ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. దీంతో అనుకున్న టైమ్ కంటే ముందుగానే ప్రీ-బుకింగ్ ను క్లోజ్ చేసింది జియో. కేవలం రూ.1500కే 4జీ హ్యాండ్ సెట్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన జియో.. గురువారం సాయంత్రం 5గంటల 30నిమిషాలకు ప్రీ-బుకింగ్ ప్రారంభించింది. ఒక దశలో జియోకు సంబంధించిన వెబ్ సైట్, యాప్స్ అన్నీ హ్యాంగ్ అయ్యాయంటే దీనికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
అలా మిలియన్ల సంఖ్యలో కస్టమర్లు 4జీ హ్యాండ్ సెట్స్ బుక్ చేసుకున్నారని తెలిపిన జియో.. భారీ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి ప్రీ-బుకింగ్స్ నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. బుకింగ్ ను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.
ప్రస్తుతం జియో దృష్టింతా ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లకు ఎలా హ్యాండ్ సెట్స్ అందించాలనే అంశంపైనే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతానికి ఈ సంస్థకు వారానికి 5 లక్షల హ్యాండ్ సెట్స్ అందించే సామర్థ్యం మాత్రమే ఉంది. అటు బుకింగ్స్ మాత్రం కోటి దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బుక్ చేసుకున్న వినియోగదారులకు హ్యాండ్ సెట్స్ అందించిన తర్వాతే తిరిగి ప్రీ-బుకింగ్ ప్రారంభించాలని జియో భావిస్తోంది.
4జీ హ్యాండ్ సెట్ అమ్మకాలతో టెలీకమ్యూనికేషన్స్ రంగంలో మరో ఏడాదిలో తిరుగులేని శక్తిగా ఎదగబోతోంది జియో. సిమ్ కార్డులతో ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ సంస్థ.. హ్యాండ్ సెట్ తో పాటు మరో సిమ్ కార్డును కూడా అందించబోతోంది. సో.. ఇప్పటికే ఉన్న జియో కస్టమర్లు దాదాపు మరో 40శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.