మోదీ ప్రధాని కావడం కాదు కానీ, లోకమంతా తలకిందులు చేసేద్దామన్న ఉబలాటం పుట్టింది కొందరికి. కరెన్సీ నోట్ల నుంచి గాంధీ బొమ్మ తీసేయాలని, విశ్వవిద్యాలయాలలో స్కూళ్లలో గాంధీని జాతిపితగా వ్యవహరించడం మానేయాలనీ ఆందోళన చేస్తున్నారు. గాంధీని చంపిన గోడ్సేకు విగ్రహాలు పెట్టడమే కాదు, గుళ్లు కట్టాలని కూడా అంటున్నారు. డిసెంబరులో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్ 'గాంధీ ఎంత దేశభక్తుడో గోడ్సే కూడా అంతే దేశభక్తుడు' అని ప్రకటించాడు. దానిపై కాంగ్రెసు ఎంపీలు నిరసన తెలిపారు. గాడ్సే గురించి ఒక్క మంచి మాట పలికినా యిన్నాళ్లూ మీడియా గగ్గోలు పెడుతూ వచ్చింది. బిహార్ ఎసెంబ్లీలో అనుకుంటా దాదాపు 30 ఏళ్ల క్రితం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతూంటే కాంగ్రెసు శాసనసభ్యులు అతన్ని మాట్లాడనీయకుండా 'గాంధీకీ జై' అని నినాదాలు చేయసాగారు. అప్పట్లో యిది కొత్త టెక్నిక్కు. తర్వాతి రోజుల్లో బిజెపి తరఫున స్వామీజీలు, సాధ్వీమణులు పార్లమెంటులో ఏం మాట్లాడాలో తెలియక కాంగ్రెసు వాళ్లు ఏం మాట్లాడినా 'జై శ్రీరామ్' అంటూ అరుస్తూండేవారు. ఇటీవలి కాలంలో 'జై తెలంగాణ' నినాదాలూ యిలాగే వుపయోగపడ్డాయి. ఇంతకీ ఆ రోజున బిహార్ ఎమ్మెల్యే కాంగ్రెసు వాళ్లను ఆపడానికి ప్రయత్నించి విఫలమై చివరకు కసిగా 'గోడ్సేకీ జై' అన్నాడు – వాళ్ల గాంధీకి యాంటీ డోట్ గోడ్సే అనే అర్థంలో! అంతకంటె గోడ్సే గొప్పవాడనీ అనలేదు, మరోటీ అనలేదు. అంతే అప్పణ్నుంచి మీడియా అతన్ని పట్టించింది – ది లీడర్ హూ సెడ్ గోడ్సేకీ జై అని తెగ యీసడించింది. గోడ్సే పేరెత్తితేనే అంత తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వచ్చేది. అలాటిది యీ రోజు బిజెపి ఎంపీ గోడ్సేను దేశభక్తుడు అనేశాడు. అనవచ్చా? ఒకవేళ అయితే… గుడి కట్టవలసినంత గొప్పవాడా? మనలో చాలామందికి వున్నది అరకొర జ్ఞానమే కాబట్టి గోడ్సే ఎలాటి వాడో తెలుసుకుంటే మనంతట మనమే ఒక అభిప్రాయానికి వస్తాం.
దేశభక్తుడు అనే మాటకు నిర్వచనం ఏమిటి? దేశాన్ని ప్రేమించేవాడు. దేశం బాగుపడాలని కోరుకునే వాడు. అలా అతి రైటిస్టు నుంచి, అతి వామపక్షవాది దాకా అందరూ కోరుకుంటారు. అయితే తేడా ఏమిటంటే తాము అనుకున్న పద్ధతిలో నడిస్తేనే దేశం బాగుపడుతుందని, ఎదుటి వాళ్లు ఆశించే పద్ధతిలో నడిస్తే దేశం చెడిపోతుందని అనుకుంటారు. అంతమాత్రం చేత వాళ్లు దేశభక్తులు కాకుండా పోతారా? అలా అయితే రాజకీయ ప్రత్యర్థులను హింసాత్మకంగా నిర్మూలించేవారి దేశభక్తి మాటేమిటి? మావోయిస్టులు అనేకమంది రాజకీయ నాయకులను చంపివేశారు. మరి వారు దేశభక్తులా కారా? మావోయిస్టులు దేశభక్తులే అని ఎన్టీయారూ అన్నారు. ఆయన పార్టీ నాయకుడు మాధవరెడ్డిని వాళ్లే చంపేశారు. అందరూ ఖండించారు. 'మావోయిస్టుల అజెండాయే మా అజెండా' అని ప్రకటించినా కెసియార్ టిడిపి పార్టీని భూస్థాపితం చేయడానికి హత్యల జోలికి పోకుండా ఆ పార్టీ నుండి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. విమర్శలతో సరిపెడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే కెసియార్ చేస్తున్నది ప్రజాస్వామ్యబద్ధమైనది. సమాజం ఆమోదించినది.
కురుపాండవులు యిద్దరూ భారతీయులే. దేశాన్ని ప్రేమించినవారే. కురుక్షేత్రంలో దారుణమైన యుద్ధం జరిపి ఒకరినొకరు చంపుకున్నారు. కానీ అది కొన్ని నియమాల ప్రకారం నిర్వహించుకున్న యుద్ధం. ఫ్రెంచ్ విప్లవం జరిగింది. విప్లవకారులు రాజరికంతో సంబంధం వున్న కుటుంబాల వారందరివీ గిల్లెటిన్‌తో పీకలు కోశారు – బహిరంగంగా, అందరికీ చెప్పి! అందుకని ఆ రక్తపాతానికి శిక్షలు పడలేదు. రష్యాలో బోల్షివిక్‌లకు, మెన్షెవిక్‌లకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఇద్దరికీ రష్యా అంటే దేశభక్తే. అనేక దేశాల్లో పాలకుడు మారినపుడు పూర్వపాలకుడి అనుయాయులకు ఉరిశిక్షలు అమలు చేస్తారు. దానికి ఓ చట్టం చేస్తారు, శాసనాలు చేస్తారు. వీటిని సమాజంలో ఎక్కువమంది ఆమోదించారని భావించాలి. అలా కాకుండా ఒక వ్యక్తి చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాజకీయ లేదా సిద్ధాంతపరమైన శత్రువును మట్టుపెడితే అతను నేరస్తుడే అవుతాడు. ఇప్పుడు వున్న చట్టాల ప్రకారం వ్యక్తిగత హింసకు పాల్పడుతున్న మావోయిస్టులు శిక్షార్హులు. మావోయిస్టులను హింసతో అణచిన పోలీసు అధికారులు ప్రశంసార్హులు. రేపు మావోయిస్టులు అధికారంలోకి వచ్చి చట్టాలను మారిస్తే ఏమవుతుందో తెలియదు కానీ యీరోజుకి యిది పద్ధతి.
దేశాన్ని ప్రేమించడమంటే సాటి దేశస్తులనీ ప్రేమించాలి. దేశమంటే మట్టి కాదోయ్, మనుషులోయ్ అన్నాడు మహాకవి. సాటి మనిషి అభిప్రాయాలను గౌరవించాలి. అతని సిద్ధాంతాలతో వైరుధ్యం వుంటే వాదించి గెలవాలి. అతన్ని గెలవకపోతే ప్రజల్లోకి వెళ్లి అతని వాదనలోని తప్పులను ఎత్తి చూపి అతన్ని నిర్వీర్యం చేయాలి. గతంలో మహా మహా పండితులు, కవులు, ఆధ్యాత్మిక వేత్తలు తలపడేవారంటే భౌతికంగా యుద్ధం చేసేవారా? ఓ పద్యం చెప్పి కావాలంటే దీనిలో తప్పులు పట్టు ఛాలెంజ్ అని చెప్పి, వెంటనే బొడ్లోంచి కత్తి తీసి పీకపై పెట్టి 'తప్పంటే చంపుతా' అంటే పోటీ గెలిచినట్లా? దేశవిభజన సమయంలో జిన్నా ద్విజాతి సిద్ధాంతపు అడ్డగోలు వాదనలు విని విసిగి, ఇతను ఛస్తే పీడా విరగడై పోయేది అని కొందరు శాపనార్థాలు పెట్టేవారట. కెసియార్ దుర్భాషలు వినలేక కొందరు సమైక్యవాదులు కెసియార్‌ను మావోయిస్టులెవరైనా లేపేస్తే బాగుండును, సోనియాను కాన్సర్ కబళిస్తే బాగుండును అని వ్యక్తిగత సంభాషణల్లో తిట్టుకునే వుంటారు. కానీ అది పద్ధతి కాదు కదా, శక్తి వుంటే ప్రజల్లోకి వెళ్లి కెసియార్ వితండ వాదనలో పొరబాట్లు ప్రజలముందు పెట్టి వారిని కన్విన్స్ చేయాలి.
సోనియా విదేశీయురాలని, అందుకే ఆమెకు రాష్ట్రం పట్ల అవగాహన లేదని తప్పుపట్టే బదులు ఆమెను నెత్తి కెక్కించుకున్న కాంగ్రెసు వారు ఆమెను కిందికి దింపేట్లు చేయగలగాలి. మనం ఏం చెప్పినా ప్రజలు వినరు అనే నిరాశతో, నిస్పృహతో అడ్డదారులు తొక్కి వాళ్లపై తుపాకీ ఎక్కుపెడితే అది గోడ్సే వ్యవహారంలా వుంటుంది. తన నమ్మకాలలో తనకు విశ్వాసం వుంటే గోడ్సే ప్రజలను వెంటేసుకుని గాంధీని ఎదిరించాల్సింది. అలా చాలామంది చేశారు. గాంధీని వ్యతిరేకించడం పాపమేమీ కాదు, తప్పేమీ కాదు. నిజానికి గోడ్సే వాదనలలో కొన్ని మంచి పాయింట్లు వున్నాయి. అతని వాంగ్మూలంలో అది తెలుస్తుంది. (తర్వాతి భాగాల్లో రాస్తాను. అతన్ని విచారించిన జడ్జి జి.డి. ఖోస్లా ఆ కేసు గురించి తన అనుభవాలను, అభిప్రాయాలను పుస్తకరూపంలో రాశారు. అదీ రాస్తాను) అంతమాత్రం చేత అతను చేసినది ఘనకార్యం కాదు. అతని విగ్రహాలు పెట్టనవసరం లేదు, అతనికి గుడి కట్టనక్కరలేదు. ఇది నా అభిప్రాయం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)