ఎమ్బీయస్‌ : ముఫ్తీ యిక్కట్లు

79 ఏళ్ల ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ కశ్మీర్‌ రాజకీయాల్లో కురువృద్ధుడు. 1958 నుండి 1999 వరకు కాంగ్రెసులో వుండి నేషనల్‌ కాన్ఫరెన్సుకి వ్యతిరేకంగా పని చేసేవాడు. తర్వాత సొంతంగా పిడిపి పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు…

79 ఏళ్ల ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ కశ్మీర్‌ రాజకీయాల్లో కురువృద్ధుడు. 1958 నుండి 1999 వరకు కాంగ్రెసులో వుండి నేషనల్‌ కాన్ఫరెన్సుకి వ్యతిరేకంగా పని చేసేవాడు. తర్వాత సొంతంగా పిడిపి పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు కశ్మీర్‌ ప్రజలు అతనికి అధికారం అందీ అందనట్టుగా యిచ్చారు. అందరి కంటె ఎక్కువగా 28 సీట్లు వచ్చినమాట వాస్తవమే కానీ అవి ఎటూ సరిపోవు. బిజెపితో చేతులు కలిపితే అధికారం తథ్యం కానీ బిజెపి బేరసారాలు తట్టుకోవడం కష్టం. ముఖ్యమంత్రి హిందువు అయి వుండాలని, కనీసం జమ్మూ నుంచి వుండాలని పట్టుబడుతోంది. 

అదే జరిగితే కశ్మీర్‌ లోయలో ఎవరికీ మొహం చూపించలేనని ముఫ్తీ వాపోతున్నాడు. జమ్మూ కశ్మీర్‌ ఓటర్లు అందర్నీ తలో కాస్తా శిక్షించాలనుకోవడంతో ఓట్లు చీలిపోయాయి. 87 సీట్లుంటే వాటిలో 17 వాటిల్లో 1500 ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారయ్యాయి. పిడిపి 11 స్థానాలను యీ విధంగా పోగొట్టుకుంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌పై వున్న ప్రభుత్వ వ్యతిరేకతతో కశ్మీర్‌ లోయలో పిడిపికే ఎక్కువ సీట్లు రావలసి వుంది. కానీ బిజెపితో అంటకాగుతాడనే అనుమానం కొద్దీ పిడిపిని అధికారానికి దూరంగా ఆపేశారు కశ్మీర్‌ ఓటర్లు. తను ప్రధాని కాగానే మోదీ ముఫ్తీకి ఫోన్‌ చేసి హలో చెప్పాడన్న ప్రచారం కశ్మీర్‌ ఓటర్లలో శంకలు రేపింది. 

కశ్మీర్‌లో వరదలు వచ్చినపుడు ముఫ్తీ కూతురు మెహబూబా తన పార్టీ ఎంపీలను వెంటపెట్టుకుని మోదీని కలిసి, మీడియా ఎదుట హంగామా చేయడంతో యీ శంక బలపడింది. పిడిపి నిలబెట్టిన హిందు అభ్యర్థుల్లో ఒక్కరినైనా ముస్లిం ఓటర్లు గెలిపించలేదు.  ఆర్టికల్‌ 370 రద్దుకై ప్రయత్నిస్తామని, సైన్యానికి విశేషాధికారాలు కొనసాగిస్తామని  బిజెపి అనడం కశ్మీర్‌ లోయలోని ప్రజలు సహించలేదు. అందుకే బిజెపి అభ్యర్థుల్లో ఒక్కరికి తప్ప వేరెవ్వరికీ డిపాజిట్టు దక్కలేదు. పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి 32.65% ఓట్లు రాగా అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చేసరికి 23%కి పడిపోయింది. పిడిపికి అప్పుడు 20.72% వస్తే యిప్పుడు 22.7% వచ్చాయి. 

ఎన్‌సికి కూడా 11.22% నుండి 20.8%కి పెరిగాయి. కాంగ్రెసు అప్పటి కంటె ఘోరంగా నష్టపోయింది. అప్పుడు 23.07% యిప్పుడు 18%. అంటే అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చేసరికి ప్రాంతీయపార్టీలైన పిడిపి 2%, ఎన్‌సి 8.5% ఎక్కువ తెచ్చుకోగా జాతీయ పార్టీ లయిన కాంగ్రెస్‌ 5%, బిజెపి 9.5% తక్కువ తెచ్చుకున్నాయి. అందరి కంటె ఎక్కువగా బిజెపి నష్టపోవడానికి కారణం కశ్మీర్‌ లోయలోని ఓటర్ల గాఢ వ్యతిరేకత. తన మూలస్థానమైన లోయలో బిజెపి పట్ల వ్యతిరేకత యింత తీవ్రంగా కనబడుతున్నపుడు ముఫ్తీ బిజెపికి ముఖ్యమంత్రి పదవి అప్పగించడానికి వెనుకాడడంలో ఆశ్చర్యమేముంది? 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]