మూలిగే నక్క మీద…

ఉత్తరాంధ్ర పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా తయారవుతోంది హుద్‌హుద్‌ తుపాను పుణ్యమా అని. విశాఖ జిల్లా కొంత తేరుకుంటుండగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హుద్‌ హుద్‌ తుపాను సృష్టించిన విలయం…

ఉత్తరాంధ్ర పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా తయారవుతోంది హుద్‌హుద్‌ తుపాను పుణ్యమా అని. విశాఖ జిల్లా కొంత తేరుకుంటుండగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హుద్‌ హుద్‌ తుపాను సృష్టించిన విలయం నుంచి తేరుకోకముందే, ఒరిస్సా నుంచి వస్తోన్న వరదతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నదులు పోటెత్తుతున్నాయి.

ఇప్పటికే శ్రీకాకుళం పట్టణంలోకి వరద నీరు చేరుకుంటుండగా, గంట గంటకీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని అధికారులే చెబుతున్నారు. దురదృష్టకరమైన విషయమేంటంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాధారణ ప్రజానీకానికి ఏం జరుగుతుందో ఇంకా అర్థం కాకపోవడం. తుపాను బీభత్సం కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండ్రోజులనుంచి విద్యుత్‌ నిలిచిపోయింది.

మొబైల్‌ ఫోన్లు పనిచేయక, నిత్యావసర వస్తువులు దొరక్క.. మంచినీటికి సైతం దిక్కులేక.. మూడు జిల్లాల్లో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వరదలంటే పరిస్థితి మరీ దుర్భరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విద్యుత్‌ని పునరుద్ధరిస్తే.. కొంతమేర భయాందోళనలు తగ్గే అవకాశం వుంది. కానీ విద్యుత్‌ పునరుద్ధరణ ఇప్పటికిప్పుడు జరిగే అవకాశమే కన్పించని పరిస్థితి.

రహదార్లను తొలుత క్లియర్‌ చేస్తున్న అధికారులు, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. విశాఖ నుంచి రాజమండ్రి వరకూ వున్న జాతీయ రహదారిపై పరిస్థితి కొంచెం మెరుగుపడినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా వరకూ జాతీయ రహదారి తేరుకుంటే.. మూడు జిల్లాలూ కొంతమేర గాడిన పడే అవకాశం వుంటుంది.