తెలుగోళ్ల బతుకు చిత్రం మారుతుందా?

తెలుగోళ్లు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలందరూ అని అర్థం. వీరి బతుకు చిత్రం మారుతుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే మరింత సుఖంగా, దర్జాగా బతగ్గలరా? తెలంగాణ ‘బంగారు తెలంగాణ’గా, ఆంధ్రప్రదేశ్‌ ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌’గా మారుతాయా?…

తెలుగోళ్లు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలందరూ అని అర్థం. వీరి బతుకు చిత్రం మారుతుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే మరింత సుఖంగా, దర్జాగా బతగ్గలరా? తెలంగాణ ‘బంగారు తెలంగాణ’గా, ఆంధ్రప్రదేశ్‌ ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌’గా మారుతాయా? ఈ రాష్ట్రాలు అమెరికా మాదిరిగానో, సింగపూర్‌లాగానో రూపాంతంరం చెందుతాయా? ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడెందుకు? అనే సందేహం రావొచ్చు. రాష్ట్రం విడిపోతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. ఎలాగూ విడిపోయాం కదా…ఇది మా మంచికే జరిగింది అని సీమాంధ్రులు అనుకుంటున్నారు. 

రెండు రాష్ట్రాల్లోనూ పాలకులు ఎన్నికల్లో, అధికారంలోకి వచ్చాక ఈరోజు వరకూ చెబుతున్న మాటలు, చేస్తున్న వాగ్దానాలు, చూపిస్తున్న స్వర్గాలు చూస్తుంటే తెలుగోళ్ల బతుకులు పూర్తిగా మారిపోతాయని ఎవరైనా అనుకుంటారు. కాని గొప్పగా చేస్తున్న వాగ్దానాలు ఆచరణలోకి వచ్చేసరికి బలహీనపడుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పాలకుల మాటలు తడబడుతున్నాయి. వాటికి రకరకాల సవరణలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో రుణమాఫీ మొదలుకొని ఇప్పటివరకూ చేసిన వాగ్దానాలు పరిశీలిస్తే అధికారంలో ఉన్నవారు ఎలాంటి పిల్లి మొగ్గలు వేస్తున్నారో అర్థమవుతుంది. కారణం? మాటలు చెప్పడం తేలికే గాని ఆచరణ అంత సులభం కాదు.  ఖజానా పరిస్థితిని, ఆదాయ మార్గాలను పట్టించుకోకుండా వాగ్దానాలు చేసేస్తున్నారు. వాస్తవాలను పట్టించుకోకుండా గాలి మేడలు కడుతున్నారు. రోజుకో నిర్ణయం ప్రకటిస్తున్నారు. చేయగలిగిన పనులేవి? చేయలేని పనులేవి? అని ఆలోచించడంలేదు. 

పాలకులు ఏ విషయంలోనూ అధ్యయనం చేయడంలేదని రుణ మాఫీ వ్యవహారంతో తేలిపోయింది.  చేసిన వాగ్దానాలు అమలు చేయాలనుకునేసరికి సాధ్యం కాక రకరకాల షరతులు, నిబంధనలు పెడుతున్నారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంటును ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పింఛన్లు, పేదలకు డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లు, రేషన్‌ కార్డులు, కేజీ టు పీజీ…ఇలా అనేక పథకాలకు సవరణలు చేయడమో, కుదించడమో చేయాల్సి వస్తోంది. ఇదే పని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ చేస్తోంది. ఇక్కడ చెప్పుకునే విషయమేమిటంటే…పాలకులు వాగ్దానాలు చేసేటప్పుడు స్పష్టత ఇవ్వడం లేదు. చేసే వాగ్దానం స్వరూప స్వభావాలేమిటో, రూపు రేఖలు ఏమిటో తెలియచేయడంలేదు. 

ఉదాహరణకు…కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలోనే ‘తెలంగాణలోని పిల్లలందరికీ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాం’ అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చక కూడా పదే పదే ప్రకటించారు. దీన్ని వింటే ఏమనుకుంటారు? అందరు పిల్లలకూ ఇది వరిస్తుందని అనుకుంటారు. కాని కాని తాజాగా 4 నుంచి 12 తరగతుల వరకే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతావారికే ప్రాధాన్యమని చెబుతున్నారు. ఇంకా అనేక నిబంధనలు పెట్టారు. ఇలా ఎందుకు చేయాలి? హామీ ఇచ్చేముందే సమగ్రంగా ఇస్తే ప్రజలకు కూడా స్పష్టత వస్తుంది కదా. ముఖ్యమంత్రులు ఎక్కడికి వెళితే అక్కడ ఏవో వాగ్దానాలు చేసేస్తున్నారు. పురాణాల్లో దేవుళ్లు వరాలు ఇస్తున్నట్లుగా వీరు కూడా అక్కడిక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాని…అది సాధ్యమా? కాదా? ఆలోచించడం లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి  ‘పిల్ల చేష్టలు’ చేస్తున్నారనిపిస్తోంది. అపరిపక్వంగా వ్యవహరిస్తున్నారు.

ఐటి హబ్‌ చేస్తాం, టూరిజం హబ్‌ చేస్తాం, ఆ హబ్‌ చేస్తాం, ఈ హబ్‌ చేస్తాం అంటూ దండకంలా చదువుతున్నారు. పారిశ్రామికవేత్తలకు స్వర్గం చూపిస్తున్నారు. ప్రపంచ దేశాలు తిరుగుతూ తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండని స్వాగతాలు పలుకుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు పెట్టే గొంతెమ్మ కోరికలకు తలూపుతున్నారు. విలువైన భూములు వారికి కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకూ విదేశీ నగరాలంటే విపరీతమైన మోజు. ఆ నగరాల మాదిరిగా తాము అభివృద్ధి చేస్తామని అదేపనిగా చెబుతున్నారు.  తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిరోజూ కొత్త నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. అందమైన ఊహా చిత్రాలు నిర్మిస్తున్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి కంకణం కట్టుకున్నానని చెబుతున్న కేసీఆర్‌ హైదరాబాద్‌ను విశ్వ నగరం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.  ఆవేశంతో అనేక ప్రకటనలు చేస్తున్నారుగాని చివరకు ఏం చేస్తారో తెలియదు. అధికారానికి వచ్చిన కొత్తల్లో సింగపూర్‌ చేస్తానన్నారు. కౌలాలంపూర్‌ చేస్తానన్నారు. పాత బస్తీని ఇస్తాంబుల్‌ నగరంలా చేస్తానన్నారు. తెలంగాణను చదవుల్లో లండన్‌ మాదిరిగా చేస్తానన్నారు. కొద్ది రోజుల కిందట టునీషియా ప్రతినిధులు కేసీఆర్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్‌ను టునీషియాలా చేస్తానని ప్రకటించారు.

 హైదరాబాద్‌ అభివృద్ధిపై కేసీఆర్‌ చేసిన ప్రకటనలు లేదా హామీలు అమలు చేయాలంటేనే దాదాపు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. అలాంటిది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఇచ్చిన ‘అభివృద్ధి’ హామీలు సాకారం కావాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలిఅభివృద్ధి కాకూడదని ఎవరూ అనరు. అడ్డుకోరు. కాని ఇస్తున్న హామీల్లో కొన్ని అలవిగానివి, అనవసరమైనవి కూడా ఉన్నాయనిపిస్తోంది. ట్యాంక్‌బండ్‌ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామన్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన టవర్‌ నిర్మిస్తామన్నారు. రెండు వేల ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మిస్తామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో చూసుకుంటే ఇప్పడు ఇవన్నీ అవసరమా? అనే ప్రశ్న వస్తుంది. ప్రభుత్వ భూములు అమ్మాలని, కబ్జా భూములు క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ కార్యాలయాలను వేలం వేయాలని కేసీఆర్‌ నిర్ణయించారంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి మేడిపండు చందంగా ఉన్నట్లు అర్థమవుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్ని అనవసరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆంధ్రకు సుదీర్ఘమైన సముద్రతీరం ఓ వరం. దాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సహేతుకంగా ఆలోచించాలి. కాని బాబు తీరం పొడవునా ఓడరేవులు నిర్మిస్తామన్నారు. కాని వాటికి ఎలా పని కల్పిస్తారో చెప్పలేదు. మూడేళ్లలో తమ రాష్ట్రం దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంటుందని చెప్పారు. 

నాలుగేళ్లలో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని బాబు చేస్తున్న ప్రకటనలు వాస్తవ దూరంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజధాని స్థల సేకరణపై ఇప్పటికీ వివాదాలు ఇంకా సమసిపోలేదు. భూములు ఇచ్చేందుకు అనేకమంది నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో కొద్ది సమయంలో అద్భుతమైన రాజధాని తయారవుతుందా? ఓ పక్క కేంద్ర సాయం కోసం అర్రులు చాస్తున్న బాబు మరో పక్క ‘అద్భుత’మైన హామీలు ఇస్తున్నారు. ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే పాలకులు ప్రజల మౌలిక అవసరాలు తీర్చడం మీద దృష్టి పెట్టకుండా వారిని భ్రమల్లో విహరింపచేస్తున్నారు. ఊహల్లో బతికే విధంగా చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి మాటల కోటలు కడుతున్నారు. 

-సునయన