ఎమ్బీయస్‌ :గోడ్సేని ఎలా చూడాలి? – 6

గాంధీ గురించి గోడ్సే అభిప్రాయాలు యిలా వున్నాయి. – దక్షిణాఫ్రికాలో విజయం సాధించి భారతదేశపు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి గాంధీ  1915లో ఇండియాకి తిరిగి వచ్చినపుడు ఆయనకు ఒక విషయం గ్రహింపుకి వచ్చింది. అక్కడ…

గాంధీ గురించి గోడ్సే అభిప్రాయాలు యిలా వున్నాయి. – దక్షిణాఫ్రికాలో విజయం సాధించి భారతదేశపు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి గాంధీ  1915లో ఇండియాకి తిరిగి వచ్చినపుడు ఆయనకు ఒక విషయం గ్రహింపుకి వచ్చింది. అక్కడ బోయర్లు, బ్రిటిషు వారు తమను కాలి క్రింద వేసి అణగదొక్కడం చేత కులమతభేదాలు లేకుండా భారతీయులందరూ ఒక్కతాటిపై నిలిచి గాంధీకి మద్దతు పలికారు. అందుకే ఆయన అక్కడ సులభంగా విజయం సాధించగలిగాడు. కానీ భారతదేశంలో పరిస్థితి వేరు. ఇక్కడి సమాజం అనేక కులాలుగా, మతాలుగా విడిపోయి వుంది. అందువలన తిరిగి వచ్చిన ఐదు సంవత్సరాలలో నాయకుడిగా ఎదగడానికి గాంధీకి అవకాశం లేకపోయింది. దాదాభాయ్‌ నౌరోజీ, ఫిరోజ్‌ షా మెహతా, టిళక్‌, గోపాల కృష్ణ గోఖలే వంటి దిగ్దంతులు యింకా జీవించే వున్నారు. వారి ముందు గాంధీ కుర్రవాడిగానే తోచాడు. తనకు నాయకత్వం దక్కాలంటే ముస్లిములను దువ్వాలని అర్థం చేసుకున్నాడు. బ్రిటిషువారు దేశంలో ప్రవేశించడానికి ముందు హిందువులు, ముస్లింలు శతాబ్దాలుగా కలిసి వున్నారు. తాము యజమానులుగా వుండలేమని ముస్లింలు, వారిని సాంతం తరిమివేయడం సాధ్యం కాదని హిందువులు గ్రహించారు. ఇద్దరూ కలిసి వుండాల్సిందే అని యిద్దరికీ తెలుసు. అయితే ఆంగ్లేయులు వచ్చి విభజించి పాలించే పద్ధతి అమలు చేసి ముస్లింలను హిందువులకు వ్యతిరేకంగా తయారుచేయసాగారు. 

ఆ ముస్లిం వర్గాలలో సహచరభావాన్ని, మాతృదేశం యెడల సమైక్యభక్తి భావనను దృఢపరచనిదే ఆ ఐక్యసంఘటనకు తాను నాయకత్వం వహించే అవకాశాలు స్వల్పం అని గాంధీ గ్రహించాడు. అప్పటినుంచి బ్రిటిషువారి కుయుక్తులను ఎదురు దెబ్బ తీయడానికి ముస్లింలకు ధారాళంగా, అలవిమీరిన వాగ్దానాలు చేయసాగాడు. ఖిలాఫత్‌ ఉద్యమాన్ని సమర్థించి, దానికి కాంగ్రెసు మద్దతు కూడగట్టడం యీ చర్యలో భాగమే. ఇది తాత్కాలికంగా గాంధీకి ముస్లిం అనుయాయులను తెచ్చిపెట్టింది. ఆలీ సోదరులు గాంధీకి అనుయాయులై తిరుగులేని ముస్లిం నాయకులైనారు. వారు 'ఖిలాఫత్‌కు శత్రువు ఇస్లాంకే శత్రువు' అని ప్రచారం చేయడమే కాకుండా బ్రిటిషు పాలనలో వున్న భారత్‌పై దండెత్తి రమ్మనమని ఆఫ్గన్‌ అమీరుకు ఆహ్వానం పలికారు. దీన్ని గాంధీ సమర్థించారు. ''అమీరుకు ఆలీ సోదరులు ఏదైనా సందేశం పంపి వుంటే, ఆయన దాన్ని మన్నించి భారతదేశానికి వస్తే ఆయనను వెనకకు తరమటంలో ఏ భారతీయుడూ ప్రభుత్వానికి సహాయం చేయకుండా వుండేందుకు నేను చేయగలిగినంతా చేస్తానని అమీరుకు నేను ఒక సందేశం పంపుతాను'' అని గాంధీ రాశారు. ఆలీ సోదరుల పన్నాగం ఏమీ పారలేదు కానీ గాంధీకి మాతృదేశంపై భక్తి ఏ పాటిదో దీనితో తేలిపోయింది. 

(ఖిలాఫత్‌ ఉద్యమం – క్రైస్తవులకు పోప్‌ ఎలాగో ముస్లింలకు టర్కీ సుల్తాన్‌ ఖలీఫాగా అలా వుండేవారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయాక టర్కీ సామ్రాజ్యం కుంచించుకుపోయింది. సుల్తాన్‌ సామ్రాజ్యంలోనే యువకులు రాజరికానికి వ్యతిరేకంగా పోరాడుతూ, మతపరమైన సంస్కరణలు కూడా వాంఛించారు. బ్రిటన్‌ మద్దతుతోనే యిదంతా జరుగుతోందని సుల్తాన్‌ ఆందోళన చెంది, తన ఖలీఫా పదవి సంరక్షణకై ముస్లింలందరూ ముందుకు వచ్చి బ్రిటిషు వారిని ఎదిరించాలని కోరాడు. టర్కీ సామ్రాజ్యవాదమంటే యిష్టం లేని అరబ్‌ దేశాల వారు దీనికి మద్దతు యివ్వలేదు. ఖలీఫా అంటే అభిమానమున్న భారత ముస్లిములు లేవనెత్తిన ఉద్యమమే – ఖిలాఫత్‌. ఇది పూర్తిగా ముస్లిములకు సంబంధించిన మతపరమైన అంశం. దానికీి భారతరాజకీయ ఉద్యమానికీి ముడిపెట్టడం అర్థరహితం. ఇది గాంధీ చేసిన పొరపాటు. ముస్లింలను జాతీయపోరాటంలో తీసుకురావడానికి గాంధీ చేసిన ప్రయత్నాలలో జరిగిన ఓవరాక్షన్‌ను గోడ్సే సరిగ్గానే గుర్తించాడు. అదే సమయంలో గాంధీ హిందువులను ఆకర్షించడానికి రామరాజ్యం తెస్తాననడం, హిందూ మతంలోని కులవ్యవస్థను ఖండించకపోవడం గోడ్సే ప్రస్తావించలేదు. మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన కమ్యూనిస్టులు ప్రజలను ఆకట్టుకోలేక పోయారు. మనదేశ ప్రజలపై మతానికి గల పట్టు తెలిసిన గాంధీ మతం ద్వారానే రాజకీయ చైతన్యం తేవాలని చూశాడు. అందుకే సత్యాగ్రహం, ఖాదీ అంటూనే భజనలు కూడా దానిలో భాగంగా చేశాడు

ఏ జాతీయ ఐక్యత కోరి గాంధీ యింత పందెం ఒడ్డాడో ఆ జాతీయ ఐక్యతపై ముస్లింలకు రవ్వంతైనా సద్భావం లేదని వెంటనే వచ్చిన మోప్‌ళాల తిరుగుబాటు నిరూపించింది. ఆ సందర్భంలో హిందువులపై మారణకాండ, బలవంతపు మతమార్పిడులు, మానభంగాలు, దోపిడీలు జరిగాయి. మతమార్పిడులు జరిగాయన్న ప్రచారం తప్పు అని గాంధీ వాదించాడు. పైగా హిందూ బాధితుల కోసం కాక, మోప్‌ళా ముస్లింల కోసం ప్రత్యేక సహాయనిధి సేకరణ ప్రారంభించాడు. బ్రిటిషు ప్రభుత్వం మోప్‌ళా తిరుగుబాటును కొద్దినెలల్లోనే అణచివేసింది. వారి సామ్రాజ్యవాదం మరింత బలం పుంజుకుంది, ముస్లింలు మరింత మతోన్మాదులైనారు. వీటన్నిటి దుష్ఫలితాలు హిందువులు అనుభవించవలసి వచ్చింది. 

(మోప్‌ళా లేక మాప్పిళా తిరుగుబాటు – ఖిలాఫత్‌ వుద్యమాన్ని అణచివేసిన బ్రిటిషు వారికి వ్యతిరేకంగా 1921లో మలబారులో కొందరు ముస్లిము రైతు కూలీలు తిరగబడ్డారు. బ్రిటిషు వారితో బాటు వారు భూకామందులైన నంబూద్రి బ్రాహ్మణులపై, నాయర్లపై కూడా విరుచుకుపడి వారిని చంపివేశారు. ఆ విధంగా దీనికి ఆర్థిక కోణం కూడా వుంది. అత్యంత హింసాయుతంగా జరిగిన యీ తిరుగుబాటును బ్రిటిషువారు అంతే హింసాత్మకంగా అణచివేశారు. ఈ సందర్భంగా మతమార్పిడులు జరిగాయా, జరిగితే ఎన్ని జరిగాయి అన్నదానిపై భిన్నవాదనలు వున్నాయి. ఈ మాప్పిళా తిరుగుబాటుదారులను 50 ఏళ్ల తర్వాత 1971లో కేరళ ప్రభుత్వం స్వాతంత్య్రయోధులుగా పరిగణించింది. అహింసే పరమధర్మమనే గాంధీ యీ హింసాత్మకమైన, సాటి భారతీయులను తెగ నరికిన ఉద్యమాన్ని ఖండించకపోవడం ఘోరమైన తప్పు) (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5