లవ్‌లెటర్‌ 2 కేసీఆర్‌ : సన్యాసాస్త్రం వేసేయ్‌!

డియర్‌ కేసీఆర్‌… Advertisement నిజంగా ఇది చాలా విపత్కరమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో నలుగురు మనుషుల మధ్యన ఉంటే వారందరి ఊరడిరపు వచనాలతో కొంత సేద తీరవచ్చు. కానీ తమరేమో అజ్ఞాతాన్ని మించింది లేదన్నట్లుగా…

డియర్‌ కేసీఆర్‌…

నిజంగా ఇది చాలా విపత్కరమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో నలుగురు మనుషుల మధ్యన ఉంటే వారందరి ఊరడిరపు వచనాలతో కొంత సేద తీరవచ్చు. కానీ తమరేమో అజ్ఞాతాన్ని మించింది లేదన్నట్లుగా పరులెవరూ ప్రవేశించలేని దుర్భేద్యమైన ఫాంహౌస్‌లో కొలువుదీరిపోయారు. మీగురించి ఇలా నానా అవాకులు చెవాకులు ప్రచారం అవుతున్న ప్రస్తుత తరుణంలో.. మీరు గట్టిగా నిలబడి.. రిటార్టులు ఇవ్వాల్సింది. అఫ్‌కోర్స్‌ మీ తరఫున అల్లుడుగారు… అదే  హరీష్‌రావు, వినోద్‌కుమార్‌ వంటి వారు.. మీమీద జరుగుతున్న ప్రచారాన్ని గట్టిగానే ఖండిస్తున్నారనుకోండి. అది వేరే విషయం. ఎంతైనా వారికి మీకున్నంత నిఘంటు పాండిత్యం, ప్రసంగ పాటవం లేదుగాక లేదు. రిటార్టులు ఇవ్వడంలో మీరు ప్రత్యక్షంగా నోరుతెరవడం లేదనే లోటు కనిపిస్తూనే ఉంది.

మీరు తెలంగాణ కోసం తెరాసను కాంగ్రెసులో విలీనం చేసేస్తాను అన్నా కూడా మోసం చేశారని ప్రకటించారు. అయితే మీరు వెయ్యి కోట్లు అడిగారని, మీ యావత్తు కుటుంబానికి భారీ స్థాయి మంత్రిపదవులు కూడా డిమాండు చేశారని.. అక్కడ బేరం కుదరకనే విలీనం ఆపేశారని, తెలంగాణ ఆగిపోయిందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారం నిజమైనా అబద్ధమైనా ఉద్యమానికి మాత్రం ఇబ్బందే.

చిన్న నేతలు కాకుండా, సోనియా లాంటి పెద్దలు తెలంగాణ ఏర్పాటు ప్రకటిస్తే ఒక్క నిమిషంలో విలీన లేఖ ఇస్తామంటూ హరీష్‌రావు సెలవిచ్చారు. అలాగే ఎలాంటి షరతులు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. రాష్ట్రం ఇస్తే బేషరతుగా విలీనం చేస్తామని.. రాష్ట్రం కోసం తామంతా ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం అని.. మీ పార్టీ నేత వినోద్‌కుమార్‌ కూడా చాలా ఘనంగా ప్రకటించారు. 

అయితే ఇలాంటి  ప్రకటనతో కూడా ప్రజల్ని నమ్మించడం చాలా కష్టం. పైగా రాష్ట్రం ఇస్తామని సోనియా చెప్పేసిన తర్వాత మీరు తూచ్‌ అంటే పరిస్థితి ఏమిటి? చెప్పిన తర్వాత సోనియా ఇవ్వక తప్పదు.. విలీనం అనేది నెరవేరకుండా వారు భంగపడతారు. అందువల్ల వారు కూడా మిమ్మల్ని నమ్మరు. కనీసం ఇంత గొడవ జరిగిన తర్వాత.. నమ్మకం కష్టం. 

అయితే నాకు ఒక మధ్యేమార్గం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కోసం తెరాస పార్టీ పూర్తి చిత్తశుద్ధితో ఉన్న మాట వాస్తవం. త్యాగాల్లోనే ఇంకాస్త పెద్ద త్యాగం వైపు ఆలోచిద్దాం. మీరు కాంగ్రెసు తిరిగి కోలుకోలేని రీతిలో సన్యాసాస్త్రాన్ని ప్రయోగించండి. తెలంగాణ రాష్ట్రం ఇస్తేగనుక.. మేం రాజకీయ సన్యాసం తీసుకుంటాం. తెరాసను విలీనం చేసేసి.. మేం, మా కుటుంబాలు పూర్తిగా రాజకీయాల్లోంచి తప్పుకుంటాం. అని బహిరంగంగా ప్రమాణపూర్తిగా ప్రకటనలు చేయండి. ప్రస్తుతం అధికార పదవుల్లో ఉన్న మీరు మీ కుటుంబసభ్యులు సహా.. మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా ఇదే తరహా ప్రకటన చేయించేయంది.

త్యాగమే చేయదలచుకున్న తర్వాత.. చిన్నాపెద్దా వ్యత్యాసం ఏముంది? మీరు పదవుల్ని కోరుకునే రకం కాదని నాకు తెలుసు. ఏదో సమీకరణాల పరంగా మీ కుటుంబసభ్యులు పదవులన్నీ దక్కించుకున్నారు తప్ప.. మీకు ఆ యావ లేదని నాకు తెలుసు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన త్యాగమూర్తి మీరు. ఆ ఒక్క షరతును మాత్రం విధించి.. ప్రస్తుతం తెరాస నాయకులు అయిన మీ కుటుంబ సభ్యులు, అనుచరులు అంతా భవిష్యత్తులో ఎన్నడూ రాజకీయ బరిలోకి రాబోమంటూ పత్రాలు రాసిఇచ్చేయండి. (అప్పుడు డబ్బు బేరాలు మాట్లాడుకున్నా.. పెద్దగా తప్పు కిందికి రావు) 

కాంగ్రెసుకు కూడా గత్యంతరం లేని పరిస్థితి ఎదురవుతుంది. మీరు అంత పెద్ద త్యాగం చేసిన తర్వాత ఇవ్వకపోతే కాంగ్రెస్‌ ఈ ప్రాంతంలో మట్టి కరచిపోతుంది. వారు ఆశగా రాష్ట్రం ఇచ్చేస్తే గనుక.. మీ ఆశయం నెరవేరుతుంది. పైగా ఇలాంటి ప్రమాణ పత్రాలు, అఫిడవిట్‌ రూంలో చట్టబద్ధంగా రాసిచ్చేట్లయితే కాంగ్రెస్‌ ప్రకటన వచ్చే దాకా కూడా ఆగాల్సిన అవసరం లేదు. మీరు తక్షణమే.. అనగా ఇప్పటికిప్పుడే.. అలాంటి అఫిడవిట్‌లు ఇచ్చేయవచ్చు. ‘కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే మాత్రమే …’ అనే కండిషన్‌తో మీ రాజకీయ సన్యాసాల గురించి ప్రమాణాలు చేసేయండి. అప్పుడిక తప్పనిసరిగా రాష్ట్రం వస్తుంది.

కాంగ్రెస్‌ మీ ప్రమాణాలను విశ్వసించి, సన్యాసాస్త్రానికి లొంగితే.. ఆశయం సిద్ధించి రాష్ట్రం వస్తుంది. లొంగకపోతే మీ ఉద్యమానికి, మీ పార్టీకి తిరుగులేని ప్రజాబలం సమకూరుతుంది. అలా కూడా మీకు లాభమే జరుగుతుంది. 

ఏమంటారు? 

మరెందుకాలస్యం? కలాలు, పత్రాలు అందుకోండి.

– కపిలముని