మహా మొనగాడు …గ్రహములు అనుకూలించినచో!

‘లేస్తే నేను మనిషిని కాను’ అంటూ ఆయన తీవ్రంగా గర్జిస్తారు.  కానీ పూనిక వహించేలోగా తుప్పల్లో పొద్దుగుంకిపోతుంది.  Advertisement ‘ఆయన అపర చాణక్యుడని, రాజకీయ చతురోపాయ శాస్త్ర పారంగతుడని.. అభినవ రాజనీతికి రూపశిల్పి అని……

‘లేస్తే నేను మనిషిని కాను’ అంటూ ఆయన తీవ్రంగా గర్జిస్తారు.  కానీ పూనిక వహించేలోగా తుప్పల్లో పొద్దుగుంకిపోతుంది. 

‘ఆయన అపర చాణక్యుడని, రాజకీయ చతురోపాయ శాస్త్ర పారంగతుడని.. అభినవ రాజనీతికి రూపశిల్పి అని… పరిపాలనా దురంధరుడని.. ఇంకా అలాంటివి అనేకం అనుకోమని…’ గల్లీలనుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మీడియా సంస్థలు పదేపదే కోళ్లయి కూస్తుంటాయి. అయితే ఆ కీర్తి ప్రభలు మీడియాలోనే! ఆయన ఏలుబడిలోని జనం నోళ్లలో మనకు వినిపించవు. 

రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో… తిమ్మిని బమ్మి చేసేయడంలో తిమ్మరుసు తలదన్నగల ధీమంతుడని ఆశ్రితులు, వందిమాగధులు ప్రస్తుతిస్తూ ఉంటారు గానీ.. ‘వక్రవ్యూహాల, తరణోపాయాల’ ఆసరా లేకుండా అసలు ఆయన ప్రజా కోర్టులో ఓట్ల సందడి వేళ తనను తాను నిరూపించుకున్న సందర్భం ఒక్కటి లేదు. 

తన నీడను కూడా తాను విశ్వసించని నిత్య శంకిత శూరుడు ఆయన అని తరతరాలుగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. కానీ, నవీన రాజకీయ నిర్వచనాల్లో ఆయన ‘తన మీద తనకే విశ్వాసం లేని’ భీరుడని… పరనిందల ప్రల్లదనాలను తనలో పిరికితనానికి ముసుగుగా కప్పుకున్న వీరుడని… గ్రహములన్నీ అనుకూలించి ప్రత్యర్థులు పతనమైపోతే గనుక తనను ఓడిరచగల వారు లేరంటూ తొడగొట్టి సవాలు విసరగల ధీరుడని.. గ్రేట్‌ఆంధ్ర విశ్లేషిస్తోంది. అనేవారు, అనుకునే వారు, ప్రచారం చేసేవారు, ప్రస్తుతించే వారు… సకలురూ ఆయనను ‘మహా మొనగాడు’ అని గుర్తిస్తారు. ఆయన స్వీయ అంతరంగం మాత్రం.. ‘గ్రహములు అనుకూలించినచో’ అని అనుకుంటూ టైటిల్‌కు ఒక ట్యాగ్‌లైన్‌ తగిలిస్తుంది. 

ఆయన నారా చంద్రబాబునాయుడు. 

సుదీర్ఘ కాలం ఈ తెలుగు నేలను ఏలిన ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా ఉన్నా.. ప్రజల పక్షాన తానున్నాననే భరోసాను సదరు ప్రజలకు కల్పించలేని నిష్క్రియాపరుడు. ముఖ్యమంత్రి స్థానం అందుకోవడానికి పాదయాత్ర గేట్‌పాస్‌ అని భావిస్తూ, ప్రజాసమస్యలు సమసిపోవడానికి తాను సీఎం కావడమొక్కటే జిందా తిలిస్మాత్‌ అని జనాన్ని మభ్యపెడుతూ కొత్త కిలోమీటర్లు పుట్టుకొస్తున్నా… నెమ్మదిగా రోజులు నెట్టుకొస్తున్న ఆశావహ దురంధరుడు.
===

‘‘బలమైన వాడిని తెలివితో గెలవాలి.

తెలివైన వాడిని బలంతో గెలవాలి’’ అని ఒక నానుడి. 

దీన్ని కాస్తా రివర్సు చేసుకుని ఆలోచిస్తే …

‘‘బలంతో గెలిచే వాడు తెలివి లేని వాడు.

తెలివితో గెలిచే వాడు బలం లేని వాడు’’ అనిపిస్తుంది.

ప్రతివాడూ అంతేనా..? అని  ప్రశ్నించుకుంటే అది చాలా తర్కరహితమైన ప్రశ్నగా స్ఫురిస్తుంది. అయితే నేలతల్లికి జడుపు పుట్టేలా, సిక్స్‌టీ ప్లస్‌ కుర్రాళ్లందరికీ అసూయ జనించేలా వేలాది కిలోమీటర్లు అవలీలగా నడిచేస్తూ ముందుకు సాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు విషయంలో మాత్రం రివర్సు సిద్ధాంతం నిజమనిపిస్తుంది. రాజకీయాల్లో ఆయన ‘తర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అనుభవం ఉన్న ప్రముఖుడే గానీ.. గత రెండుదశాబ్దుల్లో ఆయన కెరీర్‌ గమనం ఉత్థాన పతనాలు అన్నిటినీ గమనించినప్పుడు… ఈ రివర్సు సిద్ధాంతం నిజమేమో అనిపించకమానదు. 

తమ బలం తమకు తెలియని వ్యక్తులు మనకు అనేక మంది తారసిల్లుతూ ఉంటారు. కానీ తమ బలహీనత తమకు తెలియని వ్యక్తులు ఉండరు. మనిషి సక్సెస్‌ను శాసించేది వ్యక్తికి ఉండే బలం అని మనం అనుకుంటాం గానీ.. నిజానికి, ప్రతి వ్యక్తికీ ‘తన సొంత బలహీనతల పట్ల ఉండే జ్ఞానం’ అతని సక్సెస్‌ ను నిర్దేశిస్తుందంటే మరింత సబబుగా ఉంటుంది. ఈ సిద్ధాంతం చంద్రబాబు విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది. చంద్రబాబు సక్సెస్‌ మంత్రం ఏంటంటే.. ఆయన బలహీనత ఆయనకు తెలుసు. ఆయన బలహీనత విశ్వాస రాహిత్యం. ఆయన ఇతరుల్ని నమ్మరు. నమ్మలేరు. దాని పర్యవసానం ఆయన తనదైన, తనంటే ప్రాణాల్ని పణంగా పెట్టగల వ్యక్తుల ప్రేమను సొంతం చేసుకోలేరు. తనకంటూ మంది బలాన్ని నిర్మించుకోలేరు. కానీ రాజకీయాల్లో మంది బలం అనేది ప్రాథమికమైన సూత్రం. నాయకుడనే వాడు.. వెనక ‘మంది’ లేకుండా అడుగుతీసి అడుగువేయడు. స్వభావత: తన స్థితిగతులకు ఆ మంది బలం లేదన్న సంగతి చంద్రబాబుకు అనుభవమే.. ఆ మందిబలాన్ని పోగుచేసుకోవడం కూడా అంత సులభం కాదన్న స్పృహ ఆయనకు మెండుగా ఉంది. అందుకే ఆయన తెలివిని నమ్ముకున్నారు. 

రాజకీయ నాయకుడికి ఉండవలసిన మౌలిక లక్షణంలోనే బలహీనత ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అతి సుదీర్ఘ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రి స్థానానికి ఎలా ఎదగగలిగాడు… అన్నదే ఆయన వ్యక్తిత్వం మనకు నేర్పే పాఠం. 

సింపుల్‌గా చెప్పాలంటే…

‘మంది’తో ఆయన అధికారాన్ని అందుకోలేదు.

అధికారం అధిష్ఠించాక ‘మంది’ ఆయన చుట్టూ చేరారు!

బలం సంపాదించి, ఆయన అధికారాన్ని నిలుపుకోలేదు.

తెలివితో బలాన్ని కమ్మేయడం వల్ల అది నిలబడగలిగింది!!

కానీ పునాదుల్లో ఉన్న బలహీనత బయటపడకుండా ఎలా ఉంటుంది. అందుకే చతికిలపడ్డాడు. ఇప్పుడు మళ్లీ అధికారం అందుకోగలడా… ఏమో ఎన్నికల తర్వాతే జవాబు దొరికేది. ఈ సిద్ధాంతానికి  స్పష్టత వచ్చేది. పూర్తిగా అవలోకించాలంటే.. ఈవ్యాసాన్ని రెండు భాగాలుగా చూడాలి. 

మొదటి భాగం

30 ఏళ్ల నిండైన కెరీర్‌ చంద్రబాబుది. మన వ్యవస్థలోని పుచ్చు లక్షణం రాజకీయానికి ఇచ్చిన ప్రివిలేజీ లేకుంటే.. మరో వృత్తిలో ఉంటే ఈ పాటికి రిటైరవ్వాల్సింది.  మామ పంచన చేరి తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రంతిప్పే స్థాయికి చేరే వరకు ఆయన కెరీర్‌ ఎలా సాగిందో దృష్టి పెట్టాల్సిన పని లేదు. ఆతర్వాతి రెండు దశాబ్దుల్లో.. కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను తూకంరాళ్లుగా భావించి బేరీజు వేద్దాం. 

మీడియా మెట్లపై ముఖ్యమంత్రిత్వం వైపు..

మామ నందమూరి తారక రామారావు ఒక్కరిని నమ్మిస్తే సరిపోతుంది గనుక.. చంద్రబాబు తాను కాంగ్రెస్‌ తరఫున ఓడిన ఎమ్మెల్యే అయినా… తెలుగుదేశంలో చేరాక చక్రం తిప్పడం ప్రారంభించారు. మామలో ఒక బలహీనత పొడసూపగానే.. ఆయనకున్న మందిబలంపై తన తెలివితో గెలిచే ప్రయత్నం చేశారు. మీడియా ప్రాపకం, రామోజీ దీవెన ఆయనకు కోరిన కోనలో వాన కురిసినట్లయింది. వైస్రాయి హోటల్లో  ఒకరిద్దరు ఎమ్మెల్యేలను గదిలో కూర్చోబెట్టి.. నలభై యాభై మంది అక్కడకు చేరిపోయినట్లుగా పత్రికల కథనాలతో భ్రమలను వ్యాప్తి చెందించారు. ఇప్పుడున్నంతగా సమాచార విప్లవం అప్పుడు లేకపోవడం.. ఈ ఐటీ బాబుకు వరమైంది. కమ్యూనికేషన్‌ ఇవాళ్టిలా జనం చేతుల్లో కాకుండా పత్రికల రాతల్లో మాత్రమే ఉంటున్న సమయంలో.. ఆ పత్రికలను ఆయన తన చేతుల్లో సాధనంగా మార్చుకోవడమే సక్సెస్‌ సూత్రమైంది. భ్రమలో వైస్రాయి గూట్లోకి (ఇష్టంతో నిమిత్తం లేకుండా) కొత్త పక్షులు చేరుతూ వచ్చాయి. కావలసినంత మంది చేకూరాక.. ఆయన ఏకంగా ‘ముఖ్య’ కుర్చీ ఎక్కి కూర్చున్నారు. 

కాషాయ పునాదుల మీద రికార్డు సాధన…

నాలుగేళ్ల ముఖ్యమంత్రిత్వం తర్వాత.. అప్పటికి కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న భాజపా కార్గిల్‌ యుద్ధాన్ని ఉన్మాద స్థాయిలో ప్రజల్లోకి చొప్పించి.. ఆ ఉన్మాదాన్ని ఓట్లుగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం చంద్రబాబుకు రుచికరంగానే కనిపించింది. అప్పట్లో ఆయన` వారు హిందూ మతతత్వ వాదులనే విషయాన్ని కన్వీనియెంట్‌గా మరచిపోయారు. యావత్తు జనంలోనూ భాజపా పట్ల ‘కార్గిల్‌ స్ఫూర్తి’ అనే ఉన్మాదం ప్రతిఫలిస్తున్నప్పుడు వారితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో విజయం సునాయాసంగా వరించేసింది. మరో అయిదేళ్లు ముఖ్యమంత్రిత్వాన్ని పదిలంగా పొందగలిగారు. తద్వారా తొమ్మిదేళ్లు ఏలిన సుదీర్ఘ ముఖ్యమంత్రిగా రికార్డును సొంతం చేసుకున్నారు. 

అలిపిరి బాంబులు బ్యాలెట్‌లో పేలలేదు…

2004లో అయినా చంద్రబాబు స్వశక్తిని (అనగా ఈ వ్యాసంలో మనం వాడుతున్న పదజాలాన్ని బట్టి బలాన్ని) నమ్ముకుని ఎన్నికలకు వెళ్లలేదు. అయితే అలిపిరిలో తన అంతానికి ఉద్దేశించిన మావోయిస్టుల బాంబులు సానుభూతి పవనాలుగా బ్యాలెట్‌ బాక్సులో ఓట్ల కలెక్షన్లు కురిపించగలవని ఆశపడ్డారు. కానీ బెడిసి కొట్టింది. ఆ దఫా కూడా ఆయన తెలివితోనే గెలవాలని కొత్త పాచికలు ప్రయోగించారు గానీ పారలేదు. ‘తెలివైన వాడిని బలంతో గెలవాలనే’ సూత్రాన్ని ఎంచుకున్న కాంగ్రెస్‌ ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్‌ను మోహరించి రంగంలోకి దిగడంతో ఎన్నిక ఏకపక్షమైంది. సానుభూతి ఎండమావి అయింది. 

చంద్రబాబు పరిస్థితి గట్టున పడ్డ చేపలాగా తయారైంది. అధికారం లేకుండా, బలం అసలే లేకుండా… ఆయన కుదేలైపోయారు. తన తెలివి తేటల ఫామ్‌ మసకబారింది. ప్రధాన ప్రతిపక్ష నేత అనే హోదా మిగిలింది గానీ.. దాన్ని ఎలా మరో విజయాలకు పునాదిగా వాడుకోవాలో ఆయనకు అంతు చిక్కలేదు. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ అనేది ఒకటి కాపాడుతుందని వేచిచూశారు గానీ.. 2009 నాటికి అలాంటి దానికి అవకాశం లేకుండా పోయింది. అప్పటికీ తెలంగాణ మీద ఎటూ తేల్చకుండానే బేరాల రూపంలో భారీగానే పొత్తులు పెట్టుకున్నారు. అసలే ఫామ్‌లో లేని తెలివి తేటలతో వేసిన వ్యూహాలు ఎక్కడో బెడిసి కొట్టాయి. అలా అనడం కంటె వైఎస్‌ తన పాలనతో సాధించుకున్న ఆదరణ ముందు అవి పారలేదని చెప్పాలి. మళ్లీ చతికిలపడ్డారు.

ఆ తర్వాత కూడా దక్కింది ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే! అయితే, అనుచితంగా ప్రాప్తించిన అధికారం దూరం కాగానే వ్యక్తులు ఎంతగా కునారిల్లిపోతారో`  అందుకు నిదర్శనంగా చంద్రబాబు ఆ సమయంలో  కనిపించారు. వైఎస్‌తో రెండోసారి కూడా ఓడిపోయాక… ఏమీ పాలుపోని స్థితికి చేరుకున్నారు. ఆ అచేతనావస్థ ఆయనను వైఎస్‌ మరణానంతరం కూడా వీడిపోలేదు. రిహార్సల్స్‌ లేకుండా రంగం మీదికి వచ్చిన అసంకల్పిత పాత్రధారి రోశయ్య ఏలుబడి గాడి తప్పిపోయినా.. ఈ ప్రధాన ప్రతిపక్షనేత ఆ వైఫల్యాల్ని తన పార్టీకి బలం నిర్మాణానికి అనువుగా వాడుకోలేదు. ఆయనకు ఆ స్పృహ కలగలేదు. అప్పటినుంచి మూడో కృష్ణుడుగా కిరణ్‌ రంగప్రవేశం చేసిన తర్వాత.. వచ్చిన అవకాశాల్ని కూడా చంద్రబాబు వాడుకోలేకపోయారు. వారి వైఫల్యాలు కళ్లముందు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత అంత నిస్తేజంగా, నిర్వ్యాపారంగా, నిష్క్రియాపరంగా ఎలా ఉండగలిగారు. బహుశా తను పోరాటం సాగించడం ఎందుకు … వారి వైఫల్యాలు ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రాణం పోసి ఏకైక ప్రత్యామ్నాయంగా తననే గద్దెనెక్కిస్తాయి లెమ్మని ఆయన తలపోసి ఉండవచ్చు.

పీడకలలా పుట్టిన జగన్‌ పార్టీ…

చంద్రబాబుకు బహుశా ఆయన ముప్పయ్యేళ్ల రాజకీయ కెరీర్‌లో అశనిపాతం వంటి ఉత్పాతం ఏదైనా ఉన్నదంటే అది జగన్‌ రాజకీయ పార్టీని స్థాపించడమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదో ‘ప్రభుత్వ వ్యతిరేకత’ తనను గద్దెనెక్కిస్తుందిగదా అనే ఊహల్లో ఉండి, ప్రజల పక్షాన పోరాడాలనే ప్రతిపక్ష బాధ్యతను గాలికొదిలి ఏళ్లు గడిపేసిన చంద్రబాబునాయుడు.. సదరు ‘ప్రభుత్వ వ్యతిరేకత’ను పంచుకోవడానికి తన బలానికి అదనంగా సానుభూతిని కూడా పుష్కలంగా దాచుకుని రంగంలోకి వచ్చిన కొత్త ప్రత్యర్థిని చూసి బెంబేలెత్తిపోయాడు. ఆ పార్టీకి కనిపిస్తున్న ఆదరణ, తన పార్టీనుంచి కూడా.. అటువైపు సాగుతున్న వలసలు, ఉప ఎన్నికలు, ఇతరత్రా కొన్ని సందర్భాల్లో నిరూపితమైన వారి బలం, తద్వారా తేటతెల్లం అయిపోయిన తన బలహీనత ఇలాంటివన్నీ ఆయనను కలవరపెట్టాయి. 

కలవరపాటులో నిర్ణయమే పాదయాత్ర

షోలే సినిమాను తెలుగులో తీసినప్పుడు సెంటిమెంటు ప్రధానంగా ఉండే చిత్రపరిశ్రమ పెద్దలు, సదరు హిందీ మాతృకలో గబ్బర్‌ సింగ్‌ ఏ బండరాయి మీద కాలు ఆన్చి డైలాగు చెబుతాడో.. ఆ బండరాయిని ఇక్కడకు తరలించి షూటింగులో వాడి డైలాగు పలికించారని చెబుతుంటారు. ఆ రీతిగా` పాదయాత్ర అనేది వైఎస్‌ను సీఎం కుర్చీవైపు నడిపించిన మంత్రమని చంద్రబాబు అనుకున్నారు. అలా అనడం కంటె.. వైఎస్‌కు ఉన్న అసలు బలాన్ని ఆమోదించడానికి ఆయన అంతరంగం, అహం అడ్డొచ్చాయి. తాను కూడా పాదయాత్ర చేయగానే.. అట్నుంచి అటే డైరక్టుగా సీఎం కుర్చీలోకి వెళ్లిపోగలనని అనుకుంటూ మొదలెట్టారు. 

ఫిట్‌నెస్‌లో మహా మొనగాడే!

అతిశయం కాదు` అరవయ్యేళ్లు పైబడిన కుర్రవాడు చంద్రబాబు. వ్యూహాలు బెడిసికొడుతుండవచ్చు గానీ.. ఆయన ఫిట్‌నెస్‌ మాత్రం మాంఛి ఫామ్‌లోనే ఉన్నదనడానికి నిదర్శనంగానే… తిరుగులేని రీతిలో నిరంతరాయమైన పాదయాత్రను సాగించారు. రెండువేల కిలోమీటర్లు పూర్తి చేశారు. 

రెండోభాగం

రెండువేల కిలోమీటర్లు పూర్తయ్యాయి. మధ్యలో పండగలొచ్చాయి. అవాంతరాలూ వొచ్చాయి. అయినా చంద్రబాబు మడమ తిప్పలేదు. అలుపెరగకుండా నడుస్తూనే ఉన్నారు. అయితే ఏం సాధించారు. 

ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి అంటూ చంద్రబాబు యాత్ర ప్రారంభించారు. అయితే ఊరుదాటి ఊరు వెళుతుండగా.. ఆయన అధ్యయనం ఆయనకు ఏం నేర్పుతుందో, తెలియబరుస్తోందో ప్రజలకు అర్థం కావాలి. కొత్తగా పాదయాత్ర చేపట్టడం వల్ల ప్రజల గురించి, పాలన వైఫల్యాల గురించి ఆయన ప్రత్యేకంగా తెలుసుకున్నదేమిటో ఆ తర్వాతి ఊర్లో మాట్లాడేప్పుడు ప్రసంగంలో ధ్వనించాలి. అలాంటిదేమీ జరగలేదు. ఊర్లు ఎన్ని దాటి వస్తున్నా ఆయన ప్రసంగాల్లో అరగిపోయిన గ్రాంఫోను రికార్డుల్లా మాత్రమే తయారయ్యాయి. వైఎస్‌ అవినీతిని స్మరించడం.. జగన్‌ అక్రమార్జనల్ని దుమ్మెత్తిపోయడం..! ఒక్క రుణమాఫీ అనే పదాన్ని వాడినందుకు.. నిజానికి చంద్రబాబు ఈ పాదయాత్ర కాలంలో చాలా సార్లు పశ్చాత్తాప పడికూడా ఉండవచ్చు. ఎందుకంటే.. రుణమాఫీ ఫైలుమీద ముఖ్యమంత్రి కాగానే తొలిసంతకం చేస్తానంటూ ఆయన చాలా ఆడంబరంగా ప్రకటించారు. రుణమాఫీ అనేది (లాజిక్‌ మరియు ప్రాక్టికాలిటీ సంగతి ఎలా ఉన్నా) గంపగుత్తగా ఓట్లు కురిపించేస్తుందని ఆయనకు ఎందుకు అనిపించిందో మరి! బహుశా తనది రైతు వ్యతిరేక పోకడ అనే ప్రచారాన్ని దీంతో తుడిచేయవచ్చునని ఆయన అనుకుని ఉండవచ్చు. అయితే ఆ హామీ.. ఆయనకు గుదిబండలా మారింది. తను దూరను కంత సరిపోతుందని సంతోషిస్తోంటే.. 
మెడకు డోలులా తగులుకుంది. ఎలాగంటే.. రుణమాఫీ అనేది ఎన్ని వేల కోట్లకు ముదురుతుందో అనే భయం హామీ ఇచ్చేసిన తర్వాత చంద్రబాబును ఆవరించింది. పర్యవసానంగా.. కొత్తగా జనాకర్షక హామీలు ఇవ్వడానికి నోరాడడం లేదు. అధికారంలోకి రావడం అనేది విధిలిఖితం మాత్రమేనని ఆయనకు స్పష్టత ఉన్నది గానీ.. ఒకవేళ తానే అధికారంలోకి వచ్చేస్తే.. ఈ హామీలను అన్నిటినీ అమలు చేయాల్సి వస్తుంది గనుక.. ఇప్పటికే రుణమాఫీ అనే పెద్ద హామీ ఇచ్చేశాం గనుక.. మరేమీ ఇవ్వనక్కరలేదని ఆయన పరిమితులు విధించుకుంటున్నారు. కొత్త వాగ్దానాలకు చోటు లేకుండా.. ఆయన అమ్ములపొదిని ఈ రుణమాఫీ కుంచింపజేసేసింది. పాపం.. చంద్రబాబు.. తన కాళ్లను తాను నమ్ముకుని ప్రస్థానం సాగిస్తున్నారు. 

వాగ్దానాలు చేయడానికి కూడా తెగువలేని నాయకుడికి మిగిలే ఏకైక ప్రత్యామ్నాయం ఏమిటి? పరనింద మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పనికూడా అదే. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చేతగానితనాన్ని, అవినీతిని తూలనాడడంలో కూడా చంద్రబాబు తెలివిగా వైఎస్‌ దుర్మార్గ పాలనకు కొనసాగింపుగా అభివర్ణిస్తూ.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వైరిపక్షాలు రెండిరటినీ ఒకే మాటతో తూర్పారపడుతున్నారు. అంతమాత్రాన.. బలమైన ప్రత్యర్థి కాగలడనుకుంటున్న, పీడకలలా వెన్నాడుతున్న జగన్‌ను ఆయన విస్మరించడం లేదు. జగన్‌ అక్రమాలు, అవినీతి ఆర్జనలు, మీడియా దుష్ప్రచారాలు అంటూ పదేపదే నొక్కి వక్కాణిస్తున్నారు. జగన్‌ అనే బూచి ఆయనను ఏ రీతిగా భయపెడుతున్నదో గానీ.. తన ప్రసంగాల్లో జగన్‌ ప్రస్తావన రాగానే.. చంద్రబాబు కు పూనకం వచ్చేస్తుంది. హద్దులు తెలియకుండా విమర్శల్ని కురిపించేస్తారు. నిత్యమూ పరనిందనే నమ్ముకుంటే బయటపడేది తన బలహీనత మాత్రమేననే సత్యం ఆయనకు బోధపడినట్లు లేదు. తన బలం మీద తనకు విశ్వాసం ఉండే నాయకుడు.. దాన్ని గురించే ప్రస్తావిస్తాడు. అది లేనినాడు.. పరుల్ని పలచన చేసే మార్గాల్ని వెతుక్కుంటాడు. జగన్‌ మీద ఫోకస్‌ ఎంతగా ముదిరిపోతోందంటే.. కనీసం పార్టీ నిర్మాణం, బలోపేతం చేసుకోవడ
ం, ఎవ్వరూ జారిపోకుండా చూసుకోవడం వంటివాటిమీద కూడా ఆయన పూర్తి స్థాయి శ్రద్ధను, తన చాణక్యాన్ని కనపరచలేకపోతున్నారు. 

ప్రస్తుతానికి తారకమంత్రం అదే…

రివర్సులో తనకు ‘బలం లేదు గనుక తెలివితో గెలవడం’ అలవాటు చేసుకున్న చంద్రబాబు … అంతకుముందు చెప్పుకున్న అసలు సిద్ధాంతం ప్రకారం ‘తెలివైన వాడిని బలంతో గెలవడం’ అనే సూత్రం అలవాటైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఢీకొట్టగానే తడబడ్డాడు. తూలిపడ్డాడు. రెండోసారి కూడా ఆ బలంతో ఢీకొనలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ మరో బలమైన ప్రత్యర్థి తగిలితే గనుక.. 

సిద్ధాంతమే నిజమౌతుందా? రివర్సు నిగ్గుతేలుతుందా?

చంద్రబాబు మాత్రం మహా మొనగాడే! గ్రహాలు ఆయనకు అనుకూలించి ప్రత్యర్థులందరినీ మట్టి కరిపిస్తే అప్పుడు ఆయన బరిలో విజయనాదం చేస్తారు.

-కపిలముని