కిరణ్ మన ముఖ్యమంత్రి!` అందరికీ తెలుసు.
కిరణ్ మంచి క్రికెటర్ ` చాలా మందికి తెలుసు.
నిజానికి కిరణ్ మన రాష్ట్రంనుంచి తయారైన చాలా మంది మంచి క్రికెటర్లలో ఒకడు. అజారుద్దీన్ తదితరుల సహచరుడు. ఆయన స్వతహాగా మంచి బ్యాట్స్‌మన్. ఒక రంగంలో పరిణతి ఉన్న వారికి ఆ రంగంలో అనుసరించే వ్యూహప్రతివ్యూహాల మీద మంచి పట్టు ఉంటుంది. ఆ జ్ఞానం వారు ఏ రంగంలో కాలు పెట్టినా.. అక్కడ అనుసరించవలసిన వ్యూహప్రతివ్యూహాలను తొందరగా వడిసిపట్టుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలను కూడా క్రికెట్ తరహా వ్యూహాలతోనే ప్రభావితం చేయాలని అనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి స్థానానికి సంబంధించినంత వరకు కిరణ్‌కుమార్ రెడ్డి టెయిలెండర్ కింద లెక్క. టెయిలెండర్‌గా క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌కు రెండే అవకాశాలు ఉంటాయి. ఒకటి.. వికెట్ల వద్ద పాతుకుపోయి.. జిడ్డు ఆడుతూ… ఇన్నింగ్స్ ముగిసే వరకు అవుట్ కాకుండా ఉండడం. రెండు… అఫెన్సివ్ ఆట పద్ధతిని ఎంచుకుని… దూకుడుగా ఆడుతూ… తెలిసీ తెలియకుండా అయినా భారీ షాట్లు కొట్టేసి.. వీలైనన్ని ఎక్కువ పరుగుల్ని రాబట్టడం. మొదటి పద్దతి టెస్టుల్లో ఆడే శైలి అయితే… రెండో పద్ధతి వన్డే క్రికెట్ ఆడే శైలి.
కిరణ్‌కుమార్‌రెడ్డి స్వభావత: టెస్టు బ్యాట్స్‌మెనే. అయితే ఆయన ఇప్పుడు చాలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. వన్డేలో బ్యాటింగ్‌కు దిగిన టెయిలెండర్‌లాగా భారీ షాట్లు కొట్టేస్తా అనుమతి ఇవ్వమంటూ కెప్టెన్ సోనియాగాంధీని అడుగుతున్నాడు. అనుమతి వస్తేగనుక.. తెలిసీతెలియని షాట్లు బాది పారేస్తారు. కొన్ని సందర్భాల్లో అది క్లిక్ అవుతుంది. అంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం దక్కవచ్చు. కొన్ని సందర్భాల్లో.. వికెట్ గిరాటేయడం అవుతుంది. అంటే.. కాంగ్రెస్ ఇన్నింగ్స్ ఈ రాష్ట్రంలో ఇక పరిసమ్తాం అవుతుంది.
అయితే కిరణ్ ఆడదలచుకుంటున్న భారీషాట్లు ఏమిటి…?
మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలన్నది కిరణ్ కల! ఇది చాలాకాలంనుంచి ఉన్న కలే అయినప్పటికీ ఆయనకు సరిగ్గా గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. ప్రస్తుతం మేడంను మళ్లీ దాన్ని గురించే అడుగుతున్నారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేసి అంతా తన మనుషుల్ని పెట్టుకుని ఈ ఏడాదిరోజుల్లో అద్భుతాలు చేసేస్తానని.. మళ్లీ మన పార్టీకి తప్పకుండా విజయం దక్కే పరిస్థితి క్రియేట్ చేస్తానని సీఎం హామీ ఇస్తున్నారు
అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా.. తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని ఆయన అడుగుతున్నారు. తన ఇష్టానుసారం వ్యవహరించే వెసులుబాటు కల్పిస్తే.. అవకాశవాదంతో పార్టీని బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్న వారి ఆట కట్టించి.. తాను విజయం వైపు తీసుకువెళ్తాననేది ఆయన హామీ.
వ్యతిరేకుల మీద వేటు వేయడానికి సర్వాధికారాలు ఉండాలనేది కిరణ్ ప్రధాన కోరిక. వ్యతిరేకులంటే ఇక్కడ పార్టీ వ్యతిరేకులా? తన మీద వ్యతిరేకత ఉన్నవారా? అనేక్లారిటీని ఆయన అధిష్ఠానానికి ఇవ్వదలచుకున్నట్లు కూడా లేదు. నిజానికి సీఎం అయినప్పుడు కూడా కిరణ్ అధిష్ఠానం నుంచి ఇలాంటి ఒక హామీని తెచ్చుకున్నారు. దాని పర్యవసానమే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ‘తన వ్యతిరేకుడి’ని మంత్రిపదవినుంచి పీకేయడం. అయితే అదికాస్తా బెడిసికొట్టింది. అదివరలో వైఎస్‌తో మరీ పెద్ద సాన్నిహిత్యం లేకపోయినప్పటికీ.. కిరణ్ దెబ్బతో అహం గాయపడిన పెద్దిరెడ్డి బాహాటంగానే వైకాపాకు అనుకూలంగా చిత్తూరు జిల్లా రాజకీయాల్ని ప్రభావితం చేయడం ప్రారంభించారు. కేవలం కిరణ్ వ్యతిరేకతతోనే తాను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేస్తున్నానని.. ఆయన నేరుగా ఢల్లీి పెద్దలకే చెబుతున్నారు. వారు కూడా ఏమీ అనలేని పరిస్థితి.
ఇప్పుడు కిరణ్‌కు ఆయన అడుగుతున్నట్లుగా సర్వాధికారాలు కట్టబెట్టేస్తే మళ్లీ ఇలాంటి తలనొప్పులు అనేకం సృష్టిస్తాడేమో అనే భయం కూడా.. అధిష్ఠానానికి ఉంది. ‘మోటారు సైకిలు ఇవ్వునాన్నా.. నేను నడపడం నేర్చుకున్నా.. బజారుకు వెళ్లివస్తా.. ’అని ఎనిమిదో తరగతి కుర్రాడు అడిగితే.. ఒకవేళ వాడు డ్రైవింగ్ నేర్చుకున్నాడనే సంగతి తెలిసిన తండ్రికి కూడా.. మోటార్ సైకిల్ ఇవ్వడానికి భయం భయంగానే ఉంటుంది. ఇప్పుడు అధిష్ఠానం పరిస్థితి కూడా అలాగే డైలమాలో ఉంది. కిరణ్ చెబుతున్న సమీకరణాలు, గణాంకాలు కాగితాల మీద బాగానే కనిపిస్తున్నాయి. వ్యూహాలు ప్రణాళిక ప్రకారం చక్కగానే అమరుతున్నాయి.
అయితే.. కార్యరూపంలో వీటిని సమర్థంగా అమలు చేసి పార్టీని అధికారం వైపు నడిపించేంత సత్తా కిరణ్‌లో ఉన్నదా…
ఆ అనుమానం అధిష్ఠానంలో పుష్కలంగా ఉంది.
అదే అనుమానం.. యావత్తు ప్రజానీకంలో కూడా ఉంది.
– కపిలముని