ఆర్ఆర్ఆర్ లో దింపుడుకళ్లెం ఆశలు!

ఏపీ ఎన్నికలకు సంబంధించి.. అన్ని పార్టీలూ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేశాయి. ఎవరికి వారు ఎన్నికల ప్రచార బరిలో మున్ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. నామినేషన్ల పర్వం మొదలయ్యేలోగా ఒకటిరెండు మార్పులు జరగడం అతిశయం ఎంతమాత్రమూ కాదు.…

ఏపీ ఎన్నికలకు సంబంధించి.. అన్ని పార్టీలూ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేశాయి. ఎవరికి వారు ఎన్నికల ప్రచార బరిలో మున్ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. నామినేషన్ల పర్వం మొదలయ్యేలోగా ఒకటిరెండు మార్పులు జరగడం అతిశయం ఎంతమాత్రమూ కాదు.

కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే.. అటు అధికార, ఇటు విపక్ష పార్టీల్లో దాదాపుగా అందరూ చాలా కష్టపడి పోరాటాలు చేసి టికెట్ దక్కించుకున్నవాళ్లే. అంత ఈజీగా ఎవరూ వదలుకోరు.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనూ.. నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజులో మాత్రం ఇంకా దింపుడు కళ్లెం ఆశలు చావడం లేదు. ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తాననే సంపూర్ణమైన విశ్వాసం తనకు ఉన్నదని రఘురామ చెప్పుకుంటున్నారు. అన్ని పార్టీల ప్రకటనలు పూర్తయిపోయిన తర్వాత కూడా.. ఆయన ఇలాంటి మాటలు చెప్పడం చూస్తోంటే జనానికి నవ్వు వస్తోంది.

ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో తెలియదట. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో, ఎంపీగా బరిలో ఉంటారో కూడా తెలియదట! కానీ మూడు నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని మాత్రం రఘురామ చెబుతున్నారు.

రఘురామక్రిష్ణ రాజు.. తాను సిటింగ్ ఎంపీగా ఉన్న నరసాపురం నుంచి మాత్రమే మళ్లీ ఎంపీ బరిలో ఉంటానని మొన్నమొన్నటిదాకా గప్పాలు కొట్టారు. ఏ పార్టీ తెలియదు గానీ.. నరసాపురం ఎంపీ బరిలో ఉండబోయేది మాత్రం నేనే అంటూ బీరాలు పలికారు.

పొత్తుల్లో ఏ పార్టీకి నరసాపురం దక్కినా సరే, వారు తనకు తప్ప మరెవ్వరికీ టికెట్ ఇవ్వబోరన్నట్టుగా రఘురామ అలవిమాలిన అహంకారాన్ని ప్రదర్శించారు. తీరా ఆ సీటును బిజెపి దక్కించుకుని శ్రీనివాసరాజు చేతిలో పెట్టింది. ఆయన పరిస్థితి అగమ్యగోచరం అయింది. అప్పటినుంచి రోజుకో రకం ప్రకటన చేస్తున్నారు.

మొన్నటిదాకా సింగిల్ గా చంద్రబాబునాయుడును మాత్రమే కీర్తిస్తూ వచ్చారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి మాత్రమే పోటీలో ఉంటానని, చంద్రబాబు తనకు న్యాయంచేస్తారనే నమ్మకం ఉన్నదని రకరకాలుగా బాబును ఉబ్బించారు. చంద్రబాబు న్యాయం చేస్తారనే డైలాగులు చెప్పారే తప్ప.. ఆయన తెలుగుదేశంలో చేరలేదు. తీరా ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయినట్టుంది.

ఏ పార్టీనో తెలియదు అంటున్నారంటే.. చంద్రబాబునుంచి పెద్దగా సానుకూల స్పందన రాలేదని, రఘురామ ఇంకా.. మూడు పార్టీల పెద్దలనూ బతిమాలుకుంటూ ఏదో ఒక సీటు ఎడ్జస్ట్ చేసి ఇవ్వండి బాబూ అని వేడుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు స్థిరత్వం ఉండాలని అనుకోవడం భ్రమ. కనీసం తాను ఏ పార్టీలోకి వెళ్లి రాజకీయం చేయాలో కూడా క్లారిటీలేకుండా.. ఇలా గోడమీద పిల్లిలా ఉంటే ఎలా అని ప్రజలు నవ్వుకుంటున్నారు.