చిరంజీవి అన్నయ్యా…
గుడ్‌మాణింగ్.., అందరినీ ఒక విడత పలకరించిన తర్వాత మళ్లీ నీకో లేఖ రాద్దాం అనుకున్నాను గానీ.. నువ్వు నాకు ఆ వ్యవధి ఇచ్చేలా లేవు. అర్జెంటుగా నీకే మళ్లీ రెండో ఉత్తరం రాసేసే పరిస్థితిని కల్పించావు. అన్నయ్యా.. ఈ దేశానికి టూరిజం మంత్రివి నువ్వు. అంతర్జాతీయంగా భారతీయ టూరిజం ఖ్యాతి వర్ధిల్లాలంటే అదిప్పుడు పూర్తిగా నీ చేతిలో పని. ఆ బాధ్యతను నువ్వు చాలా బాగా చేస్తున్నావు. లండను వెళ్లి మరీ టూరిజం గురించి ఉపన్యసించి వచ్చావు. అంతర్జాతీయ పర్యాటకుల్ని మారుమూల ప్రాంతాలకు కూడా ఆకర్షించేలా కార్యక్రమాలు చేపడతానంటూ ప్రతిజ్ఞలు కూడా చేశావు . బాగుంది. తాజాగా పర్యావరణం చెడిపోవడం వలన దెబ్బతింటున్న గోవాలోని సుందర సముద్రతీరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దడం కోసం నువ్వు యాభై కోట్ల రూపాయలను ఉదారంగా ఇచ్చేశావంటే.. అన్నయ్యా.. నీ చేతికి ఎముకలేదని నాకనిపించిందంటే నమ్ము. నా మటుకు నేను.. నీ ఔదార్యం గురించి టముకు వేసుకుంటున్నా అన్నయ్యా…!
అయితే, ఈ మూర్ఖ ప్రజలు మాత్రం నీగురించి అవాకులు చెవాకులు పేలుతున్నారు. అన్నయ్యా ఏదో నువ్వు ఎదిగివెళ్లిపోతున్నావని, ఇలాంటి మంచి పనులు అనేకం చేసేస్తున్నావని.. ఇలాంటి అనేకానేక మంచి పనుల ద్వారా నువ్వు మరింత కీర్తి సంపాదించేసుకుంటే.. ఎప్పటికీ అందకుండా ఉన్నత స్థానానికి పోతావని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు గానీ… వాళ్ల మాటలు మనకెందుకు చెప్పు.
గోవా బీచ్‌లు అంటే నాక్కూడా చాలా ముచ్చటే అన్నయ్యా..! ఎంచక్కా విదేశాల నుంచి వచ్చిన వేల మంది అమ్మాయిలు అక్కడ బట్టల్లేకుండా తిరుగుతూ ఉంటారు. ఏదో ఇంట్లో మన సొంత కంప్యూటర్లో బ్లూఫిల్ములు చూసుకుందాం అనుకున్నా.. ఏపూట పోలీసులు దాడిచేస్తే పరువు పోతుందో అని భయం. రోడ్డు మీద కురచ దుస్తుల్లో వెర్రెత్తించే అమ్మాయిల్ని మిర్రి మిర్రి చూద్దామంటే సంఘంలో పలుచన అవుతామనే వెరపు.. ఇలాంటి భయాలన్నీ ఉంటాయి అన్నయ్యా! అదే మన దేశానికి సంబంధించి గోవాలో మాత్రం టూరిజం డిపార్టుమెంటు వారు టిక్కెట్లు పెట్టి మరీ బూతు అందాల దివ్యదర్శనానికి లైసెన్సు ఇస్తుంటారు.
‘చూసుకోండి బాబూ.. చూసుకోండి! మంచి తరుణం మించిన దొరకదు. పొట్టి అండర్ వేర్లూ.. అంతకంటె పొట్టి బ్రాలూ వేసుకుని ఇక్కడ విదేశాలనుంచి వచ్చిన వేల మంది అమ్మాయిలు ఎగ్జిబిషను పెట్టినట్లుగా తిరుగుతున్నారు బాబూ వచ్చి చూసుకోండి. కంప్యూటర్లలో కూడా దొరకని వేల కొద్దీ అందాలను మీ మీ కళ్లతో జుర్రుకోండి బాబూ’ అంటూ టూరిజం వారు టికెట్లు అమ్మేస్తుంటారు. వారికి తమ బోటి పెద్దలు యాభయ్యేసి కోట్ల రూపాయలు చదివింపులు ఇస్తూ కూడా ఉంటారు. చాలా బాగుంది అన్నయ్యా.
అక్కడ అంగాంగ ప్రదర్శనలు చేసుకుంటూ ఉండేవాళ్లు పాపం ఎక్కడెక్కడో విదేశాలనుంచి పెద్దపెద్ద విమానాలు ఎక్కి వస్తారు. దండిగా నక్షత్రాలు ఉండే హోటళ్లలో నెలల వారీగా గదులు అద్దెకు తీసుకుని బస చేస్తూ ఉంటారు. మనం అక్కడ బీచిల్లో బట్టలిప్పుకుని సూర్యస్నానాలు అదే అన్నయ్యా సన్‌బాతింగు చేయడానికి అనుమతించడంలో టిక్కెట్లు పెంచేశామనుకో… పాపం వాళ్లకు చాలా ఇబ్బంది. అప్పటికే వాళ్లు తెచ్చుకున్న డాలర్లు చాలా ఖర్చయిపోయి ఉంటాయి.. మనం టిక్కెట్లు పెంచేశామనుకో.. వాల్లకు ఆ గోచీలు కూడా లేకుండా బట్టలిప్పేసుకుని మన రోడ్లమ్మట తిరగాల్సి వస్తుందేమో పాపం.. వద్దులే అన్నయ్యా.. టిక్కెట్లు పెంచి .. ఆ డబ్బుల్తో అక్కడ వాళ్లు తిరిగి నాశనం చేసేసే బీచీలను బాగు చేసే ప్రయత్నం అసలొద్దు. ఎటొచ్చీ బీచీలను ఉద్దరించడానికి నువ్వు యాభైకోట్ల రూపాయలు సంతర్పణ చేసేశావు కద.. ఆ సొమ్ముతో.. ఆ విదేశీ శృంగారాల బొమ్మలకు ఏర్పాట్లు చేసిపెడితే సరి.
ఈ కౌపీన ధారుల అందాలు.. అదే అన్నయ్యా గోవా బీచీల్లో తిరిగే గోచీరాయుళ్ల , గోచీ భామల అందాలు మన దేశ పౌరులకు ఎంతెంత కనువిందు చేస్తుంటాయి? దీని ద్వారా మనవాళ్లు ఎంత ఆత్మానందం పొందుతుంటారు? అలాంటి ఆత్మానందాన్ని వారికి అందించడానికి నువ్వు ఎంత ఉదారహృదయంతో యాభైకోట్ల రూపాయలు ఇచ్చావు.. ఎంత దేస్సేవ చేస్తున్నావు…? సెబ్బాస్ అన్నయ్యా సెబ్బాస్.
అన్నయ్యా మనదేశంలో (నువ్విప్పుడు దేశం మొత్తానికీ మంత్రివి అన్నయ్యో.. గుర్తు పెట్టుకో.. గోవాకో, విశాఖపట్నానికో మాత్రమే కాదు) ఈ మాత్రం కౌపీన యోగం అదే అన్నయ్యా గోచీ గుడ్డకు గతిలేని వాళ్లు.. గోచీ దొరికినా.. దాన్ని వంటిమీద తగిలించుకోడానికి సరైన మొలతాడుకు కూడా దిక్కులేని దరిద్రనారాయణలు కొన్ని లక్షలు, కోట్ల మంది ఉన్నారన్నయ్యో. గోవాలో ఫారీనోళ్ల గోచీలు కొంచిం గట్టిగా ఉంటాయేమో.. ధర కూడా జాస్తిగా ఉంటాయేమో..! మనదేశంలో మారుమూల పల్లెలో తండాల్లో, కొండల్లో, కోనల్లో… నీ డిపార్టుమెంటు పరంగా టూరిజం అనునది అత్యంతగా , ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి చెందగలిగిన ప్రాంతాల్లో కూడా ఇలాంటి గోచిపాత రాయుళ్లు చాలామందే ఉంటారు. పాపం వోళ్లకి సన్ బాత్ అంటూ తోలు చూపించుకుంటూ తిరగాలని ఉండదు.. కాపోతే కప్పుకోడానికి గతి ఉండదు అంతే. ఆళ్లకి కూడా ఏదో ఒకటి నీపుణ్యమా అని కొంత మేలు జరిగేలా.. అచ్చంగా నీ డిపార్టుమెంటు నుంచే కాకపోయినా.. ఎంతో కొంత ప్రయత్నం చేయి అన్నయ్యా.. గోచీల సంగతి తర్వాత.. నలుగురికి నాలుగు ముద్దలు దొరికి.. ఓ పూట గడిచిందనుకో.. నీ మేలు వచ్చే జనమకి కూడా మరిచిపోరు.
మరో సంగతి అన్నయ్యో.. ఈ విదేశీ గోచిగాళ్లకి తమరెన్ని కోట్లు చదివించుకున్నా.. వాళ్లు తోలు చూపించి వెళ్లిపోతారే తప్ప.. తమ పేరు కూడా తెలుసుకోరు. అదే మన గోచిపాత రాయుళ్లు అనుకో.. నువ్వేదైనా మేలు చేసావంటే.. కలకాలం నిన్ను తలచుకుంటూనే ఉంటారు. కాస్త గేపకం పెట్టుకో అన్నయ్యో.. అందరికీ మంచి జరుగుతుంది.
చాలా బాగుంది అన్నయ్యా… ఎటూ అక్కడ గోవాలో టూరిజం డెవలపింగు కావడానికి నువ్వు యాభై కోట్ల రూపాయలిచ్చావు. అదే మాదిరిగా మరింత పెద్ద మనసు చేసుకోని.. అక్కడ టూరిజం మరింతగా డెవలపింగు కావడానికి.. నువ్వే బ్రాండ్ అంబాసిడరుగా సేవలందిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. తొడలపైకి పొట్టి గా మరియు టైటుగా ఉండే జీన్సు నిక్కర్లూ, నిక్కర్ల కిందివరకు వేళ్లాడుతూ ఉండే.. రంగురంగుల పూలు అద్దిన వదులు చొక్కాలూ… చేతిలో ఒక బీ.. (వద్దులే డేమేజీ అయిపోగల్దు)… బుగ్గల్ని కూడా కప్పేసేంత కళ్లజోళ్లూ ఇవన్నీ తగిలించుకోని.. మాంఛి ఫుటోలు దిగి మోడలింగు చేశావనుకో.. అన్నయ్యా… గోవా టూరిజం లాభాల గ్రాఫు లంబంగా పెరిగిపోవడం గ్యారంటీ.. ఏమంటావు?
` కపిలమున