ఎమ్బీయస్‌ : రోత పుడుతోంది – 6

హరి చెప్పిన విషయాలను క్రోడీకరిస్తే వచ్చిన పిక్చర్‌ – 'జగన్‌ ముఖ్యమంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోతే కాంగ్రెసుతో రాజీపడి కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో జగన్‌ ఆర్థిక…

హరి చెప్పిన విషయాలను క్రోడీకరిస్తే వచ్చిన పిక్చర్‌ – 'జగన్‌ ముఖ్యమంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోతే కాంగ్రెసుతో రాజీపడి కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే ఆఖరి నిమిషంలో జగన్‌ ఆర్థిక లావాదేవీలు మరీ యిబ్బందికరంగా వున్నాయని గ్రహించిన కేంద్రం తన ఆఫర్‌ నుండి వెనక్కి వెళ్లింది. జగన్‌కు కోపం వచ్చి కాంగ్రెసుతో తలపడబోయారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో తలపడితే వాళ్లు నల్లిని నలిపినట్టు నలిపేస్తారని హరి హెచ్చరించినా వినలేదు. రాష్ట్రప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టి కూల్చేద్దామని ప్రయత్నించారు. 130 మంది శాసనసభ్యులు తనవైపు వుంటారని అంచనా వేసుకుంటే చివరకు 17 మంది మాత్రమే మిగిలి ఆ తీర్మానం ఓడిపోయింది. ఆ సందర్భంగా జగన్‌ అనుచరులు అనేకమంది శాసనసభ్యులకు ఫోన్‌ చేసి, 'ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయం, యిప్పుడే మా పార్టీలో వచ్చి చేరకపోతే తర్వాత సీట్లు ఖాళీ వుండవు' అని మాట్లాడినది కేంద్ర ప్రభుత్వంలో వున్న కాంగ్రెసుకు చేరిపోయింది. పోనీ కదాని వదిలేస్తే, మా ప్రభుత్వానికే ఎసరు పెడతావా అని పగబట్టి వెంటనే జైలుకి పంపారు. జగన్‌ జైల్లో వుండగా అతను నమ్మినవాళ్లు పార్టీని, పేపరును భ్రష్టు పట్టించారు. పార్టీ దెబ్బతినసాగింది.' 

ఇంతవరకూ హరి చెప్పినది మనకు కూడా చూచాయగా తెలుసు. ఒక థలో జగన్‌వైపు 50 మంది ఎమ్మెల్యేలు వెళ్లబోయి ఆగిపోయారని కూడా గమనించాం. జగన్‌కు బెయిలు ఎన్నోసార్లు తిరస్కరించారని కూడా చూశాం. రాష్ట్రవిభజన చేయాలని సోనియా గట్టిగా తలపెట్టి ప్రకటన చేసే సమయంలోనే జగన్‌కు బెయిలు రావడం జరిగింది. అతనిపై పెట్టిన 10 కేసుల్లో 8 కేసుల్లో దమ్ము లేదనడమూ జరిగింది. బేరాలు కుదిరాయని టిడిపి ఆరోపించింది. బేరం కుదిరితే యిన్నాళ్లూ జైల్లో ఎందుకు పెట్టిందని వైకాపా తిరిగి ప్రశ్నించింది. జైల్లో పెట్టారు కాబట్టే బేరానికి మీరు దిగి వచ్చారని, లేకపోతే ఎప్పటికీ కొండెక్కి కూర్చుని వుండేవారని టిడిపి జవాబిచ్చింది. ఇప్పుడు హరి రాష్ట్రవిభజన ప్లానుకు, జగన్‌ బెయిలుకు – స్పష్టంగా చెప్పకపోయినా – ముడిపెట్టి మాట్లాడారు. జగన్‌ను 'సమైక్యవాదానికి కట్టుబడి వుండమ'ని కోరడం ద్వారా యిప్పుడు అతను సమైక్యవాది కాదని, కేసుల్లోంచి బయటపడడానికి సోనియా చెప్పినట్లు ఆడుతున్నారని ధ్వనింపచేశారు. జగన్‌ దత్తపుత్రుడనీ, అతని అండ చూసుకుని అధిష్టానం మమ్మల్ని వదలుకుందనీ రాజగోపాల్‌ చెపుతున్నదానికి యిది అనుగుణంగా వుంది. తెరాస కాంగ్రెసుతో అనుసంధానంగా పని చేస్తోందన్నది బహిరంగరహస్యమే. 'చూడండి, ఎంతసేపు చూసినా తెరాస కిరణ్‌ను, చంద్రబాబును తిడుతోంది తప్ప సమైక్యం గురించి అంత గట్టిగా మాట్లాడుతున్న జగన్‌ను ఏమీ అనటం లేదు.' అని కొందరు ఎత్తి చూపారు. అటు తెరాసతో, యిటు జగన్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళదామనే ప్లానుతోనే కాంగ్రెసు విభజన తలపెట్టింది అనే వాదనకు  యిది బలం చేకూరుస్తోంది. 

ఈ రకమైన అభిప్రాయం జనంలో నాటుకున్నకొద్దీ తెలంగాణ ప్రాంతంలోని విభజనవాదుల్లో వైకాపా బలం పెరగవచ్చు కానీ సీమాంధ్రలో బలం తగ్గుతుంది. ఎందుకంటే అక్కడి జనులు కాంగ్రెసు పేరు చెపితేనే మండిపడుతున్నారు. వారితో ఏ కొద్దిపాటి అనుబంధం వుందన్న అనుమానం తగిలినా వైకాపాను దూరం పెడతారు. కాంగ్రెసు అధిష్టానాన్ని అడుగడుగునా ధిక్కరిస్తున్నట్లు కనబడుతున్న కిరణ్‌ పార్టీ పెడితే దాని వైపు కొందరు మొగ్గవచ్చు. టిడిపి రెండు గొంతుకలతో మాట్లాడుతున్నా కాంగ్రెసు నుండి కొంతమంది ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోంది. వైకాపాలోకి వెళ్లేవారు కూడా జగన్‌ నాయకత్వపు తీరుపై సంశయంతో కిరణ్‌వైపో, టిడిపి వైపో చూస్తున్నారు. టిడిపి-బిజెపి పొత్తు ఖాయమనే అనిపిస్తోంది. రేపు ఏ కారణంచేతనైనా పార్లమెంటులో బిల్లు సకాలంలో ప్రవేశపెట్టకపోయినా, పాస్‌ కాకపోయినా బాబు అదంతా తన ప్రజ్ఞే అని ప్రచారం చేసుకుంటారు. 'బిజెపికి నచ్చచెప్పాను కాబట్టి వాళ్లు లోపాయికారీగా కాంగ్రెసు వాళ్లను హెచ్చరించారు. ఓటమి భయంతో కాంగ్రెసు బిల్లు ప్రవేశపెట్టలేదు. పెట్టినా సవరణల పేరు చెప్పి వాయిదా వేస్తుంది' అని చెప్పుకుంటారు. బిజెపిని మానిప్యులేట్‌ చేసి బాబు విభజనను అడ్డుకున్నారని ఎ-టిడిపి వారు, అలాటిదేం లేదని టి-టిడిపి వారు ప్రచారం చేసుకోవచ్చు. ఎప్పటిలాగ బాబు ఏమీ మాట్లాడరు. ఎన్‌డిఏ హయాంలో బాబు కారణంగా తెలంగాణ యివ్వలేకపోయామని బిజెపి నాయకులు ఐదారేళ్లుగా చెప్తూ వచ్చినా బాబు ఎప్పుడూ ధృవీకరించలేదు. ఈ మధ్యే, సమైక్య వుద్యమం వూపు అందుకున్నాకే 'అవును' అన్నారు. 

ఇలా కిరణ్‌, టిడిపిలకు ఆదరణ పెరిగితే వైకాపాకు నష్టం వాటిల్లుతుంది. అధికసంఖ్యలో సీట్లు తెచ్చుకోకపోతే వైకాపా కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో బేరసారాలు చేయలేదు. అవి పార్టీ మనుగడకు అత్యావశ్యకం. అందువలన ఎలాగైనా ముందంజలో వుండాలనే పట్టుదలతో వైకాపా చాలా దూకుడుగా వుంది. ఈ క్రమంలో సీమాంధ్ర నాయకులందరూ చీలిపోయి వున్నారు. అసెంబ్లీలో అందరూ ఉమ్మడిగా కృషి చేసి బిల్లును అడ్డుకోవలసిన సమయంలో యిలా కలహించుకోవడం వలన సమైక్యవాదానికి దెబ్బ తగులుతోంది.

అసెంబ్లీ సవ్యంగా జరగాలని గట్టిగా వాదిస్తున్నానే కానీ జరిగినా ఏం ప్రయోజనం అని మనసులో అనిపిస్తోంది. అక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతాయని,  మనకు తట్టని పాయింట్లు ఏమైనా చెప్తారనీ కొన్ని రోజులు టీవీ చూశాను. ఏమీ చెప్పటం లేదు. ఇప్పటిదాకా మాట్లాడినవారందరూ ఏళ్ల తరబడి అరిగిపోయిన రికార్డులే వేస్తున్నారు. 'నీళ్లు, ఉద్యోగాలు దోచుకున్నారు', 'ఇడ్లీ సాంబార్‌ గోబ్యాక్‌ అని 1952లోనే అన్నాం', 'నెహ్రూగారు అమాయకపు బాలిక అన్నారు' అని విభజనవాదులు 'హైదరాబాదు అందరిదీ', 'పిలిస్తేనే వచ్చాం', 'తెలుగుజాతి శాలివాహనుల కాలం నుండి వుంది' అని సమైక్యవాదులు. శాలివాహనులు, శాతవాహనులంటూ, సినిమాల్లో మా యాసను వెక్కిరించారంటూ ఎన్నాళ్లు కొడతారు యీ సుత్తి? ఈ వాదనలన్నీ వినివినే కేంద్రం యీ బిల్లు తయారుచేసింది. ఇప్పుడు దీనిపై మాట్లాడాలి. బిల్లులో ఫలానా క్లాజ్‌ ఆచరణయోగ్యం కాదు, ఫలానా క్లాజ్‌కు లాజిక్‌ లోపించింది, ఫలానా దానికి బ్యాకప్‌ గణాంకాలు, సమాచారం అంద చేయలేదు… అలా మాట్లాడాలి. బిల్లు ప్రకారం నదులు, విద్యుచ్ఛక్తి అన్నీ ఉమ్మడి ఖాతాలో పడేస్తున్నారు. అంటే అన్నీ కేంద్రం చేతికి వెళ్లిపోతాయి.  ఇరు రాష్ట్రాలకూ యిది నష్టమే. సుదీర్ఘమైన పోరాటం చేసి సాధించిన తెలంగాణ యిది అంటే హాస్యాస్పదంగా వుంటుంది. ఇలాటి అంశాలపై ప్రజలను ఎడ్యుకేట్‌ చేయడం మానేసి ఓటింగుకి ఒప్పుకోవాలంటూ వైకాపావారు, క్లాజువారీ ఓటింగుకి కూడా ఒప్పుకోమని విభజనవాదులు గొడవ చేస్తూ అసెంబ్లీ నడవకుండా చేస్తే మన తెలుగువాళ్ల గురించి దేశప్రజలు ఏమనుకుంటారు? అందుకే అంటున్నాను – రోత పుడుతోంది! అని. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014) 

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5