ఎ.ఎన్.ఆర్, వంశీ ఆర్ట్ ధియేటర్ ఇంటర్నేషనల్ వారు ప్రముఖగాయని,సహృదయురాలు,సంఘ సేవికురాలూ రేవతిమెట్టుకూరు (TAS President Nashvil le TN) గారి వికలాంగ సేవానిరతికి అభినందిస్తూ.. సంఘ సేవాశిరోమణి '' బిరుదునిచ్చి గౌరవిస్తూ అందించిన అభినందనపత్రం!
—————————
ఇరవై ఏడు మంది మెరుపు చుక్కల మధ్య పదహారు కళలతో విరాజిల్లే 'వెన్నెల రాజు ' కి ..కడపటి చుక్క 'రేవతి 'అత్యంత అభిమాన తార ! మిగిలిన అందరికీ కొన్ని కళలిచ్చినా రేవతికి మాత్రం చాలా కళలే అందించాడా కళల మారాజు -ఆ చంద్రుడు చల్లటి మనసునీ ,తియ్యటి మాటనీ,గాంధర్వంతో మంత్రించిన మధుర గాత్రాన్నీ,సుస్మిత శోభిత వదనాన్నీ,పసితనం వీడని లావణినీ,విదేశీ వైభవాలని సమకూర్చే విద్యాధిక్యతనీ,సహకార సద్గుణాన్నీ, వితరణాశక్తినీ,ఇచ్చాడు.
ఇన్ని సుగుణాలున్న రేవతి మెట్టుకూరు స్వయంగా సాధించుకున్న మరిన్ని కళల సౌభాగ్యవతిగా రాణిస్తూన్న ఆశ్చర్యాద్భుతాల ఆహ్లాదకారిణి! ఆమెకి పాట ఆభరణం – నాట్యం క్రీడా సమానం -నిరంతరాభ్యాసం నైజం -తాను చవి చూస్తున్న మధురానుభూతుల్ని పదిమందికీ అందించాలన్న సహృదయం ఆమె గుణం- కళాబంధువులకి ఆత్మీయాతిధ్యాలందించటం ఆమెకి పరమానందం-విదేశంలో.. తానున్న ప్రదేశంలో స్వరాష్ట్రాన్ని సృష్టించుకుని..తెలుగుతనాన్ని ప్రతిష్టించి,సంఘీకృత స్నేహ బృందంతో..సామాజిక సేవ చేయటం తలపోసే కర్తవ్యం .
అనాధలూ ,అభాగ్యులూ ,అంగవికలురూ ,వీరికి సేవ చేయటానికి రేవతి మెట్టుకూరు ముందు అడుగువేస్తారు – వారికోసం ఏ వ్యక్తి గానీ ,ఏ సంస్థ గానీ కృషిచేస్తుంటే ప్రత్యక్షంగా ..పరోక్షంగా ..స్వచ్చ్హందంగా తన పాత్రని తానే రూపొందించుకుని..సమర్ధవంతంగా నిర్వహించి అభిమానాభినందనలు అందుకుంటారు- తెలుగువారు ఎవరు వచ్చినా .. వారికున్న సమస్యలని అధిగమించే సలహా సహాయాలందించే ప్రముఖ వ్యక్తులు ఆమెకి ఆరాధ్యులు ,ఆదర్శస్ఫూర్తి దాతలు !!వారివలే జీవనసాఫల్యతనీ ..సార్ధకతనీ సాధించుకుంటూన్న సంఘ సేవిక రేవతి మెట్టుకూరు గారిని ;వంశీ ఆర్ట్ ధియేటర్ ఇంటర్నేషనల్ గౌరవాదర పురస్సరంగా 'సంఘ సేవా శిరోమణి ' బిరుదుతో సత్కరిస్తున్నాము .
'శిరోమణి 'వంశీ రామరాజు
వ్యవస్థాపకులు,వంశీసంస్థలు
శ్రీ త్యాగరాయ గాన సభ
హైదరాబాద్