పవన్ కళ్యాణ్..జనసేన అధ్యక్షుడు.పవనిజం అనే కొరుకుడుపడని (ఈ మాట ఆర్జీవీతో సహా చాలా మంది అన్నారు) అనే పుస్తకాన్ని రాసిన రాజా రవితేజ గుర్తున్నారా? ఆయన ఇప్పుడు పవన్ ను వదిలేసారని, ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. అయితే అదెంతవరకు నిజం అన్నది తెలియడం లేదు కానీ ఆశ్చర్యమైతే కాదు.
ఎందుకంటే పవన్ తో ఇమడడం అన్నది, కలిసి ప్రయాణించడం అన్నది అంత సులువు కాదని ఇప్పటికే కొంతమంది రుజువు చేసేసారుగా. పైగా జనసేన పార్టీ అనేది ఎప్పుడు నిద్రిస్తుందో, ఎప్పుడు నిద్ర లేస్తుందో, ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు రెస్టు తీసుకుంటుందో తెలియదు కదా. అలాంటపుడు రాజా రవితేజ కైనా అక్కడపనేం వుంటుంది.
సరే ఆ సంగతి అలా వుంటే సదరు రాజా రవితేజ పవన్ ని వీడిపోతూ ఓ బాంబు లాంటి మాట అనేసి వెళ్లిపోయాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్లో షికారు కొడుతోంది. రాజా..పవన్ కు మెయిల్ ద్వారానో, మరో విధంగానో సమాచారం ఇచ్చి కలవడం మానేసారని అంటున్నారు. 'పైకి ఒకలాగ, లోపల ఒకలాగ వుండేవారితో కలిసి పయనించడం కష్టం' అని రాజా రవితేజ పవన్ కు ఇచ్చిన ఆఖరి సమాచారం అన్నది చక్కర్లు కొడుతున్న వార్త సారాశం. అదే నిజమైతే, అంత త్వరగా రవితేజకు ఎలా అర్థమైందో?