(జిన్నా గోఖలేకు శిష్యుడు. గాంధీ ప్రాభవం సహించడం అతని వలన కాలేదు. తొలిథలో మతతత్వవాది కాకపోవడం ముస్లింలీగ్‌తో కూడా పొరపొచ్చాలు వచ్చాయి. భారత ప్రజల్లో వస్తున్న చైతన్యం చూసి బెదిరి పరిస్థితులను అధ్యయనం చేయమని ఆంగ్లప్రభుత్వం 1928లో సర్ జాన్ సైమన్ను ఆధ్వర్యంలో పంపిన సైమన్ కమీషన్‌ను కాంగ్రెసుతో బాటు బహిష్కరించి ఇంగ్లీషువారికి, లీగ్ వారికి విరోధి అయ్యాడు. చివరకు ప్రాణం విసిగి ఇంగ్లండు వెళ్లిపోయి లా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 1930లో దండి పాదయాత్ర చేయడం ద్వారా ఇక్కడ గాంధీ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 1931 గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెసు పక్షాన ఏకైక ప్రతినిథిగా గాంధీ హాజరయ్యేరు. ఆంగ్ల ప్రభుత్వం జిన్నాను ఆహ్వానించనైనా ఆహ్వానించలేదు. ఆ సమావేశంలో ముస్లిములు మైనారిటీలు కాబట్టి వారి హక్కులు పరిరక్షించాలనే విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ మెలికకు కారణం అప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ఆంగ్ల ప్రభుత్వం హిందూ-ముస్లిము విభేదాలను తమ కనుగుణంగా ఉపయోగించుకోవాలని చూడడమే. వారు ఇండియాలో 15 ఆర్డినెన్సులు తెచ్చి స్వాతంత్రోద్యమాన్ని అణచి వేయాలని చూసారు. అంతేగాక 1932లో జరిగిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో 1935 ఇండియా బిల్లు తయారు ప్రతిపాదన తెచ్చేటప్పుడు ఇండియాలోని రాజ్యాధీశులు ఒప్పుకుంటేనే ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు – రాజ్యాధీశులు ఆ ఆలోచనకు ఎలాగూ సమ్మతించరని తెలిసికూడా.
జూన్ 1935లో ఇండియా బిల్లు బ్రిటన్ పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు బ్రిటన్‌లోని లేబర్ పార్టీ నాయకుడు, ఇండియాకు స్వాతంత్య్రం యివ్వాలని భావించే క్లెమెంట్ అట్లీ దానిలో లోపాలను ఎత్తిచూపారు. 'ఇండియాను సంస్థానాధీశుల మధ్య, మైనారిటీల మధ్య, జాతీయవాదుల మధ్య విభజించాలని చూస్తోందీ బిల్లు. మైనారిటీలకు, రాజులకు అనవసర ప్రాముఖ్యం ఇచ్చి, రాష్ట్రాలను యుద్ధభూములుగా మార్చి, జాతీయశక్తులైన కాంగ్రెసును బలహీనపరుస్తుందీ బిల్లు' అని వాదించారాయన. జిన్నా 1934 ఏప్రిల్‌కు ఇండియాకు తిరిగివచ్చేసరికి కాంగ్రెస్ కూడా సత్యాగ్రహాల మార్గం మార్చి, సహాయనిరాకరణ ఉద్యమం విరమించి, పరిపాలనవైపు దృష్టి సారిస్తోంది. 1937 ఫిబ్రవరి ఎన్నికల ద్వారా రాష్ట్రీయ స్వపరిపాలనకు అవకాశం వస్తోంది, యిదే అదనని జిన్నా రంగంలోకి దూకాడు. కాంగ్రెసు పార్టీ యీ చట్టం నిరుత్సాహకరమనీ, భారతప్రజలకు సమ్మతం కాదనీ నిరూపించడానికి నిరసనగా ఎన్నికలలో దిగుతున్నాం అంటూ ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్నికలే ప్రజాభిప్రాయానికి దర్పణం. ఎన్నికలకు దూరంగా వుండి ప్రజలు మా పక్షానే వున్నారు అని చెప్పుకుంటూ వుంటే నమ్మేవారెవరు? ఆ ఎన్నికలలో గాంధీ ఒక్క ఎన్నికల ప్రచారసభలో కూడా ప్రసంగించక పోయినా ఎన్నికలలో ప్రజలు కాంగ్రెసు పట్ల తమ అభిమానాన్ని చాటి చెప్పారు. మొత్తం 228 సీట్లలో కాంగ్రెసు 133 గెలుచుకుంది. భారతదేశంలో (అంటే నేటి భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్) 11 ప్రాంతాలుంటే 7 ప్రాంతాల్లో కాంగ్రెసు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పరచగలిగింది. తక్కిన వాటిలో రెండింట్లో (ఆసాం, సింధ్) యితరులతో కలిసి సంయుక్త ప్రభుత్వాలు ఏర్పరచగలిగింది. తక్కిన రెండిట్లో – అంటే బెంగాల్, పంజాబ్‌లలో మాత్రం కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బెంగాల్లో కృషక్ ప్రజా పార్టీ, ముస్లిం లీగు కలిసి ప్రభుత్వం ఏర్పరచగా పంజాబ్‌లో యూనియనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. జిన్నా నేతృత్వంలో లీగ్‌కు 5% ముస్లిము ఓట్లు మాత్రం పడ్డాయి. బెంగాల్‌లోని 117 ముస్లిము స్థానాల్లో 39, పంజాబ్ 84 లో 1, సింధ్ 39లో 3, మద్రాసులో 10, బొంబాయిలో 20 దక్కాయి. బీహార్, సి.పి., ఒరిస్సాలలో పూజ్యం. యు.పి.లో 69 సీట్లలో 27 గెలుచుకున్నారు.
కాంగ్రెసు పార్టీ తమకిచ్చిన పరిమిత అధికారాలతోనే ప్రజలను మెప్పించే పనులు చేపట్టింది. దాని మంత్రులు తమ జీతాలు తగ్గించుకున్నారు. ఆడంబరాలు లేకుండా రైళ్లలో మూడో తరగతి లేదా రెండో తరగతిలో ప్రయాణించేవారు. నిజాయితీతో వ్యవహరించారు. ప్రజలపై నిర్బంధాలు తొలగించారు. కార్మికులకు, రైతులకు యూనియన్లను ప్రోత్సహించారు. రాజకీయ ఖైదీలను విడిపించారు. హరిజనోద్ధరణ, మద్యపాన నిషేధం, భూసంస్కరణలు, కౌలుదారుల హక్కులు యిలాటి ఎన్నో అభ్యుదయ చర్యలు చేపట్టారు. ఇవన్నీ హిందూ, ముస్లిం జమీందార్లను అడలెత్తించాయి. మహారాజులు, సంస్థానాధీశులనైతే మరీనూ. తమ ప్రాంతాలలో కాంగ్రెసు బలపడితే గ్రామీణప్రజలు యిలాటి సంస్కరణలు కోరతారని, నగరప్రజలు నిషేధరహిత స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కోరతారని భయపడి కాంగ్రెసు పతనాన్ని కోరుకున్నారు. తమ అధీనంలో వున్న ప్రాంతాల్లో కాంగ్రెసు వ్యాప్తిని అడ్డుకున్నారు. కోస్తా, సీమల్లో కాంగ్రెసు ఉద్యమాన్ని, నిజాం ఏలుబడిలో వున్న తెలంగాణలో కాంగ్రెసు ఉద్యమాన్ని పోల్చి చూస్తే యీ విషయం బోధపడుతుంది. అధికారం చేపడితే చేయగల పనులు చూసిన యు.పి. ముస్లిం లీగ్ నాయకులు కాంగ్రెసు నాయకత్వంలోని మంత్రివర్గంలో చేరదామనుకున్నారు. కాని లీగ్ సమర్థకులు జమీందార్లు కాబట్టి, వారు తాము చేపట్టదలచిన భూసంస్కరణలను అడ్డుకుంటారనే భయంతో కాంగ్రెసుకు లీగ్‌తో అధికారం పంచుకోవడానికి యిష్టపడలేదు. లీగ్‌కు ఒకే ఒక్క మంత్రి పదవి ఇస్తామన్నారు. దాంతో లీగ్‌కు కోపం వచ్చి మంత్రివర్గంలో చేరం అన్నారు. ఒకవేళ కాంగ్రెసు రెండు మంత్రి పదవులు ఇస్తామన్నా జిన్నా పడనిచ్చేవారు కారు. ఆయన వ్యూహం వేరు. కాంగ్రెసును అప్రతిష్టపాలు చేసి ముస్లిములు ఆ పార్టీలో చేరకుండా చేయాలన్నదే ఆయన ప్రణాళిక. ఆయన డిమాండ్లు ఏమిటంటే – 'కేంద్రప్రభుత్వానికి పెద్దగా అధికారాలు ఉండకూడదు, ప్రాంతీయ ప్రభుత్వాలకు పూర్తి స్వయంనిర్ణయాధికారం ఉండాలి, మిలటరీలో, ఉద్యోగాలలో ముస్లిములకు వాటా ఉండాలి. ముస్లిములకు ఏకైక ప్రతినిథిగా లీగ్‌ని మాత్రమే పరిగణించాలి. ఇతర ముస్లిము పార్టీలను సంప్రదించనవసరం లేదు. కాంగ్రెసును అసలే అడగనక్కరలేదు. తమది హిందువుల పార్టీ అని అది ఒప్పేసుకోవాలి.'
యు.పి. ఉప ఎన్నికలలో జిన్నా అల్లాపేరు మీద, కురాన్ పేరు మీద ఓట్లు అర్థించారు. జిన్నా స్వతహాగా ఎంత ఉదారవాదో తెలిసిన నెహ్రూ రాజకీయాల కోసం అతను మతాన్ని ఉపయోగించుకోవడం చూసి నిర్ఘాంతపోయాడు. కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడి కొన్ని వారాలయిందో లేదో, ముస్లిములు కాంగ్రెసు పాలనలో అష్టకష్టాలు పడుతున్నారనీ, కాంగ్రెసు ఏలుబడిలో ముస్లిములు న్యాయం కోసం ఆశించడం కల్ల అనీ జిన్నా ప్రకటనలు గుప్పించాడు. నిజానికి పాలన చేసే ఐ.సి.ఎస్. అధికారులలో 50 శాతం మంది ఇంగ్లీషువారే. పోలీసులలో ఎక్కువమంది ముస్లిములే. అయినా శాంతిభద్రతలు బాగా లేవని, దానికి కాంగ్రెసు హిందూతత్వమే కారణమనీ జిన్నా ప్రచారం చేశాడు. కాంగ్రెసు వారు అతని ఆరోపణలపై న్యాయవిచారణ జరిపిస్తామన్నారు. కానీ జిన్నా సహకరించలేదు. నాకు దానిపై నమ్మకం లేదు పొమ్మన్నాడు. ఆయన ఇతర ఫిర్యాదులేమిటంటే – గాంధీ జన్మదినం సెలవుగా ఎందుకు ప్రకటించాలి? గాంధీ కెందుకింత ప్రాముఖ్యత? వందేమాతరం హిందూ జాతి గీతం, దానిని ప్రభుత్వ కార్యక్రమాలలో పాడకూడదు. గాంధీ ప్రచారం చేస్తున్న బేసిక్ ఎడ్యుకేషన్ (అసలు దానిని రూపొందించింది జాకీర్ హుసేన్, కె.జి.సైయిదుదీన్)లో ముస్లిము బాలురకు కావలసిన మత ప్రార్థనకు తావివ్వలేదు కాబట్టి దానిని స్కూళ్లలో ప్రవేశపెట్టకూడదు… యిలా రకరకాలుగా పేచీ పెట్టాడు. పరిస్థితులు యిలా వుండగా గోడ్సే '…అలా చేయడంలో తమ మంత్రి మండళ్లలో ముస్లిం లీగుకి ప్రాతినిథ్యం లేకుండా చేసి కాంగ్రెసు తీవ్రమైన పొరపాటు చేసింది' అని రాయడం వింతగా వుంది. నిజం ఏమిటంటే కాంగ్రెసు-ముస్లిం లీగు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాలలో యిద్దరికీ పడేది కాదు. ఒకరి కంటె మరొకరు అధికుల మన్నట్లు ప్రవర్తించేవారు. ఈ అనుభవాలతోనే ఇంగ్లీషు వాళ్లతో బాటు ముస్లిం లీగు వాళ్ల పీడ కూడా వదిలితే బాగుండునని కాంగ్రెసు వారికి మనసులో తోచి తర్వాతి కాలంలో దేశవిభజన విషయంలో మెత్తబడేట్లా చేసింది. అలాటప్పుడు తమకు పూర్తి మెజారిటీ వున్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెసు ముస్లిం లీగుని పిలిచి నెత్తి కెక్కించుకుని వుండాల్సిందని గోడ్సే ఎలా అనగలడు? సంస్థానాధీశులు, బ్రిటిషువారు, జిన్నా అందరూ కలిసి కాంగ్రెసు ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసిన మాట వాస్తవం.- వ్యా) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)