సినీ సంగీత దర్శకుడు చక్రి మరణంపై నెలకొన్న వివాదం రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది. ఇది ఖచ్చితంగా దురదృష్టకరమైన విషయమే. ఒక్క మాటలో చెప్పాలంటే, చక్రిని వివాదాల పేరుతో మళ్ళీ మళ్ళీ చంపేస్తున్నారు. చక్రి మరణంపై అనుమానాలున్నాయని చక్రి భార్య శ్రావణి ఇప్పటికే ఆరోపించారు. ఆమె నిన్నంతా మీడియా ముందుకొచ్చి, చక్రి కుటుంబ సభ్యుల నుంచి తానెదుర్కొంటోన్న ఇబ్బందుల్ని పూసగుచ్చినట్లు వివరించిన విషయం విదితమే.
చక్రి మరణానికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ కూడా తనకు ఇవ్వలేదనీ, చాలా సెటిల్‌మెంట్లు చెయ్యాల్సి వుందనీ శ్రావణి ఏవేవో విషయాలు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో గత కొన్నాళ్ళుగా చక్రితోపాటూ తానూ తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పిన శ్రావణి, ఆస్తి పంపకాల వివాదంలో తనను చక్రి కుటుంబ సభ్యులు దూరం పెట్టారనీ చెబుతున్నారు.
మరోపక్క, చక్రిని ఆయన భార్య శ్రావణే చంపేసిందంటూ చక్రి తల్లి విద్యావతి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేశారు. చక్రిని తానే చంపేశానని శ్రావణి ఫోన్ చేసి చెప్పిందనీ, ఆమె కాల్ డేటాని విశ్లేషిస్తే చక్రి మరణంపై వాస్తవాలు బయటకు వస్తాయని విద్యావతి అంటున్నారు.
ఏదిఏమైనా.. చక్రి మరణానంతరం ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నాయి ఈ కుటుంబ వివాదాలు. ఈ వివాదాల కారణంగానే ఆయన తీవ్ర మనస్థాపానికి గురై ఆ ఒత్తిడిలోనే గుండెపోటుతో మరణించారేమోనన్న కొత్త అనుమానాలు తెరపైకొస్తున్నాయి.