సాములారా.. తమరందరూ పెద్దోళ్లు.. చట్టం అంటే ఏటో తమకు తెలుసు లేదో నాకు తెల్దు గానీ.. తామంతా.. సట్టాల్ని తయారుజేసే కార్కానాలో గూసోని.. నాబొందలే.. దాన్నే అసెంబిలీ అంటారు గద! ఆడ గూసోని.. ఎంసక్కా లోకాబిరామాయనాలు మాటాడుకుంటా… మీకుకిట్టనోల్ల మీద బురద జల్లుకుంటా.. పేడజల్లుకుంటా గడిపేస్తాంటారు. అంతా శానా మంచిగ చేస్తంటారు. తమరందరూ చర్చించి సట్టం అనేదాన్ని తయారుజేస్తారని.. మన రాజ్జాంగమనే పుస్తకం జెప్తాది గానీ.. అదంతా జరిగి సచ్చేది గాదులే. కాపోతే.. తమబోటి పెద్దోళ్లలో మహా పెద్దోళ్లకి ఇపుడో గుబులు పట్టుకున్నట్టుండాది. మడుసులంతా సమానమే.. కొందరు శానా ఎక్కువ సమానం అని పెద్దాయన ఎవురో జెప్పినట్లుగా.. మీ పెద్దోళ్లలో గూడా కొందరు శానా పెద్దోళ్లుంటారు గద! అట్టాంటి మీకు అంటే ఏలుబడి సాగించేటోల్లకి.. కాంగిరేసోల్లకి.. ఆల్లకి పెదాన మిత్ర ప్రతి పక్షం అనగా తెలుగుదేసపోల్లకి కొన్ని గుబుళ్లు రేగతన్నట్లున్నాయి.
జగన్ రెడ్డి.. ఏటైనా స్టేట్లో దుమ్ము రేపేత్తన్నాడూ అంటే.. అదేదో ఈడ సెంచల్గూడా జైల్లో పెట్టడం వల్లనేనని తమరంతా దిగాలు పడిపోతన్నట్టున్నారు. ఆ జగన్ని అరిజెంటుగా పొరుగునే ఉండే ఇంకేదైనా స్టేట్లోగానీ.. లేపోతే.. ఆ పాపని డిల్లీ బస్సులో రేపు జేసి చంపేసిన కర్కోటక ఎదవలు కూడా ఉండలేక ఆత్మహత్య చేసుకునే వాతావరనం ఉండే తీహారు జైల్లోకి గానీ పంపించేయాలని తమకంతా బలే కుశాలగా ఉన్నట్టుండాది. ఈ జైల్లో ఉండబట్టే మనోడు స్టేటు పోల్టిక్సులో సెక్రం తిప్పేస్తన్నాడూ.. దూరంగా యింకో జైల్లో పెడితే.. తిప్పడానికి ఆడి సేతికి సెక్రం దొరక్కుండా ఉంటాదీ అని తమరు అనుకుంటన్నట్టుగా ఉన్నారు. కానీ అయ్యా.. ఆడ మటుకు ఎవరూ వెళ్లి కలవకుండా ఉంటారనే గేరంటీ ఏటీ…
అయ్యా నాకో డౌటు. జైలు ఆపీసర్లంతా కుమ్మక్కయిపోతండారూ.. జగనుకు తలుపులు తెరిచేసి అందరూ యెళ్లి మీటింగులు బెట్టుకునేలా… ఏర్పాట్లు జేస్తండారూ అని తమరు గొంతు సించుకుంటన్నారే. గవుర్మెంటు తమ సేతిలోనే కదా ఉండాది.. ‘ఆయ్.. ఏంటిదీ..’ అని ఆ జైలు ఆపీసర్లని గదమాయించలేరా? రూల్సు దాటి పోతా ఉంటే.. తోల్తీస్తా అని బెదిరించలేరా..? అయ్యా.. తమ మంత్రిగారి సారా బొక్కలు తవ్వినందుకు అంతపెద్ద ఐపీఎస్ పోలీసాయన్ని శంకరగిరి మాన్యాలు పట్టించిన గనత తమకుంది కదా.. మరి జైలు ఆపీసర్ని బెదిరంచలేకపోతన్నారంటే.. జనం నమ్మతారా? ఆడు ఆడి.. రూల్సు పెకారమే పోతన్నాడు కాబట్టి… తమరేటీ అన్లేకపోతన్నారని జనం మాట..? తమరేటంటారు?
అయ్యలారా నా అనుమానమేటంటే.. మీ కళ్లు సల్లంగుండాలంటే.. జగన్ని తీస్కోనొచ్చి గాందీ బవన్లోనో… ఎన్టీఆర్ బవన్లోనో ఓ గదిలో పెట్టి తాళమేసి.. కాపలాగా మిమ్మల్నే గూసోబెడితే తప్ప యేరే మార్గమున్నట్టు లేదు. అయినా దొరలారా.. అప్పుటికీ నాకో అనుమానం. గాందీబవన్లో బెడ్తే.. అద్గదిగో జగనూ కాంగ్రెసూ ఒకటే గూటికి అంటూ తెలుగుదేసపోల్లూ… ఎన్టీఆర్ బవన్లో బెడ్తే.. ‘అద్గదిగో మేమంటే వైకాపా తెదేపా అంటకాగతన్నాయంటే ఇదే రుజువు’ అని కాంగిరేసోల్లూ.. కొత్త పాట అందుకుంటారేమో అని!!
అయ్యా… సెంచల్గూడాలో లేకపోయినంత మాత్రాన జగన్ కొచ్చే నస్టమేటో నాకు కనపడ్డం లే. ఒకేళ ఆళ్ల పార్టీ వోళ్లు అనుకుంటన్నట్లుగా.. జగను గానీ, ఆళ్ల అయ్య రాజసేకర్రెడ్డి గానీ… జనం గుండెల్లో ఉండేదే గనుక నిజమైతే.. యిక తమరు జగన్ని తీల్కెళ్లి సెంద్రమండలం మీద బెట్టేయండి.. ఇబ్బందేటీ రాదు… ఆయన పని ఆయన సక్కంగా జేస్కుంటా పోతారు. ఊరు మారితే దూరం మారతాది గానీ, ఉంటే గింటే అబిమానాలు మారతాయా బాబయ్యా.. రవ్వంత యోచన జెయ్యండి..
– కపిలముని