ఫన్‌చర్‌ : మెగా మంత్రిత్వ మోడలింగ్‌!

అనగనగా మన మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన ఇప్పుడు స్టారాధిస్టారుడు. కేంద్రమంత్రిగా భారతీయ టూరిజం ఘనతను యావత్తు ప్రపంచానికి తెలియజెప్పవలసిన, భారతీయ టూరిజం రంగాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాల్సిన స్థాయిలో, స్థానంలో ఉన్నవాడు. ఇండియన్‌ టూరిజం…

అనగనగా మన మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన ఇప్పుడు స్టారాధిస్టారుడు. కేంద్రమంత్రిగా భారతీయ టూరిజం ఘనతను యావత్తు ప్రపంచానికి తెలియజెప్పవలసిన, భారతీయ టూరిజం రంగాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాల్సిన స్థాయిలో, స్థానంలో ఉన్నవాడు. ఇండియన్‌ టూరిజం ప్రాధాన్యాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజెప్పేలాగా.. భారతీయ సినిమా స్టార్లు అందరితోనూ కలిపి కొత్త రకం బ్రాండ్‌ ప్రమోసన్‌ యాక్టివిటీ రూపొందిస్తానని కూడా అన్నయ్య తాను పదవి అధిష్ఠించిన తొలిరోజుల్లోనే ప్రజలకు హామీ ఇచ్చారు. అనివార్యంగా అలాంటి ప్రమోషన్‌లో సౌతిండియన్‌ స్టారాధిస్టారుడు.. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఉంటారనడంలో సందేహం లేదు. ఒక సంస్థను ప్రమోట్‌ చేయాలంటే.. మోడల్స్‌ను ఎంచుకునే బదులు, కంట్రీక్లబ్‌ రాజీవ్‌ రెడ్డి లాగా.. సంస్థ యజమానే రకరకాల గెటప్పులతో మోడలింగ్‌ చేయడం అనేది మనకు కొత్త కాదు. అలా ఒక శాఖ చూసే కేంద్ర మంత్రి తనే రంగేసుకుని ఆ శాఖ ప్రమోషన్‌కు మోడలింగ్‌ చేసే రోజులు చిరంజీవితో శ్రీకారం దిద్దుకోవచ్చు. 

అయితే ఆయనకు పదవిని కట్టబెట్టే ముందు సోనియాగాంధీ ఇంతదూరం ఆలోచించి ఉండకపోవచ్చు. అయితే అన్నయ్య తానిప్పుడు ఏం చేయాలన్నా అమ్మ గ్రీన్‌సిగ్నల్‌ అందుకోవాలి. అంటే.. తాను బ్రాండ్‌ ప్రమోషన్‌ చేయగలననే సంగతి అమ్మ దృష్టికి తీసుకెళ్లాలి. అందుకేనేమో.. తెలుగులో 9న విడుదల కాబోతున్న తనయుడు రాంచరణ్‌ సినిమా తొలి ట్రైలర్‌లో అన్నయ్య బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం మోడలింగ్‌ చేస్తూ ప్రజలకు కనువిందు చేస్తున్నాడు. 150 వ సినిమా అనేది మిత్‌ అవుతుందేమో అనే సందేహం అభిమాన జన సందోహాన్ని వేధిస్తోంటే.. అలాగే అవుతుందేమో..అయినా మేకప్పులకు దూరంగా నేనుండలేనుగా అన్నట్లు.. అన్నయ్య ఎంచక్కా.. నాయక్‌ సినినమా గురించి.. నాలుగు టిక్కెట్లు ఎక్కువ అమ్ముడయ్యేలా.. విపరీతమైన పొగడ్తలను గుప్పిస్తున్నారు. 

‘డ్యాన్సుల్లో రాంచరణ్‌ ఎక్కడికో.. ఎక్కడికో వెళ్లిపోయాడని’ కీర్తిస్తూ.. ఈ చిత్రంలో నవరసాలు అద్భుతంగా పండాయని శ్లాఘిస్తూ చిరంజీవి సినిమాను కీర్తిస్తున్నారు. 

చూడబోతే నాయక్‌ ఆడియో వేడుకలో ఢల్లీినుంచి లైవ్‌లో చిరంజీవి అందించిన సందేశంలోంచే క్లిప్పింగులు తీసి.. ఈ తొలి ట్రైలర్‌లో వాడుకున్నట్లుగా కనిపిస్తోంది. అయినా సరే.. ఇలా చిల్లరగా సినిమాల యాడ్‌లలో కనిపిస్తూ.. రకరకాల హావభావాలతో పొగడుతూ చేయడం ఆయన స్థాయికి తగని పని. 

సినిమా వేడుకలకు హాజరు కావడం ఒక ఎత్తు.. చిరంజీవి ఎంతటి మెగాస్టార్‌ అయినా.. అది ఒకప్పటి వైభవం అనే స్పృహ ఆయనకు ఉండాలి. సినిమా ఫంక్షన్లకు వెళ్లినా.. తాను మంత్రి స్థాయిలోనే ప్రవర్తించాలి తప్ప సినిమా ఇండస్ట్రీ వాళ్ల తరహా పొగడ్తలతో పలుచన కాకూడదు. ఇలా ఒక సందర్భంలో మాట్లాడినప్పటి విజువల్స్‌ను మరో సందర్భంలో అడ్డగోలుగా యాడ్‌ల కోసం వాడుకోవడం అనే అపభ్రంశపు పోకడకు కూడా ఆయన స్వస్తి పలికించాలి. 

చిరంజీవి ఈ వాస్తవాల్ని గుర్తిస్తే బాగానే ఉంటుంది. ఒకవేళ ఆయనకు ఇవన్నీ తెలిసినా కూడా.. బ్రాండ్‌ ప్రమోషన్‌లో తనది అందెవేసిన చేయి.. అనీ.. సునాయాసంగా యాడ్స్‌ గట్రా చేసేయగలననీ.. అలా కూడా దేశానికి, యూపీఏకి, ప్రభుత్వానికి తన సేవల్ని వినియోగించుకోవచ్చనని సంకేతం ఇవ్వడం కోసం ఈ మెగా మంత్రిత్వ మోడలింగ్‌ రూపంలో పాట్లు పడుతోంటే మనం ఏమీ చేయలేం. చూసి.. సరదాగా నవ్వుకుని.. ఆనందించడం తప్ప!