పార్టీపై ప‌ట్టు కోల్పోయిన బాబు!

టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చంద్ర‌బాబునాయుడు అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పార్టీపై చంద్ర‌బాబునాయుడు ప‌ట్టు కోల్పోయారు. త‌మ ప్ర‌యోజ‌నాల‌కు దెబ్బ త‌గులుతుంద‌ని భావిస్తే, ఏ ఒక్క నాయ‌కుడు ఆయ‌న…

టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చంద్ర‌బాబునాయుడు అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పార్టీపై చంద్ర‌బాబునాయుడు ప‌ట్టు కోల్పోయారు. త‌మ ప్ర‌యోజ‌నాల‌కు దెబ్బ త‌గులుతుంద‌ని భావిస్తే, ఏ ఒక్క నాయ‌కుడు ఆయ‌న మాట వినే ప‌రిస్థితి లేదు. ఇందుకు ఎన్ని ఉదాహ‌ర‌ణ‌లైనా చెప్పొచ్చు. పొత్తులో భాగంగా బీజేపీ, జ‌న‌సేన‌కు కొన్ని సీట్ల‌ను టీడీపీ త్యాగం చేయాల్సి వ‌చ్చింది. అలాగే సొంత పార్టీలోనూ కొన్ని మార్పుచేర్పులు చేయాల్సి వ‌చ్చింది.

టికెట్లు ద‌క్క‌ని ఆశావ‌హులు పార్టీపై రివ‌ర్స్ అయ్యారు. తిరుగుబాటు బావుటా ఎగుర‌వేయ‌డం చ‌ర్చ‌నీయాంశం. కొన్ని చోట్ల టీడీపీ ఇన్‌చార్జ్‌లు షో చేస్తూ, చంద్ర‌బాబు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు. ఇవ‌న్నీ టీడీపీకి న‌ష్టం క‌లిగించేవే. శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం జిల్లా వ‌ర‌కూ టికెట్లు ద‌క్క‌ని నేత‌లు ఏ మాత్రం ఆలోచించ‌కుండా, చంద్ర‌బాబుపై ఫైర్ అవుతున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో కిమిడి నాగార్జున‌, బండారు స‌త్య‌నారాయ‌ణ‌, అలాగే భీమిలి, అన‌కాప‌ల్లి, య‌ల‌మంచిలికి చెందిన టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అనంత‌పురంలో ప్ర‌భాక‌ర్‌చౌద‌రి టికెట్‌ను అమ్ముకున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. అన‌ప‌ర్తిలో న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణారెడ్డి, రివ‌ర్స్ అయ్యారు. న్యాయం కోస‌మంటూ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు.

ప‌రిటాల, జేసీ కుటుంబాలు కూడా చంద్ర‌బాబు వైఖ‌రిపై గుర్రుగా ఉన్న‌ప్ప‌టికీ, బ‌య‌టికి ఏమీ మాట్లాడ్డం లేదు. తంబ‌ళ్ల‌ప‌ల్లెల్లో శంక‌ర్‌యాద‌వ్ అనుచ‌రులు, రాజంపేట‌లో బ‌త్యాల చెంగ‌ల్రాయులు నేతృత్వంలో ఏకంగా భారీ ర్యాలీ నిర్వ‌హించి నిర‌స‌న తెలిపారు. ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్‌చార్జ్ ప్ర‌వీణ్‌రెడ్డి మౌన‌వ్ర‌తంలో ఉన్నారు. రైల్వేకోడూరులో విశ్వ‌నాథ‌నాయుడు తీవ్ర కోపంగా ఉన్నారు.

ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు చంద్ర‌బాబు తీరుపై ర‌గిలిపోతున్నారు. ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రించాల‌నే చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తిని ఎవ‌రూ లెక్క పెట్ట‌డం లేదు. టీడీపీకి భ‌విష్య‌త్ వుంటుంద‌నే న‌మ్మ‌కం లేక‌పోవ‌డమే, నాయ‌కులు ఖాత‌రు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని ప‌లువురి అభిప్రాయం.