డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న టిల్లూ స్క్వేర్ సినిమాపై గతంలో వచ్చిన పుకార్లు, వివాదాలు అన్నీఇన్నీ కావు. చాన్నాళ్లపాటు అవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఎట్టకేలకు వీటిలో కొన్నింటిపై హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పందించాడు. రిలీజ్ కు సరిగ్గా కొన్ని రోజుల ముందు, కీలకమైన 2 అంశాలపై స్పష్టత ఇచ్చాడు.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెను ఎంపిక చేసిన విధానం, ఆ తర్వాత ఆమె తప్పుకోవడం, తిరిగి జాయిన్ అవ్వడం, హీరోతో గొడవ అంటూ ప్రచారం.. ఇలా చాలానే వ్యవహారం నడిచింది. ప్రస్తుతం సినిమా కంటే ఎక్కువగా అనుమప పరమేశ్వరన్ బోల్డ్ యాక్ట్ గురించే ఎక్కువమంది మాట్లాడుకుంటున్నారు.
దీనిపై సిద్ధు స్పందించాడు. ప్రస్తుతం అనుపమ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, కానీ రిలీజ్ తర్వాత ఆమె గురించి కాకుండా, సినిమాలో ఆమె పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడతారని అంటున్నాడు.
“అనుపమ గురించి రిలీజ్ కు ముందే అందరూ మాట్లాడుకుంటారని మాకు తెలుసు. ఇదే విషయం నేను, అనుపమ కూడా ప్రారంభంలోనే మాట్లాడుకున్నాం. అయితే సినిమా రిలీజ్ అయ్యేంత వరకే. టిల్లూ స్క్వేర్ రిలీజైన తర్వాత అనుపమ గురించి కాకుండా, ఆమె పోషించిన పాత్ర గురించి అంతా మాట్లాడుకుంటారు.”
ఇక దర్శకుడి మార్పుపై కూడా స్పందించాడు సిద్ధు జొన్నలగడ్డ. మొదటి భాగానికి ఒకరు దర్శకత్వం వహించి, రెండో భాగానికి వచ్చేసరికి దర్శకుడు మారడాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. సీక్వెల్ తీద్దామనుకునే టైమ్ కు విమల్ మరో ప్రాజెక్టుతో బిజీ అయ్యాడట. అందుకే టిల్లూ స్క్వేర్ కు మరో డైరక్టర్ ను తీసుకున్నామని అంటున్నాడు. సీక్వెల్ స్టోరీ నచ్చక విమల్ తప్పుకున్నాడనే వార్తల్ని సిద్ధు ఖండిస్తున్నాడు.