ఫన్‌చర్‌ : సత్తిబాబుది స్వార్థంకాదు సుమా!

‘‘అందరూ అలా రౌండప్‌ చేసేయకండి.. కన్ఫ్యూజ్‌ అయిపోతాను.. కన్ఫ్యూజన్‌లో ఎవడిని పడితే ఆడిని కొట్టేస్తాను’’ అనే మహేష్‌ బాబు మాటలు గుర్తున్నాయి కదా.  పాపం మన సత్తి బాబు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది.…

‘‘అందరూ అలా రౌండప్‌ చేసేయకండి.. కన్ఫ్యూజ్‌ అయిపోతాను.. కన్ఫ్యూజన్‌లో ఎవడిని పడితే ఆడిని కొట్టేస్తాను’’ అనే మహేష్‌ బాబు మాటలు గుర్తున్నాయి కదా. 
పాపం మన సత్తి బాబు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. విలేకర్లందరూ రౌండప్‌ చేసే ఏదోటి అడిగేస్తూ ఉండేసరికి.. సత్తిబాబు తెగ కన్ఫ్యూజ్‌ అయిపోయారు. ఆ కన్ఫ్యూజన్‌లో ఏది పడితే అది మాట్లాడేశారు. అదికాస్తా ఇప్పుడు పీకల మీదికి వచ్చేసింది. మాటల వరసకి ఆయన ఆ తొమ్మిది మందిని ఆల్రెడీ బహిష్కరించేసినట్లే అని చెప్పారు. పైగా పార్టీకి విరుద్ధంగా వ్యవహరించే వాళ్లందరూ కూడా బహిష్కృతులు అయినట్లే లెక్క అని కూడా ప్రకటించారు. 
అక్కడినుంచి రగడ మొదలైంది. సాధారణంగా ఈ మాటల్ని బహిష్కృతులుకింద స్పష్టంగా భావింపబడుతున్న వాళ్లెవ్వరూ సీరియస్‌గా పట్టించుకోలేదు. ‘పోన్లెద్దూ.. ఏదో బొత్స బాబాయి ఇన్నాళ్లకు మనల్ని వెలేసినట్లుగా బయటకు చెప్పుకునే దైర్నం తెచ్చుకున్నట్లున్నాడూ’ అంటూ పండగ చేసుకున్నారు. 
జోగి రమేష్‌ చెప్పే వరకూ అందులో మతలబు ఎవ్వరికీ బోధపడినట్టు లేదు. 9 మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు ప్రకటించేయడం ద్వారా తమ కాంగ్రెస్‌ సర్కారు మైనారిటీలో పడిపోయిందని… పరోక్షంగా ప్రకటించేసి, తద్వారా కిరణ్‌ ప్రభుత్వాన్ని కూల్చేయడమే బొత్స సత్తిబాబు అంతరంగంలో ఆలోచన అని జోగి రమేష్‌ ముడి విప్పి చెప్పారు. 
సత్తిబాబు పాపం.. బహిష్కరించిన వారి పదవులు పోయేలా మీరు స్పీకరుకు ఫిర్యాదు ఇవ్వచ్చుకదా అంటే.. ఎప్పుడు ఫిర్యాదు ఇవ్వాలో మాకు తెలుసులేవో అంటూ ముడిపెట్టారు. అంతే తప్ప ఇస్తే తమ ప్రభుత్వం పడిపోతుంది కదా అనే మర్మం చెప్పలేదు. అయినాసరే ఆయన బహిష్కరణ అన్నాడు గనక.. ప్రభుత్వం పడిపోయినట్లే నంటూ రాద్దాంతాలు రేగిపోయాయి. ఆ మాటకొస్తే.. జోగి రమేష్‌ చెప్పేవరకు ‘అరె మన మాటల్లో ఇంత మతలబు ఉందా.. మనం కిరణ్‌  సర్కారును పడగొట్టేయాలని అనుకున్నామా..’ అని సత్తిబాబుకు కూడా తెలియదు. 
అయితే.. విషయం ఏంటంటే.. పాపం ఈ మాటల వెనుక సత్తిబాబుకు ఎలాంటి స్వార్దమూ లేదన్నది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే.. సర్కారుమైనారిటీలో పడి కిరణ్‌ కూలిపోతే.. సత్తిబాబుకు ఏటొస్తుందీ.. కూలిపోయే పడవలో ఆయన కూడా ఉంటాడు కదా…! మరి ఆయన ఏటి సాదించినట్లు అవుతుంది? పడిపోతే.. బొత్సకు లాబమేటి? ఈ లాజిక్కు మిస్సయి.. జోగి రమేష్‌ అంతలేసి మాటలు అంటూ ఉంటే అవును గదా అవునుగదా అని అందరూ తానతందానా అంటున్నారు ఎలా కుదురుద్ది. 
కూల్చీసినంత మాత్రాన.. అటు సెంద్రబాబు పార్టీలోనో, జగను పార్టీలోనో చేరిపోతే తప్ప.. బొత్సకు ఏటైనా ఒరుగుతుందా అంటే లేదు. అటు చేరినా కూడా… అక్కడైనా ఆయన సీఎం కాబోయేది లేదు. మరైతే కుట్ర చెయ్యడానికి రీజను ఏటుంటాది? 
లాజిక్కు దొరకడం లేదు గనుక.. బొత్స సత్తిబాబు నిస్వార్దపరుడేనండీ బాబూ…!!