గోడ్సే వాదన – బొంబాయి రాష్ట్రం నుండి సింధు ప్రాంతాన్ని విడగొట్టడానికి గాంధీ అంగీకరించి అక్కడి హిందువులను మతోన్మాదులైన ముస్లిం తోడేళ్ల పాలు చేశాడు. ముస్లిం లీగుకు గాంధీ దాసోహం అనేసరికి ముస్లిములలో ఆలీ సోదరుల పరపతి పూర్తిగా పడిపోయి, జిన్నా తిరిగి రంగప్రవేశం చేసి ముస్లిము నాయకుడిగా ఎదిగాడు. 1928 సంవత్సరానికి జిన్నా విలువ చాలా ఎత్తుకు పెరిగింది. అప్పటికే గాంధీ, జిన్నా కోరిన అన్యాయమైన, హేతుబద్ధం కాని కోర్కెలకు తలవొగ్గాడు. జిన్నా 1935 రాజ్యాంగ సంస్కరణలలో మతప్రాతిపదిక సిద్ధాంతాలు మరింత లోతుగా నాటేట్లు చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జిన్నా బహిరంగంగా ఒకే వైఖరి అవలంబించాడు – ముస్లిం హక్కులు అంగీకరిస్తే యుద్ధానికి సహకారం యిస్తానని చెప్పాడు. యుద్ధం ప్రారంభమైన ఆరునెలలకు 1940లో తన ద్విజాతి సిద్ధాంతం, పాకిస్తాన్ ఏర్పరచాలనే కోరిక బయటపెట్టాడు. కాంగ్రెసు పార్టీ రెండవ ప్రపంచయుద్ధ సమయంలో తమకు వ్యతిరేకంగా వుండడం చేత, జిన్నా సానుకూలంగా వుండడం చేత బ్రిటిషువారు జిన్నాకు మద్దతు యిచ్చారు. అదే అంతిమంగా పాకిస్తాన్ ఆవిర్భావానికి దారి తీసింది. బ్రిటిషువారి 'విభజించి పాలించు' విధానానికి అనుగుణంగా నడుచుకోవడంలో గాంధీ కృతార్థుడైనాడు. విభజనకు బ్రిటిషువారి సామ్రాజ్యవాద విధానం ఎంతవరకు కారణమో, మతవర్గాల ఐక్యత అనే గాంధీ తప్పుడు విధానం కూడా అంతే కారణం.
1935లో భారతప్రభుత్వం చట్టం క్రింద రాష్ట్ర, స్వపరిపాలనం 1937 ఏప్రిల్ 1 నుండి ప్రవేశపెట్టబడింది. ఈ చట్టంలో బ్రిటిషు అధికారులకు ప్రత్యేక అధికారాలు, రక్షణలు కల్పించడం చేత యీ ప్రభుత్వాలలో చేరాలా వద్దా అని కాంగ్రెసు తటపటాయించింది. కానీ త్వరలోనే ప్రతి రాష్ట్రంలో మంత్రివర్గాలు ఏర్పరచబడడం, అందులో ఐదు రాష్ట్రాలలో ఎలాటి యిబ్బంది లేకుండా అవి పనిచేసుకుని పోవడం కాంగ్రెసు పార్టీ గమనించింది. మిగతా ఐదు రాష్ట్రాలలో కూడా బలం పెద్దగా లేని మంత్రివర్గాలు కూడా పనిచేయడం కూడా దాని దృష్టిని దాటిపోలేదు. ఇలాటి పరిస్థితుల్లో సహాయనిరాకరణం కొనసాగిస్తే తమ గురించి పట్టించుకునేవారు లేకుండా పోతారని కాంగ్రెసుకు తోచి 1937 జులైలో అధికార స్వీకరణకు అంగీకరించింది. అలా చేయడంలో తమ మంత్రి మండళ్లలో ముస్లిం లీగుకి ప్రాతినిథ్యం లేకుండా చేసి తీవ్రమైన పొరపాటు చేసింది. ముస్లిం ప్రతినిథులుగా కాంగ్రెసులోని ముస్లింలను చేర్చుకుని సరిపెట్టింది.
పౌరులందరికీ ఒకే విధమైన నియోజకవర్గాలుండి, మతపరమైన ప్రాతినిథ్యం లేని దేశాలలో యిది సరైన పద్ధతే. కానీ మతపరమైన నియోజకవర్గాలను అంగీకరించి, తాము మైనారిటీలో వున్న ప్రతి రాష్ట్రంలో ముస్లిం జనబాహుళ్యానికి ప్రతినిథులుగా ఎన్నికైన ముస్లిం లీగుని దూరంగా వుంచడం అర్థరహితం. మంత్రులుగా తీసుకోబడిన కాంగ్రెసు ముస్లిం నాయకులు ముస్లింలీగు ముస్లిం నాయకుల్లా ముస్లింజనబాహుళ్యానికి ప్రతినిథులు కానందువలన కాంగ్రెసు ప్రభుత్వాలు ఏకవర్గ పక్షంగా ముద్రపడ్డాయి. ఈ పరిస్థితి జిన్నాకు పూర్తిగా అనుకూలమైంది. ఈ అనుకూలతను 1939లో కాంగ్రెసు బ్రిటిషువారిపై అలిగి పదవీపరిత్యాగం చేసినపుడు పూర్తిగా వినియోగించుకున్నాడు. అలా రాజీనామా చేసిన కాంగ్రెసు ప్రభుత్వాల స్థానంలో గవర్నర్లు అధికారాలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలలో ముస్లిం మంత్రివర్గాలు పదవిలో కొనసాగాయి. ముస్లిం పక్షపాతులైన గవర్నర్లతో 6 రాష్ట్రాలలో, ముస్లింలీగు ప్రభుత్వాలున్న 5 రాష్ట్రాలలో మతతత్వం రెచ్చగొట్టబడింది. జిన్నా ముందుకు దూసుకుపోయాడు. గాంధీ హిందూ-ముస్లిం ఐక్యత ఒట్టి కలగా మిగిలింది.
(ఈ స్థానిక ప్రభుత్వాల గందరగోళం కారణంగా కాంగ్రెసు బలహీనపడడం, జిన్నా బలపడడం విషయంలో గోడ్సే చెప్పినది నిజమే. కానీ బ్రిటిషు ప్రభుత్వం పన్నాగాలు ఏమిటి, వాటిని ఎదుర్కోవడానికి కాంగ్రెసుకున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి అని తెలుసుకుంటే చేసుకుంటేనే కాంగ్రెసు పరిస్థితిని అర్థం చేసుకోగలం. సచిన్ టెండూల్కర్ ఔట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చినపుడు అతని పాడ్స్ యిప్పేవాడు కూడా 'మీరు ఆ ఆఖరి బాల్‌ను ఎటెంప్ట్ చేయకుండా వుండాల్సింది' అని వ్యాఖ్యానిస్తాడు. అతని చేతికే బ్యాట్ యిచ్చి పంపిస్తే ఏం చేస్తాడో తెలియదు. యుద్ధమధ్యంలో వున్నవాడికి అన్ని విషయాలపై దృష్టి సారించే అవకాశం వుండదు. అలా సారిస్తూ కూర్చుంటే యుద్ధం చేయలేడు. యుద్ధరంగానికి దూరంగా విశ్లేషిస్తూ వుండేవారికి మాత్రమే సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. మనలా 50, 60 ఏళ్ల తర్వాత 'విత్ ద బెనిఫిట్ ఆఫ్ హైండ్‌సైట్' సింహావలోకనం చేసే సౌలభ్యం ఆనాటి స్వాతంత్య్ర పోరాట యోధులకు లేదు.
కాంగ్రెసు విధానాలను తప్పుపట్టిన గోడ్సే ఆ చట్టం తయారుచేసిన చట్రాన్ని, దానిలోని యితర భాగస్వాములను విస్మరించాడు. ఆనాడు కాంగ్రెసును ఒంటరిదాన్ని చేయడానికి బ్రిటిషు ముస్లింలీగుని ధారాళంగా వాడుకోవడమే కాదు, తమ పాలన కొనసాగాలని కోరుకుంటున్న సంస్థానాధీశులను కూడా ముందుకు తోసి తన యిష్టం వచ్చినట్లు వాడుకుంది. వీరందరినీ ఎదిరించవలసిన అగత్యం కాంగ్రెసుది. 1932లో కాంగ్రెసు ప్రతినిథులు లేకుండా జరిగిన మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చల పర్యవసానంగా 1935 నాటి చట్టం తయారైంది. ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయంప్రతిపత్తి యిస్తామని, అవన్నీ ఒక ఫెడరేషన్‌గా ఏర్పడాలని సూచించారు. ఈ ఫెడరేషన్‌లో డైరక్టుగా బ్రిటిషు పాలనలో వున్న ప్రాంతాలు, సంస్థానాల అధీనంలో వున్న ప్రాంతాలు వుంటాయి. రెండు అంచెల్లో వుండే ఫెడరల్ లెజిస్లేచర్‌లో సంస్థానాలకు అధికారాలు ఎక్కువ. వాటి నుంచి వచ్చే ప్రతినిథులు ఎన్నిక కానక్కరలేదు. రాజులు, సంస్థానాధీశులు ఎవర్ని నామినేట్ చేస్తే వారే వచ్చి కూర్చుంటారు. ఆ విధంగా దేశంలో కేవలం 14% మందికి మాత్రమే ఓటు హక్కు దక్కింది. గవర్నర్ జనరల్‌కు, గవర్నర్లకు విశేష అధికారాలు యివ్వబడ్డాయి. లెజిస్లేటివ్ ఎసెంబ్లీ పాస్ చేసిన తీర్మానాలను తోసిరాజనే హక్కు, సొంతంగా చట్టాలు చేసే హక్కు గవర్నర్లకు యిచ్చారు. సివిల్ సర్వీసెస్ (అప్పట్లో ఐసియస్ అనేవారు), పోలీసులపై వారిదే కంట్రోలు. ప్రజలెన్నుకున్న ప్రతినిథుల మాట యీ అధికారులు విననక్కరలేదు. అంటే బ్రిటిషు వారు ఏ అధికారాన్నీ వదులుకోలేదు. ప్రజలెన్నుకున్నవారిని తోలుబొమ్మలుగా చూపిస్తూ ఎప్పటిలాగానే పరిపాలిద్దామనుకున్నారు. – వ్యా) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)