‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా..’ అనే పాట విన్న కిరణ్ యిప్పుడు పాడుకుంటూ వుండి వుంటారు – ‘రాహుల్‌నైనా కాకపోతిని, అమ్మ దయ సోకగా..’ అని. రాహుల్ చేసినది, కిరణ్ చేసినది ఒకటే ! ఆట్టే మాట్లాడితే కిరణ్ చేసినది చాలా తక్కువ. ‘‘విభజన వలన తీర్చరాని సమస్యలున్నాయి కాబట్టి అధిష్టానాన్ని పునరాలోచించుకోమని కోరుతున్నాను. కాంగ్రెసు, సమైక్యత అనే వాటి మధ్య ఎంచుకోవాల్సిన దుర్గతి నాకు పట్టకూడదని కోరుకుంటున్నాను. రెండూ నా హృదయానికి దగ్గరే. ఒకవేళ విభజన చేయాలని పట్టుబడితే నా చేతులమీదుగా చేయలేను కాబట్టి తప్పుకోవడానికైనా రెడీ.’’ అని చెప్పారు. అది కూడా తెలంగాణ నోట్ యింకా ప్రాథమిక దశలో వుండగానే. ఇప్పటివరకు తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకు పెట్టలేదు, రాష్ట్రపతి వద్దకు వెళ్లలేదు, హోం శాఖ బిల్లు తయారు చేయలేదు, అసెంబ్లీకి పంపలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మాత్రమే జరిగింది.
కాబినెట్ నోట్ తయారీ దశలో వుంది. ఏ మేరకు అని మాత్రం అడక్కండి. గంటగంటకు మార్చిమార్చి వార్తలు ఒక్కోలా వస్తున్నాయి. ‘ఆంటోనీ కమిటీ నివేదిక యిచ్చేవరకూ తయారవదు, ఆయన రాష్ట్రానికి వచ్చి కళ్లారా చూసేవరకూ నివేదిక యివ్వరు, రావాలంటే ఆయన మంచంలోంచి లేవాలి’ అని ఓ ఢిల్లీ నేత చెప్పినట్టు యిప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తే ఇంకో గంట పోయాక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది – ‘ఆంటోనీ యిచ్చేదేమిటి, మేం చూసేదేమిటి, ఆపాటి మాకు తెలియదా, ఆయన దారి ఆయనదే, మా దారి మాదే, మేం నోట్ తయారుచేసి మడిచి జేబులో పెట్టుకున్నాం, కాబినెట్ మీటింగులో మామూలు ఎజెండా అయిపోగానే ఆ కాగితాల్లో దీన్ని కలిపేస్తాం’ అని యింకో ఢిల్లీ నాయకమ్మన్యుడు అన్నాడని! కాబినెట్ నోట్‌పై సంతకం పెట్టానని షిండే అన్నట్టు ఓ ఛానెల్ చెపితే, అబ్బే చూడనే లేదు అన్నాడని మరో ఛానెల్ యిస్తోంది. మీడియా మనతో ఆటలాడుకుంటోందనడానికి యింతకంటె నిదర్శనం కావాలా?
మరి రాహుల్ వ్యతిరేకించిన ఆర్డినెన్సు యివన్నీ దాటేసింది. కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చలు జరిగాయి, యుపిఏ భాగస్వామ్యపక్షాలతో చర్చలు జరిగాయి, ప్రతిపక్షాలతో జరిగాయి. అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అన్నీ అయిపోయి దేశజనత ‘ఇదేమిటి? ఇలాటి బిల్లు’ అని ఛీత్కరించుకుంటూ వుంటే దాన్నే ఆర్డినెన్సుగా తేవడానికి కాంగ్రెసు పార్టీ, యుపిఏ ప్రధాని అందరూ నిశ్చయించుకుని ప్రెస్ మీట్ పెడితే అక్కడ రాహుల్ అనుకోని అతిథిగా వచ్చి ‘ఇది సెన్సు లేని ఆర్డినెన్సు, చింపి పారేయడమొకటే దీనికి శాస్తి’ అని దివ్యవాణి వినిపించి మాయమై పోయారు. ఇదంతా చేసినది కాంగ్రెసు అధ్యక్షురాలు, రాహుల్‌గారు ఉపాధ్యక్షులు. పోనీ మన రాష్ట్రపు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిలా వారేమైనా ఒకరిమొహం మరొకరు చూసుకోనివారా అంటే అదేమీ కాదు, తల్లీకొడుకులు. తమ పార్టీనే ధిక్కరించిన రాహుల్ ‘నీతికోసం నిలబడిన నేతాశ్రీ’గా జేజేలు అందుకుంటూ వుంటే అంతకంటె ముందు అధిష్టానాన్ని యింత ఘాటు పదాలు ఏమీ లేకుండా ‘అమ్మా తల్లీ’ అంటూ బతిమాలిన కిరణ్ తిరుగుబాటుదారుడిగా ఛీత్కరించుకోబడుతున్నాడు.
ఇదేమిటి వింత? అంటే ఎమర్జన్సీ కాలం నాటి జోక్ గుర్తుకు వచ్చింది. తమిళ హాస్యనటుడు, రచయిత ‘చో’ రామస్వామి నడిపే ‘‘తుగ్లక్’’ పత్రికలో ఎవరో ప్రశ్న అడిగారు – ‘‘నేను యింత చదువుకున్నాను. ఇన్ని డిగ్రీలున్నాయి. నేను ప్రధాని కాగలనా?’’ అని. చో సమాధానం – ‘‘నీ డిగ్రీలెవడడిగాడయ్యా బాబూ, మీ అమ్మ పేరు చెప్పు. ప్రధాని అవుతావో లేదో చిటికెలో చెప్తాను.’’ ! ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ యువనేతగా, భావిప్రధానిగా దేశమంతా కీర్తిస్తున్న కాలమది. అలాగ రాహుల్‌కి పట్టిన భోగం కిరణ్‌కు పట్టకపోవడానికి కారణం – కిరణ్ తల్లి పేరు సోనియా గాంధీ కాకపోవడమే!
ఒక్కోప్పుడు రాబోయే పరిణామాలు వూహించలేక రాజు తప్పుటాలోచన చేయవచ్చు. అప్పుడు మంత్రో, రాణో, యువరాజో మరొకరో రాజుకి హితవు పలకవచ్చు. విన్నవాడు బాగుపడ్డాడు, విననివాడు చెడ్డాడు. రావణుడికి హితవు చెప్పిన విభీషణుణ్ని మనం భీషణదూషణ చేయడం లేదు. వస్త్రాపహరణం జరపబోతున్న దుర్యోధనుణ్ని వారించిన వికర్ణుణ్ని మనం కర్ణకఠోరంగా తిట్టడం లేదు. యుద్ధానికి సిద్ధమవుతున్న సుయోధనుడికి భీష్మద్రోణులు శాంతి చేసుకోమని చెప్పి చూశారు. వినకపోతే ‘సరే కానీయ్, నీ కర్మా, మా కర్మా యిలా కాలింది’ అనుకుంటూ కురుక్షేత్రంలోకి దిగి కురువంశ నాశనం చూసి బాధపడ్డారు. జైలుపక్షుల ఆర్డినెన్సు విషయంలో సోనియా ప్రజాగ్రహం చూశాక నాలిక కరుచుకుని వుండవచ్చు. వెనక్కి తీసుకుందామనుకుని, మనంతట మనమే తగ్గడం ఎందుకు, ఆ ఘనతేదో రాహుల్‌కి కట్టబెట్టవచ్చు కదా అనుకుని ఓ చిన్న ప్రహసనం ఆడి వుండవచ్చు.
కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు జీతాలు పెంచేముందు, తమ పార్టీ ఆధ్వర్యంలోని యూనియన్ల ద్వారా వారి చేత చిన్నపాటి సమ్మె చేయించి, అప్పుడు జీతాలు పెంచుతాయిట. వాళ్లు అడక్కుండా మనమే పెంచేస్తే సమ్మెలు చేసే అవాటు తప్పిపోతే కార్మికచైతన్యం చచ్చిపోతుందని భయంట. తదుపరి కాలంలో తాము గద్దె దిగాక మరొకర్ని ఎదిరించాలంటే కాస్త ప్రాక్టీసు వుండాలి కదా. అలాగే రాహుల్‌కు కూడా విప్లవకారుడిగా కాస్త యిమేజి తేవాలంటే యిలాటి కసరత్తు మంచిదే. ‘‘రాజమకుటం’’ సినిమాలో యువరాజే కోటలోని, కోటబయట శత్రువులను ఎదిరించడానికి తనే విప్లవకారుడిగా అవతారం ఎత్తుతాడు. తనని తనే అపహరించబోయినట్టు నాటకమాడతాడు. సినిమా బలే థ్రిల్లింగ్‌గా వుంటుంది. ఆ థ్రిల్ కోసమే రాహుల్ చేత యిలాటి ట్రిక్కే వేయించారు. ఆయనే రాజు, ఆయనే రాబిన్‌హుడ్. వహ్వా!
ఆ లెవెల్లో కాకపోయినా కిరణ్‌కు కూడా అలాటి పాత్రే యిచ్చారని అనుకుంటూ వచ్చాం. సీమాంధ్ర పౌరుషాన్ని రగిలించడానికి అవకతవక ప్రతిపాదన ఒకటి జులై 30 న చేసి, వారిని రెచ్చగొట్టి వాళ్లందరికి మెస్సయ్యగా కిరణ్‌ను ప్రసాదించే స్క్రీన్ ప్లే కాంగ్రెసు రచించిందని అనుమానం కలిగింది. సీమాంధ్ర ఉద్యమం పట్ల కిరణ్ బహిరంగంగా సానుభూతి ప్రదర్శిస్తున్నా, దానిపై తెలంగాణ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నా అతనిపై ఏ చర్యా తీసుకోకపోవడం అనుమానాన్ని బలపరచింది. అలా అని సీమాంధ్ర ప్రాంతం విషయంలో అధిష్టానం ఏ వెసులుబాటూ కల్పించడం లేదు. ఉద్యమం ప్రారంభమై రెండు నెలలు దాటినా యిప్పటిదాకా వారిని చల్లార్చే ఒక్క చల్లటిమాట లేదు. మీ సంగతి పట్టించుకుంటామని సోనియా, రాహుల్ స్థాయి నేత నుండి హామీ లేదు. ఉద్యమాన్ని గుర్తిస్తున్నట్టు వాళ్లు కనీసం నటించనైనా లేదు. ఇక అమాంబాపతు నాయకులు చెలరేగి పోయి రోజుకో మాట మాట్లాడుతున్నారు. ‘అరిచి గీపెట్టినా నిర్ణయం మారదు, తెలంగాణ ఏర్పాటు ఖాయం’ అని ఒకటే దంపుళ్ల పాట.
ఓకే, ఖాయమే, కానీ మా భయాల మాట ఏమిటి? అంటే ‘ఏవైనా వుంటే మా రోగిష్టి నాయకులకు చెప్పుకోండి, ఓపికున్నంత మేరకు వినిపించుకుంటారు. వాళ్లకు మీరేం చెప్పుకున్నా మాకు ఖాతరు లేదు, మా దారిన మేము బిల్లు చేసేసుకుంటూ పోతాం’ అని మాటిమాటికీ బెదిరిస్తున్నారు. ‘సమస్యలేవైనా వుంటే..’ అంటూ అనుమానాలు దేనికి? ఉన్నాయి కాబట్టే కదా యిన్నేళ్లుగా నాన్చారు. కమిటీలు వేశారు. ఇలా ఎంత మొత్తుకున్నా వినకుండా వాళ్లు మీ లెక్కేమిటి అని ప్రవర్తిస్తూ వుంటే, ‘మా భవిష్యత్తు అంధకారబంధురమే’ అని సీమాంధ్రప్రజలు భయపడుతున్నవేళ కిరణ్ ఓ బుల్లి ఆశాకిరణంలా కనబడ్డాడు.
అతను కాంగ్రెసు చేతి కీలుబొమ్మే కావచ్చు, కానీ యీ క్షణాన అతని కంఠంలో నిజాయితీ కనబడుతోంది. దృఢత్వం కనబడుతోంది. ‘అసెంబ్లీ తీర్మానం రాకతప్పదు, అప్పుడు ఓడించి మన అభిప్రాయం లోకానికి తెలుపుదాం, అప్పటిదాకా రాజీనామాలు వద్దు’ అని సహచరులకు నచ్చచెప్పడంలో విజ్ఞత కనబడుతోంది. కానీ యిది విభజనవాదులకు కర్ణకఠోరంగా వినబడుతోంది. ‘ఆయన ఓ వెధవ’ అనేశాడు మాజీమంత్రి కోమటిరెడ్డి. ఇలాటి పదాలు గతంలో ఎవరూ ఉపయోగించినట్టు నాకు గుర్తు లేదు. ‘సీల్డు కవర్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు’ అన్నాడు ఉపముఖ్యమంత్రి, తన పుట్టుక మర్చిపోయి. తెలంగాణ కోటాలో గీతా రెడ్డితో పోటీ పడి, మాల, మాదిగ వ్యత్యాసం వలన ఆఖరి నిమిషంలో పదవి తెచ్చుకున్న మనిషాయన. ఆయన మర్చిపోయినా జనం మర్చిపోరు కదా. కిరణ్‌ను మెచ్చుకునేవారు, తిట్టేవారు అందరూ (కుంభసంభవుల్లా) కవరుసంభవులే. పైనుంచి దిగినవారే. జనంలోంచి వచ్చిన నాయకులైతే ధైర్యంగా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికయ్యేవారు. తెలంగాణ ఉద్యమం నడిచే రోజుల్లో రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు కోరితే వీరు చేశారా? అధిష్టానానికి కోపం వస్తుందని అదిరిబెదిరిన వారే కదా! ఇప్పుడు కిరణ్‌ను ఎత్తిపొడవడం దేనికి?
వీళ్లేమంటున్నా సీమాంధ్ర ప్రజలు కిరణ్ పట్ల ద్వేషం ప్రకటించటం లేదు. అతని దిష్టిబొమ్మలు తగలబడటం లేదు. అధిష్టానం దన్ను వుండడం చేతనే, అతని ఆటలు సాగుతున్నాయన్నాయని అనుకుంటూ వుండగా హఠాత్తుగా సీమాంధ్ర మంత్రుల్లో చీలిక వచ్చింది. కిరణ్ అనుకూలురు, వ్యతిరేకులుగా చీలిపోయారు. మొదటిరోజు అలాటిది ఏమీ లేదు అన్నారు కానీ మరుసటి రోజే డొక్కా వారు మాణిక్యాలు వెదజల్లారు. ఆయనకు హఠాత్తుగా శంకరరావు, డిఎల్ రవీంద్రా రెడ్డిల తొలగింపులో అన్యాయం, అక్రమం కనబడింది. అధిష్టానాన్ని ధిక్కరించడమేమిటి, హన్నా అని కిరణ్‌ని కోంబడ్డారు. తమ సమస్యలకు పరిష్కారం చెప్పకుండా డోంట్‌కేర్‌గా వున్న అధిష్టానాన్ని యీ మేరకు వెనేకసుకుని వస్తున్న డొక్కాను సీమాంధ్రులు డొక్క చింపుతారేమోనని భయం వేసింది నాకు. ఆ భయమే ఆయనకీ వేసిందేమో ‘నేనూ సమైక్యవాదినే’ అన్నాడు. మరి యిక కిరణ్ పట్ల ఫిర్యాదు దేనికి?
ఎవరేమనుకున్నా కిరణ్ పట్ల సీమాంధ్రులకు, సమైక్యవాదులకు సానుభూతి వుంది. ఆయన లేవనెత్తిన సమస్యలకు అధిష్టానం పరిష్కారాలు చూపించి అప్పుడు ముందడుగు వేయాల్సిందే అనుకుంటున్నారు. అలాటి సమయంలో కిరణ్ అధిష్టానాన్ని ధిక్కరించి మాట్లాడారంటూ యితర మంత్రులు కొందరైనా మాట్లాడితే వాళ్లను ప్రజామోదం లభించదు. అసలు కాంగ్రెసు అంటేనే జనం మండిపడుతున్నారు. కాంగ్రెసు ముఖ్యమంత్రి తమ పక్షాన మాట్లాడుతున్నాడు కదాని కాస్త ఓపిక వహిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులే అతన్ని తిట్టనారంభిస్తే వాళ్లకు యిబ్బందులు తప్పవు. ఎందుకంటే ‘మనకు అధిష్టానం ఫలానా మేలు చేసింది కాబట్టి విభజన ఒప్పుకుందాం. అడ్డుపడుతున్న కిరణ్ విధానం తప్పు’ అని చెప్పడానికి వాళ్లకు చేతిలో ఏమీ లేదు. కేవలం అధిష్టానం చెప్పింది కదాని వాళ్లు కిరణ్‌ను బహిరంగంగా తిడితే, అంతిమంగా నష్టపోయేది వారే అవుతారు.
అధిష్టానాన్ని ధిక్కరించడమే కిరణ్ పాపమైతే మరి రాహుల్ చేసినదేమిటి? ‘ఆర్డినెన్సు చింపేయమన్న రాహుల్ చేత తెలంగాణ బిల్లు కూడా చింపేయమని పిలుపు యిప్పించండి, లేదా ఆంధ్రకు ఫలానా మేళ్లు చేస్తామని హామీ యిప్పించండి’ అని ప్రజలు యీ ఆనం, డొక్కాలను అడిగితే వీళ్లేం చేయగలరు? అయినా కిరణ్‌ను తొలగించడం అంత సులభమేమీ కాదు. అతన్ని తీసేసి తెలంగాణ నాయకుణ్ని పెడితే ఆంధ్రప్రజలు మాకు మరీ అన్యాయం జరిగిందంటారు. పోనీ ఏ బొత్సనో కూర్చోబెడితే ‘ఆంధ్రద్రోహి’ అని సీమాంధ్రులు అతనిపై ముద్ర కొడతారు. రాజీనామా చేసి దిగిపో అంటే కిరణ్ నాదెండ్ల మనోహర్‌ను మచ్చిక చేసుకుంటే, అసెంబ్లీని ఏర్పాటు చేయగలడు. ఎందుకంటే అసెంబ్లీ ప్రొరోగ్ కాలేదు. అసెంబ్లీలో బ్రహ్మాండమైన వీడ్కోలు స్పీచి యిచ్చి దిగిపోయాడంటే యిక చిరస్థాయిగా ప్రజల్లో హీరో అయిపోతాడు. ఇక అతన్ని తట్టుకోవడం అందరికీ కష్టమే. అందువలన కాంగ్రెసు అతని గాలి తీసేసిగాని, పదవి తీయదు. గాలి తీయడానికే యిప్పుడు వీళ్లను దువ్వింది. ‘రాహుల్ విషయంలో వీళ్లు నోరు విప్పలేదు కదా, నా విషయంలోనే ఎందుకిలా?’ అని వ్యథ చెందుతూ ‘రాహుల్‌నైనా కాకపోతిని..’ అని కిరణ్ పాట పాడుకున్నా లాభం లేదు.
ఎమ్బీయస్ ప్రసాద్