ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? – 5

బాక్స్‌ ఐటమ్‌ – గోడ్సే అభిమానులు Advertisement నాథూరాం గోడ్సే గాంధీని హత్య చేయడం ఎంత సంచలనమో, అతణ్ణి, అతని సహచరుడు నారాయణ ఆప్టేని 1948 ఫిబ్రవరిలో అరెస్టు చేయడం అంతే సంచలనం. ఉరికి…

బాక్స్‌ ఐటమ్‌ – గోడ్సే అభిమానులు

నాథూరాం గోడ్సే గాంధీని హత్య చేయడం ఎంత సంచలనమో, అతణ్ణి, అతని సహచరుడు నారాయణ ఆప్టేని 1948 ఫిబ్రవరిలో అరెస్టు చేయడం అంతే సంచలనం. ఉరికి ముందు గోడ్సే వివరణలాగా ప్రచురించిన 'నేను గాంధీని ఎందుకు హత్య చేసానంటే..' అనే వ్యాసం అంతకన్నా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య తాలూకు పథక రచనలో ప్రధానమైన వ్యక్తిగా అనుమానించిన గోపాల్‌ గోడ్సే తన నాయకుడైన నాథూరాం గోడ్సే ఆశయమైన 'అఖండ భారతా'న్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ప్రతియేటా జూన్‌ ఒకటో తేదీన గోడ్సే సంస్మరణ సభ జరుపుతున్నాడు.

పూనేలోని మారుమూల వీధిలో ఏ ఆర్భాటాలు లేకుండా ఈ సంస్మరణ జరిగింది. ఆ సభలో గోపాల్‌ వ్యక్తం చేసిన వ్యాఖ్యలు వింటే వొళ్లు గగుర్పొడుస్తుంది. కొన్నింటిని వినండి.
''ఎప్పుడో ఒక నాటికి సింధ్‌ (ఇప్పుడు పాకిస్తాన్‌లో అంతర్భాగమైన నది)ను ఆక్రమిస్తాం. సింధ్‌ భారతదేశంలో అంతర్భాగమైన వేద మంత్రాల్లో వుంది.''

''ఆగ్రాలో గుడి (గోపాల్‌ గోడ్సే ఉద్దేశంలో తాజ్‌మహల్‌) హిందువులది. 1156లో ఒక హిందూ రాజు నిర్మించిన శివదేవాలయమే ఇది. దీన్ని ప్రజలు గుర్తిస్తారు. శివాలయాన్ని పునర్నిర్మిస్తారు.''

''గాంధీని జాతిపిత అని పిలవడంలో నాకభ్యంతరముంది. ఆయన ఏ జాతికి పిత? వట్టి వేర్పాటు వాది. స్వాతంత్య్రానికి ఆయనే కారకుడని మీరు కీర్తిస్తే విభజనకు కూడా ఆయన్నే కారణం చేయండి''

– యివన్నీ గోపాల్‌  గోడ్సే ఈ మధ్య జరిగిన నాథూరామ్‌ సంస్మరణ సభ వేదిక నుంచి అన్నమాటలే.

అయితే 1991 ఎన్నికలలో అప్పటి శివసేన అధ్యకక్షుడు బాల్‌ ఠాకరే ఒక వేదిక మీద నాథూరాం గోడ్సేను కీర్తిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశాడు. తరువాత దీన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమకు సంబంధం లేని చర్యగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ తన ఎన్నికల ప్రచారంలో బిజెపి ద్వంద్వ వైఖరిని తన నినాదంలో ఇలా అన్నాడు – ''నోట్లో రాముడి మాట మనసులో నాథూరామ్‌ బాట!''                     

(ఆంధ్రజ్యోతి వీక్లీ జులై 1996)

ఇదీ 1996లో నేను రాసిన వ్యాసం. దీని తర్వాత 2000 సం||రంలో వీరసావర్కార్‌ వాఙ్మయ ప్రతిష్టాన్‌ ప్రచురించిన ''గాంధీ హత్య- నాథూరాం గోడ్సే వాఙ్మూలం'' అనే అనువాద పుస్తకం (1999లో ద్వితీయ ముద్రణ) కొన్నాను. భారతప్రభుత్వం దాని ప్రచురణను నిషేధించిందిన కారణంగా అప్పటిదాకా గోడ్సే తరఫు వాదన నేను చదవలేదు. సహనిందితుడైన గోపాల్‌ గోడ్సే 1965లో జైలు నుంచి విడుదలై దీన్ని మరాఠీలో విడుదల చేశాడు. గోడ్సే భావాలను ప్రచారం చేయసాగాడు.  కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 1999లో బిజెపి నాయకత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనికి వూపు వచ్చింది. ఆ వూపులోనే యీ పుస్తకం మార్కెట్‌లోకి వచ్చినట్టుంది. అనువాదమూ, ప్రింటింగు యింప్రెసివ్‌గా లేవు. నా కాపీలో పేజీలు తారుమారుగా వున్నాయి కూడా. గోడ్సే తనను తాను ఎలా సమర్థించుకుంటాడో తెలుసుకోవాలని పట్టుదలతో చదివాను. గోడ్సే పేరు గాడ్సే కాదనీ గోడ్సే అనీ అప్పుడే తెలిసింది. ఇన్నాళ్లూ గాడ్సే అని ఎందుకు పొరబడ్డామా అని తర్కించుకున్నారు. ఆ పేరులో మొదటి మూడు అక్షరాలు విడతీసి ఇంగ్లీషు అర్థం ప్రకారం 'గాడ్‌' అనుకుని ఆ తర్వాత సే కలిపి వుంటారు కాబోలు. తెలుగులో గోటేటి అనే యింటిపేరు వుంది. దాన్ని ఇంగ్లీషులో రాస్తే యీ పేరు తెలియనివారు మొదటి మూడు అక్షరాలు విడదీసి 'జిఓటి – గాట్‌' అని అనుకుని 'ఏటి' కలిపి గాటేటి అంటారేమో అనుకున్నా. దాన్ని నివారించాలంటే జిఓఎటి – గోట్‌ (మేక) అనే స్పెల్లింగ్‌ పెట్టుకుని ఆ తర్వాత ఏటి రాయాలేమో అనుకుని నవ్వుకున్నా. మన పత్రికారంగమంతా యిప్పటికీ 'గాడ్సే' అనే రాస్తోంది. 

సరే, యిక ఆ పుస్తకంలో ముఖ్యాంశాలు, వాటితో బాటు నా వ్యాఖ్యానమూ రాస్తాను. ముందుగా యితని వాఙ్మూలం బయటకు రావడానికి ఎందుకింత లేటైంది అనే విషయం చెపుతాను. ఇది ఆ పుస్తకంలో వున్నదే! 1948 జనవరి 30 న గాంధీ హత్య జరిగిన తర్వాత నిందితులు పట్టుబడ్డాక, కేసు విచారణకై ఆత్మచరణ్‌ అగ్రవాల్‌ అనే ఐసియస్‌ న్యాయాధిపతిగా ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పరచారు. 1948 మే 27 నుండి విచారణ ప్రారంభమైంది. నిందితులందరు  తమ తరఫున న్యాయవాదులను నియమించుకున్నారు. తమపై మోపబడిన అభియోగాలపై జవాబులు లిఖితపూర్వకంగా యిచ్చారు. నాథూరాం తన స్టేటుమెంటులో గాంధీని తను ఎందుకు చంపుదామనుకున్నాడో కారణాలు వివరించాడు. ఇవన్నీ కోర్టులో వాళ్లు చదివారు. వాటిలో కొన్ని భాగాలను మర్నాటి పత్రికలు ప్రచురించాయి. ఇది ప్రభుత్వానికి రుచించలేదు. ఇకపై ప్రచురించడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఆ తర్వాత నాథూరాం కోర్టులో చేసిన వాదనలు పత్రికలలో రావడం మానేశాయి. 1948 డిసెంబరు 30కి విచారణ పూర్తయింది. 1949 ఫిబ్రవరి 10 న తీర్పు వచ్చింది. సావర్కార్‌ నిర్దోషిగా విడుదలయ్యారు. అప్రూవర్‌గా మారిన దిగంబర్‌కు క్షమాభిక్ష పెట్టి వదిలేశారు. నాథూరామ్‌, ఆప్టేలకు ఉరిశిక్ష. కర్కారే, మదన్‌లాల్‌, గోపాల్‌ గోడ్సే, శంకర్‌ కిష్టయ్య, పర్చూరేలకు యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష పడింది. అప్పటికి సుప్రీం కోర్టు ఏర్పరచలేదు. బొంబాయి పబ్లిక్‌ సెక్యూరిటీ మెజర్స్‌ చట్టాన్ని ఢిల్లీకి కూడా వర్తింపచేసి ఆ చట్టం కింద యీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. మామూలు చట్టాల్లో అయితే స్పెషల్‌ కోర్టు విధించే మరణశిక్షను హైకోర్టు ధృవీకరించాలి. కానీ యీ చట్టం కింద ఆ అవసరం లేదు. అప్పీలు చేసుకోవడానికి 15 రోజులు గడువిచ్చారు. శిక్ష పడినవారందరూ పంజాబ్‌ హై కోర్టుకు అపీలు చేసుకున్నారు. న్యాయాధిపతులు జస్టిస్‌ భండారీ, అచ్చురామ్‌, జి డి  ఖోస్లాలు అప్పీలు పిటిషన్లను విచారించి 1949 జూన్‌ 22న తీర్పు యిచ్చారు. శంకర్‌ కిష్టయ్య, పర్చూరేలను విడుదల చేశారు. తక్కిన శిక్షలన్నీ ఖరారు చేశారు. హైకోర్టులో నాథూరామ్‌ చేసిన వాదనలను పత్రికల వారు ప్రచురించకుండా ప్రభుత్వం శతథా ప్రయత్నించిందని, వారిని బెదిరించిందని గోపాల్‌ గోడ్సే అంటారు.  1949 నవంబరు 15 న అంబాలా జైలులో నాథూరామ్‌, ఆప్టేల మరణశిక్ష అమలైన తర్వాత కొన్ని పత్రికలు మాత్రం కొన్ని వ్యాసాలు వేశాయట.

ద్వీపాంతరవాస శిక్ష ఆచరణలో యావజ్జీవ శిక్షగా మారింది. గోపాల్‌ తన విడుదలకై సుప్రీం కోర్టులో 22 సార్లు కేసులు వేశాడు. నేరస్తులపై తమకు పూర్తి అధికారం వుందని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. చివరకు 1964 అక్టోబరు 13 న గోపాల్‌, మరో యిద్దరు విడుదలయ్యారు. బయటకు వచ్చాక 'గాంధీ హత్య అణి మీ' (గాంధీ హత్యా, నేనూ) అనే పుస్తకం రాస్తే ప్రభుత్వం దాన్ని నిషేధించింది. హైకోర్టు ఆ నిషేధాన్ని తొలగించింది. ఆ తర్వాత నాథూరామ్‌ వాఙ్మూలం పుస్తకం వేశాడు. ప్రభుత్వం అప్పట్లో గోడ్సే వాదనలు బయటకు రాకుండా ఎందుకు చేసింది అని ఆలోచించాను. నిషేధమనేది అప్రజాస్వామిక చర్యే కానీ అప్పటి పరిస్థితుల్లో అనివార్యమేమో. దేశవిభజనకు అంగీకరించిన హిందూ, ముస్లిం నాయకులెవరూ దారుణ హింసాకాండ జరుగుతుందని అనుకోలేదు. ఉన్న ప్రాంతం పేరు ఏ దేశమైతే ఏముంది, ఎక్కడివారు అక్కడే వుంటారు అనుకున్నారు. కానీ పాకిస్తాన్‌ హిందువులు హిందూస్తాన్‌కు, హిందూస్తాన్‌ ముస్లిములు పాకిస్తాన్‌కు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. కొందరు తరమబడ్డారు. ప్రజల్లో మతపరమైన విద్వేషం యింతలా వుంటుందని వూహించని యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. దాన్ని తట్టుకోవడం ఎలా అనేది కొత్తగా ఏర్పడిన రెండు దేశాలకు తలనొప్పిగా వుంది. రెండు దేశాల్లో శరణార్థుల గుడారాల్లో హాహాకారాలు వినబడుతూ ఆ యా మతాల యువకుల్లో రక్తం వేడెక్కుతోంది. 

అలాటి వేడెక్కిన వాతావరణంలో గాంధీ హత్య జరిగింది. గాంధీని చంపినవాడు ఒక మరాఠీ బ్రాహ్మణుడు అని తెలియగానే మరాఠీ బ్రాహ్మణులపై దాడులు జరిగాయి. కొన్నేళ్ల తర్వాత ఇందిర హత్య తర్వాత శిఖ్కులపై జరిగినట్లు! ఇలాటి పరిస్థితుల్లో గోడ్సే వాదనలను ఆమోదించనివారు మరిన్ని దాడులు చేయడమో, యితర ప్రాంతాల్లో మహారాష్ట్రులందర్నీ హింసించడమో చేస్తారన్న భయం ఆనాటి పాలకుల్లో వుండి వుండవచ్చు. పాలన చేతికి వచ్చి అప్పటికి ఆర్నెల్లు కూడా కాలేదు. అధికారుల్లో చాలామంది బ్రిటిషువారే. తమ పాలన పోయిందన్న కసితో వాళ్లు భారతీయ పాలకుల మాట లక్ష్యపెట్టటం లేదు. (''తమస్‌'' నవలలో భీష్మ సహానీ యిలాటి పాయింట్లు బాగా రాశారు). భారతీయులు పరిపాలించడానికి తగరని మేం మొదట్నుంచీ చెపుతున్నా వినకుండా వాళ్లకు స్వాతంత్య్రం యిచ్చారు. ఇప్పుడు ఇండియా కుక్కలు చింపిన విస్తరైంది చూడు అని బ్రిటిష్‌ కన్సర్వేటివులు లేబర్‌ పార్టీని ఎద్దేవా చేసే పరిస్థితి వచ్చింది. ఇలాటి పరిస్థితుల్లో గోడ్సే గొంతు నొక్కడం 'లెస్సర్‌ యీవిల్‌' అనుకున్నారేమో! అప్పటికి అది సరైనదే అనుకున్నా పాలనలో నిలదొక్కుకున్నాక, శాంతిభద్రతలు స్థిరపడ్డాక నిషేధం ఎత్తివేయాల్సింది. కానీ అప్పటికి గోడ్సేపై జనాలకు యింట్రస్టు పోయిందేమో.  

1962లో స్టాన్లీ వాల్‌పోర్ట్‌ రాసిన ''నైన్‌ అవర్స్‌ టు రామా'' అనే పుస్తకం వచ్చింది. రామా అంటే చనిపోతూ గాంధీ అన్న 'హే రామ్‌' అనే మాటలన్న మాట. గాంధీ హత్యకు 9 గంటల ముందు కథ ప్రారంభమై మర్డర్‌ మిస్టరీలా సాగుతుంది. ఇది హిస్టారికల్‌ ఫిక్షన్‌ కింద వస్తుంది. అంటే చారిత్రక యదార్థం నేపథ్యంగా అల్లిన కథ అన్నమాట (గోడ్సే కథంతా చెప్పాక 'ఇహ చాలు బాబోయ్‌' అని పాఠకులు అనకుండా వుంటే దీని కథా చెప్తాను). చరిత్రతోనే వేగలేకుండా వుంటే (మన ఒవైసీగారు యిప్పటిదాకా మనకు తెలియని హిందూదేశ చరిత్ర చెప్తున్నారు) గోడ్సేకు రొమాన్సు యాంగిల్‌ కూడా చేర్చిన యీ కాల్పనిక గాథ ఒకటా అని ప్రభుత్వం దడుచుకుంది. గోడ్సే అభిమానులను రెచ్చగొట్టే ఆ పుస్తకాన్నీ, దానిపై ఆధారపడి తీసిన సినిమా (1963)ను ఇండియాలో నిషేధించింది. (ఈ స్టాన్లీ గారు పట్టు వదలని విక్రమార్కుడు. జిన్నా గురించి, నెహ్రూ గురించి నిజాలు, కథలు, కల్పనలు కలగలిపిన పుస్తకాలు రాస్తూ పోయాడు) ఈ పుస్తకాన్ని నిషేధించడం తప్పు అని మేధావులు వాదించవచ్చు. కానీ ప్రజలు విజ్ఞులై, విచక్షణ కలవారైతే ఎంతటి స్వేచ్ఛనైనా యివ్వవచ్చు. ఎక్కడో స్వీడిష్‌ పత్రికలో మొహమ్మద్‌ ప్రవక్తపై కార్టూన్‌ పడితే, ఫ్రాన్సులో బార్‌లో బీరు సీసాపై గణేశుడి బొమ్మ వేస్తే ఆవేశపడిపోయి, రెచ్చిపోయి దానికి వ్యతిరేకంగా అంటూ నిరసన అంటూ యిక్కడి దుకాణాలు తగలబెట్టే మూకలు వున్న యీ దేశంలో పాలకులు జాగ్రత్త పడితే తప్పు పట్టగలమా? మనం అలాటి బాధ్యతాయుతమైన పదవిలో వున్నపుడు కానీ సాధకబాధకాలు తెలియవు. సరే, యిక గోడ్సే వాదనేమిటో చూదాం. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)