లవ్‌లెటర్‌ 2 పొన్నం : పెద్దాపురం వేశ్య గురించి..

డియర్‌ పొన్నం ప్రభాకర్‌… Advertisement తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర వాదం అంటే అది కేవలం కేసీఆర్‌ సొత్తు అనే భావననుంచి ప్రజలను బయటకు తీసుకురావడంలో మీ పాత్ర చాలా ఉంది. అందుకు ముందుగా అభినందించాలి. తెలంగాణ…

డియర్‌ పొన్నం ప్రభాకర్‌…

తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర వాదం అంటే అది కేవలం కేసీఆర్‌ సొత్తు అనే భావననుంచి ప్రజలను బయటకు తీసుకురావడంలో మీ పాత్ర చాలా ఉంది. అందుకు ముందుగా అభినందించాలి. తెలంగాణ వాదం కాంగ్రెస్‌ పార్టీలో సజీవంగా ఉండడానికి ఏ నాటికి నిర్ణయం వచ్చినా అది ఈ ఉద్యమవాదానికి అనుకూలంగా రావడానికి మీరు ప్రయత్నంలోపం లేకుండా కష్టపడుతున్నారు. యావత్తు ప్రజ దానిని గుర్తిస్తూనే ఉంది. కానీ ఇటీవలి పరిణామాల విషయంలో కొన్ని సంగతులు మీకు నివేదించాలని అనిపిస్తోంది. అందుకే ఈ లవ్‌లెటర్‌. సావధానంగా చదువుకోండి… 

రాజకీయ విమర్శలు ప్రతివిమర్శల సమయంలో నాయకులు చాలా తరచుగా అదుపు తప్పి పోతుంటారు. తమ విమర్శల్లోకి ఏమాత్రం సబంధంలేని వారిని కూడా ఈడ్చుకు వస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ` సమైక్యాంధ్ర వాదుల రగడలో అలాంటిదే జరుగుతోంది. ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ రాజమండ్రిలో సభపెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తెలంగాణ వాదులను.. తమను మాటమాటతోనూ దోపిడీ దొంగలుగా అభివర్ణిస్తున్న వారిని నిజాం పాలకు దుష్ట సేనాని అయిన ఖాసిం రజ్వీతో పోల్చారు. నిజానికి ఆయన అన్న సందర్భంలో తెరాస నాయకుల్ని, ప్రత్యేకించి కేసీఆర్‌ను అన్నట్లుగా అర్థం ధ్వనించింది గానీ.. ఆ ‘రజ్వీ’ అన్న మాట పర్యవసానంగా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు , తమకు కూడా మంట పుట్టింది. 

‘మమ్మల్ని రజ్వీతో పోలుస్తావా’ అంటూ ఆగ్రహోదగ్రులైపోయిన తమరు రాష్ట్ర కాంగ్రెసు ఎంపీల కన్వీనర్‌ హోదాలో… మాట్లాడుతూ.. ‘అయితే నిన్ను పెద్దాపురం వేశ్యతో పోల్చాలా’ అంటూ నిప్పులు చెరిగారు. అయితే వ్యక్తిగతంగా నాకున్న అభ్యంతరం అంతా ఈ ‘పెద్దాపురం వేశ్య’ అన్న పదం దగ్గరే. ‘పెద్దాపురం వేశ్య’  అంటే తిట్టడానికి ఉపమాలంకారంగా ఎంచుకోదగిన పదం అని మీరు అనుకుంటున్నారా? ఆ మాటకొస్తే.. రజ్వీకి ‘పెద్దాపురం వేశ్య’ కు ఏమైనా సాపత్యం ఉందా? అయితే నా అభిమతం ఉండవిల్లి వ్యాఖ్యలను వెనకేసుకు రావడం కూడా కాదు… కావలిస్తే.. తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఉండవిల్లిని అంతకంటె నీచమైన ఎన్ని తిట్లు అయినా తిట్టుకోవచ్చు. వారికి ఆ స్వేచ్ఛ కూడా సమానంగా ఉంది. 

రజాకార్లంటేనే దుర్మార్గాలకు, దోపిడీలకు ప్రతీకలుగా చరిత్రలో నిలిచిన వారు. కానీ ‘పెద్దాపురం వేశ్య’ లు అలా కాదే. రజ్వీ తెలంగాణ ప్రజల, నిస్సహాయుల మాన ప్రాణాలను  దుర్మార్గంగా దోచుకున్న మూకకు నాయకుడు. జనహననం సాగించిన వాడు. కానీ ‘పెద్దాపురం వేశ్య’ అంటే వారు తమ మానాన్ని తమ బతుకు తెరువుగా మార్చుకున్న వారు మాత్రమే. వారు ఎవ్వరినీ దోచుకోలేదు. కడుపుకాలుతున్న వారి పొట్టకొట్టి వారు తాము మేడలు కట్టుకున్న వారు కాదు. ఇవాళ పొన్నం ప్రభాకర్‌ కావొచ్చు… మరొకరు కావొచ్చు.. వేశ్య అంటే అంత చులకన భావం ఎందుకు వస్తుంది?  ఒక వృత్తిని, ఒక ఊరిని, ఒక సాంప్రదాయాన్ని అవమానించే విధంగా మాట్లాడినందుకు ,, ఆ మాటకొస్తే.. దుర్మార్గపు విలువలతో నిలకడలేని పోకడలతో సాగుతూ ఉండే రాజకీయ వివాదాల్లోకి గుట్టుగా సాగిపోయే తమను ఈడ్చుకు వచ్చినందుకు… అసలు మీరు ‘పెద్దాపురం వేశ్య’ లకు క్షమాపణ చెప్పాలి. 

వేశ్యలంటే రాజకీయనాయకుల్లాగా ఏ ఎండకాగొడుగు పడుతూ ఏ రోటికాడ ఆ  పాట పాడుతూ బతుకీడ్చే వారు కాదు. వారికి ఉన్నన్ని విలువలు, కట్టుబాట్లు, నిబద్ధత ఈ రాజకీయ నాయకుల్లో కనీసం పది శాతం మందికి ఉంటే అసలు ఈ దేశం మొత్తం ఎప్పుడో బాగుపడిపోతుంది. సనాతనంగా.. సంఘంలో రకరకాల వృత్తుల ఏర్పాటు/ వ్యవస్థ నిర్మాణం జరిగినప్పుడు ఒక వర్గాన్ని వేశ్యలుగా.. కొన్ని పనులకు నిర్దేశించడం జరిగిందే తప్ప.. వారు ఎవ్వరినీ దోచుకోవడం లక్ష్యంగా స్వార్థం ఆలంబనగా బతుకుతున్నవారు కాదు. తమ మానం అమ్ముకుని, తాము బతుకుతున్నవారే తప్ప.. ఇతరుల అభిమానాన్ని, ఇతరుల విశ్వాసాల్ని, నమ్మకాల్ని, అనుబంధాలను తార్చేసి.. ఆ పునాదుల మీద తమ రాజకీయ ఉన్నతుల హర్మ్యాలను నిర్మించుకోజేసే నాయకుల దళారీ ధోరణి వారెరుగరు. 

నాయకుల మధ్య వైషమ్యాలు లక్షరకాలుగా ఉండవచ్చు గాక.. అంత మాత్రాన వారి రచ్చల్లోకి ఇతరుల వ్యక్తిత్వాన్ని లాక్కొచ్చే హక్కు వారికి ఉండదు. వేశ్యలకు వ్యక్తిత్వం లేదని తమరనగలరా? ‘పెద్దాపురం వేశ్య’ తో పోల్చాలా.. అంటూ వారేదో.. పనికి మాలిన వారైనట్లుగా, దుర్మార్గులు అయినట్లుగా.. మాట్లాడిన మీరు ఈ విచక్షణను అలవాటు చేసుకోవాలి. 

మామూలుగా అయితే మీకు కుల రాజకీయాలు అలవాటు. కులం పేరిట తిట్టాలంటే మీకు జడుపు. ఆ కులం వారంతా జట్టుకట్టి మీమీద వాగ్దాడులకు దిగుతారేమోనని భయం. కానీ ఒక వృత్తిలో ఉంటూ.. తమ బతుకేదో తాము బతికిపోతున్న.. నిజానికి, ఆ వృత్తిలోంచి బయటకు వచ్చి ఎంతెంతో ఉన్నత స్థానాలకు వెళ్లిన కుటుంబాలు వ్యక్తులు వందల్లో ఉన్నా.. ఆ ముద్రలోంచి బయటకు రాలేకపోతున్న పెద్దాపురం వేశ్యలను మాట అంటే వారి తరఫున మీమీద విరుచుకు పడడానికి ప్రత్యేకించిన కులం ఏదీ లేదు లెమ్మని మీకు ధీమా కావొచ్చు. తమను వాడుకునే వారు తప్ప ఆదుకునే వారంటూ ఎవ్వరూ లేకపోవడం వారికి శాపం కావొచ్చు. కానీ అలాంటి వారి పట్ల తర్కబద్ధమైన ఆలోచనను, విచక్షణను పెంచుకుని.. రాజకీయాల్లోకి ఈడ్చుకు వచ్చినందుకు ‘పెద్దాపురం వేశ్య’ లకు క్షమాపణ చెబితే.. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఔన్నత్యాన్ని కాపాడుకున్నట్లు, నిరూపించుకున్నట్లు  ఉంటుంది. 

– సెలవు.. ప్రేమతో..

కపిలముని