నాథూరామ్ మెట్రిక్ దాకా చదివేడు. అతని అభిరుచులు – మతరపరమైన పుస్తకాలు చదవడం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోట్లాడడం, పరోపకారాలు చేయడం, వీర సావర్కార్ పరిచయంతో ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మి ఆ ఆశయసిద్ధికి బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. సిగరెట్టు, మద్యం సేవించి ఎరగడు.
గోడ్సే కంటే ఒక సంవత్సరం చిన్నవాడైన నారాయణ్ ఆప్టే ఇందుకు విరుద్ధం. సిగరెట్టు, మద్యం, ప్రియురాలు అన్నీ అతనికి ఇష్టమైనవే. సూక్ష్మగ్రాహి, పండిత వంశానికి చెందినవాడు. ఒక క్రిష్టియన్ స్కూల్లో టీచరుగా పనిచేశాడు. దిరిమిలా రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. తరువాత రాజీనామా చేసి గోడ్సేతో కలిసి మరాఠీ దినపత్రిక ఆరంభించేడు.
దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుండి కాందిశీకులుగా వచ్చిపడిన హిందువుల విషాద గాథలు గోడ్సేను, అతని మిత్రులను కలచివేశాయి. 1947 మార్చిలో 'దేశ విభజన నా మృతదేహం మీదుగా జరుగుతుంది' అని ప్రకటించిన గాంధీ, విభజనను ఆపకపోవడం ముస్లిములను బుజ్జగించడానికేనని నమ్మారు.
1948, జనవరి 20న ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో సాయంత్రం అయిదు గంటలకు ప్రార్థనా సమావేశంలో గాంధీని కడతేర్చాలని వారి పథకం. దాని ప్రకారం దిగంబర్ బాహ్‌ాడగే (ఇతడు హత్య తర్వాత అప్రూవర్‌గా మారి, గుట్టంతా బయటపెట్టి శిక్ష తప్పించుకున్నాడు) ముఖ్య పాత్రధారి. అతను చేయవలసినది – గాంధీ కూర్చునే వేదికకకు 20 అడుగుల దూరంలో వున్న సర్వెంటు క్వార్టర్స్‌కి వెళ్లి డ్రైవరు ఛోటురామ్ నివసించే మూడవ నెంబరు క్వార్టర్లో ఫోటో తీసుకునే మిషతో లోపలకు దూరడం, దానితో ఉన్న సిమెంటు జాలీ (రంధ్రాలుండే సిమెంటు కిటికీ) ద్వారా గాంధీని .38 తుపాకీతో కాల్చడం, ఆ తర్వాత దానిగుండానే ఒక గ్రెనేడ్ జనం మధ్యకు విసరడం.
అతని అసిస్టెంటుగా వున్న శంకర్ కిష్టయ్యకు అప్పగించిన పని – జనంలోకి దూరి గాంధీకి దగ్గరగా చేరుకొని .32 రివాల్వరుతో పాయింట్ – బ్లాంక్ రేంజిలో గాంధీని కాల్చడం, ఒక గ్రెనేడ్ విసరడం.
ఈ కార్యక్రమం ఆరంభించడానికి సంకేతంగా మదన్‌లాల్ పహ్వా 90 సెకండ్ల ఫ్యూజ్ గన్ కాటన్ స్లాబ్ పేల్చాలి. దాంతో గందరగోళం నెలకొంటుంది. వెంటనే తుపాకి కాల్పులు… ఆ కాల్పులు వినగానే ఇతర కుట్రదారులు – కర్కరే గోపాల్‌లు గ్రెనేడ్లు గాంధీ వైపుగా గుంపులోకి విసరాలి. తుపాకీ కాల్చిన దిగంబర్, శంకర్లు, బాంబు పెట్టిన మదన్‌లాల్ కూడా జనంలోకి కలిసిపోయి గ్రెనేడ్లు విసరాలి.
ఢిల్లీ 1948, జనవరి 20 నాటి ఉదయం 8.30 గంటలు. మెరీనా హోటల్లో బస చేసిన ఆప్టే, కర్కరేలు హిందూ మహాసభ పార్టీ ఆఫీసులో బస చేసిన మదన్‌లాల్, గోపాల్, దిగంబర్, శంకర్ల వద్దకు వచ్చి హత్య రిహార్సలు వేసుకొనే నిమిత్తం బిర్లా హౌస్‌కి వెళదామన్నారు. నాథూరామ్ గోడ్సే మైగ్రేన్ తలనొప్పి కారణంగా హోటల్ రూమ్‌లోనే వుండిపోవలసి వచ్చిందనీ, మధ్యాహ్నం కలుస్తాడనీ తెలియబరచారు.
రిహార్సల్‌కు దిగంబర్, శంకర్లు మాత్రమే ఆప్టేతో వచ్చారు. మదన్‌లాల్, గోపాల్ అంతకుముందు బిర్లాహౌస్ ఎన్నడూ చూడకపోయినా వాళ్లు స్నానం చేయడానికి వేడినీళ్లు సిద్ధం కాని కారణంగా రూమ్‌లోనే వుండిపోయారు. కర్కరే బిర్లా హౌస్ ఇంతకుముందు చూసి ఉన్నాను కదా మళ్లీ రావడం దండగ అనుకొని అతనూ ఉండిపోయాడు.
ఆప్టే తన సహచరుడు దిగంబర్‌కు ఛోటారామ్ క్వార్టర్ జాలీ చూపించి దాంట్లోంచి తుపాకీ సులభంగా కాల్చవచ్చని చెప్పాడు. నిజానికి ఆ గది ఫ్లోరింగ్ పల్లంగా వుండడం కారణంగా ఆ జాలీ గది లోపల్నుంచి ఏడడుగుల ఎత్తుంది. కానీ ఆప్టే బృందం ఆ గదిలోకి ప్రవేశించకుండా బయట నుండే లెక్కలు వేసిన కారణంగా వారికీ విషయం తెలియదు. పైగా జీవితంలో ఎన్నడూ గ్రెనేడ్ ఉపయోగించని ఆప్టే ఆ కిటికీలోంచి హేండ్ గ్రెనేడ్ సులభంగా విసరవచ్చని దిగంబర్‌కు హామీ కూడా ఇచ్చేశాడు!
ఆ రోజు మధ్యాహ్నం ఫైరింగ్ ప్రాక్టీసు కూడా ఇంత అందంగానూ జరిగింది. కర్కరే, మదన్‌లాల్ భోజనానికి బయటకు వెళ్లిన కారణంగా ఆప్టే వారిని వదిలేసి తక్కిన వారితో అడవుల్లోకి వెళ్లి ప్రాక్టీసు చేయించబోయాడు. గోపాల్ తన .38 వెబ్లీ స్కాట్ రివాల్వర్‌ను ఉపయోగించబోతే ఛాంబర్ బయటకే రాలేదు. అతను దానిని నాలుగేళ్లుగా మట్టిలో కప్పి పెట్టి ఉంచిన కారణంగా తుప్పు పట్టిపోయింది.
ఆ తర్వాత దిగంబర్ .32 రివాల్వర్‌లో నాలుగు తూటాలు వేసి శంకర్ చేతికిచ్చి కాల్చి చూపమన్నాడు ఆప్టే. శంకర్ తనకి కాల్చడం రాదంటే 'ఆ చెట్టుకు గురి చూసి జస్ట్ ట్రిగ్గర్ నొక్కితే చాల'న్నాడు ఆప్టే. ఆ బుల్లెట్ చెట్టు దాకా చేరనేలేదు. తుపాకీలో పొరబాటేమీ లేదు. తూటాలు సరియైన కాలిబర్వి కావు. ఇక దిగంబర్ తుపాకీ మీద ఆశ విడిచి గోపాల్ .38 తుపాకీనే ఆశ్రయించవలసి వచ్చింది. శంకర్‌ని భవన్‌కి పంపి ఒక చాకు, కొబ్బరినూనె, దుప్పటీ పట్టుకురమ్మన్నారు. ఆ తుపాకీని రిపేరు చేస్తుండగానే ఫారెస్టు గార్డులు రౌండ్స్‌కి వచ్చారు. ఇక ప్రాణం విసిగి ఆప్టే 'మెరీనా హోటల్‌కి పోదా'మన్నాడు.
అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలు. దిగంబర్ను, శంకర్నీ భోజనానికి పంపి బాంబు ఫ్యూజ్ పనిచేస్తోందో లేదో చూద్దామని రూమ్‌లోనే తలుపు మూసి కాల్చి చూశారు. పెద్ద వెలుతురు, మంట, పొగ వచ్చాయి. పరుపుతో తొక్కి పెట్టి మంట ఆర్పేశారు. హోటల్ బాయ్ పరుగెత్తుకువస్తే ఆప్టే ఏదో కాకమ్మ కథ చెప్పి పంపేశాడు.
ఈలోగా .38 తుపాకీ బాగుపడింది. అన్ని భాగాలూ పనిచేస్తున్నాయి. కానీ ఫైరింగ్ ప్రాక్టీసు చేయడానికి సమయం చాలదు!
తలనొప్పి కాస్త ఉపశమించాక నాథూరామ్ గోడ్సే తన పథకాన్ని అందరికీ విశదీకరించి ఏమైనా సందేహాలుంటే అడగమన్నాడు. ఎవరికీ ఏ సందేహాలూ లేవు. ప్లాను భేషుగ్గా వుందనుకున్నారు. అసలు ఈ సంభాషణలన్నీ జరిగిన మరాఠీ భాష శంకర్‌కు అర్థం కాదు, అతనికి గాంధీజీ ఎలా ఉంటాడో తెలియదు కూడా. అయినా ఆప్టేకు అదేమీ పట్టలేదు. దిగంబర్‌కు అనుచరుడు శంకర్. అతనికి తెలియజెప్పవలసిన బాధ్యత దిగంబర్దే! దిగంబర్ శంకర్‌కు ఒకటే కొండ గుర్తు చెప్పాడు. 'నేనెవరి మీద తుపాకీ కాలిస్తే ఆయన్ని కాల్చెయ్యి. నేనెవరి మీద బాంబు వేస్తే ఆయన మీద వేసేయ్!' (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)