కపిలముని : టీం జగన్‌

యుద్ధం.. రాజు చేస్తాడు. రాజు పేరిట జరుగుతుంది. అగ్రభాగాన నిలబడి శ్రేణులకు ఉత్తేజాన్నిస్తూ రణన్నినాదం చేస్తుంటాడు. కానీ యుద్ధం అంటే రాజు ఒక్కడే కాదు. ఇంకా బోలెడు అంశాలుంటాయి. అనేక మంది వ్యక్తులుంటారు. పెద్ద…

యుద్ధం.. రాజు చేస్తాడు. రాజు పేరిట జరుగుతుంది. అగ్రభాగాన నిలబడి శ్రేణులకు ఉత్తేజాన్నిస్తూ రణన్నినాదం చేస్తుంటాడు. కానీ యుద్ధం అంటే రాజు ఒక్కడే కాదు. ఇంకా బోలెడు అంశాలుంటాయి. అనేక మంది వ్యక్తులుంటారు. పెద్ద పటాలమూ.. మందీ మార్బలమూ అంతా ఉంటుంది. అందులో కొందరు కీలక వ్యక్తులు కూడా ఉంటారు. అతిరథులు, మహారథులు అనేకులు ఉంటారు. వ్యూహచాతుర్య పారంగతులు, బలసమీకరణల ఉద్ధండులు, ప్రత్యర్థుల బలహీనతల్ని పసిగట్టి పరిమార్చగల మేథోసంపన్నులు.. అనేకులు ఉంటారు. అలా ఒక రాజు నేతృత్వంలో.. ఈ సమస్త సన్నాహక వ్యవస్థ వేర్వేరు వ్యక్తుల రూపంలో కేంద్రీకృతమై ఉంటుంది. 
రాజకీయాలు అంటే యుద్ధానికి భిన్నమైనవేం కాదు. ఇక్కడ యుద్ధం పార్టీలకు ఉండే అధినాయకుడి పేరు మీద నడుస్తుంది. కానీ ఆయన వెనుక వెన్నుదన్నుగా నిలిచే వ్యూహకర్తలు చాలా మందే ఉంటారు. ఉదాహరణకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునే తీసుకుంటే.. గత ఎన్నికల సమయంలో ఆయన తన పార్టీ మేనిఫెస్టోలో తురుపుముక్క బ్రహ్మాస్త్రంగా భావించిన మనీ ట్రాన్స్‌ఫర్‌ అనేది ఆయన కొడుకు లోకేష్‌ ఎత్తుగడగా ప్రాచుర్యం పొందింది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తరఫున మన రాష్ట్రంలో ‘రాజు’ స్థానంలో ఉండి యుద్ధానికి దిగిన వైఎస్‌ రాజశేఖర  రెడ్డి అమ్ముల పొదిలో అస్త్రశస్త్రాలను ఏర్చికూర్చి ఆయనతో శర సంధానం చేయించే చాణక్యుడిగా కేవీపీ రామచంద్రరావు పేరు పడ్డారు. అప్పట్లో యుద్ధానికి ఆర్భాటంగా కాలుదువ్వినటువంటి ప్రజారాజ్యం , తమ ‘రాజు’ మెగాస్టార్‌ చిరంజీవి కోసమే  యుద్ధం చేసినప్పటికీ.. కీలకంగా ఆయన సేనావాహినిని నడిపించిన ప్రముఖులుగా డాక్టర్‌ మిత్రా, అల్లు అరవింద్‌ మరికొందరి పేర్లు కూడా వినిపించాయి. ఇదంతా గత ఎన్నికల చరిత్ర మన కళ్లముందు ఆవిష్కరిస్తున్న నిజాలు. గత ఎన్నికల చరిత్ర.. మనకు పరిచయం చేసిన పార్టీల వ్యూహకర్తలు. 
ఇప్పుడు తాజాగా మన రాష్ట్ర రాజకీయ రణసీమలోకి కొత్తగా అడుగుపెడుతున్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌.  ఈ పార్టీకి నేతృత్వం వహిస్తూ… విజయబావుటా ఎగరవేసి… చక్రవర్తిత్వాన్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్న నేత జగన్‌. ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ… ఆయన పార్టీని బొడ్డూడని పార్టీగానే చెప్పుకోవాలి. ఉప ఎన్నికలలో తమ అనుంగు అనుచరుల స్థానాలను గెలుచుకోవడంలో బలిమిని ప్రదర్శించారే తప్ప.. వారి పార్టీ అసలు బలాబలాలేమిటో.. జగన్‌ ఆంతరంగిక, వ్యూహచాతుర్య మేథో బృందంలో కీలక సభ్యులెవరో.. ప్రత్యర్థుల ఆనుపానులెరిగి… వారిని దునుమాడగల శక్తియుక్తులను పార్టీకి సమకూర్చగల సమర్థులెవరో ఇంకా బాహ్యప్రపంచానికి తెలియదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడిగా.. రాష్ట్రవ్యాప్తంగా ఏకధ్రువంగా ఉన్న జనాదరణ (కరిష్మా) జగన్‌కు సొంతం. ఆ కరిష్మా ఒక్కటీ చాలు.. ఆయన కోరుకునే చక్రవర్తిత్వాన్ని ఆయన చేతికి అందించడానికి అని అంతా అనుకుంటాం. కానీ భ్రమ. వాస్తవమైన భ్రమ.
జేజేలు కొట్టే జనం ఓట్లుగా పరివర్తనం చెందడానికి మధ్యలో ఒక దశ ఉంటుంది…
నివ్వెరపోతున్న పార్టీల నాయకులు.. వచ్చి తన జట్టులో కలవడానికి, తన నాయకత్వాన్ని ఆమోదించడానికి మధ్యలో ఓ దశ ఉంటుంది….
వెల్లువెత్తుతున్న జనంలో అసలు వాస్తవంగా మెదలుతున్న మనోగతం ఏమిటో అర్థం చేసుకోవడానికి సర్వేల వంటి సుదీర్ఘమైన, శాస్త్రబద్ధమైన వ్యవస్థ ఉంటుంది… 
యుద్ధం అంటే.. పార్టీ అంటే ‘జగన్‌’ ఒక్కడే కాదు…. షర్మిల ఒక్కటే కాదు.. వైఎస్సార్‌ బొమ్మ ఒక్కటే కాదు… 
ఇప్పుడు ప్రస్తావించుకున్న అంశాలన్నీ కలిస్తేనే ఆ దశలన్నీ సమర్థంగా నిర్వహించగలిగితేనే… ఆ వ్యవస్థలను సవ్యంగా నడపగలిగితేనే… యుద్ధంలో విజయం దక్కేది…
జగన్‌ సేనా వాహినిలో.. ఇప్పుడు ఆయా బాధ్యతలను తమ తమ భుజస్కంధాలపై మోస్తున్న… పార్టీని ముందుకు నడిపిస్తున్న.. అతిరథులు, మహారథులు ఎవరెవరు…?
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెరవెనుక నిలిచి మర్మ మంత్రాంగాన్ని నడిపిస్తున్న వారి గురించి గ్రేట్‌ఆంధ్ర అందిస్తున్న ప్రత్యేక, విశ్లేషణాత్మక కథనం… 

1. సర్వే యంత్రాంగం
ఏ పార్టీకి అయినా సరే.. ఎన్నికల సమరానికి సిద్ధం కావడం అంటే ముందుగా జనాభిప్రాయం తెలుసుకోవాల్సిన అవశ్యకత ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీ కూడా అందుకు సర్వేల మీద ఆధారపడుతుంది. పైగా కేవలం ఒక్కటే సంస్థ లేదా వ్యవస్థ ద్వారా మాత్రమే కాకుండా.. వారి సర్వేల్లో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చుననే అనుమానంతో.. రెండు మూడు మార్గాల నుంచి కూడా సర్వేలు చేయించుకుని వాటిని బేరీజు వేసుకుని ఒక స్థిర అభిప్రాయానికి వచ్చి నిర్ణయాలు తీసుకోవడంలో ఆ వివరాలు వాడుకుంటూ ఉంటారు. చాలా కీలకమైన ఈ విభాగాన్ని పర్యవేక్షంచే దెవరు…?
వైఎస్‌ అనిల్‌. వైఎస్‌ఆర్‌ ఆయన తమ్ముళ్లు, ఆయన కుటుంబం, పిల్లలు గురించి తమకు చాలా వివరాలు తెలుసు అనుకునే చాలా మంది నాయకులకు తెలియని పేరు. సాంకేతికంగా మేథోబుర్ర ఉన్నటువంటి అనిల్‌ వైఎస్‌ కుటుంబసభ్యుల్లో ఒకడు. వరుసకు జగన్‌కు సోదరుడు అవుతారు. సర్వేల బాధ్యత యావత్తూ అనిల్‌ స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఆ ఫలితాలను  బేరీజు వేసి.. జగన్‌కు నివేదిస్తుంటారు. 
ఆ మాటకొస్తే సర్వేల విషయంలో జగన్‌ పార్టీ చాలా ఎడ్వాన్స్‌డ్‌ గా ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి సర్వేలు జరిపించుకుని.. ఇన్ని స్థానాల్లో పార్టీ బాగానే ఉన్నదని, ఇన్ని స్థానాల్లో పార్టీ పరిస్థితి మెరుగ్గా లేదని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ ప్రకారం పావులు కదుపుకుంటూపోవడం కాదు.. సర్వేలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉండే జనాభిప్రాయాన్ని కూడా తమకు తెలియజెప్పేలా ఉండాలనే కాన్సెప్టుతో వారు వెళుతున్నారు. ప్రతిచోటా విడతలు విడతలుగా ఈ సర్వేలు జరుగుతున్నాయి. దీనికోసం ఓ పెద్ద యంత్రాంగం పనిచేస్తుంది. పార్టీ పట్ల మారుతున్న జనాభిప్రాయాలు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రాబబుల్స్‌గా ఉన్న పలువురు నాయకులు శైలీ, వారి గురించి జనంలో మారుతున్న అభిప్రాయాలు ఇవన్నీ.. ఆ సర్వేల్లో చోటు నిగ్గు తేలుతుంటాయి. 
వీటి ఫలితాలను బట్టి ఏయే నియోజకవర్గాలో తమ పార్టీ బలహీనంగా ఉన్నదో.. ఏయే నియోజకవర్గాల్లో తాము అభ్యర్థి అనుకుంటున్న వ్యక్తి బలహీనంగా ఉన్నారో ఎక్కడెక్కడ సకలరీతులా తమ పార్టీ బలోపేతంగా కనిపిస్తున్నదో తేల్చేపనిలో వైఎస్‌ అనిల్‌  నిత్యం బిజీగా ఉంటారు. వచ్చే ఫలితాలను మధించి.. కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలకు చొరబాట్లకు తావులేకుండా.. నికార్సయిన ఫలితాలను నాయకుడు జగన్‌కు నివేదించడమే ఆయన పని. 

2. చేరికలకు ప్రాంతాలవారీ నేతలు
ఒక పార్టీ పుట్టుకతోనే బలమైన పార్టీగా ఆవిర్భవించడం అనేది జరగదు. ఎంత ప్రజాదరణ ఉన్నా.. ఆ పార్టీలోకి కాలక్రమంలో వచ్చి చేరే నేతలు వారి బలం అంతా కలిసిన తర్వాతనే.. ఒక పార్టీ యొక్క వాస్తవబలం అంచనాకు వచ్చేది. మళ్లీ పార్టీలోకి నాయకుల్ని చేర్చుకోవడం అంటే.. ఎవడిని పడితే వాడిని చేర్చుకుంటే.. అది పార్టీ పతనానికి దారితీస్తుందే తప్ప ఔద్ధత్యానికి పునాది వేయదు. పార్టీని తమ బలంగా  వాడుకుంటూ… పార్టీకి తమ బలాన్ని అదనంగా జత చేస్తూ.. ఉభయతారకంగా వృద్ధి చెందడానికి ఉపయోగపడగల నాయకులను మాత్రమే జాగ్రత్త ఎంపిక చేసుకుని చేర్చుకోవాలి. మళ్లీ వారిలో కోవర్టులు ఉండకూడదు. తమ ప్రత్యర్థులు తమ పార్టీ ఆనుపానులను సంగ్రహించడానికి ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా మన జట్టులోకి పంపే వేగులు ఉండకూడదు. ఉండకూడదు అంటే.. మేం మీ పార్టీలో చేరుతాం అంటూ మన వద్దకు వచ్చే వారిని సరిగ్గా బేరీజు వేయగల శక్తి  మనకుండాలి. అది సామాన్యమైన సామర్థ్యం కాదు. చేరుతామంటూ వచ్చేవాళ్ల పుట్టుమచ్చల సహా, వారి పుట్టుపూర్వోత్తరాలు యావత్తూ తెలుసుకోగలిగి.. వారిని జడ్జ్‌ చేయగలిగి ఉండాలి. ఆ తర్వాత చేరికకు పచ్చజెండా ఊపాలి. అంటే కేవలం వ్యక్తుల సామర్థ్యాలను మాత్రమే కాదు.. ఆయా వ్యక్తుల పాత పార్టీల వ్యూహాలను, తమ ప్రత్యర్థుల్తో వారికి ఉండే బంధాలను అన్నిటినీ తూకం వేయగల వారు.. చేరికల విషయంలో నిర్ణయాత్మక పాత్రలో ఉండాలి. అలాంటప్పుడే.. పార్టీలోకి వచ్చేవారు.. మనసా వాచా కర్మేణా పార్టీతో మమేకం కాగలిగిన వారు.. పార్టీ వృద్ధికి  ఉపయోగడపగలవారు అయి ఉంటారు. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత కీలకమైన ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ఒక్కరు కాదు, ముగ్గురు నాయకులు ఉన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల బాధ్యతలను ముగ్గురు నాయకులకు అప్పగించడం ద్వారా జగన్‌.. బాధ్యతల వికేంద్రీకరణ జరిపించారు.  ఇంత కీలకమైన బరువును ఒక్కరి భుజాలమీదనే పెట్టి.. ప్రతికూల ఫలితాలు చూడడం కంటె.. ప్రాంతాలవారీ బాధ్యతలు పంచేస్తే …మెరుగుదల ఉంటుందనేది ఆయన వ్యూహం. ఆ ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో

  • తెలంగాణ – సజ్జల రామకృష్ణారెడ్డి
  • కోస్తాంధ్ర – వైవి సుబ్బారెడ్డి
  • రాయలసీమ – భూమా నాగిరెడ్డి

.. చేరికల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురూ జగన్‌కు అత్యంత విశ్వసనీయులు. త్రికరణశుద్ధిగా జగన్‌ హితం కోరే వ్యక్తులు. అందుచేతనే జగన్‌ కీలకమైన బాధ్యతను వీరి చేతుల్లో పెట్టారు.
అయితే ఇక్కడమొక మతలబు ఉంది. మూడు ప్రాంతాలకు ముగ్గురు నాయకులు ఉన్నప్పటికీ వీరు కేవలం మోడరేటర్లు మాత్రమే. ఆయా ప్రాంతాలనుంచి వచ్చే నాయకుల గురించి వీరు ప్రాథమిక మంతనాలు జరపగల స్థాయి వారు మాత్రమే. అంతిమంగా నిర్ణయం తీసుకునేది జగనే. వీరిలో ఎవ్వరు ఏ నిర్ణయం చెప్పినా.. అది ఫైనల్‌ అవుతుందనే గ్యారంటీ లేదు. వీరి అభిప్రాయాలను జగన్‌ కేవలం పరిగణనలోకి తీసుకుంటాడంతే. అంటే ఒక నాయకుడు వైకాపాలో చేరాలనుకుంటే.. ప్రాంతాన్ని బట్టి ఈ నాయకులను సంప్రదిస్తే.. వారు అతగాడి గురించి సమస్త వివరాలూ సాకల్యంగా తెలుసుకున్న తరువాత.. తమకు సూటవుతాడని అనిపిస్తే ఆ విషయాన్ని జగన్‌ పరిశీలనకు తీసుకెళ్లగల వరకు మాత్రమే చేయగలరు. ఆ తర్వాత నిర్ణయం జగన్‌ కోర్టులోకి మారుతుంది. అది పూర్తి అప్రమేయంగా… స్వయంచాలితంగా ఉంటుంది. ఆవిషయంలో జగన్‌ ఎవ్వరినీ ఖాతరు చేయరు. 

3. ఆర్థిక చాణక్యం
పార్టీ నడవడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. పైగా ఇవాళ్టి రోజుల్లో పార్టీ నడపడం కూడా ఓ  కార్పొరేట్‌ వ్యాపార సరళికి సమీపంగానే ఉంటోంది. పెట్టుబడులు… లాభాల తీరులోనే నడుస్తున్నాయి. పైపెచ్చు. పార్టీలో ఏ కార్యకలాపాలు సవ్యంగా జరగాలన్నా నిధుల సమన్వయం అనేది చాలా పెద్ద పని. నిధులకు సంబంధించిన సమస్త వ్యవహారాలకు సేకరణ, నిర్వహణ, వ్యయం వ్యవహారాలన్నీ పర్యవేక్షించే మేథోబుర్ర… ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక పెద్ద దిక్కు ఆడిటర్‌ విజయసాయిరెడ్డి. 
ఆడిటర్‌ విజయసాయిరెడ్డికి జగన్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్‌ మీద కేసులు వెల్లువెత్తిన నాటినుంచి జగన్‌తో సమానంగా విజయసాయి పేరు కూడా పత్రికల్లో నానుతూనే ఉంది. అయితే సీబీఐ ఎంతటా టార్చర్‌`పూరిత విచారణ ప్రయోగాలతో తనను ఇబ్బంది పెట్టినప్పటికీ.. జగన్‌ తరహాలోనే.. ఏమాత్రం సంయమనం కోల్పోకుండా.. నిబ్బరంగా నిలబడగలిగిన వ్యక్తి విజయసాయి. బెయిలు మీద బయట ఉన్నప్పటికీ.. సీబీఐ, ఈడీ కేసుల తాలూకు ఒత్తిళ్లు ఆయన సమయాన్ని, పనితీరును బాగా కాజేస్తుంటాయి. ఆయన మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంటాయి. ఈ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. పార్టీ ఆర్థిక వ్యవహారాల సమన్వయం మొత్తం చూస్తున్నది ఆయనే. 
కేవలం పార్టీ ఆవిర్భావ సమయంలోనే కాకుండా.. భవిష్యత్తులో కూడా చాలా కీలకమైన ఆర్థిక నిర్వహణ బాధ్యత గనుక విజయసాయి ఎన్నికల జోలికి కూడా వెళ్లకుండా పార్టీపనిలోనే నిమగ్నం అవుతారని భోగట్టా. ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఆయన కుమార్తెకు నెల్లూరు జిల్లాలోని  ఏదో ఒక గెలుపు గ్యారంటీ నియోజకవర్గం నుంచి సీటు కేటాయిస్తారనేది ప్రస్తుతానికి మాట. 

4. ప్రసంగ, ప్రచార బాధ్యత
నాయకుల ప్రసంగాలను రూపొందించడం, వారి ప్రచార బాద్యతలను పర్యవేక్షించడం.. అనేది చేసే పని, ఉన్న కీర్తి, ఆదరణ ఇనుమడిరచడంలో కీలకంగా ఉంటుంది. వైకాపాకు సంబంధించి ఆ బాధ్యతను పర్యవేక్షిస్తున్నవారు పాత్రికేయుడు జివిడి కృష్ణమోహన్‌. వైఎస్‌ రాజశేఖర రెడ్డి జట్టు నుంచి కూడా కీలకమైన సలహా బాధ్యతలతో ఉంటూ.. ఆయన ప్రభుత్వ గమనంలో తెరవెనుక ప్రధానవ్యక్తులో ఒకరుగా చెలామణీ అయినటువంటి సోమయాజులు ఇప్పుడు వైకాపాలోనే ఉన్నారు. మేథోపరమైన మంత్రాంగం, వ్యూహరచన తాలూకు సమస్త నిర్ణయాల్లోనూ ఆయన భాగం ఉంటుంది. ప్రసంగాలు, ప్రచారాల బాద్యతలను పర్యవేక్షించే జివిడి కృష్ణమోహన్‌ కూడా సోమయాజులు జట్టులోని వ్యక్తి. 
 ఈనాడు పత్రిక చేసే ఆరోపణలకు ఎదురొడ్డి వాటిని తిప్పి కొట్టడానికి సాక్షి దినపత్రికలో .. ‘ఏదినిజం’ ఫీచర్‌ను నిర్వహిస్తూ.. రామోజీ గ్రూపు మీద నిశిత అక్షర బాణాలతో విరుచుకు పడుతుండే కృష్ణమోహన్‌.. ప్రసంగాలు, ప్రచార వ్యవహారాల కోసం ప్రత్యేకించిన జట్టును లీడ్‌ చేస్తుంటారు. గైడ్‌ చేస్తుంటారు. ఫైనల్‌గా సాక్షి దినపత్రికలోనే పనిచేసే రామిరెడ్డి అప్రూవ్‌ చేస్తుంటారని సమాచారం. 

5. జైలు వ్యవహారం
వైకాపాకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఇదే అన్నింటికంటె కీలకమైన దశ. పార్టీకి దిక్కుగా భావిస్తున్న అసలు నాయకుడు జైలులో ఉన్నాడు. నెలలు గడుస్తున్నా రిమాండు పొడిగిస్తున్నారే తప్ప.. బెయిలు గురించి పట్టించుకోవడం లేదు. పార్టీ ఏకధ్రువ వ్యవస్థగా నడుస్తున్నప్పుడు.. పగ్గాలు సకలం తన చేతిలో కలిగి ఉన్న వ్యక్తి జైలులో ఉంటే.. ఏ చిన్న నిర్ణయం రావాలన్నా ఆయనను పలుమార్లు సంప్రదించాల్సి ఉంటుంది. అంటే బాహ్య ప్రపంచానికి జైల్లో ఉన్న నాయకుడికి మధ్య ఒక అనుసంధాన హబ్‌, స్విచ్‌ ఉండాలి. ఆ హబ్‌ పాత్రలో ఉన్న వ్యక్తి పేరు కెఎస్‌ఎన్‌.
కెఎస్‌ఎన్‌ అంటే సీనియర్‌ పాత్రికేయుడు.. ప్రస్తుతం ప్రధానంగా పార్టీ పనినే పర్యవేక్షిస్తున్న వ్యక్తి. పార్టీకి సంబంధించి పై లేయర్‌లో ఉండే కీలక నాయకులు ఎవ్వరు ఏ విషయం గురించి జగన్‌తో సంప్రదించాలన్నా, కలవాలన్నా ఆ విషయాన్ని కెఎస్‌ఎన్‌కే మెసేజి పెడతారు. అనునిత్యం చంచల్‌గూడ జైలు దరిదాపుల్లోనే ఉండే కెఎస్‌ఎన్‌, అక్కడినుంచి మిగిలిన వ్యవహారాలు నడిపిస్తారు. జగన్‌తో సంప్రదించి ఆయన సమయం తీసుకోవడమూ, ఆయన ములాఖత్‌లు గట్రా ఏర్పాటు చేయడమూ, మరే ఇతరమైన ఇబ్బందులు రాకుండా చూడడమూ ఇవన్నీ కెఎస్‌ఎన్‌ నిర్వర్తించే బాధ్యత. 

శిలా సదృశాలు ఇవీ… 
పైన మనం చర్చించుకున్నవన్నీ… పార్టీలో కీలకమైన వ్యక్తుల గురించి. ఇవికాకుండా తెలుసుకోవాల్సిన శిలాసదృశమైన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఎలాంటి వారైనా, ఏ స్థాయి నాయకుల వచ్చి తమ పార్టీలో చేరుతున్నా జగన్‌ ఎవ్వరికీ టిక్కెట్‌ ఖరారు చేయడం అంటూ ఈ దశలో జరగడం లేదు. పార్టీ మీద విశ్వాసం ఉంటే చేరండి అనే వరకే ఆయన ఇచ్చే హామీ. ‘పార్టీ పనిచేస్తూ ఉండండి’ అనేది మాత్రమే ఆయన చేసే సూచన! ఎన్నికల వేళకు పరిస్థితులు ఎలా ఉంటే అప్పటికి వాటిని బట్టి నిర్ణయం తీసుకోవాలనేది ఆయన వ్యూహం. 
ఈ తరహాలో కొందరు కీలకవ్యక్తుల మంత్రాంగ చాతుర్యంతో.. తనదైన శైలిలోని నిర్ణయాధికారంతో ముందుకు సాగుతున్న జగన్‌.. ఎన్నికల సమయానికి ఈ పార్టీని ఇంకా ఏదశకు తీసుకువెళతారు? ఎలాంటి ఫలితాల్ని తనను నమ్ముకున్న వాళ్లకు అందివ్వగలరు? అనేది వేచిచూడాలి. 
 

– కపిలముని