దమ్ముంటే చర్చను తేల్చండి!!

సమైక్యాంధ్ర నాయకులు ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఎందుకు అంటున్నారో చాలా కాలంగా చాలా వేదికల మీద తమకు చేతనైన రీతిలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలాగే తెలంగాణ వాదులు తమకు ప్రత్యేక రాష్ట్రం…

సమైక్యాంధ్ర నాయకులు ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఎందుకు అంటున్నారో చాలా కాలంగా చాలా వేదికల మీద తమకు చేతనైన రీతిలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలాగే తెలంగాణ వాదులు తమకు ప్రత్యేక రాష్ట్రం అవసరం ఎలా సబబో పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. తెలంగాణ వారు చెబుతున్న విషయాలు అన్నీ అవాస్తవాలు అంటూ.. 101 అబద్ధాలు పేరిట.. సమైక్య వాదులు ఒక పుస్తకం అచ్చు వేశారు. దాని తర్వాత.. రాజమండ్రిలో ఎంపీ ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ నిర్వహించిన జైఆంధ్రప్రదేశ్‌ సమావేశం లో ఆవేశపూరితమైన ఆయన ప్రసంగం తరువాత.. ఈ రెండువాదనలకు సంబంధించిన వారు చెబుతున్న సంగతులు బహుధా చర్చనీయాంశాలుగా మారాయి. తాజాగా జరిగింది ఉండవిల్లి మీటింగే గనుక.. ఆయన మాట్లాడిన మాటలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఆ మీటింగులోని ప్రసంగాంశాలు.. వాటి మంచిచెడుల మీదనే ఇప్పుడు ఉభయపక్షాలకు చెందిన నాయకులు తమ తమ వాదనల్ని వినిపిస్తున్నారు. 

తెరాస నాయకులు ‘దమ్ముంటే బహిరంగ చర్చకు రా..’ అంటారు.. 

ఉండవిల్లి మరోవైపు నుంచి.. ఏ వేదికమీదనైనా చర్చకు సిద్ధం అంటారు..

ఇదంతా చూస్తూ/వింటూ / చదువుతూ కూర్చునే మనలాంటి సామాన్యులు మాత్రం.. అంతా డ్రామాలే బాసూ.. నిజంగా చర్చపెడితే.. అట్నుంచి వాళ్లూ రారు, ఇట్నుంచి వీళ్లూ రారు.. అంటూ తేల్చిపారేస్తారు. 
===

ఎందుకిలాంటి పరిస్థితి ఉంది. ఒక చర్చ అనేది ఈ సమస్యను ఒక కొలిక్కి తేగలదని ఇరువర్గాలు నమ్ముతున్నది నిజమేనా? ఉభయపక్షాలు తమకు తాము చేసుకుంటున్న ప్రచారం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నారా? అలాగైతే బహిరంగ చర్చకు వారు ఎందుకు మొగ్గుచూపడం లేదు.  ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఏదో ఒక వర్గానికి చెందిన వారు ఇదిగో ముహూర్తం ఫలానా.. వేదిక ఫలానా.. ఫలానా చోట మేం వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటాం.. దమ్మున్న వాళ్లెవరైనా వచ్చి వాళ్ల వాళ్ల వాదనలతో మమ్మల్ని ఒప్పించండి. అని తేల్చవచ్చు కదా! కానీ అలాంటి పరిణామం మాత్రం జరగడం లేదు. 

ఏ వేదిక  మీద చర్చ జరిగినా కూడా దానిని లైవ్‌ ప్రసారాల ద్వారా యావదాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ముందుంచడానికి మన పద్నాలుగు టీవీ న్యూస్‌ ఛానెళ్లూ సదా సిద్ధంగా ఉంటాయి…

ఉచితంగా వస్తున్న ఈ చర్చను అటు సీరియస్‌గా విషయం బోధపరచుకోవడానికైనా లేదా, కామెడీగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూసి ఆనందించడానికైనా ప్రజలు కూడా ఖాళీగానే ఉన్నారు.

…మరిక జాప్యం ఎక్కడ? ఎందుకు? దమ్మున్నవారెవరైనా వెంటనే ఒక చర్చను ఏర్పాటు చేస్తే పోతుంది. 
===

అయితే

శుష్క ప్రేలాపనలతో సవాళ్లు ` ప్రతిసవాళ్లు కాకుండా వాస్తవంగా చర్చకు కూర్చోగల దమ్ము ఈ నాయకులకు ఉందా లేదా అనేది తొలి సందేహం. ఒక వేళ ఉన్నట్లయితే ఉభయులకు ఆమోదయోగ్యులైన ఒకరిద్దరు లేదా ముగ్గురు పెద్ద మనుషులను మాజీ న్యాయమూర్తులను సంధానకర్తలుగా నిర్ణాయకస్థానంలో ఉంచి చర్చను చేయాలి. ఇరుపక్షాల వారు తమతమ వాదనలను వినిపించగల వారిని పార్టీ రహితంగా అందరినీ పోగుచేసి.. ఆ చర్చకు తీసుకురావాలి. ఆ చర్చలో తేలే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని.. ముందుగానే ప్రమాణం చేయాలి. చర్చ పూర్తయిన తర్వాత.. ఎవరి వాదన సబబుగా ఉందన్న నిర్ణయం జరిగితే ఆ వాదనకు రెండో వారు కూడా పూర్తిగా నిబద్ధులై ఉండాలి. వితండవాదానికి దిగకూడదు. 

అలాంటి ముందస్తు ఒప్పందాలతో చర్చకు కూర్చుంటే గనుక.. రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది. రాష్ట్రం విడిపోయినా… సమైక్యంగానే ఉండాల్సి వచ్చినా.. ఎలాంటి అవాంఛనీయ పరిణామాల ఊసు లేకుండా.. అంతా పద్ధతిగా జరిగిపోతుంది.

తెలంగాణ వాదం పేరిట రాష్ట్రం ప్రత్యేకంగా కావాలంటూ.. ఉద్యమిస్తున్నా రభసలు చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా… వీరికి మరోవైపు రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ రోడ్లెక్కుతున్నా, ఢల్లీి గడపలు తొక్కుతున్నా… ప్రదర్శనలు గట్రా చేస్తున్నా.. అలాంటి వారి సంఖ్య అంతా కలిపి.. ఈ రాష్ట్ర జనాభాలో కేవలం 5 శాతం కూడా లేదన్నది మాత్రం కఠోరమైన వాస్తవం. మిగిలిన 95 శాతం మంది ప్రజలు మాత్రం.. ఏమైనా జరగొచ్చు కానీ.. ఎలాంటి చికాకులు, మనస్తాపాలు, విభేదాలు, తగాదాలు, రభసలు లేకుండా జరిగిపోవాలని కోరుకుంటున్నవారు మాత్రమే. మెజారిటీ మెజారిటీ అంటూ ఊదరగొట్టే మన నాయకులు.. వాస్తవానికి మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇదేనన్న సంగతిని గుర్తించి ఇలాంటి చర్చ ఒకటి నిర్వహించిన తర్వాతనైనా ఆ విధంగా వ్యవహరిస్తే వారికి మర్యాదగానూ, రాష్ట్రానికి శాంతి ప్రదాయకంగానూ ఉంటుంది. 

కానీ పిల్లిమెడలో గంట కట్టేదెవరు? ఒక చర్చ ను ఏర్పాటు చేయగల సత్తా ఉన్న వారెవ్వరు? ఎవరైనా పూనుకుని ఏర్పాటుచేసినా.. వారు  ఏర్పాటు చేస్తున్న చర్చ మీద తమకు విశ్వాసం లేదని.. ఇది ఫలానా వారి తొత్తులుగా, వారి సొమ్ములు తిని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అని.. ఇరువర్గాల వారు ఎవరికి వారు అర్థం పర్థం లేఇన విమర్శలతో విరుచుకు పడరని గ్యారంటీ ఏమిటి? అందుకే సవాళ్లే తప్ప.. సత్తాలేని మాటలతో తెలంగాణ, సమైక్యాంధ్ర వాదనలు ప్రజలకు విసుగు పుట్టిస్తున్నాయి. 

– కపిలముని