లవ్‌ లెటర్‌ : కేటీఆర్‌! తల్లిని చీల్చొద్దు..

డియర్‌ తారకరామా… Advertisement అలా పిలుస్తోంటే చాలా హాయిగా ఉంది. ఈ రాష్ట్రం మీద అసామాన్యమైన ముద్ర వేసిన నందమూరి తారకరాముని పేరును మీ నాన్న నీకు ఎంత ముచ్చటపడి పెట్టుకున్నాడో గానీ.. అంత…

డియర్‌ తారకరామా…

అలా పిలుస్తోంటే చాలా హాయిగా ఉంది. ఈ రాష్ట్రం మీద అసామాన్యమైన ముద్ర వేసిన నందమూరి తారకరాముని పేరును మీ నాన్న నీకు ఎంత ముచ్చటపడి పెట్టుకున్నాడో గానీ.. అంత మంచి పేరు ప్రజల నోళ్లలో నానకుండా.. ఈ సంకుచిత మీడియా ప్రపంచం ‘కేటీఆర్‌’ అంటూ జవం జీవం లేని పొడి అక్షరాల్లో నిన్ను గురించి ప్రస్తావిస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది తమ్ముడూ! తారకరామా అని పిలుస్తోంటే.. ఎంత బాగా ఉన్నదో చెప్పలేను. 

నాన్న బీజం వేసిన ఉద్యమాన్ని నీకు చేతనైనంత దూకుడుగా నేవర్ధిల్ల జేయడంలో నీవంతు ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు. సంతోషం. ఇలాంటి ఉద్యమాల్లో తార్కికంగా మాట్లాడడం కంటె వాస్తవాలు మాట్లాడడం కంటె.. ఆవేశంగా మాట్లాడడమే, రెచ్చగొట్టే లాగా మాట్లాడడమే చాలా మంచిఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆ సంగతి నాన్నకు లాగానే నీకు కూడా బాగా తెలుసు. ఆ సూత్రం వంటబట్టిన వాడివి గనుకనే.. నాన్నలాగా తెలంగాణ యాస నీ భాషలో దొర్లకపోయినా.. చాలా శిష్ట వ్యావహారికంలో.. (కొందరు చెప్పుకునేమాదిరిగా కృష్ణా జిల్లా వాళ్ల భాష మాదిరిగా) చక్కగా మాట్లాడుతూ… విమర్శల్ని మాత్రం తీవ్రాతి తీవ్రంగా సంధిస్తుంటావు. అంతవరకు బాగానే ఉంది. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం ఆ ప్రాంత వాసుల హక్కు. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆ ప్రాంతంలో.. రాష్ట్రం వస్తేనే తాము బాగుపడతాం అని నమ్ముతున్న వారందరూ కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నవారు కూడా ఉన్నారు. వారు మిన్నకుంటున్నారు. అదే సమయంలో సమైక్యంగా ఉండాలని మిగిలిన ప్రాంతంలోని కొందరు అంటున్నారు. అందుకు అనుగుణంగా ఉద్యమిస్తున్నారు. ఇదంతా ప్రస్తుత సమస్యకు ఒక పార్శ్వం. 

రెండో పార్శ్వం ఏమిటంటే.. అది నీ సహచరులనుంచే వినవస్తోంది. సందర్భాన్ని బట్టి దూకుడుగా కాకుండా, మెతగ్గా మాట్లాడే ప్రతిసారీ ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే.. 1) తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి? నిజమే ఈ వాదన ఇంతవరకు కరక్టే. 2) మనం అన్నదమ్ముల్లా ప్రేమగానే విడిపోదాం! నిజమే విడిపోవాల్సిన నిర్ణయమే వస్తే గనుక మనం అలాగే విడిపోవాలి. ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు  మిగలకూడదు. ఉద్యమాలు నడిపి, విఫలమైన వారికి అసంతృప్తులు తప్ప.. విద్వేషాలు రగలకూడదు. అందరూ అన్నదమ్ముల్లాగానే విడిపోవాలి. ప్రేమను పంచుకునే విడిపోవాలి. 

అయితే ఇక్కడ నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ‘అన్నదమ్ములం’  అని నువ్వుగానీ, మీ బావ గానీ, మీ నాన్నగానీ, అక్కగానీ,.. మీ పనుపున మాట్లాడుతూ ఉండే పెద్దలు గానీ అంటుండే మాట చాలా వాస్తవం. మనం ఒక్క తల్లి బిడ్డలం. విడిపోవడం, కలిసి ఉండడం గురించి మనం నిర్ణయం వచ్చే వరకు కొట్టుకోవచ్చు. అయితే మనం కొట్టుకునే సందర్భంగా మన తల్లిని బజారకి ఈడ్చుకు రావడం ఎందుకు? మన తల్లిని అవమానపరచడం ఎందుకు? నీవైపు నుంచి అలాంటి పొరబాటు జరుగుతోంది. అందుకే ఈ లవ్‌లెటర్‌ రాయాల్సి వచ్చింది. ఆ తల్లి ‘తెలుగుతల్లి’. ఆ సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. 

మనం అన్నదమ్ముల్లాగానే గొడవ పడాలి. అన్నదమ్ముల్లాగానే విడిపోవాలి. అమ్మను అవమానించడం నీకు తగదు. అదే అమ్మకు సీమాంధ్రలో ఒక రకమైన ఆహార్యం ఉండొచ్చు… చేత వరికంకులు ఉండొచ్చు… అన్నపూర్ణగా పేరున్న ఆ అమ్మకు నీ ప్రాంతంలోనూ అంటే తెలంగాణ ప్రాంతలోనూ గరిష్టంగా వరి పండే ప్రాంతాలు పుష్కలంగా ఉన్నాయనే వాస్తవాన్ని ప్రయత్నపూర్వకంగా విస్మరించి.. నువ్వు నీ ప్రాంతంలో ప్రతిష్ఠించుకున్నప్పుడే అదే అమ్మకు చేత వరికంకులస్థానే జొన్న కంకులు పెట్టి.. మరో రకమైన ఆహార్యంతో పూజించుకోవచ్చు. నీ ఇచ్ఛకు, వారి ఇచ్ఛకు మధ్య అమ్మ వేషం, ఆహార్యం మారొచ్చు కానీ.. అమ్మే మారిపోదు. ఈ ప్రపంచంలో మనం మార్చుకోలేని ఒకే ఒక్క బంధం అమ్మే. అది నువ్వు కూడా కాదనలేవు. 

నువ్వు కోరుకుంటున్న రాష్ట్రం రాకుండా అడ్డు పడుతున్నారని నీలో ఆవేశం కట్టలు తెంచుకుంటే.. నీ అన్నదమ్ములని అదే సీమాంధ్ర వాదులని నువ్వు లక్షరకాలుగా తూలనాడు.. గొడవ పడు.. సబబే. కానీ అమ్మని పట్టుకుని సవతి తల్లి అంటూ దూషించడం పాడి కాదు. తల్లిని దూషించే సంస్కృతి ఏ ప్రాంతమూ, ఏ మతమూ, ఏ వర్గమూ, ఏ దేశమూ మనకు నేర్పదు గాక నేర్పదు. 

ఎంతగా ఆవేశం కట్టలు తెంచుకునే సందర్భం ఎదురైనా కూడా.. తల్లీ చెల్లీ అనే విచక్షణ కొంత ఉండాలి. ప్రాంతం ఏదైనా మన సంస్కృతి నేర్పే సంస్కారం అది. బాగా చదువుకున్న వాడివి.. దేశాంతరాలు తిరిగొచ్చిన జ్ఞానం సముపార్జించిన వాడివి.. ఈ సంగతి నీకు తెలియనిది కాదు. కానీ ఆవేశంలో అప్పుడప్పుడూ మాట మీరిపోతున్నావు. మనం అన్నదమ్ములమే.. అమ్మ ఒక్కటే అనే సత్యం బోధపరచుకోవాలి. అమ్మను నువ్వు ఆమోదించకపోయినా కూడా.. అన్నదమ్ములతో  తగాదాలోకి అమ్మని ఈడ్చుకు రావడం కూడా కరెక్టు కాదు. అంతవరకు ఆచరించగలిగితేచాలు. 

`ప్రేమతో

కపిలముని