బరిలోకి పులి

మహాభారతంలో శల్యుడి కథ తెలుసా? తెలిసిన వారికి కూడా కేవలం కర్ణుడికి రథసారధిగా మాత్రమే తెలుసు! అదికూడా ‘శల్యసారథ్యం’ అనే నెగటివ్ అర్థాన్ని ఇచ్చే పదం ద్వారా మాత్రమే తెలుసు. కానీ పాజిటివ్ యాంగిల్…

మహాభారతంలో శల్యుడి కథ తెలుసా? తెలిసిన వారికి కూడా కేవలం కర్ణుడికి రథసారధిగా మాత్రమే తెలుసు! అదికూడా ‘శల్యసారథ్యం’ అనే నెగటివ్ అర్థాన్ని ఇచ్చే పదం ద్వారా మాత్రమే తెలుసు. కానీ పాజిటివ్ యాంగిల్ తెలుసుకుంటే, శల్యుడు స్వతహాగా, మహా పరాక్రమ బలసంపన్నుడు. పాండవులకు అత్యంత ఆప్తుడు (నకుల సహదేవులకు స్వయాన మేనమామ). కురుక్షేత్ర సంగ్రామంలో చివరిదైన 1వ రోజున కౌరవ సేనలకు సేనానిగా వ్యవహరించిన, ఓడిపోయే చివరిరోజు కూడా పాండవసేనలను గగ్గోలు పెట్టించినంతటి మహాబలుడు. 

శకుని కుటిలనీతి గొప్పదనం అదే. పాండవుల దరికి ప్రయాణమై వెళుతున్న శల్యుడికి మార్గమధ్యంలోనే రాచమర్యాదలు రుచిచూపించి.. తన శిబిరంలో ఉండేలా వరం పొందుతాడు సుయోధనుడు. అపారమైన ఆయన సేనలను కూడా వాడుకున్నాడు. యుద్ధంలో శత్రువుతో తలపడాలంటే.. కేవలం మన లాలను సమీకరించుకోవడమే కాదు, ప్రత్యర్థి బలాలను కూడా మనవిగా మార్చుకోవడం ఒక యుద్ధనీతి. 

జయాపజయాల ప్రస్తావనలు అప్రస్తుతం. 

అత్యంత విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. రాష్ట్ర రాజకీయ యవనికపై భారీ మార్పు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. మహాభారత యుద్ధంలో శల్యుడిలాగా… కేవలం నటుడిగానే కాకుండా మంచి మనిషిగా తిరుగులేని  ప్రజాదరణ ఉన్న పవన్ కల్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయనను హైజాక్ చేసి తమకు అనుకూలంగా వాడుకునేందుకు ఒక కౌరవబృందం పావులు కదుపుతోంది. ఒక శకుని తెర వెనుక ఉండి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలుదఫాల మంతనాలు పూర్తయ్యాయి. ప్రజల కోసం ప్రగతి కోసం పార్టీ పెట్టాలంటూ పవన్‌కు కొందరు పురెక్కిస్తున్నారు. 

2014 లో ఆంధ్రావనిలో రాజకీయ కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోంది. ధర్మవిజేతలుగా నిలిచే పాండవులు ఎవరో ఇంకా లెక్క తేలలేదు. కానీ, శల్యుడి లాంటి పరాక్రమ బలసంపన్నుడైన పవన్ కల్యాణ్‌ను హైజాక్ చేసి వాడుకోజూసే కురుకూటమి ఎవ్వరో సంకేతాలు అందుతున్నాయి. వారి పనుపున వ్యూహరచనా దురంధరుడైన శకుని తానే సూత్రధారిగా సకలం నడిపిస్తున్నట్లు తెలిసి వస్తోంది. ఎవరా కౌరవులు? ఎవరా శకుని? పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం ముగింపు సైతం శల్యుడి దృష్టాంతమే అవుతుందా? కొత్త కురుక్షేత్ర విలువల్ని ప్రతిష్ఠిస్తాడా? అనేది.. తెలుసుకోవాలంటే.. గ్రేట్‌ఆంధ్ర అందిస్తున్న సవివర కథనంలోకి వెళ్లాల్సిందే… 

‘ఇప్పటికి కూడా పవన్‌కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టకపోతే గనుక.. ఆయన ఒక పెద్ద మూర్ఖుడు కింద లెక్క’ అని రాంగోపాల్ వర్మ ట్వీటిన విషయం పెద్ద గొప్పేమీ కాదు. ఆ మాటకొస్తే ఆయనది ‘మూర్ఖప్రేమ’ (వైరభక్తి లాంటిది). ఎందుకంటే.. ఒక్క సినిమా అపరిమితమైన విజయాన్ని నమోదు చేసిందని ఒక నటుడు రాజకీయ పార్టీని స్థాపించడం అనేది వివేకవంతమైన నిర్ణయమేనా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. జీవితంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఓటువేసిన రాజకీయ అనుభవం శూన్యుడు గనుక.. రాంగోపాల్‌వర్మ అలా అని సలహా ఇస్తుండవచ్చు. కానీ, రాజకీయ పార్టీ స్థాపించడానికి సినిమా విజయం ప్రాతిపదిక ఎన్నటికీ కాజాలదు. అంటే దాని అర్థం పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించ లేడని కాదు. ఆయన స్థాపించగలడు. ఎందుకంటే కేవలం సినిమా జయాపజయాలతో నిమిత్తం లేని, ప్రమేయం లేని ప్రజాదరణ పవన్ కల్యాణ్ సొంతం. ఆయన పాత్రలు కావొచ్చు ప్రవర్తన కావొచ్చు. వ్యక్తిగా ఆయనలో ఉన్న  మానవీయ, సామాజిక కోణాలు..  మానవ అనుబంధాలు, సంఘహితం పట్ల ఆయన దృక్పథం కారణం కావొచ్చు.. మూలాలు ఏవి అయినప్పటికీ.. పవన్ కల్యాణ్‌కు యావత్తు రాష్ట్రంలోని జనసామాన్యంలో విసృ్తతమైన ప్రజాదరణ ఉన్న మాట వాస్తవం. ఆయన సినిమాలను చూసే వయోతరగతికి చెందిన వారిలో మాత్రమే కాదు. వారికంటె పెద్ద, ఇటు చిన్న వారిలో కూడా పవన్ కల్యాణ్ అంటే ఎందుకో తెలియని ఒక అభిమానం, ఒక గౌరవం ఉన్నాయి. అవి రాజకీయంగానూ బలమైన పునాదిని నిర్మించగలుగుతాయి. 

ఏతావతా, పవన్ కల్యాణ్ పార్టీ పెడితే బాగుండునని కోరుకుంటున్నది.. రాంగోపాల్ వర్మ ఒక్కడే కాదు.. సంసృ్కతంలో ‘రామ:’ ఏకవచనం అయితే ‘రామో’ అన్నది ద్వివచనం అయినట్లుగా..  రామూతో పాటూ మరొకరు కూడా ఉన్నారు. జనంలోనూ లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. 

సరిగ్గా ఈ వాతావరణమే, ఇప్పుడు రాజకీయ శక్తులు కొన్ని పవన్ వైపు దృష్టి సారించడానికి కారణం అవుతున్నది. పవన్‌లో అంతర్గతంగా ఉన్న ఆ ప్రజాబలాన్ని ‘వెలికితీయడం’ అనే మిష మీద ‘తాము వాడుకోవడం’ ఎలా? అనే కోణంలో కసరత్తు చేస్తున్నాయి. పవన్ మీద ప్రేమానురాగాలను కురిపిస్తూ… లోలోన తామాశించే వక్రప్రయోజనాలు ఈడేర్చుకోవడం ఎలా అనే వ్యూహరచన  జరుపుతున్నాయి.

శూన్యత ఏర్పడుతున్న వేళ…
మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అనుభవజ్ఞులు అందరూ ఒక మాట అన్నారు. ఆయన పార్టీ పెట్టడానికి అది అనువైన సమయం కాదని అభిప్రాయ పడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా.. ‘చిరంజీవి పార్టీ పెట్టాలనుకుంటే స్వాగతిస్తాం. మంచి నిర్ణయమే. కానీ రాజకీయంగా శూన్యత ఉన్నప్పుడు కొత్త పార్టీలకు మనుగడ ఉంటుంది. ఇప్పుడు శూన్యత లేదు.’ అనే మాట చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి పరిస్థితుల్ని కూడా ఆయన పోల్చిచెప్పారు. ఆ హితవచనాలేవీ చిరంజీవి చెవికెక్కలేదు. ఆయన రాజకీయ మౌలిక సిద్ధాంతాలను తోసిరాజని కేవలం తన కరిష్మాతో చక్రం తిప్పేయగలనని నమ్మి బొక్కబోర్లా పడ్డారు.

అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు రాష్ట్రంలో.. ప్రత్యేకించి సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ శూన్యత ఏర్పడబోతున్నది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని నాయకులు కాంగ్రెస్ అనే పేరును పలకాలంటేనే భయపడిపోతున్నారు. ‘ఎందుకా కాంగ్రెసులో ఉండడం.. డిపాజిట్లు పోగొట్టుకోడానికా…’ అంటూ వెటకారంగా ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. ఏదో ఒక పార్టీలోకి జంప్ కావడం.. అథమపక్షం తనకోసం తనే ఒక బుల్లి పార్టీని స్థాపించుకోవడం మాత్రమే మార్గాంతరం అనే స్థితికి వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వైకాపాలోకి జంప్ చేశారు. 

కానీ వైకాపా అనేది పుష్పకవిమానం కాదని మనం తెలుసుకోవాలి. కాంగ్రెసు నుంచి వెళ్లదలచుకున్న వారందరూ వస్తామని అంటే అక్కడ బెర్తులు ఖాళీ కూడా ఉండవు. పైగా స్థానికంగా తమతమ నియోజకవర్గాల్లో ఉండే సమీకరణాల దృష్ట్యా వైకాపాలోకి ‘వెళ్లలేని’ స్థితి కూడా కొందరికి ఉంటుంది. అలాగే.. తెదేపా మెరుగైన ప్రత్యామ్నాయంగా భావించేవారు కూడా కొందరు ఉండవచ్చు. ఈ రెండు పార్టీల్లోకి వెళ్లలేని వారు కూడా అనేకులు. కారణాలు వేర్వేరుగా ఉండవచ్చు. 

ఇప్పుడు మన రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడుతోంది. కాంగ్రెస్ పార్టీ తమకు తాము సమాధి నిర్మించుకుని.. మరో కొత్త పార్టీకి చోటు కల్పించనున్నది. ఆ చోటు ఎవరికి? ఎవరిది?

పక్క దుకాణం ఖాళీ అయితే.. అందులో తన వ్యాపారానికి ఇబ్బంది లేని, కనీసం అనుకూలంగా ఉండగల వ్యాపారాన్ని సన్నిహితులతో మొదలుపెట్టించజేసే … వ్యాపారాత్మక తెలవితేటలను కొందరు నాయకులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. పవన్‌తో పార్టీ పెట్టించి.. ఆ శూన్యతను భర్తీ చేస్తే.. కొన్ని కోణాల్లోంచి అది తమకు లాభిస్తుందనేది అంచనా. 

‘యూ ఆర్ వెల్‌కమ్ పవన్…!’
ఈ రాష్ట్రం నిన్ను ఆహ్వానిస్తోంది. ‘యూ ఆర్ వెల్‌కమ్ పవన్…!’ అన్నది ఈ పవర్‌స్టార్‌కు కొందరు ప్రముఖుల నుంచి ఇటీవలి కాలంలో తరచుగా వినిపిస్తున్న మాట. రాజకీయ కింగ్‌మేకర్‌గా పేరున్న మీడియా అధిపతులు, రాజకీయ దళపతులు ఇప్పుడు పవన్ కల్యాణ్ ను ప్రేరేపిస్తున్నారు. నిత్యం ఉషోదయాన సత్యాన్ని నినదించే ఒక మీడియా అధినేత, మెరుగైన సమాజంకోసం పరితపిస్తూ ఉండే మరో మీడియా అధినేత.. ఇలా… తమ చుట్టూ అనునిత్యం ఒక ‘తటస్థ, ప్రగతి కాముక’ ముద్రను కాపాడుకుంటూ ఉండే ప్రముఖులు కొందరు పవన్ కల్యాణ్ మీద దృష్టి పెట్టారు. పవన్‌లో రాజకీయ స్ఫూర్తిని ఉద్దీపింపజేయడానికి నడుం బిగించారు. 

ఈ ప్రయత్నాల పర్యవసానంగా.. మీడియా మొఘల్ కోటలో కూర్చుంటే పవన్ కల్యాణ్ ఆయన వద్దకు వెళ్లి రెండు దఫాలుగా చర్చోపచర్చలు సాగించినట్లు సమాచారం. జాతి ఇప్పుడు కొత్త శక్తి కోసం, కొత్త స్ఫూర్తి కోసం, ప్రగతి దిశానిర్దేశం చేయగల కొత్త వ్యక్తి కోసం చూస్తున్న అవసరాన్ని సదరు మీడియా మొఘల్ పవన్ కల్యాణ్‌కు నూరిపోశారు. ‘వెనుక ఉండి’ నడిపించడంలో గల తమ అపారఅనుభవం వనెె్నకక్కినదే గనుక.. ప్రత్యేకంగా వివరించకుండా.. తాము వెన్నంటి నిలుస్తామంటూ పవన్‌లో ఏమూల అయినా కొన్ని శంకలు సంశయాలు ఉంటే వాటిని పటాపంచలు చేసే ప్రయత్నం కూడా చేశారు. 

పవన్ కల్యాణ్ ఇప్పటికి రెండు పర్యాయాలు ఆయనతో భేటీలకు హాజరయ్యారు. పెద్దాయన పిలుపును మన్నించి వెళ్లకుంటే మన్నన కాదన్న గౌరవం తప్ప.. పవన్‌లో మాత్రం స్వతహాగా ప్రస్తుతానికి రాజకీయాసక్తి లేనేలేదని అభిజ్ఞ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఆయన ఒద్దంటున్నప్పటికీ, రా అవసరాల దృష్ట్యా.. నీ ఎంట్రీ మాత్రమే తగు పరిష్కారం.. అంటూ అవతలి నుంచి ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 

‘దళపతి’ గంటా
పవన్ కల్యాణ్ తరఫున రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు దళపతి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మీడియా మొఘల్ వద్దకు, నెంబర్ 1గా భావించుకునే ఛానెల్ అధిపతుల భేటీకి పవన్‌ను తీసుకువెళుతున్నది కూడా గంటానే అని సమాచారం. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాలనే ఆలోచనను గంటా బహుధా సమర్థిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఆకాంక్ష కార్యరూపం దాలిస్తే గనుక.. తాను వెనకుండి, అవసరమైతే ముందుండి అన్నీ తానై చూసుకుంటానని కూడా పవన్ కు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

గంటా శ్రీనివాసరావు పవన్ తరఫున కీలక పాత్ర నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకించి సీమాంధ్రలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సంక్షోభం ఏంటి? దాని స్థితి గతులు ఎలా ఉన్నాయి. ఏ పార్టీల నుంచి ఎందరు నాయకులు సిటింగ్ ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయం పై స్పష్టత లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు. వారిలో ఎందరు నాయకులు ‘పవన్ బ్రాండ్’ కూడా తోడైతే మళ్లీ విజయం సాధించగల స్థితిలో ఉన్నారు. రమారమిగా ఎన్ని సీట్లలో కొత్త పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నది లాంటి అనేకానేక రాజకీయ గణాంకాలను రూపొందించి.. కాగితాల మీద నివేదికలను తయారుచేసి ఆయన పవన్ కల్యాణ్‌ను ఒప్పించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

విశాఖకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు… గతంలో తెదేపా నాయకుడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు.  ఆ పార్టీ విలీనం కావడంతో కాంగ్రెసులోకి వచ్చి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. విభజన నిర్ణయం తరువాత మారిన సినేరియోలో తన వెంట పీఆర్పీకి చెందిన ఎమ్మెల్యేలు మరో ఏడుగురిని కూడా వెంటబెట్టుకుని తెదేపాలో చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా ఆ నడుమ వార్తలు కూడా వచ్చాయి. అయితే వారే కాకుండా.. ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు.. ‘మీరు పార్టీ పెడితే మీ వెంట నడుస్తా’రంటూ, గంటా పవన్‌కు నూరిపోస్తున్నట్లు సమచారం. ప్రేరేపణ అందించే పెద్దలతో భేటీకి స్వయంగా గంటా కూడా పవన్ వెంట వెళ్లి హాజరైనట్లు తెలుస్తోంది.

కులబలం ఒక ప్రధాన హేతువు
పవన్‌ను పార్టీ పెట్టమని ఉద్బోధ చేస్తున్న పెద్దలయినా, ‘పెట్టేద్దాం’ అంటూ ప్రోత్సహిస్తున్న చిన్నలైనా.. అందరూ ఏకరీతిగా చూపిస్తున్న ప్రధానమైన బలం కులం. రాష్ట్రంలో కాపు కులస్తులకు ఒక స్వతంత్ర రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కావాలనే వాంఛ వారిలో బలం ఏర్పడుతోంది. ఇటీవల బొత్స సత్యనారాయణ కూడా అల్ప సంఖ్యాకులైన రెండు కులాలేక ఈ రాష్ట్ర అధికారం శాశ్వతమా అంటూ ఆవేదన వ్యక్తంచేయడానికి కూడా హేతువు ఇదే. ఆయన సొంత పార్టీ పెట్టేంత సీన్ లేదు గానీ..  ఆ కారణాలను చూపించి పవన్‌ను ప్రేరేపిస్తున్న వారు.. ఆయనను ముందుకు నెడుతున్నారు. కాపుల్లో తెదేపా, కాంగ్రెస్ రెండు పార్టీల్లోనూ సమానమైన బలం ఉంది. వైకాపాలోనూ సహజంగా కొందరున్నారు. తెదేపాలోని వారు.. ఆ పార్టీ సొంత బలమే కాగా, కాంగ్రెసులో ఉన్న వారు మెజారిటీ చిరంజీవి పుణ్యమాని ఇటు షిఫ్టయిన వారు. ఇప్పుడున్న (విభజన అనంతర) పరిణామాల్లో ఏ పార్టీ చిత్తశుద్ధిని కూడా నమ్మలేని ప్రజలు (కాపుల సహా) వారికి బుద్ధి చెప్పే యోచన చేస్తున్నారన్నది నిజం. 

అసలే కుప్పకూలుతున్న కాంగ్రెస్‌లోంచి పవన్ అనే ఒక ప్రబల శక్తి ఈ కులాన్ని మైనస్ చేస్తే గనుక.. ఆ పార్టీలోని మిగిలిన కులాల వారు కూడా ‘జై పవన్’ అనక తప్పని పరిస్థితి వస్తుందని కూడా కొందరు చెబుతున్నారు. 

అంతర్ముఖుడిలో అంతర్మధనం
తాను తనంతగా ఒక పార్టీ పెట్టడం అనే ప్రతిపాదన పట్ల పవన్ కల్యాణ్ స్వతహాగా అయితే విముఖంగానే ఉన్నారు. ఒకవైపు తను పార్టీ పెట్టడం అనేది జాతికి అవసరం అని ప్రేరేపిస్తున్న పెద్దల మాటలు, పార్టీ పెడితే.. మనదే అధికారం అంటూ ఊదరగొట్టేస్తున్న సహచరుల ఒత్తిడి పవన్ మీద పెరుగుతున్నాయి. సహజంగా అంతర్ముఖుడు అయిన పవన్ కల్యాణ్ ఈ ఒత్తిడితో అంతర్మధనానికి గురవుతున్నారు. 

అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి తనలోని ఉత్సాహం, అందులో క్రియాశీలంగా వ్యవహరించిన తీరు, ఆ పార్టీ తన ఆశలను, తనతోపాటుగా ఆశలను పంచుకున్న పెంచుకున్న లక్షల మంది తమ్ముళ్ల ఆశలను ఎలా కూల్చేసినది… ఈ వ్యవహారాలు అన్నీ ఆయన కళ్ల ముందు మెదలుతున్నాయి. ఇప్పుడు తానే సింగిల్‌గా ఇంత బాధ్యతను మోయగలనా అనేది ఆయనలోని అంతర్మధనానికి హేతువు. ఇప్పుడు వెనుకనుంచి అంతా మేం చూసుకుంటాంలే నువ్వు ముందుకు ఉరుకు అని అంటున్నవాళ్లూ… ఇప్పుడు ముందు ఉంటూ నీ ప్రస్థానానికి మేం బాటలు తీరుస్తాం అంటూ నమ్మబలుకుతున్న వాళ్లూ ఎవ్వరూ శాశ్వతం కాదనే వరకు ఆయన పూర్తి సృ్పహతోనే ఉన్నారు. 

తానంటూ ఒక రాజకీయ పార్టీ పెట్టడం అనేది అన్నయ్య చిరంజీవి మీద తిరుగుబాటు బావుటా అవుతుందా? ఆయన ఆగ్రహానికి పాత్రమవుతుందా? అన్నయ్యతో తన/తమ అనుబంధానికి శాశ్వతంగా తెగతెంపులు కాగలదా? అనే కోణంలో కూడా ఆయన అనుమానాలు సాగుతున్నట్లు సమచారం. అదే సమయంలో.. ఈ కసరత్తు ప్రతిపాదనల గురించి మరో అన్నయ్య నాగేంద్రబాబు మాత్రం తిరస్కరిస్తున్నారుట. గంటా వంటి వారు పవన్‌కు ‘ఒక మాట చెప్పాల్సిందిగా’ ఆయన వద్దకు వెళ్లినప్పుడు.. ‘మా అన్నయ్యకు వ్యతిరేకంగా మేం ఏమీ చేయం’ అని మాత్రమే చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెసులో చిరు పరిస్థితి కూడా అంత బాగా లేకపోవడం కూడా పవన్‌లో రాజకీయాలపై కసి పెరగడానికి ఒక కారణం కావచ్చునని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.

అంతిమంగా , నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం పవన్ కల్యాణే. ‘నా మీడియా నిన్ను లేపి నిలబెడుతుంది’ అని ఇవాళ ప్రతిపాదిస్తున్న వారు తమ చరిత్రలో ఎన్నెన్ని సార్లు తమ మాట ఫిరాయించిన వ్యక్తులో పవన్‌కు తెలియని విషయాలు కాదు. అందుకే పవన్ ‘వారు చెప్పారని కాకుండా.. వారు ఉన్నారనే భరోసాతో కాకుండా.. ఆ ప్రతిపాదన తనకు నచ్చితే మాత్రమే అనుకూల నిర్ణయం తీసుకోవా’లనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు.

‘ఆపరేషన్ ఆహ్వానం’ వెనుక వక్రవ్యూహాలేంటి…
అందరూ కలిసి ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను రాజకీయ బరిలోకి ఆహ్వానిస్తున్నారు బాగానే ఉంది. కానీ చాలా మంది ఆయన అభిమానులు ‘ఏమిసారూ.. పవన్‌ని బురదలోకి లాగేస్తున్నారు. ఒకసారి అంటించుకుని కడిగేసుకున్నాడు కదా’ అని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. వారి భయాలు కూడా నిజమే! ఎందుకంటే  ఈ ‘ఆపరేషన్ ఆహ్వానం’ అనేది అంత రుజుమార్గంలో జరుగుతున్నది కాదు. దీని వెనుక అనేక వక్రవ్యూహాలు మిళితమై ఉన్నాయి. వాటి క్రమం ఇలా ఉంది… 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాపు కుల ముద్ర వేసుకునేందుకు తహతహ లాడుతోంది. ఒక పెద్ద సామాజికవర్గం తమదైతే ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందని.. రెడ్డి సామాజిక వర్గం జగన్‌లో తమ ఆశలను చూసుకుంటుండగా, కమ్మ సామాజిక వర్గం 2009లాగా పొరబాటు చేయకుండా పూర్తిస్థాయిలో చంద్రబాబువైపు పోలరైజ్ అవుతుండగా.. అనాధలా మారుతున్న కాపు సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవడానికి ఉత్సాహపడుతున్నది. చిరంజీవి, బొత్స, పళ్లంరాజు, కన్నా.. తదితర అనేకులకు లభిస్తున్న ప్రాధాన్యాలను బట్టి చూస్తోంటే.. ఆ విషయం తేలుతుంది. పైగా ఆ కులానికి కూడా ప్రత్యామ్నాయం లేదు. 

అయితే  ఆ కోణంలోంచి కాంగ్రెసు స్థిరమైన బలాన్ని సమీకరించుకోకుండా చెక్ పెట్టడం ఒక వక్రవ్యూహం. కాపు బలాన్ని మొత్తం పవన్ ఇమేజి కిందికి తెచ్చి.. ఆయన పార్టీకి అండగా మార్చాలనేది తెర వెనుక ఉన్న వ్యక్తుల వక్రవ్యూహాల్లో కీలకమైనది. అప్పుడు ప్రధానంగా కాంగ్రెస్‌ను ఈ రాష్ట్రంలో శాశ్వతంగా బలహీనం చేయడం సాధ్యం అవుతుంది. 

అలాగే తమ మాట విని పవన్ పార్టీ పెట్టడం అంటూ జరిగితే గనుక.. ఎన్నికల వేళ ఆసన్నం అయ్యేవరకు ఆయనను బాగా ప్రోత్సహించి.. సరిగ్గా ఎన్నికలు, అభ్యర్థులు లాంటి తరుణం ఆసన్నం అయినప్పుడు.. ‘రాష్ట్రంలో దుష్టకాంగ్రెస్‌కు, అవినీతి వైకాపాకు సమాధి కట్టాలంటే వేరే ప్రత్యామ్నాయం లేదు’ అనే నినాదంతో తెలుగుదేశం తో పొత్తు పెట్టుకునేలా ఏర్పాటు చేయాలనేది వారి వక్రవ్యూహాల్లో మరో అంచె. ‘తెలుగుదేశంతో పవన్ పొత్తులు’ అనేది ఇప్పుడు ఆయనను ఆహ్వానిస్తున్న వారి అసలు కోరిక. ఆ సమయం వచ్చినప్పుడు చిన్న మరియు కొత్త పార్టీ గనుక.. పవన్‌కు పరిమిత సీట్లను కేటాయించి.. ఎట్టి పరిస్థిల్లోనూ చంద్రబాబును తిరిగి సీఎం పదవి మీద అధిష్ఠింపజేయాలనేది అసలు వ్యూహం. దీని గురించి పవన్ కల్యాణ్  దృష్టికి ఎవరైనా తీసుకువెళ్లారో లేదో మాత్రం తెలియడం లేదు. 

మొత్తానికి పవన్‌ను రాజకీయ నేతగా చేసే ప్రయత్నం మాత్రం ముమ్మరంగా జరుగుతున్నది.

వంచితుడా? విజేతా?
అంతిమ ఫలితం ఎలా ఉండేలా పవన్ పరిణామాల్ని నిర్దేశిస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం. 

‘శల్యసారథ్యం’ అనే పదం కలిగించే దురభిప్రాయాన్ని పక్కన పెడితే.. భారతంలోని గొప్ప హీరోలో ఒకరైన శల్యునికి పవన్ కల్యాణ్‌కు చాలా సారూప్యత ఉంది. పవన్ కల్యాణ్ గురించి ప్రపంచానికి తెలిసింది ఒక షేడ్ మాత్రమే! ఆయన కోపిష్టి అని, అన్నభక్తితో అతిగా స్పందిస్తుంటాడని, ఎవరినీ లెక్కచేయడని.. ఇలాంటివి ప్రచారంలో ఉన్న కొన్ని సంగతులే అందరికీ తెలిసినవి. కానీ పవన్ కల్యాణ్‌లో ఇంకా అనేక షేడ్స్ ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆ సకల షేడ్స్‌ను వాడేందుకు అవకాశం ఉంటుంది. 

రాజకీయ పరమపద సోపానపటంలో ప్రేమగా ఆయన కోసం వేచి ఉన్న (పొంచి ఉన్న) పాములు అనేకం ఉన్నాయనేది నిజం. వాటి విషకోరలకు చిక్కి తాను ఒక వంచితుడుగా మారుతాడో.. లేదా, తాను ‘ప్రజ్ఞానిధే గావున’ మడమతిప్పకుండా సాగుతూ, ‘ప్రారబ్ధార్థము లుజ్జగింపకుండా’ ప్రజల ఆశలకు చుక్కానిగా నిలుస్తూ.. ‘ధృత్యున్నతోత్సాహియై’ కంటకప్రాయమైన విఘ్నాలను కాలరాస్తూ ముందుకెళ్లి… ధీరోదాత్తుడైన , భరృ్తహరి సుభాషిత వాక్యానికి ప్రతీక అయిన విజేతగా నిలుస్తాడో కాలపరీక్షలో నిగ్గుతేలుతుంది!

కపిలముని