అక్బర్ భాయ్.. ఆదాబ్!!
నిన్ను గానీ, అన్నయ్య అసద్‌ను గానీ చూస్తే ఒకందుకు నాకు చాలా ముచ్చటేస్తుంది అక్బర్ భయ్యా…! మీరిద్దరూ చాలా చక్కగా మాట్లాడుతారు.. అసెంబ్లీలో ప్రసంగాలు చేసేప్పుడు చూడముచ్చటగా ఉండే ప్రసంగాల్లో మీవి కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత ఆవేశంగా మాట్లాడతారో.. అంతే లాజికల్‌గా మాట్లాడతారు. బాగా చదువుకున్న అతి కొద్దిమంది ఎమ్మెల్యేల తరహాలో చక్కటి ఇంగ్లీషు, హిందీ`ఉర్దూ కలిపి సాగే మీ ప్రసంగాలు సహజంగానే ముచ్చటగా ఉంటాయి. అందుకు మీ బ్రదర్స్ ఇద్దరినీ తప్పక అభినందించాల్సిందే!
అలాగే నాన్న జమానాకు, మీ జమానాకు మధ్యలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌లో చిన్న (చిన్న కాదు చాలా పెద్ద) మార్పు తీసుకు వచ్చినందుకు కూడా మీకు మరోసారి అభినందనలు చెప్పాలి భయ్యా! ఇది ముస్లింల పార్టీ గా అప్పట్లో ఉండేది.. కానీ మీరొచ్చిన తర్వాత.. ముస్లింలకు మాత్రమే పరిమితమైన పార్టీ కాదు.. ఇందులో హిందువులు కూడా ఉంటారు, పదవుల్లోనూ ఉంటారు అనే కొత్త పోకడను మీరు తీసుకువచ్చారు. మొన్నటికి మొన్న అఖిలపక్షానికి వెళ్లేప్పుడు కూడా అన్నయ్యతోపాటు, మీ ముస్లిం పార్టీ తరఫున ఒక హిందువును ప్రతినిధిగా తీసుకువెళ్లారు. అలా మీ పార్టీ విస్తృతిని పెంచుతూ పోయే ప్రయత్నం కూడా కచ్చితంగా అభినందించాల్సిందే.
అయితే భయ్యా… హిందూ పొలిటీషియన్లు.. మసీదులకు వచ్చి నెత్తిన కర్చీఫు ఉంచుకుని నమాజులు చేసినట్లే.. మీరు కూడా అప్పుడప్పుడూ హిందూ ఆలయాలకు, కనీసం మీ చార్‌మీనార్ తో అనుబంధం పెనవేసుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికో వచ్చి.. బొట్టు పెట్టుకో అక్కర్లేదు. ఓ దణ్నం పెట్టుకుంటే బాగుండునని నాకు అనిపిస్తుంది గానీ.. బహుశా మతం ప్రాతిపదికగా పార్టీ ఆవిర్భవించినప్పుడు.. మతంలోని మూలాలు అందుకు అంగీకరించకపోవచ్చు. కానీ ఇస్లాం పుట్టిన పరిస్థితుల్లో పరమత సహనం అనేది అనూహ్యమైన సంగతి. ఆరోజు పరిస్థితులు, ఆ మతానికి పొంచి ఉన్న ప్రమాదాలు వేరు. అందువల్ల అలాంటి ప్రస్తావన లేకుండా.. ఇస్లాం ఓ అద్భుతమైన జీవన శైలిని ప్రవచిస్తూ వెళ్లింది. కానీ, కాలక్రమంలో పుట్టిన ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు, దేశాలకు, ఖండాలకు కూడా మతం విస్తరించిన తర్వాత.. పద్ధతులు కూడా మారుతూ వచ్చాయి. ఇవాళ ముస్లిం కుర్రాళ్లు పాల్గొనకుండా నేను గణేశ్ పండుగను చూసిన సందర్భం లేదు. హిందూ కుర్రాళ్లు కాలు కలపకుండా.. పీర్ల పండగ రోజున అగ్గితొక్కడం పూర్తయ్యేదీ ఉండదు. అంతగా మనం జీవితాల్లో కలిసిపోయాం.
అయితే భయ్యా! పరమతసహనం ఉండడం వేరు, పరమత ద్వేషం ఉండడం వేరు, ఆ ద్వేషాన్ని విషంలా కక్కడం వేరు!! ఎంతో బాగా చదువుకున్నావ్.. తర్కం తెలిసిన వాడివి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు నువ్వు. కుర్రవాడివి.. రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నవాడివి. నీలో ద్వేషం ఉన్నా కూడా అది ఒక ఎత్తు.. ఒక్కో వ్యక్తిని ఒక్కో రకమైన ద్వేషం… హరించేస్తూ ఉంటుంది.. కాన్నీ దాన్ని విషంలా కక్కడం.. వైరస్‌లా మరింత మందికి అంటించే ప్రయత్నం చేయడం ఏపాటి విజ్ఞత.
నువ్వు ఏం అన్నావు.. ఏం అనలేదు.. అనే సంగతి ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఆ తరువాతి విషయాలను మాత్రమే నేను చెప్తాను. కొంచెం సావకాశంగా విను. నీ వ్యాఖ్యలు మళ్లీ రాసి రగడకు రెండు చితుకులు జతచేయడం నా ఉద్దేశం కాదు. కానీ వ్యాఖ్యల తర్వాత రేగిన వాటిని నువ్వు సమీక్షించుకోవాలి.
రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు… (తాజాగా మీతో నేస్తం కట్టాలని ఉవ్విళ్లూరుతున్న వైకాపా మినహా) నిన్ను ముక్తకంఠంతో తిట్టిపోశాయి. నీ పదవిని పీకేయాలని అంటున్నాయి. నువ్వు దేశద్రోహం చేశావంటున్నాయి. ఇలాంటి విమర్శలన్నీ అభూతకల్పనలని, కావాలని అంటున్నారని, ఆ విమర్శలు నీకు తగవని, మీడియాలో వక్రీకరించారని…. సత్యం మాత్రమే పలకాలని ప్రవచించే పవిత్ర ఖురాన్‌ను విశ్వసించే నువ్వు.. గుండెల మీద చేయివేసుకుని ధైర్యంగా పలకగలవా? కష్టం అక్బర్ భాయ్! బయటి విమర్శలు చేసే ఎన్ని వేల మందిని మనం డబాయించి బతకగలిగినా.. మన ఆత్మసాక్షి నిలదీసినప్పుడు డబాయించడం, మనం విశ్వసించే అల్లా ఆత్మసాక్షి రూపేణా నిలదీసినప్పుడు బుకాయించడం అసాధ్యం.
భాజపా నిన్ను ఆడిపోసుకోవడంలో, నీ తిట్లనుంచి మరింత రాద్ధాంతం సృష్టించి.. దాన్ని తమ ఓటుబ్యాంకు మార్గంగా మార్చుకోవాలని ప్రయత్నించడంలో వింతేమీ లేదు. కానీ, అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్, తెలుగుదేశం, చివరికి మతాలను, కులాలను గుర్తించని, దేవుడు అనే విశ్వాసాలను (వ్యక్తిగత హోదాలో తప్ప) పాటించని వామపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో నిన్ను తప్పు పడుతున్నాయి. సామాజికసంఘాలు, ప్రజా సంఘాల పరిస్థితి చెప్పక్కర్లేదు. నిర్మల్‌నుంచి ఢల్లీి వరకు ఆ వెల్లువ కొనసాగుతోంది. ఇందరు నిన్ను విమర్శిస్తున్నా.. ఇంకా నీలో ఆత్మవిమర్శ కోణం మేలుకోవడం లేదా అక్బర్ భాయ్! ఒకసారి పునరాలోచించుకో!
సరే, తిట్టే వాళ్ల సంగతి పక్కన పెట్టు. కనీసం నీ వెనుక ఇవాళ ఎవరు నిలబడి ఉన్నారు. నీకు సెక్యూరిటీ కింద తరలివచ్చినట్లుగా వివాదం ఉన్న ప్రస్తుతం సమయంలో నీ చుట్టూ మోహరించి, జాగ్రత్తగా కాపాడుకుంటున్న సొంత పార్టీ అనుచరుల్ని పక్కన పెట్టు. మీ అన్నయ్య కూడా.. స్పష్టంగా ‘అక్బర్ తప్పు చేయలేదు` నిందలన్నీ అవాస్తవం. అరెస్టు చేసినా, శిక్ష పడినా సహించం’ అనగల స్థితి ఇవాళ ఉందా?
రాష్ట్రంలో నీకు వ్యతిరేకంగా ఎన్ని ప్రదర్శనలు జరిగాయో.. బహుశా నువ్వు గమనించకపోయినా.. ఎవరో ఒకరు లెక్కచెప్పగలరు. కానీ నీకు అనుకూలంగా.. అక్బర్ తప్పు చేయలేదు ` అని చెప్పే ప్రదర్శన రాష్ట్రంలో.. ఏమూలనైనా ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? కనీసం నువ్వు ఏ మతం వారినైతే రెచ్చగొట్టాలని చూశావో.. ఏ మతం వారందరూ కలిసి ఉమ్ము వేస్తే హిందూ ఆలయాలు కొట్టుకుపోతాయన్నావో… ఏ మతం వారు తెగిస్తే ఏం జరుగుతుందో చూడాలని పిలుపునిచ్చావో.. ఆ మతం వారు ఒక్కటంటే ఒక్క చోట కూడా నీకు మద్దతుగా చిన్న ప్రకటన, ప్రదర్శన చేయలేదు. నీ వ్యాఖ్యలు, నీ ప్రస్థానం ఎంత వ్యర్థపూరితమో గుర్తించావా? ఆలోచించు.
ఎందుకంటే` వారందరూ ఇక్కడ కుటుంబంలో సభ్యులు అక్బర్ భాయ్. నువ్వూ నేనూ ఉన్నట్టే. నీకు అక్బర్ అనీ, నాకు కపిలముని అని పేర్లున్నట్టే.. వాళ్ల వాళ్ల బృందాలకు హిందువులని, ముస్లిములని, క్రిస్టియన్లు అనీ పేర్లు వేరే ఉన్నాయి తప్ప.. అందరూ ఒక కుటుంబ సభ్యులే. ఆ సంగతి తెలుసుకోవాలి నువ్వు.
ఏదో ఒక దుర్ముహూర్తంలోనో.. ఒళ్లు స్పృహ తెలియని స్థితిలో ఉన్నప్పుడో.. నువ్వు అన్నయ్య అక్బర్‌నే నానా తీవ్రమైన దూషణలతో తిట్టిపోశావనుకో.. ఏం జరుగుతుంది? తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత.. క్షమించమని అడుగుతావ్. తిరిగి అన్నయ్యతో నీ సుహృద్భావ సోదర బంధాన్ని పునర్నిర్మించుకుంటావ్! అంతేకదా! ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సిన పని అదే. హిందూ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ముస్లింలకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ వ్యాఖ్యల వల్ల ప్రతి ఊరిలోనూ ముస్లింలను ఎవరైనా అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడితే.. అది నీ బాధ్యత. దానికి కారణమైనందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ముస్లిం సమాజంలో వారి బుర్రల్లో విషం ఎక్కించడం నువ్వు అనుకున్నంత సులభం కాదు అక్బర్ భాయ్. వారు ఈ కుటుంబంలో భాగమైపోయి వందల సంవత్సరాలు గడుస్తోంది. ఈరోజు ఒకటిరెండు మాటలతో ఒకరిద్దరిని మాత్రమే వేరుచేసి, విషపూరితం చేయగలం గానీ, యావత్తు ముస్లిం సంఘాన్ని విషపూరితం చేయడం అసాధ్యం.
క్షమాపణ వేడుకోవడం తప్పు కాదు అక్బర్‌భాయ్! అది నీ ఔన్నత్యాన్ని నిరూపిస్తుంది. క్షణికావేశంలో లక్ష మాటలు అంటాం.. కానీ విచక్షణ తిరిగి మేలుకున్న తర్వాత.. మనలో ఉన్నది మనిషేననే సంగతిని ఈ క్షమాపణ తిరిగి ప్రపంచానికి చెబుతుంది. అందుకే అక్బర్ భాయ్.. నువ్వు అందుకు మానసికంగా సిద్ధం కావాలి. బుకాయింపులు మానుకోవాలి.
అన్నిటినీ మించి నువ్వు మరో పనిచేయాలి. సర్వశక్తిమంతుడైన అల్లాను మనసారా ప్రార్థించాలి. నీ నోటమ్మట అలాంటి పరుషవాక్యాలు పలికినందుకు నువ్వు మనసారా అల్లాకు క్షమాపణలు వేడుకోవాలి. నీకు మంచి ఆలోచనలు ప్రసాదించమని.. నీ వృద్ధికి, నీ పార్టీ అభివృద్ధికి, నువ్వు ప్రాతినిధ్యం వహించదలచుకునే ముస్లిం సమాజపు అభివృద్ధికి ఉపకరించగల మంచి ఆలోచనలు నీకు ప్రసాదించమని నువ్వు సర్వవ్యాపి, నిరాకార స్వరూపుడు అయిన అల్లాను వేడుకోవాలి. ఈ సమాజం విషపూరితం కాకుండా ఉండాలని, అలాంటి ఉపద్రవాలు ఏవైనా పొరబాట్న జరిగినా.. అందుకు నువ్వు కారణం కాకుండా ఉండాలని.. అందుకు అనుగుణంగా అల్లా అనుగ్రహించాలని నువ్వు వేడుకోవాలి.
ఖయామత్ రోజున` నువ్వు ప్రభువు ముందు` మహోన్నతుడు, దయామయుడు అయినటువంటి అల్లా ముందు నువ్వు సగర్వంగా, కల్మషరహితంగా, నిర్భయంగా నిల్చునే పరిస్థితి మాత్రమే నీకు ఉండాలి.
అల్లా కే నామ్ పర్ ఆదాబ్.
– కపిలముని