లవ్‌లెటర్‌ : కో.రా.! బురద పూస్కోవద్దు!!

కోదండరాం అన్నయ్యా… Advertisement జుట్టుకు రంగు వేసుకోకుండా ఉండే వాళ్లంటే నాకు చాలా ఇష్టం.. గౌరవం. తమ ముందున్న సమస్యల్లో కట్‌చేస్తే మళ్లీ మొలిచే అత్యంత తక్కువ విలువైన జుట్టు గురించి ఆందోళన చెందేవాళ్లంటే..…

కోదండరాం అన్నయ్యా…

జుట్టుకు రంగు వేసుకోకుండా ఉండే వాళ్లంటే నాకు చాలా ఇష్టం.. గౌరవం. తమ ముందున్న సమస్యల్లో కట్‌చేస్తే మళ్లీ మొలిచే అత్యంత తక్కువ విలువైన జుట్టు గురించి ఆందోళన చెందేవాళ్లంటే.. తమకు దక్కే గుర్తింపు ‘ఎప్పియరెన్స్‌’లోనే ఉంటుందని, అందులో జుట్టు మొదటిదని భ్రమించే వాళ్లంటే నాకు జాలి. జుట్టుకు రంగు వేసుకోని వాళ్లు.. అది తప్ప ఇతరత్రా తమకు ఉండే బలాలు (మేథస్సు, అంకితభావం లాంటివి) ద్వారా మాత్రమే వచ్చే గుర్తింపు చాలు అనే ఉద్దేశంతో ఉంటారనేది నా అభిప్రాయం. అందువలన తమ చిత్తశుద్ధి, అంకిత భావం, ఉద్యమ ప్రేరణ వీటి పట్ల నాకు ఓ గౌరవం ఉంది. 

అన్నయ్యా… మీరు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నడుపుతున్నారు. అటు కాంగ్రెస్‌ ఎంపీల వల్ల సాధ్యమైనా.. ఇటు చంద్రబాబు లేఖ వల్ల మాత్రమే కార్యరూపం దాల్చినా.. కేసీఆర్‌ ఒక్కడే తెలంగాణకు దేవుడని కేకే లాంటివారు శతకాలు రాసినా.. క్రెడిట్‌ను ఎవ్వరి ఖాతాలోనైనా తగలేసుకోనివ్వండి.. దానికి మూలం మీ ఉద్యమం సజీవంగా ఉండడంలో మాత్రమే ఉందని నేను నమ్ముతాను. 

‘ఉద్యమానికి ఒకటే ప్రేరణ, ఒకటే లక్ష్యం, ఒకటే మార్గం .. వెరసి అది ఉద్యమం మాత్రమే’ 

`అన్నట్లుగా అది ప్రస్తుతం మీ సారథ్యంలో నిర్విఘ్నంగా సాగుతోంది. ‘మేమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతాం’ అనే మీ ప్రకటన చూసి నేను నివ్వెరపోయాను. రాజకీయం అనే బురద పూసుకున్న వెంటనే ఉద్యమం అనేది ఎంతగా భ్రష్టు పట్టి పోతుందో మన కళ్లముందు అనేక సజీవ ఉదాహరణలు ఉన్నాయి. అన్నాహజారే అంతటి వాడు.. (అంటే నా ఉద్దేశం ఆయన పెద్ద హీరో అని కాదు.. కనీసం దేశవ్యాప్తంగా ఒక ఆలోచన కలిగించినవాడు) రాజకీయం గురించి మాటెత్తగానే.. కీర్తించిన నోళ్లలోనే పలుచన అయిపోయాడు. 

లోకల్‌ కండిషన్స్‌ కు కూడా సూటయ్యే సంగతిని మీకు నివేదిస్తాను. లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ్‌ సంగతేమిటి? ఐఏఎస్‌ అధికారి ఆయన. ఓటరు జాబితాలను సంస్కరించడం, ఎక్కువ మంది ఓటు వేసేలా చేయడంతో మన దేశ రాజకీయ వ్యవస్థకు పట్టిన సకల కుళ్లును, అంటురోగాలను, రుగ్మతలను ఒక్కదెబ్బతో నివారించేయవచ్చునంటూ నమ్మి, ఆ నమ్మకంతో లోక్‌సత్తా ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన వ్యక్తి. ఆయన ఎదురుగా వన్‌`టూ`వన్‌ భేటీలో ఆయన నోటమ్మట ఈ సిద్ధాంతాన్ని.. దాని మూలాలను.. అది సాధించగల ఫలితాలను విని.. నేను దిగ్భ్రమ చెందాను. ‘ఆహా! ఈయన రాబోయే రోజుల్లో ఓ నవీన భారతాన్ని ఆవిష్కరించబోతున్నారు కదా అనుకున్నాను’. 

కానీ ఏమైంది? నేను అనుకున్న నాలుగు సంవత్సరాలకు ఆయన పార్టీ పెట్టారు. అక్కడితో ఆయన ఉద్యమ ప్రేమ మంటగలిసిపోయింది. ఎన్నికలు` పోటీచేయడం` ప్రచారం` గెలవడం` ఓడిపోవడం` ఇలాంటి రంధిలో పడి అసలు తను లోక్‌సత్తాను ఏ లక్ష్యంతో ప్రారంభించాడో… ఏం సంస్కారాల్ని ఆవిష్కరించాలని కలగన్నాడో అన్నీ మరచిపోయాడు. ఆయనను ఆరోజుల్లో నమ్మి.. ఇవాళ్టి వరకు గుడ్డిగా అలాగే నమ్ముతున్న వారంతా… ఇప్పుడు ఆయన ఎక్కడ దారితప్పిపోతున్నాడో గుర్తించలేని ‘తెలివైన అంధత్వాన్ని’ తెచ్చిపెట్టుకుని ఆయన మీద ఈగ వాలనివ్వకుండా.. ఆయనను యథేచ్ఛగా తన అసలు మార్గం వదిలేసి వెళ్లిపోతున్నా కాపలా కాసుకుంటున్నారు. 

అన్నయ్యా.. నువ్వు కూడా అలా అయిపోవద్దు. సజీవ ఉద్యమం లాగానే, సజీవ ఉదాహరణలు ఇవి. ఇప్పుడు ఎటూ నువ్వు కేసీఆర్‌ తో అంటకాగుతున్న ఉద్యమనేతగానే అప్పుడప్పుడూ వ్యవహరిస్తున్నావు. అలా కాదని వాదించినా పర్లేదు. ఓకే. తెలంగాణను పూర్తిగా కోరుకునే ప్రతి పార్టీకి నువ్వు ప్రేమాస్పదుడివే అనుకుందాం. నువ్వు కూడా ఓ రాజకీయ శక్తిగా ఎదిగి.. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమనో మరో చిన్న ముక్క కింద కత్తిరించి.. మరింత బలహీనం చేయాలని ఎందుకు ఉవ్విళ్లూరుతావు? పోనీ నువ్వంటూ ఓ పార్టీగా అవతరిస్తే ఇటు అన్ని పార్టీల్లోని తెలంగాణ వాదుల్ని ఉమ్మడిగా అందులోకి రప్పించుకోగలవా? అసలు ఇలాంటి పిచ్చి ఆలోచన ఆచరణ సాధ్యమా? ఆలోచించు. 

అన్నయ్యా.. ముగించే ముందు ఒక్కమాట చెబుతాను. కోపం తెచ్చుకోకుండా ఆలకించు. నచ్చితే ఆచరించు. 

‘రాజకీయశక్తిగా అవతరించడం’ అనేది నువ్వు జుట్టుకు రంగు వేసుకోవడం కంటె పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. నీ జుట్టు రంగు కంటె నీకున్న బలాలు గొప్పవని ఇన్ని దశాబ్దాలుగా ఎలా నమ్ముతూ వచ్చావో… 

ఈ నీచమైన ‘ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం’ అనే దానికంటె నీ ఉచ్ఛమైన ఉద్యమమే గొప్పదనే వాస్తవాన్ని మరింత పరిపూర్ణంగా విశ్వసించు. ఉద్యమం మీద ముందుగా నీకున్న విశ్వాసమే… సడలిపోతే గనుక.. దానికి సాధ్యం కాదని, పని జరగడానికి మరో ప్రత్యామ్నాయం అవసరమని.. సారథి స్థానంలో ఉన్న నువ్వే విశ్వసిస్తే గనుక.. ఇక యావత్తు ఉద్యమమూ నీరుగారిపోతుంది గుర్తుంచుకో.

`ప్రేమతో…

కపిలముని