సన్మానాలూ గట్రా చేసేవాళ్లు ఎవరైనా ఉన్నారేమో చూడండి. అనగా ముందుగా సన్మానాలు చేసే అలవాటు ఉన్న సంఘాలను వెతకండి. సొమ్ముల్దేముంది. తెలుగు సినిమా హితమూ, తెలుగు ప్రేక్షకుల క్షేమమూ కోరే మనబోటి వాళ్లు నలుగురూ నాలుగురూపాయలు చందాలు వేసుకుంటే సరిపోతుంది. ఎంచక్కా బోలెడు డబ్బులు పోగవుతాయి. ఎటొచ్చీ సన్మానం చేసే సంఘానికి రుసుము చెల్లించడం ఒక్కటే ఇక్కడ భారం తప్ప.. సన్మాన గ్రహీతకు నగదు పురస్కారం అక్కర్లేదు. భారీగా ఫ్రేము కట్టించిన ఒక సన్మాన పత్రమూ.. పూలమాలా, శాలువా చాలు.. కాపోతే బిరుదు మాత్రం ప్రదానం చేయాల్సిందే. అసలు సన్మానం చేయిస్తున్నదే బిరుదు కోసమయ్యా బాబూ…
ఏమిటీ! ఇంతకూ ఎవరికి సన్మానం అని అడుగుతున్నారా..?
అదేనండీ మన తెలుగుతెరనుంచి ముంబాయికి వలసవెళ్లి అక్కడ ఇండస్ట్రీని ఏలుతున్న దర్శక దిగ్గజం రాంగోపాల్ వర్మకి.
అరె.. మీరు చెబుతున్న ఐడియా నాకిప్పటిదాకా స్ఫురించనే లేదు సుమండీ! అందుకే మరి నేను తమరి సలహా కోసం వచ్చింది. సన్మానం చేయబోతున్నది రాంగోపాల్ వర్మకే అని చెప్పగానే.. అవసరమైతే లక్షల సొమ్మునైనా గుమ్మరించేయడానికి, ముఖ్యఅతిథిగా పిలవకుండానైనా వచ్చేయడానికి మన జగడాల ఘనాపాటి లగడపాటి సిద్ధంగా ఉంటారు కదా! అవునవును. మీరు చెబుతోంది నిజమే. ఆయన పురమాయిస్తే గనుక.. గజ్జెలు కట్టిన తప్పెట ఒకటి అందుకుని.. వేదికమీదినుంచి వర్మ స్తోత్రావళిని గజల్సు రూపంలో వినిపించడానికి గజల్ శ్రీనివాస్ కూడా పరుగున వచ్చేయగలడు. ఇక ఆలస్యం ఏముందీ.. సన్మానం ప్లాన్ చేసేయండి.
ఆ ఏమిటీ! బిరుదు ఏం ఇవ్వాలి అనడగుతున్నారా… అదేనండీ ‘గానగంధర్వ’ అనే బిరుదు ఇవ్వాలి. అవును మీరు వింటున్నది నిజమే.. దర్శకుడు రాంగోపాల్ వర్మకే నండీ బాబూ. ఆయన ఏం పొడిచాడు గనుక.. రక్త చరిత్ర సినిమాలో వాయిస్ ఓవర్ చెప్పడం తప్ప అంటున్నారా…? అది పాత మాట. ఇప్పుడు తాజ్ దాడుల మీద తీసిన తాజా చిత్రంలో ఓ పాట కూడా పాడుకున్నారండీ బాబూ. ఇంకా ఆడియో విడుదల కాలేదు గనుక.. తమరికి స్పష్టంగా తెలిసినట్లు లేదు. అందుకే ఆయన తొలిసారిగా గొంతు చించుకుని.. సారీ, గొంతు సవరించుకుని పాట పాడుకున్నాడు గనుక మనందరి కలిసి వెంటనే గానగంధర్వ బిరుదు ఇచ్చేయాల్సిందే. అప్పుడెప్పుడో ఆయన గాయం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రితో పాడిరచి ప్రయోగం చేశాడా? ఇప్పుడు అవకాశం మరొకరికి ఇవ్వడం ఎందుకని తానే గొంతెత్తుకున్నాడు. ‘‘ఎవరి సృష్టి ఏమో … అడుగుతున్నాడు ఆ దేవుడు… లేక పిశాచాలా, రాక్షస వారసులా.. లోపల కృారమృగం బయటకు మనిషి ముఖం…’’ అంటూ ఆ పాట సాగుతుంది. అవును ఆ పాట ఆయనే పాడాడు. అందుకే ఆయనకు గానగంధర్వ ఇవ్వాలిప్పుడు. అరెరే… అది ఎస్పీ బాలుకు ఉన్న బిరుదే అని మాకు తెలియదనుకున్నారా ఏమిటి? సరిగ్గా అలాంటి బిరుదే ఇస్తే తప్ప మా వర్మ స్వీకరించడండీ బాబూ!
ఒక పాటకే ఎందుకు ఇవ్వాలంటారా? అదేంటీ మీరు కూడా విన్నారా…? ఓహో మీరు యూట్యూబ్‌లో విన్నారన్నమాట. అంత కర్ణకఠోరంగా ఉన్నదానికి అంత పెద్ద బిరుదు ఎందుకివ్వాలంటారా? కర్ణకఠోరంగా ఉన్నదని మాకు తెలియదనుకున్నారా ఏమిటి? కానీ ఇవ్వాల్సిందేనండీ బాబూ! ఒక మతలబు చెప్పనా.. బిరుదు ఇచ్చేశాం అనుకోండి.. మన వర్మ.. అంతటితో సంతృప్తి పడిపోయి, ముచ్చట తీరిపోయి ఇక పాడడానికి స్వస్తి పలికేస్తాడు. అలాంటి బిరుదు ఇవ్వలేదనుకోండి… ఇచ్చేవరకు కసిగా పాడుతూనే ఉన్నాడంటే మనమంతా వినలేక చస్తామండీ బాబూ..
దయచేసి ఇచ్చేద్దురూ…!
ఇదిగో నేను ఫ్లెక్సి బ్యానర్లు కూడా సిద్ధం చేయించేస్తున్నా.. మీరు మిగిలిన ఏర్పాట్లు చేసుకోండి. ‘గానగంధర్వ రాంగోపాల్ వర్మ’, ‘గానగంధర్వ రాంగోపాల్ వర్మ’, …
` కపిలముని