బతుకమ్మ సంబురం.. అంగరంగ వైభవంగా.!

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ఏ రేంజ్‌లో గుర్తింపు తీసుకొస్తుందో ఒక్కసారి గెలిపించి చూడండి.. అని ఎన్నికలకు ముందు.. ఆ మాటకొస్తే గడచిన పదేళ్ళుగా ఆ పార్టీ నేతలు…

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ఏ రేంజ్‌లో గుర్తింపు తీసుకొస్తుందో ఒక్కసారి గెలిపించి చూడండి.. అని ఎన్నికలకు ముందు.. ఆ మాటకొస్తే గడచిన పదేళ్ళుగా ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. సమయం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించింది.

‘రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బు లేదుగానీ.. అమరవీరుల కుటుంబాల్ని ఆదుకోవడానికి డబ్బు లేదుగానీ..’ అని కాంగ్రెస్‌, టీడీపీ సన్నాయి నొక్కులు నొక్కినాసరే.. అవేవీ అధికార పార్టీ పట్టించుకోలేదు. బతుకమ్మ ఉత్సవాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌. దసరా సెలవుల్ని బతుకమ్మ ఉత్సవాల కోసం పెంచింది. తొమ్మిది రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాల్ని అధికారికంగా నిర్వహించింది.

బతుకమ్మ ఉత్సవాల ముగింపును కనీ వినీ ఎరుగని స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం గమనార్హం. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. హైద్రాబాద్‌లో యేటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్‌ ఉత్సవాలకు ధీటుగా బతుకమ్మ ఉత్సవాలు ఈ సారి జరిగాయనే చెప్పాలి. ట్యాంక్‌ బండ్‌ అంటే వినాయక విగ్రహాల నిమజ్జన సందడి.. నిన్న మొన్నటిదాకా. ఇకపై దాంతోపాటుగా బతుకమ్మ ఉత్సవాలన్నమాట.

ఏదిఏమైనా.. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేలా జరిగాయి. ఈ ఘనత టీఆర్‌ఎస్‌ సొంతం.