జనసేన అంటే అద్దె పార్టీ అని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడా విమర్శల్ని నిజం చేస్తూ పవన్‌కల్యాణ్ అభ్యర్థులను ఎంపిక చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేనను టీడీపీకి అద్దెకిచ్చారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. కేవలం చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి చేయడమే పవన్‌కల్యాణ్ ఏకైక లక్ష్యమని పదేపదే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జనసేన రాజకీయ పంథా వుంది.
పొత్తులో భాగంగా తమకు దక్కిందే చాలా తక్కువ సీట్లు అనే ఆవేదన జనసేన నాయకులు, కార్యకర్తల్లో వుంది. జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్ని చంద్రబాబు కేటాయించారు. వాటికి కూడా తన పార్టీ నాయకుల్ని పోటీలో నిలుపుకోలేని దయనీయ స్థితి పవన్‌కల్యాణ్‌ది. అందుకే మిత్రపక్షమైన టీడీపీ నుంచి నాయకుల్ని అరువు తెచ్చుకుంటూ పవన్‌కల్యాణ్ అభాసుపాలవుతున్నారు.
కాకినాడ, మచిలీపట్నం ఎంపీస్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. మచిలీపట్నం నుంచి వైసీపీ సిటింగ్ ఎంపీ బాలశౌరినే జనసేన తరపున పోటీ చేస్తుండడం గమనార్హం. అలాగే జనసేనలో ఇటీవల చేరి అసెంబ్లీ టికెట్లు దక్కించుకున్న నేతల గురించి తెలుసుకుందాం.
అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, పెందుర్తి -పంచకర్ల రమేష్‌బాబు, రాజోలు-దేవ వరప్రసాద్, భీమవరం- పులపర్తి ఆంజనేయులు, తిరుపతి -ఆరణి శ్రీనివాసులు, విశాఖ సౌత్- వంశీకృష్ణయాదవ్, అవనిగడ్డ -మండలి బుద్ధప్రసాద్, పాలకొండ -నిమ్మక జయకృష్ణ, రైల్వేకోడూరు – అరవ శ్రీధర్ ఉన్నారు.
వీరిలో అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు అభ్యర్థి డాక్టర్ ఎనమల భాస్కరరావును ఇప్పటికే ప్రకటించారు. ఈయన్ను మార్చి టీడీపీ నుంచి చేరిన అరవ శ్రీధర్‌కు ఖరారు చేయనున్నారు.
పులిపర్లి ఆంజనేయులు, మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు భీమవరం, అవనిగడ్డ, పాలకొండ టీడీపీ ఇన్‌చార్జ్‌లు. అలాగే ఆరణి శ్రీనివాసులు చిత్తూరు వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే. విశాఖ సౌత్‌కు ఎంపిక చేసిన వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ. జనసేనలో చేరడంతో అనర్హత వేటు వేశారు. మిగిలిన నాయకులు వైసీపీ, టీడీపీలలో ఏదో ఒక స్థాయిలో పనిచేసిన వారే.
జనసేన కోసం పదేళ్లుగా పని చేస్తూ ఆర్థికంగా నష్టపోయిన నేతలకు దక్కిన సీట్లు ఎన్నో పవన్‌కల్యాణే చెప్పాలి. ఇంత వరకూ అసెంబ్లీలో అడుగు పెట్టకపోయినా, తాను పార్టీని కాపాడుకున్నానని ప్రగల్భాలు పలికే పవన్‌కల్యాణ్, మరెందుకని సగం సీట్లలో ఇతర పార్టీల అభ్యర్థుల్ని నిలబెట్టాల్సి వచ్చిందో తన వాళ్లకు సమాధానం చెప్పాలి. ప్యాకేజీ స్టార్, అద్దె పార్టీ అని ప్రత్యర్థులు తిట్టమంటే తిట్టరా మరి!
పవన్‌కల్యాణ్ అభ్యర్థుల్ని చూసి, జనం నవ్వుకుంటున్నారు. పేరుకేమో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లు తీసుకుని, వాటిలో సగం ఇతరులతో నింపి, అభాసుపాలు కావడం ఆయనకే చెల్లింది. కనీసం వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడాన్ని ఏదో రకంగా సమర్థించుకోవచ్చు. మిత్రపక్షమైన టీడీపీ నేతలను చేర్చుకుని సీట్లు ఇవ్వడమే వింతల్లోకెల్లా వింత.