చీమలు కోరిన పాముల పుట్ట!

అడవిలో ఆరోజు జంతుకోర్టు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గానీ… మావోయిస్టులు గానీ ప్రజల మద్యకు వచ్చి నిర్వహించే… రచ్చబండ, ప్రజా కోర్టు లాంటి కార్యక్రమం అన్నమాట ఈ జంతుకోర్టు! మరి అడవి అన్నాక అక్కడ అన్నీ…

అడవిలో ఆరోజు జంతుకోర్టు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గానీ… మావోయిస్టులు గానీ ప్రజల మద్యకు వచ్చి నిర్వహించే… రచ్చబండ, ప్రజా కోర్టు లాంటి కార్యక్రమం అన్నమాట ఈ జంతుకోర్టు! మరి అడవి అన్నాక అక్కడ అన్నీ జంతువులే ఉంటాయి గనుక దానిని జంతుకోర్టు అని పిలుచుకుంటాయి అవి. అయితే ఆరోజు జరుగుతున్న జంతుకోర్టుకు ఒక ప్రత్యేకత ఉంది. చీమలు తమ అస్తిత్వానికి ఉనికికి సంబంధించిన ఓ పోరాటాన్ని, అంశాన్ని కోర్టు ముందుకు తీసుకువచ్చాయి. మామూలుగానే మనం చిన్నప్పటినుంచి చదువుకున్న అన్ని కథల్లో మాదిరిగానే ఈ కథలో కూడా అడవికి రాజు సింహమే. చీమలు తమకు న్యాయం చేయాలంటూ తన ఎదుటకు ఓ సమస్యను తీసుకువచ్చినప్పుడు సింహం నివ్వెరపోయింది. ఇదేంట్రా బాబూ.. చీమలు ఎప్పుడూ చాలా సైలెంట్‌గా తమ పనేంటో తాము చేసుకుపోతూఉంటాయి కదా! ఎప్పుడూ అనవసరంగా ఎవ్వరి జోలికీ వచ్చినట్లు మనకు దాఖలాలు లేవు కదా.. మరి ఇప్పుడు అవే వచ్చి కోర్టు ముందు కేసు దాఖలు చేస్తున్నాయేమిటీ అని విస్తుపోయింది సింహం. 

అయినా సరే.. తన అడవి రాజ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా తాను రాజరికం చెలాయిస్తున్నది గనుక.. ఆ విషయాన్ని కోర్టు ముందుకు పంపించింది సింహం. ఆ మేరకు జంతుకోర్టులో చీమలు విన్నవించుకున్న బాధ గురించి.. పంచాయతీ జరగబోతున్నట్లు అడవి అంతా చాటింపు వేయించారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ అడవిలో ఉంటున్నాం.. చీమలు ఎన్నడూ ఎవ్వరూ తగాదా పెట్టుకున్నట్లు ఒక గొడవలో తల దూర్చినట్లు తామెన్నడూ చూడనే లేదు. అలాంటిది అవే వచ్చి కేసు పెట్టాయంటే ఏదో మర్మం ఉంటే ఉంటుంది అనుకుంటూ అడవిలోని జంతువులన్నీ తమ పనులు త్వరత్వరగా ముగించుకుని కోర్టు వేళకు అంతా వచ్చి సింహం గుహ ముందు గుమికూడాయి. 

సింహం గారి సభ కొలువు తీరింది.

సభలకు రెగ్యులర్‌గా హాజరయ్యే పులి, ఏనుగు, నక్కలు, తోడేళ్లు, జింకలు, వంటి జంతువులు కొన్ని ఆరోజు ప్రత్యేకంగా గుర్తించినది ఏంటంటే.. సభలో పాములు కూడా చాలా వచ్చాయి. సాధారణంగా సింహం నిర్వహించే సభలు, జంతుకోర్టులకు పాములు రావడం అరుదు. అలాంటిది చీమలు కేసు పెట్టిన రోజున పాములు దండిగా రావడం వాటికి ఆశ్చర్యం కలిగించింది. 

మరోవైపు చూస్తే.. చీమలు ఎంచక్కా బార్లు తీరి కూర్చుని ఉన్నాయి. రిపబ్లిక్ డే పెరేడ్‌లో విన్యాసాలు చేసే సైనికుల్లాగా ఎంచక్కా వరుస తప్పకుండా అవి కూర్చుని ఉన్న తీరే చాలా ముచ్చటగా ఉంది. అన్ని వరుసల కంటె కాస్త ముందుకు వచ్చి ఒంటరిగా రాణి చీమ కూర్చుని ఉంది. 

సింహం వచ్చి తన సింహాసనంలో కూర్చున్న తర్వాత.. ఇక సభ మొదలెట్టవలసిందిగా అనౌన్స్‌మెంట్ చేసింది దాని మంత్రి అయిన గుంటనక్క.  రాణి చీమ లేచి నిల్చుని, చెప్పడం ప్రారంభించింది.

‘అయ్యా సింహం దొరవారూ.. మేం ఎలాంటి వాళ్లమో మీకందరకూ తెలుసు. ఏదో మా కష్టం మేం చేసుకుని మా బతుకు మేం బతుకుతున్నాం. ఎవ్వరి జోలికి వెళ్లే వాళ్లం కాదు. ఎవ్వరితో తగవు పెట్టుకునే వాళ్లం కాదు. గుట్టుచప్పుడు కాకుండా మా బతుకు మేం బతుకుతున్నాం. అయితే ఈ పాములతో మాకు పెద్ద చిక్కొచ్చి పడింది’ అంటూ ఆపింది. 

అరె ఈ రోజు కొలువుదీరడం.. చీమలుపాములకు ఉన్న తగాదా గురించి అన్నమాట.. అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాయి మిగిలిన జంతువులు. 

ఈలోగా వెనుక గుంపుల్లోంచి ఒక పాము బుస్సు మని బుసకొట్టింది. మరో పాము.. కస్సు మంది. అయితే అన్నింటికంటె ముందున్న వాటి ప్రతినిధిలాంటి నల్లతాచు పెద్దదిగా పడగ విప్పి.. చీమల సొద ఆలకిస్తున్నట్లుగా అటూ ఇటూ తల పంకించి మాట్లాడకుండా ఊరుకుంది. 

మళ్లీ రాణిచీమే చెప్పడం ప్రారంభించింది. 

మేం కొన్ని వేల క్షల జీవులం కలిసి ఒక్కొక్క రేణువుగా మన్ను ఏరుకొచ్చి.. దానితో పుట్టపెట్టుకుంటున్నాం. ఏడాదిలో ఆర్నెల్లు ఎండాకాలం ఎలా తిండి దొరికినా.. మిగిలిన ఆర్నెల్లు వానల్లో కూడా మేం బతికే ఉండాలంటే.. ఆ ఎండల కాలంలో తెచ్చి దాచుకునే తిండే మాకు దిక్కు! దాచుకోడానికి పుట్ట ఉండక తప్పదు కదా. అల్పజీవులం. పెద్ద గుహలు మాకు పాడి కాదు కాబట్టి.. మాకు చేతనైనంతగా చీమకొక్క రేణువు మన్ను తీసుకొచ్చి పుట్ట కట్టుకుంటామని తమరెరుగనిది కాదు. కొన్ని నెలలూ, ఏళ్లూ గడిస్తే గానీ.. పూర్తిగా పుట్ట తయారు కాదు. కానీ పుట్ట తయారైన వెంటనే ఈ పాములొచ్చి తిష్ట వేసుకుని.. మమ్మల్ని తరిమేస్తున్నాయి. అదేమంటే ‘పుట్ట అంటూ ఒకటి ఏర్పడిన తర్వాత అది మాదే అని గొడవ పడుతున్నాయి. పుట్ట కట్టడంలో మా శ్రమ, మీకు తెలియంది కాదు. మీరే మాకు న్యాయం చేయాలి అని రాణి చీమ కూర్చుంది. 

సింహం తనవైపు చూడడంతో నల్లతాచు అందుకుంది.

‘పుట్ట అంటే అది పాములదే.. పాముల సొత్తు. ప్రపంచం అంతా అలాగే అనుకుంటుంది. కావలిస్తే మీరే చెక్ చేసుకోండి. పుట్ట అంటూ ఏర్పడిన తర్వాత.. అది చీమలు పెట్టినదా, దోమలు పెట్టినదా అనేది అనవసరం దానికి పాముల పుట్టగానే పేరొస్తుంది. అంటే మా ప్రాపర్టీ అనే కదా అర్థం. మేం పుట్టలను వదులుకునేదే లేదు’ అంటూ చాలా మొండిగా డాంబికంగా తన వాదన ముగించింది. 

ఇప్పుడు సింహం మొదలెట్టింది. నిజానికి దానికి పాము అంటే కాస్త గుబులు. పైగా పాము ఎప్పుడైనా తనకు ఉపయోగపడుతుంది. తనకు కిట్టనివారిని, శత్రువులను అంతుజూడాలంటే పామును వాడుకోవచ్చు. ఈ చీమల వల్ల అలాంటి ప్రయోజనం లేదు.. ఏదో లెక్కలకు ఎక్కువ సంఖ్యలో తన రాజ్యంలో ఉన్నాయి తప్ప ఉపయోగం లేదు.  అందుకని కేసు తన కోర్టుకు వచ్చినప్పటినుంచి ఎలాంటి తీర్పు చెప్పాలో అది ముందే ఫిక్సయిపోయి ఉంది. ఈ సభ, కొలువుతీర్చడం అంతా.. నాంకేవాస్తే అంతే. ఇప్పుడు సింహం మొదలెట్టింది.

‘‘అవును చీమల్లారా.. ప్రపంచంలో ఎక్కడైనా పెద్దపెద్ద పుట్టలను పాముల పుట్ట అనే మనుషులు పిలుస్తుంటారు గానీ.. చీమల పుట్ట అనడం మీరు చూశారా’’

‘‘లేదు సింహం రాజా.. చిన్నగా కాస్త మట్టి పేరుకుంటే.. చీమల పుట్ట అంటున్నారు. పుట్ట పెద్దదై చెట్టంత ఎదిగాక అందులో మేం ఉంటున్నా కూడా దాన్ని పాముల పుట్ట అనే మాట్లాడుకుంటున్నారు మనుషులు’’

‘‘అంటే అర్థం ఏంటన్నమాట. పాముల పుట్టల్లోనే మీరు ఉంటున్నారన్నమాట’’ ముక్తాయించింది సింహం. 

‘‘అలా తేల్చేయద్దు సింహం రాజా.. మా రెక్కల కష్టం లేకుండా ఆ పుట్ట అసలు ఏర్పాటయ్యేదేనా? పేరుకు పాముల పుట్టే గానీ.. అందులో శ్రమ మాది కాదా.. మీకు తెలియదా’’ అని విలపించింది రాణి చీమ.

పాము అసలు మాట్లాడకుండా.. తను మాట్లాడాల్సిందంతా సింహానికి తెలుసు అన్నట్లుగా చూస్తోంది. 

‘‘అవునుగానీ.. అందరూ దాన్ని పాముల పుట్ట అంటున్నారు గనుక మనం చేయగలిగిందేమీ లేదు. మీరు చిన్నవిగా మట్టి ముద్దల్లాంటి ఇళ్లు కట్టుకుంటే అంతా చీమలపుట్టే అంటారు కద! మీరు ఆశకుపోయి పెద్దపెద్ద పుట్టలు కట్టుకుంటే.. అంతే.. దాన్ని పాములపుట్టగా వదులుకోవాల్సిందే’’

‘‘బాగా బతుకుదాం అనుకోవడం కూడా ఆశకుపోవడమా మహరాజా’’

‘‘చీమలు గా పుట్టినందుకు చిన్నగానే బతకాలి మీరు. కావలిస్తే అదే పుట్టల్లో మీరు కూడా పాములతోనే కలిసి ఉండండి. అంతకుమించి ఏం చేయలేం’’

‘‘పుట్ట అందరిదీ అని ప్రకటిస్తే అందుకు సిద్ధం సింహం రాజా!’’

‘‘అలా కుదర్దు. పుట్ట మీరు కట్టినా.. అది పాముల పుట్టే.. కట్టిన వాడిదే పుట్ట అనేట్లయితే తాజ్‌మహల్ షాజహాన్‌ది కాదు.. కూలీలది అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కట్టిన తర్వాత అది పాములదే అవుతుంది. మీరు కూడా ఓ మూల బతుకుతోంటే.. మీకు ఇబ్బంది రాకుండా అవి కడుపులో పెట్టుకుని చూసుకుంటాయి.’’ అంది సింహం.

రాణి చీమ మౌనం వహించింది.

‘‘లేకుంటే మీ దారి మీరు చూసుకోండి.. మీవైన సొంత స్థలాల్లోకి చిన్నపుట్టల్లోకి వెళ్లండి’’ ముగించింది సింహం. 

తీర్పు అయిపోయింది.

పాములు విజయగర్వంతో లేచి నాట్యం ఆడాయి. 

అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న జంతువులన్నీ ఇంటిదారి పట్టాయి. 

రాణి చీమకు దు:ఖం వస్తోంది. ఆటవికన్యాయం అంతే అనుకుంది. దిగమింగుకుని లేచింది. అన్నీ వరుసగా లేచాయి. వరుసగా.. ఒకదాని వెంట ఒకటి మిలిటరీ డ్రిల్ చేస్తున్నట్లుగా ఆ వేల లక్షల చీమలు మిలిటరీ డ్రిల్ చేస్తున్నట్లుగా నడవడం ప్రారంభించాయి. కానీ మిగిలిన జంతు ప్రపంచానికి తెలియని సంగతి ఒకటుంది. ముందున్న రాణిచీమనుంచి చివర్న ఉన్న పిల్ల చీమ వరకు అందరి మదిలో ఒకటే పద్యం మెలగుతోంది. 

బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

మనవి…
ఈ కథ ఏ వ్యక్తులను గానీ, ఏ రాజకీయ సాంఘిక పరిణామాలను గానీ ఉద్దేశించి రాసినది కాదు. రాష్ట్రవిభజన  హైదరాబాదు ఎవరిసొత్తు అనే అంశం మీద రాసినది అసలే కాదు. హైదరాబాదు అభివృద్ధిలో మా రక్తమాంసాలు ఉన్నాయి.. ఇక్కడి ప్రగతి మాది.. ఈ నగరం మాది అనే సీమాంధ్రుల వాదనతో ఇందులోని చీమలకు ఎలాంటి సంబంధం లేదు. అలా ఎవరికైనా అనిపిస్తే దయతో మన్నించవలసినదిగా ప్రార్థన.

కపిలముని