భారీ సినిమాలను తీయడం అంత సులువు కాదు. సమయం, సొమ్ము రెండూ సమస్యలే. కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టడం ఒక ఇబ్బంది. కానీ ఇలాంటి భారీ సినిమాలకు ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. ఇంత సొమ్ము స్వంతంగా తీసుకురాలేదు. ఫైనాన్స్ తీసుకోవాలి. కనీసంలో కనీసం మూడు రూపాయిల వడ్డీకైనా ఫైనాన్స్ తీసుకోవాలి. కోటి రూపాయిలకు నెలకు మూడు లక్షలు వడ్డీ చెల్లించాలి. మరి ఇరవై ముప్ఫై కోట్లు అంటే నెలకు అరకోటి వడ్డీలకే చెల్లించాలి.
సినిమా ఆలస్యం అయిన కొద్దీ ఇది అలా అలా కొండలై కూర్చుంటుంది. రుద్రమదేవి లాంటి భారీ ప్రాజెక్టు తలకు ఎత్తుకున్నారు దర్శకుడు గుణశేఖర్. మంచి దర్శకుడే, కానీ సరైన విజయాలు లేక, అవకాశాలు రాలేదు. దాంతో ఆయన చిన్న ప్రాజెక్టు తీసుకోకుండా, ఇలాంటి పెద్ద ప్రాజెక్టు ప్రారంభించారు. సినిమా దాదాపు పూర్తయిపోయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సినిమా ఖర్చు మేరకు అమ్మకాలు జరగాలి. అక్కడే సమస్య.
రుద్రమదేవి మాస్ సినిమా కాదు. జానపద సినిమా కాదు. చరిత్రాత్మక సినిమా. అనుష్క కోసమే రావాలి సినిమాకు. రానా తదితరులు వున్నా అంత క్రౌడ్ పుల్లింగ్ కాదు. అందుకే మొత్తానికి అల్లు అర్జున్ ను ఓ కీలక పాత్రకు ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గెటప్, మేకింగ్ విడియోలు చూపించి, ఎలాగైనా సినిమాకు హైప్ తేవాలని, మార్కెట్ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అసలే బయర్లు భారీ హైప్ సినిమాలంటే భయపడి పారిపోతున్నారు. ఐ సినిమా కాబట్టి, డిజాస్టర్ టాక్ వచ్చినా, పండుగ సీజన్ పుణ్యమా అని కనీసం అర్థరూపాయి వాటా వెనక్కు వచ్చేలా కనిపిస్తోంది. అదే పొజిషన లో మరో తెలుగు సినిమా అంటే మన ప్రేక్షకులు రెండో రోజే బాక్సుల వెనక్కు పంపేస్తారు.
రుద్రమదేవిని అడ్వాన్స్ లు తీసుకుని ఆడించడం అంటే నిర్మాతకు కష్టం. ఫైనల్ సెటిల్ మెంట్ లకు, పబ్లిసిటికీ డబ్బులు కావాలి. పైగా మన డిస్ట్రిబ్యూటర్లు మహా తెలివైన వారు. సినిమా హిట్ అయినా వారి నుంచి పైసలు వెనక్కు రప్పించుకోవడం అంత సులువు కాదు. అందువల్ల అమ్మకాలే శరణ్యం. కానీ బయ్యర్లు ముందుకు రావాలి. అందుకోసమే పాపం, గుణశేఖర్, ఫస్ట్ లుక్, సెకెండ్ లుక్, మేకింగ్ విడియో అంటూ కిందా మీదా పడుతున్నారు.