విమానంలో పైలట్‌, ఇంజనీర్‌ డిష్యుం డిష్యుం.!

పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. పేరుకి పైలట్‌, ఇంజనీర్‌ అనే పెద్ద పెద్ద ఉద్యోగాలు, హోదాలు. కానీ, చిన్న పిల్లలు గిల్లికజ్జాలు పెట్టుకున్నట్టుగా కొట్టుకున్నారు. అదీ విమానంలో. ఎయిర్‌ ఇండియా సంస్థకు…

పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. పేరుకి పైలట్‌, ఇంజనీర్‌ అనే పెద్ద పెద్ద ఉద్యోగాలు, హోదాలు. కానీ, చిన్న పిల్లలు గిల్లికజ్జాలు పెట్టుకున్నట్టుగా కొట్టుకున్నారు. అదీ విమానంలో. ఎయిర్‌ ఇండియా సంస్థకు చెందిన విమానంలో జరిగిందీ గొడవ. ఏంటో, ఈ మధ్య మనదేశానికి చెందిన వివిధ ఎయిర్‌లైన్స్‌ ఏదో ఒకరకంగా వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి.

చిన్న వివాదమే అయినా పరువు తక్కువ గొడవ ఇది. చెన్నయ్‌ – పారిస్‌ విమానంలో జరిగిన ఈ గొడవపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్‌ ఇండియాకి అల్టిమేటం జారీ చేసింది డీజీసీఏ. గొడవ ఎందుకు జరిగిందో తెలియదుగానీ, పైలట్‌ దాడిలో ఇంజనీర్‌ కన్నన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క ఇంజనీర్‌ని చితక్కొట్టిన పైలట్‌ మానిక్‌ లాల్‌ విమానం కాక్‌ పిట్‌లోకి వెళ్ళి తనను తాను నిర్బంధించుకున్నాడు. ఈ తతంగంతో రెండు గంటలపాటు చెన్నయ్‌ ` ప్యారిస్‌ విమానం ఆలస్యమయ్యింది. ప్రయాణీకులు గగ్గోలు పెట్టారు. ఇంజనీర్‌పై పైలట్‌ దాడికి వ్యతిరేకంగా ఇంజనీర్స్ మద్దతుదారులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.