‘ఫన్‌’చర్‌ : చంద్రాయణంలో పిట్టకథ!

అనగనగా ఒక ఊరిలో ఓ దంపతులు ఉన్నారట. పిసినిగొట్టు తనానికి ఆ దంపతులు ఆ చుట్టుపక్కల ఊళ్లలో కూడా పేరుమోసిన జంట. ఎంగిలి చేత్తో కాకిని విదిలించని బాపతు వాళ్లన్నమాట. అలాంటి వారి ఇంటికి…

అనగనగా ఒక ఊరిలో ఓ దంపతులు ఉన్నారట. పిసినిగొట్టు తనానికి ఆ దంపతులు ఆ చుట్టుపక్కల ఊళ్లలో కూడా పేరుమోసిన జంట. ఎంగిలి చేత్తో కాకిని విదిలించని బాపతు వాళ్లన్నమాట. అలాంటి వారి ఇంటికి అతిథులు వస్తే మాత్రం వారికి ఏం పెడతారు? అందుకే బంధువుల్లో ఎవ్వరూ వారికి ఇంటికి కూడా వెళ్లేవారు కాదట.. కనీసం టీనీళ్లు కూడా వారి ఇంట్లో తాగగలగడం అనేది సాధ్యమయ్యే పనికాదని అందరూ అనుకుంటుండేవారట. అలాంటి కుటుంబంలో ఓరోజు తను భోం చేసి వస్తానంటూ ఓ బంధువు మిగిలిన వారితో పందెం కాసి వారి ఇంటికి వచ్చాట్ట. 

అనుకున్న సుముహూర్తానికి బంధువు ఇంటికొచ్చాడు. దంపతులిద్దరూ మంచినీళ్లు అందించి ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. బంధువు కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. పాపం ఇంటి ఇల్లాలు వంటపూర్తి చేసి కూర్చుంది. భోజనం వేళ అయిన తర్వాత తనకు కూడా భోజనం పెట్టకుండా  ఎంలా పంపుతార్లే అని మంకుపట్టు భావనతో ఉండిపోయాడా బంధువు. వీడు లేచి వెళ్లడం లేదే.. వీడికి తిండి తగలేయడం కంటె.. వెళ్లాక మనం తినడం మంచిది కదా అని వేచిచూస్తున్నారు. అయితే బంధువు వెళ్లలేదు. 

ఇంతలో హఠాత్తుగా భార్యాభర్తలు అకారణంగా తగవు పెట్టుకున్నారు. ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. తగాదా చిలికి చిలికి గాలివానగా మారింది. బర్త, భార్యను పట్టుకుని వంగదీసి వీపును నాలుగు దెబ్బలు చితక్కొట్టాడు. ఆ భార్య ‘ఓలమ్మో నా మొగుడు చంపేస్తున్నాడు బాబో’ అంటూ ఊరు ఊరంతా దద్దరిల్లి పోయేట్టు ఏడుపు మొదలెట్టింది. ఈ రగడ మొత్తం తారస్థాయికి చేరుకునే సరికి.. అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ల ఇంట్లో ఓ పూట భోజనం చేసి వెళ్లి.. తాను పందెం గెలవాలనే పంతంతో కూర్చున్న బంధువుకు భయం వేసింది. వీరి మధ్య గొడకు మధ్యలో తాను జవాబుదారీ కావాల్సి వస్తుందేమోనని గొడవ మధ్యలో మెల్లగా జారుకున్నాడు. 

ఓ అయిదు నిమిషాలు గడిచాయి. భర్త రంకెలు, భార్య ఏడుపులు` పెడబొబ్బలు తగ్గాయి. అంతా చల్లబడ్డాక భర్త ప్రేమగా భార్య దగ్గరకు వచ్చాడు. 

‘ఏడవకే పెళ్లామా.. ఆ బంధువు గాడు పారిపోయేలా చేయాలనే ఉద్దేశంతో కొట్టినట్టుగా నటించానే తప్ప నిన్ను కొట్టాలని కొట్టలేదే పెళ్లామా’ అని ప్రేమగా అన్నాడు.

అందుకు ఆ భార్య కళ్లు తుడుచుకుంటూ ఇలా జవాబిచ్చింది.. ‘నాక్కూడా వాడు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఏడ్చినట్లుగా నటించానే తప్ప.. నేనూ ఏడవాలని ఏడవలేదు మొగుడా! ఇక మన భోజనం చేద్దాం పద’ అని చెప్పింది. 

ఇంతలో తలుపు తలుపు దగ్గర చప్పుడు వినిపించి ఇద్దరూ అటు తిరిగి చూశారు.. ఆశ్చర్యం! అక్కడ బంధువు ఉన్నాడు. ‘నేను కూడా వెళ్లాలని వెళ్లలేదు దంపతులారా… వెళ్లినట్లుగా నటించా అంతే! నాక్కూడా ఒక ఆకు వడ్డించండి’ అంటూ వచ్చి కూర్చున్నాడట…!!

కుక్కకాటుకు చెప్పుదెబ్బ వంటి ప్రస్తావన కోసం పెద్దలు ఈ పిట్ట కథను చెబుతుంటారు. 

తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. ఎఫ్‌డీఐలపై ఓటింగుకు ఆ పార్టీ సభ్యులు ముగ్గురు ఎగ్గొట్టారు. బాగుంది. దానిపై కథలో  భర్త లాంటి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెగ సీరియస్‌ అయ్యారు. వారి మీద ఆగ్రహంతో నిప్పులు కురిపించారు. ఆయన ఊపు చూసిన జనం… ఓయబ్బో పార్టీనుంచి వెలేస్తాడేమో అనుకునే రేంజిలో కనిపించారు. తీరా వాళ్లు వచ్చి వివరణ ఇచ్చారు. సుజనా చౌదరి ఏకంగా… రాజీనామా కూడా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ఆ రాజీనామాను తన ఫైళ్లలో వేసుక్కూర్చున్నారు. 

బాబుది (భర్తలాగా )బూటకాగ్రహమే తప్ప… తిట్టాలని తిట్టలేదు. సుజనాచౌదరి ప్రభృతులది (భార్యలాగా) నాటక పశ్చాత్తాపమే తప్ప.. నిజంగా పదవులు వదిలేసుకోవాలని రాజీనామా రాయలేదు. ఎటొచ్చీ మధ్యలో బకరా అయిపోయిన బంధువు లాగా మనం విమర్శించడం వల్లనే ఇంత కోపమూ, ఈ రాజీనామాలు జరిగాయేమో అని నిన్నటిదాకా ఈ ముగ్గురినీ తిట్టిపోసిన తెలుగుదేశం నాయకులు, జనం భావించడమే మిగిలింది. కానీ తమాషా ఏంటంటే.. కథలో బంధువులాగానే బాబు` ఎంపీల ఎపిసోడ్‌లో ఏమాత్రం నిజాయితీ ఉన్నదో ఈ పార్టీ శ్రేణులు, ప్రజలందరకూ కూడా విపులంగానే తెలుసు. 

అదీ సంగతి

– కపిలముని