విబి రాజేంద్ర ప్రసాద్ ముందుతరం భారీ నిర్మాతగా చెప్పుకోవాల్సిన వ్యక్తి. ఇప్పుడు భారీ నిర్మాత అనే పదం పాపులర్ అయింది కానీ ఒకప్పుడు ఆ పదం పెద్దగ చలామణీలోలేదు. కానీ ఆ కాలంలో విబి రాజేంద్ర ప్రసాద్ ఒక్కరే ఆ కోవకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవాలి. ముఖ్యంగా 70-80 మధ్య కాలంలో ఆయన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యం, ఏదో ఒక భారీ తనం వుండేలా చూసుకునేవారు. వాటి వల్ల ఆ రోజుల్లో సినిమాకు మంచి హైప్ వచ్చది. బంగారుబాబు సినిమా క్లయిమాక్స్ లో హెలికాప్టర్ లో ఫైట్ చిత్రీకరించారు. చాలా కాలం తరువాత ఎన్టీఆర్ ఎఎన్నార్ కాంబినేషన్ సెట్ చేసిన రామకృష్ణులు సినిమా క్లయిమాక్స్ లో రివాల్వింగ్ సెట్ వేసారు. మంచి మనుషులు సినిమాలో స్కేటింగ్ పై ఫైట్ చిత్రీకరించారు.
ఇంకో ఆసక్తికరమైన సంగతేమిటంటే, ఎఎన్నారో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన శోభన్ మంజులతో కలిపి మంచి మనుషులు సినిమా తీసారు. దానికి చిత్రమైన నేపథ్యం వుంది. ఎఎన్నార్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లే సందర్భంలో ఈ సినిమా తీసారు. అప్పట్లో ఆఫీసు నిర్వహణకు కచ్చితంగా సినిమా తీయాల్సి వుండేది. అందుకోసం ఎఎన్నార్ కు ముందే చెప్పారట..శోభన్ తో ఓ సినిమా చేసుకుంటానని. దానికి ఆయన సరే అన్నారు. మంచి మనుషులు తీసారు. సూపర్ డూపర్ హిట్.
ఆ వెంటనే అదే ఉత్సాహంతో పిచ్చిమారాజు అదే కాంబినేషన్ లో తీసారు. కానీ ఈ సినిమా ఆయన తన కోసం తీయలేదు. కేవలం స్టాఫ్ పేరిట తీసారు. ఆ లాభాలువారికే. బహుశా ఇలా తన సిబ్బంది కోసం, వారి పేరిట సినిమా తీయడం ఇదే ప్రథమమేమో? కానీ చిత్రంగా ఒక సినిమా తీస్తానని చెప్పి, రెండు సినిమాలు చేయడం ఎఎన్నార్ కు కాస్త కోపం తెప్పించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అది కాస్త తగ్గేసరికి రెండేళ్లు పట్టింది. అప్పడు బంగారు బొమ్మలు తీసారు. పునర్జన్మల నేపథ్యంలో తీసిన సినిమా ఇది. దాని తరువాత రామకృష్ణులు తీసారు. దానికి ముందు చాలా కాలం పాటు ఎన్టీఆర్ ఎఎన్నార్ కాంబినేషన్ లో సినిమా రాలేదు.
విబి సినిమాలకు మరో అస్సెట్ మహదేవన్ సంగీతం. 85 ప్రాంతంలో చివరగా తీసిన అరడజనకు పైగా సినిమాలు మినహా మిగిలిన వాటన్నింటికీ (దాదాపుగా) మహదేవనే సంగీత దర్శకుడు. జగపతి వారి సినిమా అంటే పాటలు సూపర్ డూపర్ హిట్ అన్నది గ్యారంటీ. దీనికి విబి-మహదేవన్ కాంబినేషన్ లోని ఏ ఒక్క సినిమా కూడా మినహాయింపు కాదు. మహదేవన్ ను వదిలిన తరువాత మాత్రం ఆ రేంజ్ పాటలు చేయించుకోలేకపోయారు. దసరాబుల్లోడు, బంగారు బాబు, మంచి మనుషులు, బంగారు బొమ్మలు లాంటి కొన్ని ఉదాహరణ మాత్రమే.
పెరటి చెట్టు మందుకు పనికిరాదు అన్నట్లుగా ఓ మంచి నిర్మాతగా ఎందరో హీరోలకు సూపర్ హిట్ ఇచ్చిన విబి ఆయన కొడుకు జగపతి బాబుకు మాత్రం సరైన హిట్ ఇవ్వలేకపోయారు. జగపతి బాబు మాంచి ఫ్యామిలీ హీరో సెటిల్ అయ్యాక కూడా మరోసారి ప్రయత్నం చేసినా, ఫలితం ఇవ్వలేదు.
విబికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువ. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంకి వెళ్లిన వారికి తరచు ఆయన అక్కడే కనిపించేవారు తెల్లటి దుస్తులు, నుదుటన విబూది ఎప్పుడూ ఆయన యూనిఫారమ్ గా వుండేవి.
2015వస్తూనే ఓ అభిరుచి గల మంచి నిర్మాతను తీసుకుపోయింది.