ఫన్‌చర్‌ : మామయ్య మాటే నా బాట!

చంద్రబాబు నివాసం చాలా సందడిగా ఉంది… ఎటుచూసినా సినిమా హడావిడి కనిపిస్తోంది. లైట్‌బాయ్‌లు బయట జెనరేటర్‌ ఉండే వాహనాలు, షకీలా సారీ అకేలా క్రేన్‌లు, జిమ్మీ జిప్‌లు, ట్రాలీలు, క్రేన్‌లు, ట్రాక్‌లు ఇలాంటివన్నీ సందడి…

చంద్రబాబు నివాసం చాలా సందడిగా ఉంది… ఎటుచూసినా సినిమా హడావిడి కనిపిస్తోంది. లైట్‌బాయ్‌లు బయట జెనరేటర్‌ ఉండే వాహనాలు, షకీలా సారీ అకేలా క్రేన్‌లు, జిమ్మీ జిప్‌లు, ట్రాలీలు, క్రేన్‌లు, ట్రాక్‌లు ఇలాంటివన్నీ సందడి చేస్తున్నాయి. ఎందుకంటే ఆరోజే సినిమా ఓపెనింగు. ‘మామయ్య మాటే నా బాట!’ అనే టైటిల్‌తో అపురూపమైన చిత్రరాజం షూటింగుకు ఆరోజే టెంకాయ కొట్టబోతున్నారు. 

దేవుడి పటాలు పెట్టి బలంగా టెంకాయ కొట్టారు. అది అతి దారుణంగా పేలింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ క్లాప్‌ కొట్టి క్లాప్‌ బోర్డుతో పక్కకు పరుగెత్తాడు. యాక్షన్‌ అనే అరుపు వినపడగానే.. ఫాగ్‌ ఎఫెక్టు వేశారు.. పొగల్లోంచి.. ఆయన బయటకు వచ్చాడు.. రౌండ్‌ ట్రాలీ మీద కెమెరా తిరుగుతోంది… ఆయన మీద కెమెరా నిలబడగానే ఆయన తన చూపుడువేలు బెదిరిస్తున్నట్లుగా చూపిస్తూ.. తెలుగువాడిని అని చెప్పుకునే ప్రతివాడి గుండెను కోసి చూడండి.. అందులో తెలుగుజాతి అన్న ఎన్టీఆర్‌ బొమ్మ కనిపిస్తుంది. కుట్లు వేసేసి మళ్లీ రెండోసారి కోసి చూడండి.. ఈ సారి నా బొమ్మ కనిపిస్తుంది’’ అన్నారు.

ఆయనే నారా చంద్రబాబునాయుడు. 

కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ గదిలో ఓన్లీ సినిమా టీం మాత్రమే ఉన్నారు. ఎవరు అరుదైన సినిమా చేస్తాం అని చెప్పినా కూడా ‘నేనే  డైరక్టు చేస్తా’ అంటూ లగెత్తుకుని ముందు వరుసలోకి వచ్చే పూరీ జగన్నాధ్‌, ఎవరు పిలిచినా మొహమాటానికి వెళ్లి నాలుగు ముఖస్తుతి మాటలు చెప్పివచ్చే అలవాటున్న రాజమౌళి, పబ్లిసిటీ ముఖ్యం.. ఎవడిని తిట్టడానికైనా వెరపేంటి అంటూ అడ్డగోలు మాటలు సిద్ధం చేసుకుని వచ్చే రాంగోపాల్‌వర్మ వంటి ఉద్ధండులంతా ఉన్నారు. అందరూ కలపి తప్పట్లు కొట్టారు. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత.. తొలిసారిగా మొహానికి రంగేసుకుని, హీరోగా తెరంగేట్రం చేసిన తొలి వ్యక్తిగా తమరు చరిత్రలో నిలిచిపోతారు సార్‌ అంటూ పలువురు బొకేలు తెచ్చి అందించారు. క్లాప్స్‌ సాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు సినిమాకు డైలాగులు మేమే రాస్తున్నాం అంటూ కొన్నేళ్లుగా ప్రచారం చేసుకుంటున్న పరుచూరిబ్రదర్స్‌ కూడా అక్కడే ఉన్నారు. చిన్న పరుచూరి.. అదే గోపాలకృష్ణ అయితే పెద్దగా విజిల్‌ కూడా వేశాడు. కెమెరా వెనుక గడ్డం దువ్వుకుంటూ కె.రాఘవేంద్రరావు తెగ మురిసిపోతున్నాడు. ఆయన సహజమైన అలవాటును పక్కకు పెట్టి.. మీడియా వాళ్లను పట్టుకుని ఎంతో మంది ఘనుల్ని వెండితెరకు ఇంట్రడ్యూస్‌ చేసిన ఘనత నాకుంది. 
ఇప్పుడు చంద్రబాబును కూడా ఇంట్రడ్యూస్‌ చేయడం గొప్ప విషయం అంటూ మురిసిపోయారు. 

ఈలోగా ప్రెస్‌ ఫోటోగ్రాఫర్లను అనుమతించగానే.. వారు బిలబిలా లోపలకు వచ్చేసి ఆయన్ను అదే స్టిల్‌లో ఉంచేసి తళతళా ఫోటోలు తీసుకుంటున్నారు. 

ముహూర్తం హడావిడి ముగిసింది. 
==
చంద్రబాబు ఆఫీసులో సినిమా టీం అందరూ కూర్చున్నారు. 

ముహూర్తం లైవ్‌ కవరేజీ ఇచ్చేశాం. మనం సినిమా చేస్తున్న సంగతి ప్రపంచానికి తెలిసిపోయింది ఇక కథ గురించి ఆలోచించండి… అని కేకేశాడు చంద్రబాబు ల్యాప్‌టాప్‌ సర్దుకుంటూ. కథాగిథా రాఘవేంద్రరావు కాలం నాటివి.. నేనైతే కథ లేకుండానే తీసేస్తా.. అంటూ గర్జించాడు పూరీ జగన్నాధ్‌. నువ్వు కాస్తాగవయ్యా.. రెండో సినిమా నీతోనే చేస్తా అన్నా కదా.. ప్రస్తుతానికి కేఆర్‌ చేస్తున్నాడు గనుక.. ఆయన ఇష్టానికి సాగనివ్వు అని కసురుకున్నాడు చంద్రబాబు. 

ఇంతలో పరుచూరి బ్రదర్స్‌ జోక్యం చేసుకున్నారు. ‘‘చూడు బాబుగారూ తమరు ఓపెనింగులో ‘కుట్లు వేసేసి మళ్లీ రెండోసారి కోసి చూడండి.. ఈ సారి నా బొమ్మ కనిపిస్తుంది’ అన్నారు చూశారా.. ఆ డైలాగును సరైన టైమింగ్‌తో చెప్పారంటే.. పదిరూపాయల నుంచి నలభై రూపాయల టిక్కెట్‌ వరకు 90 పర్సెంట్‌ జనంనుంచి మూడు నిమిషాల పాటు కంటిన్యుయస్‌గా తప్పట్లు పడతాయి బాబూ.. యాభై రూపాయల్లో మోగవు.. వాటి సంగతి వదిలేయండి.. వారంతా బూత్‌లకు వచ్చి ఓట్లేసే బాపతు కాదు’’ అన్నారు. ఈ డైలాగు తమ మీద ఒకటో రీలులో వస్తుంది బాబూ.. దీని తర్వాత మూడులో ఒకటి, ఆ తర్వాత 6, 8, 9, 11, 12 ల్లో ఇలాంటివే మూడు నాలుగు నిమిషాలు తప్పట్లు, విజిల్సు ఆకర్షించే డైలాగులు రాశాం బాబూ. 14 వ రీలు మొత్తం డైలాగులతోనే పేలిపోతుంది. కాబట్టి అది స్పెషల్‌ గిఫ్టు తమకు’’ అన్నారు. చంద్రబాబుకు ఆశ్చర్యం వేసింది. 

‘‘మనం ఇంకా కథ ఫైనలైజ్‌ చేయలేదు కదా.. అప్పుడే డైలాగులు ఎలా రాశారు మీరు’’ అని అడిగాడు. కథ లాంటివన్నీ అనుకోవడం, ఆ తర్వాత పంచ్‌లు రాయడం అదంతా నిన్నగాక మొన్న పుట్టిన బొడ్డూడని రచయితల పని బాబూ.. మేం నాలుగువందల సినిమాలు రాశాం. మాకు కథేంటి.. కథ ఏదైనా సరే.. మేం ఇప్పుడు రాసిన డైలాగుల్ని.. ఆయన రీళ్లలోకి చొప్పించేస్తాం. ఆ భరోసా నాది’’ అంటూ ఎర్ర శాలువా తిరగదిప్పి భుజం మార్చి వేసుకున్నాడు. 

సినిమా అంటే ఇలాగే ఉంటుందిలే తమకు తెలియదు.. మామగారికి బాగా తెలుసు.. అంటూ అథార్టీగా చెప్పాడు కే రాఘవేంద్రరావు.  అవునేమోలెద్దూ అనుకుంటూ చంద్రబాబు కామ్‌ అయిపోయాడు. 

ఇంతకూ కథేంటి అనుకున్నారు. 

‘అసలే నేను సిక్స్‌టీ ప్లస్‌. మన ఏజి ఫ్యాక్టర్‌ గుర్తుంచుకుని చేయండి’ అన్నాడు చంద్రబాబు. ‘అదేంటి బాబూ అంతమాట అంటారు.. మీరు గడ్డానికి రంగేసే అలవాటు లేదు గానీ.. లేకుంటే తర్టీ ప్లస్‌ అంటే నమ్మేయొచ్చు… సినిమా కదా.. కాస్త ఆ రంగు కూడా వేసేద్దాం’ అంటూ చిడతలు దూశారు మరో రచయిత. ప్రముఖ, ఉద్ధండ రచయితలు అందరూ ఉన్నారక్కడ. ‘తర్టీ ఇయర్స్‌ ఏజిలో కాలేజీ లెక్చరర్‌గా పెట్టాం అంటే.. యూత్‌ ఎగబడతారు బాబూ.. దానికి తగ్గట్లుగా స్టూడెంట్స్‌లో మాంఛి ప్రియాంక చోప్రా ను, లెక్చరర్లలో ముమైత్‌ఖాన్‌ను పెడదాం.. యాక్షన్‌ కం లవ్‌స్టోరీ కూడా వర్కవుట్‌ అవుతుంది’ అంటూ సలహా చెప్పాడు మరో తమిళ దర్శకుడు. చంద్రబాబు అంటే ఎవరో తెలియకపోయినా.. తమిళంలో ముసలి హీరోలతో చాలా సినిమాలు తీసాడని అతన్ని ప్రత్యేకంగా పిలిపించారు. ‘బాబూ ఇది లవ్‌స్టోరీ ఇల్లే.. నువ్వు హీరో ప్రెజంటేషన్‌ గురించి దా సొల్లు.. మరేదీ సొల్లవద్దు’ అంటూ కసురుకున్నాడు కేరాఘవేంద్రరావు. 

చండశాసనుడు మాదిరి సినిమా తీద్దాం అన్నాడాయన.

మన శరీరం సరిపోతుందా` డౌటొచ్చింది చంద్రబాబుకు.

నేనున్నా కదా.. సరిపోయేలా చేస్తా` ముందుకొచ్చింది దీనాజ్‌.

ప్రచండమైన  చప్పట్ల డైలాగులు రాస్తాం` అన్నారు కొందరు.

మన తెలుగుదేశం కౌన్సిలర్లు ఉన్న అండమాన్‌లోను, ఇంకా జపాన్‌లోను, అమెరికాలోను, ఉగాండాలోను, సైబీరియాలోను, క్లింటన్‌ కాలు పెట్టిన సమస్త దేశాల్లోనూ సినిమా విడుదల ప్లాన్‌ చేయిస్తా అన్నారు మరొకరు. 

రాష్ట్రంలో మరో సినిమా ఆడకుండా.. మీ రిలీజు డేటుకు, అన్ని థియేటర్లన్నీ మీకోసం బ్లాక్‌ చేసేస్తాం అంటూ నినదించారు.. సినిమా పరిశ్రమలోని ఆ నలుగురు పెద్దలు. 

కమల్‌హాసన్‌ 150 కోట్లతో విశ్వరూపం చేశాడు గనుక.. మనం 200 కోట్లతో తీద్దాం సార్‌. స్పీల్‌బర్గ్‌ను స్పెషల్‌ ఎఫెక్టుల డైరక్టర్‌గా పెట్టుకుందాం. అక్కడికే సగం బడ్జెట్‌ ఖర్చయిపోతుంది. 

నిర్మాత ఎవరు? అడిగాడు కే రాఘవేంద్రరావు. 

ఎవర్రా అక్కడ ? అరిచాడు చంద్రబాబు. 

ఎవరూ రాలేదు. 

నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, పాలెం శ్రీకాంత్‌రెడ్డి, సీఎం రమేష్‌ అందరూ ముహూర్తం కు కొట్టిన కొబ్బరి కాయ ముక్కలు తినేసి అప్పటికే మెల్లగా జారుకున్నారు. 

‘సర్లే బ్రదర్స్‌ రేపు కూర్చుందాం’ అన్నాడు చంద్రబాబు గంభీరంగా.

‘అబ్బ ఈ గొంతులో బేస్‌ ఉంది చూశారా.. అన్నగార్ని మించిపోయారు సార్‌.. ఇలాంటి బేస్‌ డైలాగులే రాస్తాం’ అంటూ కీర్తించారు కొందరు.  అందరూ వెళ్లిపోయారు. 

===

ఏదో మామయ్య ఎన్టీఆర్‌ పేరు చెప్పి.. ఆయనలా జనం గుండెల్లో ఉండిపోవాలంటే.. పోలిటిక్సు ఒక్కటే కాకుండా సినిమాల్లో కూడా ఉండడం అవసరం అంటే.. ఈ ముహూర్తం పెట్టుకున్నాం గానీ.. నిర్మాతగా ఒక్కరూ ముందుకు రాకుంటే.. మనం ఈ భారం నెత్తిన ఎలా పెట్టుకోగలం.. అనుకంటూ భోరుమన్నాడు చంద్రబాబు.