పెద్దల సభలో పది స్థానాల భర్తీకి నగారా మోగింది. ఎమ్మెల్యేల కోటా` 29 ఓట్లు వస్తే చాలు… ఎమ్మెల్సీ అయిపోయినట్టే. ఆట్టే శ్రమ లేదు.. ఇంటింటికీ తిరిగి.. కనిపించిన ప్రతి ఒక్కరి కాళ్లూ పట్టుకుని… కోట్ల రూపాయల డబ్బు తగలేసి.. నానా పాట్లూ పడి కూడా.. గెలుస్తామో లేదో అని దైవం మీద భారం వేసి నిరీక్షించవలసిన అవసరం అసలు ఎంతమాత్రమూ లేదు. పార్టీ అధినేతల్ని, అధిష్ఠానాల్ని ప్రసన్నం చేసుకోగలిగితే చాలు.. ముడుపులు కట్టినా, మొక్కులు మొక్కినా.. ఒక చోట ఓకే చెప్పించుకోగలిగితే చాలు.. ఇక చట్టసభలో అడుగుపెట్టేసినట్లే. అందుకే ఇప్పుడు ప్రధానమైన అన్ని పార్టీల్లోనూ ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం పోటీ పెరిగిపోయింది. మండలి నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలోని పది స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అన్ని పార్టీలను కలిపి లెక్కవేసుకుంటే గనుక.. ఈ పది స్థానాల కోసం అటు ఇటుగా వందమంది పోటీ పడుతున్నారు. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరకమైన, చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్‌లో ఆశించేవాళ్లంతా హస్తినాపురం వైపు పరుగులు తీస్తుండగా, ప్రదక్షిణలు చేస్తుండగా… తెలుగుదేశంలో ఎన్నికల దాకా కాసుకుని ఉంటే గెలుపు గేరంటీ ఏంటి.. మంచో చెడో దీన్తో సర్దుకుంటే పోద్ది అని ఆత్రంగా ఎగబ
డుతున్నారు. వైకాపా` ఎంఐఎం` తెరాస ల నడుమ ట్రయాంగ్యులర్ లవ్‌స్టోరీ నడుస్తోంది.
మొత్తానికి అన్ని పార్టీలను ఒక భయం మాత్రం సార్వజనీనంగా పీడిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏ పార్టీ గద్దలు తన్నుకుపోతాయో అనే భయం. అసలే విప్ జారీచేసే సంప్రదాయం లేని ఈ ఎన్నికల్లో ఎవరు` ఎవరికి ఓట్లేయాలో పార్టీలు ముందే డిసైడ్ చేస్తాయి గానీ.. రహస్య ఓటింగ్ విధానంలో తమ వారిని ఎదిరి పార్టీ గద్దలు ఎత్తుకుపోయి.. కట్టు తప్పి ఓటు వేశారంటే పుట్టి మునుగుతుందనే భయం అన్ని పార్టీల్లోనూ ఉంది. మార్చి 11 నాటికి నామినేషన్ల పర్వం కూడా ముగియనున్న ఈ ఎన్నికలకు పార్టీల్లో జరుగుతున్న కసరత్తుపై గ్రేట్‌ఆంధ్ర విశ్లేషణ ఇది.
1
కాంగ్రెస్
అల హస్తినాపురంబులో.. నగరిలో…
జనబలం అక్కర్లేదు. ప్రతిష్ఠ.. ఇమేజి.. నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకోగల తెగువ, నాలుగు ఓట్లు వేయించుకోగల సామర్థ్యం ఇవేవీ అవసరం లేదు. కేవలం అధిష్ఠానం ప్రాపకం దొరికితే చాలు. చట్టసభలో సభ్యుడు అయిపోవచ్చు. పైగా అధికార పార్టీ గనుక తతిమ్మా వారికంటె ఎక్కువ స్థానాలను సొంతంచేసుకునే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా.. ఇప్పుడు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న పది స్థానాల్లో కాంగ్రెసు సీట్లు అయిదు ఉన్నాయి. వీటిలో తమను మళ్లీ కొనసాగిస్తారని గట్టిగా నమ్ముతున్న వారు.. ఆ మేరకు చాలా గట్టిగా పైరవీలు పూర్తి చేసుకుని నిశ్చింతగా ఉన్నవారు కనీసం ఇద్దరున్నారు. ఖాళీ అవుతున్న అయిదు స్థానాల్లో పొంగులేటి సుధాకరరెడ్డి, భారతి రాగ్యానాయక్ కు దాదాపుగా కొనసాగింపు గ్యారంటీ అని వార్తలు వచ్చాయి. మిగిలిన మూడు స్థానాలకు కొత్తవారిని ఎంపిక చేసే ఉద్దేశంతో పార్టీ ఉంది. అయితే ఈ మూడు స్థానాలకోసం పోటీ పడుతున్న వారు మాత్రం ఎక్కువే. ఫార్మాలిటీ కోసం బొత్స సత్యనారాయణకు తమ విజ్ఞాపన పత్రాలు, సిఫారసు పత్రాలు అందజేసి.. అంతా ఢల్లీిలో వాలిపోయారు.
జాబితా కడితే కాంగ్రెసులో ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. పైగా గవర్నరు నామినేట్ చేసే స్థానాలు కూడా కాంగ్రెస్ ఇష్టానుసారంగానే జరుగుతాయి గనుక.. కాంగ్రెస్ ఆశావహులు ఏదో ఒక రూపంలో స్థానం దక్కకపోతుందా అని ఆశిస్తున్నారు. పెద్ద నాయకుల నుంచి చిన్న వారి వరకు అనేకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ స్పీకరు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ, మరో మాజీ మంత్రి ఫరీదుద్దీన్, మహిళా కాంగ్రెసు నాయకురాలు గంగాభవాని, పివి రంగారావు, భమిడిపాటి రామ్మూర్తి, గిడుగు రుద్రరాజు, కోలగట్ల వీరభద్రస్వామి, సీఎం సన్నిహితుల కోటాలో కాశీనాధ్ ఇలా .. ఆశిస్తున్న వారు అనేకులు ఉన్నారు. కులాలు` వర్గాలు` పార్టీకి చేసిన సేవ ఇత్యాది అన్ని అంశాలను పార్టీ నాయకులు పరిశీలిస్తున్నారు.
ఏది ఏమైనా నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ‘అల హస్తినా పురంబులో.. టెన్ జనపథ్ నగరిలోనే’ ఉన్నదని నిర్వివాదాంశం. ఇక్కడ టిక్కెన కోరుకుంటున్న వారందరూ అక్కడిపెద్దల దృష్టిలో పడడం ఎలాగో ప్లాన్ చేసుకుంటున్నారు. ఢల్లీి వర్గాలనుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి పొంగులేటి సుధాకరరెడ్డికి, భారతికి ఖరారైనట్లే. ముఖ్యమంత్రికి ఆప్షన్ ఇచ్చేస్తే.. ఆయన తన మిత్రుడు సురేష్‌రెడ్డికి ఓటేసేస్తారు. అలాగే బొత్సకు కూడా సొంత ఆబ్లిగేషన్లు ఉన్నాయి. వీరిద్దరినీ బైపాస్ చేసి ఏకంగా అధిష్ఠానం పెద్దలతోనే సత్సంబంధాలు నెరపడం ద్వారా సీల్డ్‌కవర్‌లో టిక్కెట్‌కోసం యత్నిస్తున్నవాళ్లూ ఉన్నారు.
గద్దల భయం : కాంగ్రెస్‌కు ప్రస్తుతం 155 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపు 9 మంది వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అసలే విప్ కూడా లేని ఈ ఎన్నికల్లో ఆ 9 మంది ఓట్లు వేస్తారని నమ్ముకుని రంగంలోకి దిగితే మొదటికే మోసం వస్తుందని పార్టీకి తెలుసు. అయితే ఒక్కొక్క ఎమ్మెల్సీకి 29 ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరం అవుతాయని అనుకుంటే గనుక… అయిదు స్థానాల్ని నిలబెట్టుకోవడానికి 145 ఓట్లు సరిపోవడం అనేది ఆ పార్టీకి కాస్త ఊరట. వైకాపా తో అంటకాగుతున్న ఎమ్మెల్యేల మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోవడం వల్ల వారు సేఫ్‌జోన్‌లో ఉన్నారు. అదే సమయంలో మిగిలిన ఎమ్మెల్యేల్లో కూడా ఎవరైనా.. లోలోపల వైకాపాకు లోపాయికారీగా ఓటు వేసేవారు ఉన్నట్లయితే సీట్లు చేజారుతాయి. అయితే.. వైకాపా ఎవ్వరికి వల విసురుతుందో.. ఎట్నుంచి నరుక్కువస్తుందో.. బొటాబొటీగా ఉన్న 145 మందిలో ఏ ఒక్క వికెట్ పడినా.. ఒక సీటు పోయినట్లే అనే భయం ఆ పార్టీలో ఉంది.
2
తెలుగుదేశం
ఎగబడడం… పతనానికి ప్రతీక
తెలుగుదేశం పార్టీ అసలే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ పార్టీనుంచి పదవులకోసం చాలా మంది ఎగబడుతున్నారు. తెలుగుదేశం నాయకులకు సార్వత్రిక ఎన్నికల్లో తాము గెలిచి పదవుల్లోకి వస్తామనే విశ్వాసం చాలా తక్కువ. దానికి నిదర్శనమే ఆ పార్టీలో ఎమ్మెల్సీ పదవులకోసం పెరుగుతున్న పోటీ. ఆ పార్టీకి ఉన్న బలానికి మించి.. వారు ఏదైనా కొన్ని ఓట్లను మానిప్యులేట్ చేయగలిగితే మూడు ఎమ్మెల్సీ స్థానాలు వారికి దక్కుతాయి. ఇలాంటి సమయంలో టిక్కెట్ కోసం పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య మాత్రం 1:10 నిష్పత్తిని మించినట్లుగా ఉంటోంది. ఎమ్మెల్యేగా రంగంలోకి దిగితే.. డబ్బు తగలేయాల్సి రావడంతో పాటూ విజయం గ్యారంటీ లేదని.. అదే.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయితే ఎంచక్కా ఖర్చు లేకుండా గెలిచి ఆరేళ్లు పదవి అనుభవించవచ్చునని వారు ఉవ్విళ్లూరుతున్నారు.
సాధారణంగా ఎమ్మెల్యేలుగా పోటీచేసిన అనుభవం ఉన్న నాయకులు కూడా ఈ దఫా మాత్రం ప్రత్యేకించి ఎమ్మెల్సీల బరిలోకి వెళ్లిపోవడానికి మోజుపడుతుండడాన్ని చూస్తే.. ఎన్నికల్లో గెలిచే సత్తా తమ పార్టీకి లేదనే క్లారిటీ చాలా మంది నాయకులకే ఉన్నట్లుగా కనిపిస్తోంది. పైగా తెలుగుదేశం జాబితాలో కొమ్ములు తిరిగిన నాయకులుగా పేరున్న అనేక మంది ఎమ్మెల్సీలుగా తమ పదవిని పదిలంగా స్థిరపరచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ జాబితాలో యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి, కడియం శ్రీహరి వంటి వారు కూడా ఉండడం విశేషం. మరికొందరు మాజీ మంత్రులు కూడా ఎగబడుతున్నారు. ఇక కుల సమీకరణలు, ప్రాంతాల వారీ సమీకరణల ప్రకారం అధినేత మీద ఒత్తిడి తెచ్చేవాళ్లు, బతిమాలేవాళ్లు ఉండనే ఉంటారు. ఎటొచ్చీ.. అన్ని పార్టీల్లోకీ తెలుగుదేశంలోనే ఎమ్మెల్సీ టిక్కెట్లకోసం పోటీ ఎక్కువగా ఉంది.
పెరుగుతున్న ఈ పోటీ పార్టీ ప్రస్తుతం చేరువ అవుతున్న పతనావస్థకు నిదర్శనం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎటూ సార్వత్రిక ఎన్నికల్లో విజయం గ్యారంటీ లేదు గనుకనే.. ఇంత ఎక్కువ మంది పోటీ పడుతూ పార్టీ పరువు పలచన చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు కూడా తెలివిగా.. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేసి ఓడిన వారికి ఎమ్మెల్సీ అవకాశం లేదంటూ ఒక విస్పష్ట ప్రకటన చేసి పరిణామాల్ని గమనిస్తున్నారు. తద్వారా ఎమ్మెల్సీ అనేది పునరావాస కేంద్రం కాదని.. ఆయన సంకేతం ఇవ్వదలచుకున్నారు. మిగిలిన పార్టీలు కూడా ఈ ‘ఫిల్టర్’తో తమకున్న ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. అయితే చంద్రబాబు.. చాన్నాళ్లుగా పదవుల్ని ఆశించకుండా పార్టీకోసం సేవలందిస్తున్న వారికే ఎమ్మెల్సీలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీకి సేవచేసిన వారి ఖాతాలో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా పలువురు భావిస్తున్నారు. గతంలో రాజ్యసభ విషయంలో కూడా ఇదే సాకు చూపి… పారిశ్రామిక వేత్తలు, ఆర్థికంగా దన్నుగా నిలిచే క్వాలిఫికేషన్ కింద నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌లకు కట్టబెట్టారు. దీనిపై అప్పట్లోనూ చాలా విమర్శలు రేగాయి. ఈసారి కూడా.. ఈ ఎమ్మెల్సీ కోటాను పార్ట
ీకి అనుకూలురైన సంపన్నులకు కట్టబెట్టి.. వచ్చే ఎన్నికల సమయానికి ఆర్థికంగా వారు భారం పంచుకునేలా చంద్రబాబు ఒప్పందాలు చేసుకోవచ్చునని కూడా పలువురు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఖాళీ అవుతున్న పది స్థానాల్లో తెలుగుదేశానికి చెందిన సీట్లు మూడే ఉన్నాయి. 29ఓట్లు అవసరం అనుకుంటే ఈ మూడుస్థానాలు తిరిగి చేజిక్కించుకోవడానికి 87 ఓట్లు అవసరం అవుతాయి. వారికి ప్రస్తుతం 86 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒకటిరెండు ఓట్లు ఏదో ఒకరీతిగా మేనేజ్ చేయగలరని అనుకున్నప్పటికీ… పేరుకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా రికార్డుల్లో ఉన్నప్పటికీ… పూర్తిగా వైకాపా మనుషులుగా చెలామణీ అవుతున్నవారు కూడా ఉన్నారు. వీరిని కూడా లెక్కల్లోంచి తొలగిస్తే.. ఎవరో ఒకరి మీద పూర్తిగా ఆధారపడితే తప్ప.. తమ మూడు స్థానాలను తాము నిలబెట్టుకోవడం తెలుగుదేశానికి అసాధ్యం అవుతుంది..
గద్దల భయం : తమ పార్టీలోని ఎవ్వరు ఏ క్షణాన చేజారిపోతారో అనే భయం తెలుగుదేశానికి కూడా ఉంది. ఇప్పటికే మూడుస్థానాలను గెలిపించగల బలం వారికి సొంతంగా లేదు. వైకాపా వైపు కొందరు మొగ్గి ఉన్నారు. లోలోపల కొందరు తెలుగుదేశం వారికి కాంగ్రెస్ కూడా గేలం వేసుకుకూర్చుంది. వైకాపా వైపు నుంచి కూడా పలువురికి రాయబేరాలు సాగుతున్నట్లు వార్తలున్నాయి. ఏ గద్ద ఎటునుంచి తన్నుకుపోతుందో అనే భయం.. వారిని కూడా పుష్కలంగా వెన్నాడుతూనే ఉంది.
3
వైకాపా` తెరాస` ఎంఐఎం
ట్రయాంగ్యులర్ దోబూచులాట!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రహసనం అంతా ఇప్పుడు మిగిలిన పార్టీల ముంగిట్లోనే కేంద్రీకృతమై ఉంది. శాసనసభలో సంఖ్యాపరంగా కాంగ్రెస్ తెలుగుదేశం తర్వాతి స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం ఉన్నాయి. ఈ మూడు పార్టీలు ఒకరి మద్దతు లేకుండా రెండో వాళ్లు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. విడివిడిగా పరిశీలిస్తే..
వైకాపాకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం చాలా సులువైన పని. వారికి స్వయంగా 17 స్థానాలుండగా, కాంగ్రెస్‌నుంచి వారికి అనుకూలంగా మొగ్గుతున్న వారి 9`10 ఓట్లు, తెలుగుదేశం నుంచి మొగ్గుతున్న ఓట్లు అన్నీ కలిపి సునాయాసంగా 29 వరకు చేరుకోగలరు. పైగా 7 గురు సభ్యులు ఉన్న ఎంఐఎం భవిష్యత్తులో వైకాపాకు మద్దతు ఇస్తామని ఇదివరలోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసింది. ఈ ఎన్నికల్లో ఆ మాట కార్యరూపం దాలిస్తే గనుక.. ఆ కూటమి వద్ద ఇంకా ఓట్లు మిగిలిపోతాయి. మిగిలే ఓట్లు వృథా కాకుండా మరో అభ్యర్థిని మోహరిద్దాం అని కూడా వైకాపా ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు. చేయగలిగినన్ని ప్రయత్నాలు చేద్దాం.. ఆకర్షించగలిగినంత మందిని ఆకర్షిద్దాం.. వొస్తే వొస్తుంది.. పోతే పోయేదేం లేదు.. అనే ధోరణి కూడా వైకాపా నాయకులు కొందరిలో వ్యక్తం అవుతోంది. అది అంత సులువు కాకపోయినా.. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదన్నది వారి యోచన.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి మరో పాచిక వేస్తోంది. ముస్లిం అభ్యర్థి ఆలీ ని తాము ఎమ్మెల్సీ స్థానానికి పోటీపెడుతున్నట్లు ఏకపక్షంగా ప్రకటించేసింది. 17 స్థానాలున్న ఆ పార్టీకి ఇంకా 12 ఓట్లు కావాలి. అందుకని 7 స్థానాలున్న ఎంఐఎంకు ఓ ప్రతిపాదన పెట్టింది. తాము ముస్లిం అభ్యర్థిని మోహరించాం గనుక.. మీ ఓట్లు మాకే వేయండని వారు కోరుతున్నారు. అయితే ఎంఐఎం వైకాపాతోనే అంటకాగుతోందన్నది వేరే సంగతి.
ఇలాంటి సమయంలో వైకాపా తమకు కనీసం 27 ఓట్ల నికార్సయిన బలం (సొంతంGకాంగ్రెస్‌నుంచి సహకరించే వారు కలిపి) ఉంటుంది గనుక… ఒకటి రెండు ఓట్లను ఎంఐఎం నుంచి తీసుకుని.. ఆ పార్టీ తరఫున ఒక ఎంఐఎం అభ్యర్థిని ఎమ్మెల్సీ స్థానానికి మోహరించినట్లయితే సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. తెరాస` ఎంఐఎంను మద్దతు అడుగుతున్న ప్రస్తుత సమయంలో.. ‘మేమే నిలబడతాం.. మీరే మద్దతు ఇవ్వండి’ అని ఎంఐఎం తిరిగి తెరాసనే డిమాండ్ చేస్తే గనుక.. వారి గొంతులో పచ్చివెలక్కాయ పడుతుంది. మాకు లేకలేక ఒకసారి ఎమ్మెల్సీ కాగల అవకాశం వచ్చింది.. మీరు సహకరించాల్సిందే అని ఎంఐఎం గట్టిగా అడిగితే గనుక.. తెరాసకు తకరారే. వ్యతిరేకిస్తే ముస్లిం వ్యతిరేక ముద్ర అవుతుంది. ఆమోదిస్తే.. తమకున్న ఛాన్సు మంటగలిసిపోతుంది. అయితే ఎంఐఎం తరఫున అలా జరగడం అనేది వైకాపా అనుసరించే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది.
ఇలాంటి పితలాటకం.. తెరాస ఒంటెత్తు పోకడల వలనే వస్తోందని పలువురు భావిస్తున్నారు. తెరాస ఏకపక్షంగా తాము ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించేయకుండా.. తెలంగాణ ఐకాస ద్వారా ఒక ఏకాభిప్రాయ అభ్యర్థిని రంగంలోకి దించి ఉంటే గనుక వారి పరిస్థితి కొంత సేఫ్‌గా ఉండేది. తెలంగాణ వాదం వినిపిస్తున్నందుకు జేఏసీ నుంచి ప్రతిపాదన వచ్చి ఉంటే గనుక.. బీజేపీ, సీపీఐ, నాగం ఓట్ల మీద కూడా వారు ఆశపెట్టుకుని ఉండవచ్చు. అయితే అలాంటి పరిస్థితిని తెరాస చేజేతులా దూరం చేసుకుంది.
గద్దల భయం : ఈ మూడు పార్టీల్లో వైకాపా, ఎంఐఎం లకు తమ ఎమ్మెల్యేలను ఇతర పార్టీల గద్దలు తన్నుకుపోతాయనే భయం లేదు. ఎటొచ్చీ.. తెరాసలో మాత్రం ఆ వెరపు పుష్కలంగా ఉంది. ఎమ్మెల్సీని గెలుచుకోగల బలం తమకు ఏ పరిస్థితుల్లోనూ లేకపోయినా.. అభ్యర్థిని ప్రకటిచేయడం అనేది కేవలం.. తమ వారు గద్దల బారిన పడకుండా ఉండడానికే అని విశ్లేషకులు భావిస్తున్నారు. తమ అభ్యర్థి గనుక రంగంలో లేకుంటే.. కాంగ్రెస్ తమ పార్టీ వారికి బేరాలు పెట్టి.. వారి తరఫున ఆరో అభ్యర్థిని కూడా రంగంలో మోహరిస్తుందని తెరాస భయపడుతోంది.
మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఎటొచ్చీ గద్దలు ఎటునుంచి ఎటు పయనించి, ఎవరిని, ఎందరిని తన్నుకుపోతాయో ఈ ఎన్నికల్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. పార్టీల స్థితిగతుల మీద కూడా సూచనప్రాయంగా కొంత స్పష్టత ఏర్పడుతుంది. అయితే నెగ్గినోళ్లంతా ప్రజాబలం ఉన్నోళ్లని, నెగ్గనివాళ్లు ప్రజాబలం లేనివాళ్లని అనుకోవడానికి వీల్లేని ఈ ఎన్నికల గురించి.. పదవులకోసం అంగలారుస్తున్న వారు తప్ప.. సామాన్య ప్రజానీకం మాత్రం నిరాసక్తంగానే ఉన్నదన్నది సత్యం.
-కపిలముని