కేంద్రానికి ఎప్పుడూ ఆశే

ప్రస్తుతం హైదరాబాదు తెలంగాణ చేతిలో వుంటుందా, లేక కేంద్రానికి వెళ్లిపోతుందా అన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ నాయకులు రోజుకొక మాట మాట్లాడుతున్నారు. హైదరాబాదు నగర నిర్వచనం పై కూడా తర్జనభర్జనే. ఆంధ్ర, తెలంగాణ రెండూ…

ప్రస్తుతం హైదరాబాదు తెలంగాణ చేతిలో వుంటుందా, లేక కేంద్రానికి వెళ్లిపోతుందా అన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ నాయకులు రోజుకొక మాట మాట్లాడుతున్నారు. హైదరాబాదు నగర నిర్వచనం పై కూడా తర్జనభర్జనే. ఆంధ్ర, తెలంగాణ రెండూ తగవులాడుకుని చివరకు హైదరాబాదును కేంద్రానికి అప్పగిస్తే యీ పుష్కరకాలం నాటి ఉద్యమం వ్యర్థం కావడమే కాదు, తీరని నష్టాన్ని కూడా తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. గత చరిత్ర పరికిస్తే మహానగరాలను కబళించాలన్న ఆశ కేంద్రానికి గతంలో వుందని కూడా అర్థమవుతుంది. బొంబాయి విషయం తీసుకుందాం.

స్వాతంత్య్రం వచ్చాక భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ ముందుకు వచ్చింది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలన్నీ (విదర్భ, మరాట్వాడా, మహారాష్ట్ర, బొంబాయి) కలిపి బొంబాయి రాజధానిగా సంయుక్త మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడాలని మహారాష్ట్ర ఏకీకరణ్ పరిషత్ డిమాండ్ చేసింది. కాంగ్రెసు పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రాల పునర్విభజనను చేపట్టిన జెవిపి (జవహర్‌లాల్, వల్లభాయ్, పట్టాభి సీతారామయ్య) కమిటీ బొంబాయి రాష్ట్రాన్ని (ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలలో కొన్ని కలిసి వుండేవి) రీఆర్గనైజ్ చేయాలని చెపుతూ బొంబాయిని విడి రాష్ట్రంగా వుంచాలని అభిప్రాయపడింది. ఇప్పుడు హైదరాబాదు గురించి చెపుతున్నట్టే బొంబాయి భిన్నసంస్కృతుల సమ్మేళనమని, కేవలం మహారాష్ట్రులదే అనడానికి లేదనీ, ఆ సంస్కృతి అలా కాపాడాలంటే అది విడిగా కేంద్రపాలనలో వుండాలని వాదించింది. ఇలాటి వాదనల్లో నెహ్రూ అగ్రస్థానంలో వుంటాడు. ఆదర్శవాది కాబట్టి ఆయనకు ప్రాంతీయత అంటే గిట్టదు. అయితే ఈ ప్రతిపాదన బొంబాయి రాష్ట్రంలోని మహారాష్ట్రులకు, గుజరాతీయులకు గిట్టలేదు. దాంతో 1955లో మనందరికి పరిచితమైన ఫజల్ అలీ అధ్యక్షతన మొదటి ఎస్సార్సీ వేశారు. 

తెలంగాణను ఐదేళ్లపాటు విడిగా వుంచి అప్పుడు ఆంధ్రతో కలపాలి అన్న ఫజలాలీ సిఫార్సును ఆంధ్రుల ఒత్తిడికి లొంగి కేంద్రం పట్టించుకోలేదని తెంగాణవాదులు ఆరోపిస్తారు. బొంబాయి వ్యవహారంలో ఎవరు ఒత్తిడి చేశారంటారో కానీ ఆ విషయంలోనూ ఆయన సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదు. ఫజల్ ఆలీ బొంబాయి, విదర్భ అనే రెండు రాష్ట్రాలు ఏర్పరచాలని ప్రతిపాదించాడు. బొంబాయిలో రెండు డివిజన్లని, మహారాష్ట్ర డివిజన్‌లో మరాఠ్వాడా వుండాలని, గుజరాత్ డివిజన్‌లో కచ్, సౌరాష్ట్ర వుండాలని అన్నాడు. విదర్భ విడి రాష్ట్రంగా వుండాలన్నాడు. పరిషత్ దాన్ని వ్యతిరేకించింది. అప్పుడు నెహ్రూ అబ్బే, మూడు రాష్ట్రాలుండాలి – విదర్భ, మరాఠ్వాడాలతో కూడిన సంయుక్త మహారాష్ట్ర, కచ్, సౌరాష్ట్రలతో కూడిన మహా గుజరాత్, బొంబాయి రాష్ట్రం. అది కేంద్రం అజమాయిషీలో  వుండాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాలవారూ అక్కడికి నిర్భయంగా వస్తూ పోతూ వుండాలి అన్నాడు. నెహ్రూ 1955 అక్టోబరులో యీ మాట అనగానే నవంబరులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యీ సలహా భేషుగ్గా వుందంది. 

బొంబాయిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామని ప్రకటించిన నెహ్రూకి వ్యతిరేకంగా 1956 జనవరిలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. యూనియన్ కేబినెట్ మంత్రిగా వున్న సి డి దేశ్‌ముఖ్ (మహారాష్ట్రుడు, మన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గారి భర్త) నెహ్రూ కాబినెట్ నుండి రాజీనామా చేశారు. నెహ్రూ మహారాష్ట్ర వ్యతిరేకి అని ఆరోపించాడు. దాంతో రాష్ట్రమంతా ఆందోళనలు చెలరేగాయి. బొంబాయి వదులుకోం అని మహారాష్ట్రులు, గుజరాతీయులు నిరసనలు చేశారు. సంయుక్త మహారాష్ట్ర వాదనలను మొరార్జీ దేశాయ్ ఖండించాడు. యశ్వంతరావు చవాన్ ఒక ప్రకటన చేస్తూ ‘‘సంయుక్త మహారాష్ట్ర, నెహ్రూల మధ్య ఎంచుకోవాల్సి వస్తే నేను నెహ్రూనే ఎంచుకుంటాను.’’ అన్నాడు. (ఈయన అప్పుడు పోషించిన పాత్రనే నేను యిప్పుడు పోషిస్తా అంటున్నారు జయపాల్ రెడ్డి. వారి భావం ఏమిటో మరి) అల్లర్లలో బొంబాయిలో 27 మంది, అహ్మదాబాద్‌లో 12 మంది పోయారు. అయినా నెహ్రూ చలించలేదు. 1956 జూన్‌లో బొంబాయిని ఐదేళ్లపాటు కేంద్రపాలితంగా ప్రకటించాడు. మహారాష్ట్రకు రాజధానిగా వుండదన్నాడు. బొంబాయి, మహారాష్ట్ర, గుజరాత్ మూడు రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టు, పబ్లిక్ సర్వీసు కమిషన్లను ప్రకటించాడు.

దీనిపై మళ్లీ విపరీతంగా ఆందోళనలు జరిగాయి. చివరకు భరించలేక కేంద్రం దిగి వచ్చి ‘సరే, బొంబాయిని కేంద్రం చేతిలోకి తీసుకోం కానీ ద్విభాషా రాష్ట్రంగానే వుంచుతాం’ అని ప్రకటించి, 1956 నవంబరు 1 న బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. అప్పటిదాకా విడిగా వున్న సౌరాష్ట్ర, కచ్, విదర్భ దానికి కలిపారు. ‘ఇది బాగా లేదు, తెలుగువాళ్లకు విడిగా రాష్ట్రం యిచ్చారు కదా, మా గురాతీయులకూ వేరే యివ్వండి’ అని గుజరాత్‌లో ఆందోళన చేస్తూ వచ్చారు. కేంద్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికలలో కాంగ్రెసుకు పెద్దగా సీట్లు రాకపోవడంతో రాష్ట్రం విడగొట్టక తప్పదని వారికి అర్థమైంది. ‘‘మీరే విడిపోతామంటున్నారు కాబట్టి కొత్త రాజధాని మీరే కట్టుకోవాలి. రూ.50 కోట్లు యిస్తాం. బొంబాయి మహారాష్ట్రేక వుంచేస్తాం’’ అంది కేంద్రం. గుజరాతీలు బొంబాయి మాదే అంటూ పోట్లాడారు. కానీ కుదరలేదు. ‘విభజన కోరినవారికి రాజధాని దక్కదు, ఆంధ్రులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినప్పుడు వారు మద్రాసుకై ఎంత ఆందోళన చేసినా యివ్వలేదు కదా’ అంటూ గుజరాతీల వాదనను తిరస్కరించారు. జన్మతః మహారాష్ట్రీయుడైన ఆంబేడ్కర్ కూడా గుజరాతీల వాదన తిరస్కరించాడు.

దీనివలన మనం గమనించవలసిన అంశాలు – 1. విడిపోతామనేవాళ్లకు రాజధాని యివ్వడం జరగలేదు. అసాంలోని షిల్లాంగ్ యిచ్చారు కానీ అది పెద్ద నగరమూ కాదు, దానిలో భిన్న సంస్కృతుల ప్రజలూ లేరు. మద్రాసు, బొంబాయి, హైదరాబాదు వంటి నగరాలతో దానికి పోలికే లేదు.

2. వివాదం వచ్చినపుడు యిలాటి నగరాలను తన చేతిలోకి తీసుకోవాలని కేంద్రం ఎప్పుడూ ప్రయత్నిస్తుంది

3. హైదరాబాదు విషయంలో కేంద్రం యిప్పుడు చేస్తున్నది అదే. దీన్ని అడ్డుకోవాలంటే తెంగాణ నాయకులు విపరీతంగా కృషి చేయాలి. బొంబాయి విషయంలో అది కేంద్రం చేతిలోకి వెళ్లడాన్ని గుజరాతీయులు కూడా అడ్డుకున్నారు. హైదరాబాదు విషయంలో అది యుటీ అయితే బాగుండునని సీమాంధ్ర నాయకులు కొందరు కోరుకుంటున్నారు. అందువలన వారి సహకారం వుండదు. తెలంగాణ ఉద్యమకారులు ఒంటరిగా, మరింత దృఢంగా పోరాడవలసి వుంటుంది.

కేంద్రం అజమాయిషీ స్వరూపస్వభావాల గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ కెసియార్ ఒక్కరే గళం విప్పుతున్నారు.  తెలంగాణ కాంగ్రెసు నాయకులెవరూ ఢిల్లీ నాయకులను అడగకుండా స్తబ్దంగా వుండడం విచిత్రంగా వుంది. ఈ పొరపాటుకు వారు భావితరాలకు సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుంది. 

ఎమ్బీయస్ ప్రసాద్