల ఆర్తనాదాలతో హోరెత్తిపోతున్నాయి. ఆసుపత్రులు చాలక, రోడ్లమీదే బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

నేపాల్‌.. ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామం. కానీ, ఇప్పుడది శవాల దిబ్బగా మారిపోవడం అత్యంత బాధాకరమైన విషయం.