ఏడాది పూర్తవతోందనగానే నెల్లాళ్ల ముందు నుంచి ఇయర్ రౌండప్ అంటూ మీడియా అనేక కథనాలు వేస్తుంది. మరి 2014లో మీడియా రౌండప్ ఎలా వుంది? చెప్పాలంటే భారత మీడియాలో 2014 ఒక మైలురాయి. మోదీని అసలైన ప్రధాని అభ్యర్థిగా చూపడానికి మీడియా పడినంత శ్రమ అంతా యింతా కాదు. మోదీ ఏం చేసినా మహ బాగే, శభాషే అంటూ కేరింతలు కొట్టింది, యుపిఏ అవినీతితో, మన్‌మోహన్ మౌనముద్రతో విసిగిపోయిన మీడియా. ఆటగాళ్లను హుషారు చేయడానికి గ్రౌండ్‌లో గంతులేసే ఛీర్ లీడర్స్ స్థాయికి మీడియా దిగజారింది. మోదీలో వారికి ఏ తప్పూ కనబడలేదు. కాంగ్రెసులో ఏ మెప్పూ కనబడలేదు. ఒకప్పుడు తాము వేటాడి, వెంటాడి, విసిగించిన మోదీయే వాళ్లకు జగద్రక్షకుడిగా, మహిమాన్వితుడిగా కనబడ్డాడు. గుజరాత్‌లో మోదీ సాధించిన విజయాలను (!) దండోరా వేసే బ్యాచ్‌గా తయారయ్యారు. వింత ఏమిటంటే ఎన్నికల వరకు మీడియా బహుచక్కగా వుపయోగించుకున్న మోదీ పదవి అధిష్టించిన తర్వాత పట్టించుకోవడం మానేశాడు. పత్రికా సమావేశాలు నిర్వహించడం లేదు. మన వద్ద కెసియార్ కూడా అంతే. ఉద్యమంలో మీడియా, జాక్, మేధావులు అందరూ కావలసి వచ్చారు. అధికారం చేజిక్కాక వాళ్లని పలకరిస్తేనే పెద్ద న్యూస్ అయిపోతోంది. మోదీ తమను లక్ష్యపెట్టినా పెట్టకపోయినా మీడియాకు యింకా మోదీ మైకం దిగలేదు. నిర్మాణాత్మకమైన విమర్శలతో ప్రభుత్వానికి పక్కలో ముల్లులా వుండాలన్న మాట మర్చిపోయిన మీడియా భజనబృందం పాత్ర నుంచి బయటకు రాలేదు. ఈ లోగా మోదీ తరఫున కాపిటలిస్టులు మీడియాను సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు.
తెలుగులో అగ్రశ్రేణి పత్రిక ''ఈనాడు''లో ముకేశ్ అంబానీ రిలయన్సు పెట్టుబడులు, ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూలంగా ఆ పత్రిక వ్యవహరించడం చూస్తూనే వున్నాం. ఆ గ్రూపు ఇండియన్ మీడియా ట్రస్టు పేరిట ఎన్నికలు కాగానే జులై 2014లో నెట్‌వర్క్ 18 కొంది. సిఎన్‌ఎన్-ఐబిఎన్, ఐబిఎన్7, సిఎన్‌బిసి, ఫోర్బ్‌స్, ఫస్ట్ పోస్ట్, మనీ కంట్రోల్ యిత్యాది అనేక సంస్థలు దాని చేతిలోకి వచ్చాయి. దీనివలన తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందన్న భయంచేత కాబోలు సిఎన్‌ఎన్-ఐబిఎన్ ఎడిటర్ యిన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయి రాజీనామా చేసి తన భార్య, తోటి టీవీ యాంకర్ అయిన సాగరికా ఘోష్‌తో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరాడు. (మోదీ అభిమానులపై నోరు పారేసుకుని మోదీకి మరింత ప్రచారం కల్పించినది యితనే) అతనితో బాటే కరణ్ థాపర్ కూడా సిఎన్‌ఎన్-ఐబిఎన్ నుండి హెడ్‌లైన్స్ టుడేకు మారాడు.
మోదీ విదేశీయాత్రల సందర్భంగా అతని పబ్లిక్ రిలేషన్స్ పనంతా కొన్ని టీవీ ఛానెల్సే చేసిపెట్టాయి. ఎన్‌డిటివి, హెడ్‌లైన్స్ టుడే యాంకర్స్ మోదీతో బాటు వెళ్లి విస్తారంగా కవర్ చేసి, మోదీ యిమేజిని భారతీయుల్లో పెంచాయి. అనేకమంది సీనియర్ జర్నలిస్టులు మోదీతో కలిసి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వలన మీడియా తన శక్తిని కోల్పోతుంది. ప్రజలు దాని మాటలు విశ్వసించడం మానేస్తారు. రాజ్‌దీప్ సర్దేశాయి మీడియా తనను ఆకాశానికి ఎత్తేస్తోంది కాబట్టి మోదీకి యింకా వారితో విరోధం రాలేదు. కానీ రాష్ట్రాలలో పరిస్థితి అలా లేదు. బెంగాల్‌లో ఆనంద బజార్ పత్రికను సిపిఎం వ్యతిరేకి అనేవారు. ఈ రోజు మమతా బెనర్జీకి అది తన వ్యతిరేక పత్రికగా తోస్తోంది. కెసియార్ టీవీ 9, ఆంధ్రజ్యోతి ఛానెళ్లతో ఎలా వ్యవహరిస్తున్నారో, మీడియాను ఎలా బెదిరించారో వేరే చెప్పనక్కరలేదు.
ఎమ్బీయస్ ప్రసాద్