నిన్నటికి నిన్న పద్మ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మన తెలుగు మీడియా మొత్తం పండగ చేసేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమకు అవార్డులు వెల్లువెత్తేసినట్లుగా అందరూ తెగ గోల చేసేశారు. అవునుమరి.. ఒక రామానాయుడు వంటి దేశంలోని అపురూపమైన నిర్మాతకు పద్మభూషణ్, అసామాన్యమైన సమకాలీన నటి శ్రీదేవికి పద్మశ్రీ, దిగ్దర్శకుడు బాపు మరో పద్మశ్రీ. తిరుగులేని గానమాధుర్యంతో దక్షిణ భారతదేశాన్ని అలరించిన జానకికి మరో పద్మభూషణం… తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించేలాగా నాలుగు అవార్డులు వచ్చేయడం అంటే.. నిజంగా పండగే. అవును మరి మన సినీ పరిశ్రమకు, సినీ అభిమానులు అందరికీ తెలిసిన నలుగురికి పద్మ అవార్డులు అంటే మాటలు కాదు. ఇవాళ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించిన ఫోటోల ప్రకారం కూడా.. ఈసారి పద్మం దక్కిన వారిలో ఈ నలుగురే పాప్యులర్ అని కూడా అనుకోవాలి.
అయితే ఇదే సమయంలో మనం మరో విషయం గుర్తు చేసుకోవాలి. ఈ పద్మ అవార్డుల సాక్షిగా.. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో కుచించుకుపోవాలి. ముడుచుకుపోవాలి. అరివీరభయంకరమైన సిగ్గుతో తల ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియకుండా.. వారు కుమిలికుమిలిపోవాలి. అవును. రాష్ట్రప్రభుత్వానికి అంతటి అవమానకరమైన విషయం ఈ అవార్డులు.
నిర్మాతగా రామానాయుడు ఎంతటి ఘనుడో ఈ దేశం మొత్తానికి తెలుసు. ఆయనకు పద్మభూషణ్ అవార్డు మాజీ కేంద్ర మంత్రి టీఎస్సార్ సిఫారసుతో వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే గనుక, మరి రామానాయుడు ఘనతను గుర్తించడంలో ఈ రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తోంది? దాదాపు అన్ని భారతీయ భాషల్లోను సినిమాలు నిర్మించిన ఘనత రామానాయుడుది. లిపిలేని భాషలో కూడా సినిమా తీసి రంజింపజేసిన ఘనత ఆయనది. అలాంటి రామానాయుడుకు ఓ పద్మ పురస్కారం ఇప్పించలేకుండా ఈ సర్కారు ఏ తుప్పల్లో కాపు గాస్తున్నట్లు? దశాబ్దాల కిందట పద్మశ్రీ అందుకున్న జానకికి ఇన్నాళ్లుగా మరో పైమెట్టు అవార్డు ఇప్పించడం గురించిన కృషి ఈ రాష్ట్రప్రభుత్వం తరఫున జరగనేలేదు. ఇప్పుడు కూడా తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేస్తే… జానకికి పద్మభూషణ్ ఇచ్చారు. శ్రీదేవి మన ఇంటి ఆడపడుచు. బాలీవుడ్లో వన్నెకెక్కి.. తెలుగు భామ జాతీయ వ్యాప్త కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఔద్ధత్యానికి ప్రతీక. కథానాయికగా ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ పూర్తిచేసి తాజాగా రెండో ఇన్నింగ్స్‌తో కూడా అద్భుతాలను నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్న నటి ఆమె. ఆమె ఘనత నటనా పాటవం ఇవేవీ మన తెలుగువారికి తెలియనివి కావు. కానీ గుడ్డ
ి ప్రభుత్వం దృష్టికి మాత్రం వెళ్లిన విషయాలు కావు. మహారాష్ట్ర సర్కారు తమ జాబితాలో ఆమె పేరు చేర్చి పంపితే మనం ఇవాళ మొదటిపేజీల్లో ఫోటోలు వేసుకుని తప్పట్లు కొడుతున్నాం. మన ప్రభుత్వం మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉంది.
బాపు విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం బాపు పేరును పద్మభూషణ్‌కు సిఫారసు చేసినట్లుగా గతంలో పుకార్లు వచ్చాయి. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు.. బాపు`తనం రుచి తెలిసిన పెద్దలు ప్రభుత్వానికి తలంటు పోసి… ఆయనకు ఇప్పటికే అవార్డు ఎంత ఆలస్యం అయినదో తెలియజెప్పి.. జాబితాలో ఆయన పేరు పెట్టించారని అప్పట్లో ఉప్పందింది. అయితే తీరా అవార్డులు ప్రకటించేసరికి ఆయన పేరు పద్మశ్రీల జాబితాలో ఉంది. అదికూడా తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేసిన జాబితానుంచి ఆయనకు అవార్డు ఇచ్చారట. ఎంత ఘోరం ఇది. ఇవాళ్టి వరకు తెలుగుదనం అంటే దాన్ని బాపు బొమ్మల్లో వెతుక్కోవడం మనకు రివాజు అయిపోయింది. తెలుగు అందం అంటే దానికి ప్రతీకగా బాపు బొమ్మను పేర్కొనడం మన సంస్కృతి అయిపోయింది. సినిమా దర్శకుడుగా కాసేపు బాపును పక్కన పెడదాం. మరి ఆయన చేతిలో వగలు పోయే కుంచె మాటేమిటి? తెలుగులో చిత్రకారుడికి ఒక ప్రతిష్ఠ అంటూ రావడం బాపుతోనే మొదలైంది. తెలుగు చిత్రకళాజగతిలో (బొమ్మలుగీయడంలో) బాపు ఒక శకపురుషుడు కింద లెక్క. బాపు ముందు`వెనుక అంటూ.. తెలుగు చిత్రకళను గురించిచెప్పుకోవాల్సిందే. బాపు అడుగుజాడల్లో తమ ఉనికి మరచిపోతూ.. అసలు గీయడం అంటేనే ఆయన బొమ్మల జాడలను పట్
టుకోవడమే అన్నట్లుగా ఎదిగిన చిత్రకారులు వందల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన చేతిలో రామాయణ, మహాభారతాలే కాదు.. యావత్తు హిందూపురాణాలే కాదు, ఇతర మతాల పవిత్ర గ్రంథాలు కూడా.. బొమ్మలుగా మారి జనావళిని రంజింపజేశాయనడం అతిశయం కాదు. అలాంటి మహానుభావుడిని గుర్తించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకాలేదు. పదిమందీ వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయి చెవినిల్లు కట్టుకుని పోరినా కూడా.. ప్రతిభను గుర్తించడానికి వారికి ఏమైనా అడ్డం వచ్చిందో.. కళ్లకు మబ్బులు కమ్మాయో మనకు తెలియదు. బాపు పురస్కారం మాత్రం.. తమిళనాడు కోటాలో వచ్చింది. జానకి శ్రీదేవి తదితరులు సంగతి వేరు. తమిళనాడులో ఇల్లు కట్టుకుని నివసించడం తప్ప.. తమిళ సాహిత్యానికి బొమ్మల రూపంలో గానీ, కోలీవుడ్‌కు సినిమాల రూపంలో గానీ.. బాపు చేసిన సేవ ఏ పాటిది. చాలా నామమాత్రంగా చెప్పుకోవాలి. అయినాసరే.. వ్యక్తిని, ప్రతిభ ఔన్నత్యాన్ని గౌరవించడం తెలిసిన జాతి ప్రభుత్వం గనుక ఆయన పేరును సిఫారసు చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం నిశ్చేష్టగా చూస్తూ నిల్చుంది.
అందుకే ఈ పద్మ అవార్డుల సాక్షిగా.. మన రాష్ట్రంలో ఏలుబడి సాగిస్తున్న సిగ్గులేని ప్రభుత్వం.. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వచ్చే ఏళ్లలో అయినా.. ప్రతిభను గుర్తించడానికి సరైన తూకంరాళ్లు సిద్ధం చేసుకోవడం గురించి కసరత్తు చేయాలి.